"అవును, అన్నాను తప్పా" అన్నాడు తాపీగా.
ఊహించని ఈ సమాధానానికి చంపాలాల్ ఒక క్షణం బిత్తరపోయి రెట్టించిన కోపంతో, "ఏమన్నారు మీరు? మళ్ళీ అనండి" అన్నాడు.
"అంటాను. తప్పేముంది? కేన్సర్ వ్యాధికి మీరు కనుక్కున్న మందు వాడటంవల్ల ఏ మాత్రమూ లాభంలేదని ఒకసారి కాదు. వెయ్యిసార్లు అంటాను".
"ఎంత ధైర్యం మీకు?" ఇంగ్లీషులో బిగ్గరగా అరిచేడు. చంపాలాల్. అతడి ఎర్రటి, లావాటి బుగ్గలు మరింత ఎర్రబడ్డాయి. "పది సంవత్సరాలుగా దేశంలో డాక్టర్లు, స్పెషలిస్టులు ఇది తప్ప కేన్సర్ కి ఇంకొక మందులేదని ముక్తకంఠంతో వప్పుకున్నప్పుడు దాన్ని మీరెలా కాదనగలరు?"
"కేన్సర్ వచ్చింది ఈసారి నా కూతురికి కాబట్టి"
కళ్ళు చిట్లించి "అయితే" అన్నాడు.
"నాకు సంబంధంలేని విషయం కాబట్టి నేను జోక్యం కలిగించుకోలేదు ఇన్నాళ్ళూ. చివరికి అది నా కూతురు మీదే వాడటం మొదలు పెట్టేసరికి వద్దన్నానంతే..."
"ఎందుకో..."
"అక్యూట్ మైలోబ్లాస్టిక్ లుకేమియాకి మీ మందు పనిచెయ్యదు కాబట్టి"
"ఈర్ష్య! ఇదంతా ఈర్ష్య! ఒక సైంటిస్టుకి కళ్ళముందే పద్మశ్రీ బిరుదు రావటం- అతడు కనుక్కున్న మందుకి కోట్లలో పేటెంట్ ధనం రావటం ఇదంతా చూసి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఈ అక్కసుని యిలా వెళ్ళబుచ్చు కుంటున్నావు నువ్వు" ఈసారి హిందీలో అరిచేడు.
"నాకు కళ్ళు తిరిగిపోలేదు కాబట్టే వాస్తవాన్ని చూడగలుగుతున్నాను. కేన్స్- క్యూర్ కంపోజిషన్ ఏమిటి? అసలు దాంట్లో బేసిక్ డ్రగ్ ఏమిటి? డ్రగ్ కంట్రోలర్ నుంచి పద్మశ్రీ బిరుదు ఇచ్చిన వాళ్ళవరకూ ఒకరైనా దీన్ని ఆలోచించారా? ఒక్కక్షణం ఆలోచిస్తే చాలు అన్నీ బైటపడతాయి" అంటూ లోపలికి వెళ్ళాడు తన లాబ్ లోకి.
వెళ్ళాడన్న మాటేగానీ మనసంతా చికాకుగా తయారయింది. సాయంత్రం మరి పని చెయ్యలేకపోయాడు.
సాయంత్రం ఆస్పత్రి క్కూడా వెళ్ళలేదు.
వెళితే భరించలేడని తెలుసు.
తెల్లవారేసరికి కౌంటు 70,000 అవుతుంది.
దాన్ని ఎవరూ ఆపలేరు.
రాత్రంతా నిద్రలేకుండా గడిపాడు.
తెల్లవారేక ఇంక వుండబట్టలేక ఆస్పత్రికి ఫోన్ చేసేడు. డ్యూటీ నర్సు ఎత్తింది ఫోన్. అతడు ఊహించినది కరక్టే. కౌంటు 72,000 వుంది. అతడు బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఒక కన్నీటిచుక్క చెంప మీదకు రాలింది.
అమ్మా? ప్రార్థనా! ఎంత దయనీయమయిన స్థితి అమ్మా ఇది. నేనుండీ నీకేమీ చెయ్యలేకపోతున్నాను. కనీసం దగ్గరుండి ఓదార్పు కూడా చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించు చిట్టితల్లీ. మరు జన్మంటూ వుంటే అప్పుడు నువ్వు నాకు తల్లివై పుట్టు- గుక్కెడు పాలకోసం గొంతు ఆర్చుకుపోయేలా నేను రోదిస్తూ వుంటే నిర్ధాక్షిణ్యంగా నన్ను ఏ పెంటకుప్ప మీదో పారెయ్యి. నేను ఇప్పుడు నీకు చేస్తున్న దానికి అదే నాకు సరి అయిన శిక్ష. ఈ రంగంలో సైంటిస్టుని అయ్యుండీ నేను నిన్ను రక్షించుకోలేక పోయినందుకు అది కూడా చిన్న శిక్షే అవుతుందేమో.
2
జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు మామూలుగా జరిగిపోతూ వుంటాయి. అయితే వాటి పరిణామాన్ని బట్టి వాటి ప్రాముఖ్యత పెరుగుతుంది. మనిషి మీద దాని ప్రభావం లేకపోతే వాటికి విలువే వుండదు.
ఆ రోజు విజయభార్గవ తొందరగా ఇన్ స్టిట్యూట్ కి వెళ్ళాడు. అక్కడ పనికూడా ఎక్కువగా లేదు. కాని ఇంట్లో వుండలేక- ఆస్పత్రిలో గడపలేక- ఇన్ స్టిట్యూట్ కాస్త బావున్నట్టు తోచింది.
ఆ రోజు ప్రొద్దున్నే ఎనిమిదిన్నరకి బోర్డు మీటింగ్ ప్రారంభమయింది. అది పూర్తయ్యేసరికి పదకొండు అయింది.
పదకొండున్నరకి శంకర్ లాల్ నుంచి పిలుపు వచ్చింది. బహుశా బోర్డు మీటింగ్ లో తన ఇన్సూరెన్స్ తాలూకా సంగతి చెప్పటం కోసమేమో అనుకుంటూ వెళ్ళాడు.
ఎయిర్ కండిషన్డ్ రూమ్ లో శంకర్ లాల్ కూర్చుని వున్నాడు. అతడి మొహం ఎన్నడూ లేనంత ప్రశాంతంగా వుంది. భార్గవని చూడగానే లేచి, "రండి భార్గవా" అన్నాడు.
అతడు కూర్చున్నాక, "ఈరోజు ప్రొద్దున్న బోర్డు మీటింగు జరిగింది" అన్నాడు.
"అవును విన్నాను" అన్నాడు భార్గవ.
"సల్ఫా-3 మందు మీద రిసెర్చి కొత్తగా వచ్చిన డాక్టర్ చక్రవర్తికి ఇవ్వటానికి నిర్ణయం జరిగింది?"
భార్గవ చప్పున తలెత్తి చూసేడు. శంకర్ లాల్ కళ్ళల్లో అదోలాటి భావం, 'మంచి ఛాన్సు పోగొట్టుకున్నావ్ సుమా' లాటి భావం...
భార్గవ తలూపి "పోన్లెండి, నాకు దానిమీద అంత ఇంటరెస్టు లేదు" అన్నాడు.
శంకర్ లాల్ చాలా తాపీగా "మీకు అసలు ఈ ఇన్ స్టిట్యూట్ మీదే ఇంటరెస్టు లేదని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు డాక్టర్ భార్గవా" అన్నాడు.
భార్గవ్ ఉలిక్కిపడి చూసేడు. "ఏమిటి, ఏమిటి మీరంటున్నది" అన్నాడు తడబడుతూ.
శంకర్ లాల్ డ్రాయర్ లోంచి ఒక న్యూస్ పేపర్ తీసి పైన పెడుతూ "ప్రొద్దున్న బోర్డు రూమ్ లో ఈ పేపర్ ఒక తుఫానుని సృష్టించింది. మొత్తం మెంబర్లందరూ చిటపటలాడిపోయారు" అన్నాడు.
భార్గవ పేపర్ వైపు చూసేడు. ఆ పత్రిక పేరు -
"గుడ్ మార్నింగ్"
ఏదో తెలియని భయంతో అతడి వెన్ను జలదరించింది. చటుక్కున ఆ పేపర్ని ముందుకు లాక్కుని చదవటం ప్రారంభించాడు. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో వుందా వార్త.
"డా|| భార్గవ కాన్స్-క్యూర్ పై సవాల్"
"కాన్స్- క్యూర్ అనే మందు కేన్సర్ ని అసలు తగ్గించదనీ అది అంతా మోసమనీ పది సంవత్సరాల నుంచీ ప్రజలు దివ్య ఔషధంలా వాడుతున్న ఆ మందు కేవలం బూటకమని డాక్టర్ భార్గవ అన్నారు. ఈ మందుని కనుక్కున్న పద్మశ్రీ చంపాలాల్, డాక్టర్ భార్గవ ఈ విషయంపై ఒకర్నొకరు దాదాపు తిట్టుకోవటం మా విలేఖరి ముందే జరిగింది. ఈ ఇద్దరు డాక్టర్లూ మోహన్ లాల్ ఇన్ స్టిట్యూట్ లోనే పనిచేయటం గమనించతగ్గ విషయం. సామ్సన్ అండ్ సామ్సన్ కంపెనీకి 'కాన్స్-క్యూర్' తాలూకు పేటెంట్ ని అమ్మింది కూడా మోహన్ లాల్ ఇన్ స్టిట్యూటే అవటం మరో విశేషం..."
