నాలుగు గంటలకు ఇంటి నుంచిబయలుదేరి వెంకటేశ్వరస్వామి దేవాలయం చేరుకున్నాడు. భాగ్యలక్ష్మి కోసం గుడిలో చూశాడు. ఆమె కనిపించకపోవడంతో గుడి మెట్లమీద కూర్చుని చూడసాగేడు. ఒక్కొక్క నిముషం భారంగా గడుస్తోంది వచ్చేపోయే జనం అతని దృష్టి పథం దాటిపోతున్నారు. అతని చూపు గుడి దారి మలుపులో నిలిచింది. జీవితంలో ఎప్పుడూ అనుభవించనంత ఆత్రుత మనసుని నిలవనివ్వడం లేదు.
హఠాత్తుగా అతని కళ్ళల్లోకి కాంతి ప్రవేశించింది.
భాగ్యలక్ష్మి వీధి మలుపు తిరిగి చకచకా నడిచివస్తోంది. దూరంగా రామకృష్ణని గమనించి నవ్వింది. కొన్ని క్షణాల తరువాత అతని ప్రక్కన కూర్చుని చెప్పింది.
"ఈ రోజు రాత్రి అసెంబ్లీ రద్దు చేశారు. మూడు నెలల్లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. నాలుగు గంటలకు హైదరాబాద్ నుండి ఫోను వచ్చింది. రావడానికి బయలుదేరుతున్న నన్ను పిలిచి సూట్ కేసు సర్ధమని నాన్న చెప్పారు. సరిగ్గా పది నిముషాలు తక్కువ ఐదుకి ఆయన వెళ్ళారు. ముఖ్యమైన పనుల మీద వెళుతున్నప్పుడు నన్ను ఎదురురమ్మంటారు. అవన్నీ అయ్యేసరికి ఆలస్యమైంది.
"తిరిగి ఎప్పుడొస్తారు?" అడిగాడు రామకృష్ణ.
"పార్టీ టిక్కెట్ సంపాదించి గాని తిరిగి రారు....."
రామకృష్ణ కొన్ని క్షనాలు పాటు మాట్లాడలేదు. భాగ్యలక్ష్మి తండ్రి ఊరెళ్ళడం కలిసొచ్చిందని అనుకున్నాడు. తన పనికి ప్రధానంగా అడ్డుతగిలే వ్యక్తి అతనే అనుకున్నాడు కాబట్టి అలా భావించాడు.
"మన భవిష్యత్తు గురించి ఏమాలోచించావ్?"
భాగ్యలక్ష్మి మాట్లాడలేదు.
"నీ తండ్రి మన పెళ్ళికి అంగీకరిస్తాడనే నమ్మకం నాకు లేదు." చెప్పాడు.
"నేనడిగితే కాదనడు....." చెప్పింది నమ్మకంగా.
"ఓసారి నీ తండ్రికి తెలిసిన తరువాత మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఓ అనామకుడ్ని చేసుకోవడానికి ఎట్టి పరిస్థితిలోను ఒప్పుకోడు. అతను తల్చుకుంటే నన్ను మర్డర్ చేయించగలడు....."
ఆమె భయంగా చూసింది. రాజకీయ నాయకుడిగా తండ్రి తన ప్రత్యర్దులతో ఎలా వ్యవహరిస్తాడో తెలియదేం కాదు.
"ఏం చేద్దాం?" అడిగింది.
రామకృష్ణ కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉంది అన్నాడు.
"మనకి ఓ మార్గముంది....."
ఆసక్తిగా చూసింది భాగ్యలక్ష్మి.
"నీ తండ్రి హైదరాబాద్ నుండి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈలోపు మనం పెళ్ళి చేసుకుంటే ఎలా ఉంటుంది?"
ఆమె విస్మయంగా చూసింది అతనివైపు. నిజానికి అతన్ని చేసుకోవడానికి ఆమె సిద్దమే. అతను లేకుండా బ్రతకలేనని అనుకుంటోంది.
"నాన్నకి తెలియకుండానా?" భయంగా అంది.
"పెళ్ళి అనేసరికి అలా అయిపోయావేంటి?" ఆశ్చర్యంగా అడిగాడు.
"నా తండ్రిని ఒప్పించలేమంటారా?"
"ఇప్పుడొచ్చిన అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. సమస్య ఎదుర్కోవడానికి నేను భయపడటం లేదు. నువ్వు తోడుంటే నిప్పుల్లో దూకటానికైనా నేను సిద్దమే. అనవసరమైన శ్రమ తీసుకుని రిస్క్ కొనితెచ్చుకోవడం దేనికి? పెళ్ళికి నువ్వు అంగీకారం తెలిపితే ఏర్పాట్లు నేను చేస్తాను...." చెప్పాడు.
భాగ్యలక్ష్మి గుండె దడదడా కొట్టుకుంది. ఆమె కుదుతపడటానికి చాలా సమయం పట్టింది. అంతవరకూ రామకృష్ణ మాట్లాడకుండా ఉండిపోయాడు.
"మీతో జీవించాలనుకుంటున్న దానిని. మీరు ఏం చెబితే అది చేస్తాను...." చెప్పింది.
తను తెచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్ ఆమెకిచ్చి చెప్పాడు.
"ఈ బ్యాగ్ లో నీకు అవసరమైన సామాగ్రి ఉంది. వీటిని ధరించి ఆదివారం సాయంకాలం సింహాచలం గుడికి రా. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు అక్కడో పెళ్ళి ఉంది. అదే ముహూర్తానికి మన పెళ్ళి జరుగుతుంది. వచ్చేటప్పుడు నీ తల్లిదండ్రుల నుండి సంక్రమించిన విలువైన వస్తువులు వదిలేయి."
రామకృష్ణ ఉంగరం ఆమె వ్రేలికి తొడిగాడు. అతను అన్నీ సిద్దంచేసి వచ్చాడని గ్రహించింది భాగ్యలక్ష్మి. ఒకవేళ తను ఆ పెళ్ళి కాదంటే ఏం జరిగేదో ఆమె అంచనా వెయ్యలేకపోయింది.
14
ఆదివారం ఉదయం తెల్లారేసరికి రామకృష్ణ ఇంటి ముందు షామియానా వెలిసింది. ఇంట్లో సందడి ప్రారంభమయింది. అర్చన వెళ్ళి చుట్టు ప్రక్కల ఆడవాళ్ళని పిల్చుకొచ్చింది. సులోచనని పెళ్ళికూతుర్ని చేశారు. రామకృష్ణ ఆధ్వర్యంలో శీతయ్య పెళ్ళి కొడుకయ్యాడు. ఆ ఇంట్లోని వాళ్ళకి గతంలో పెళ్ళి చేసిన అనుభవం లేకపోయినా, పెళ్ళి పనులు నిరాటంకంగా సాగిపోతున్నాయి. నాలుగు రోజుల క్రితం పురోహితును ఏ ఏ వస్తువులు కావాలో, కార్యక్రమం ఎలా చెయ్యాలో చెప్పాడు. అతడు చెప్పిన ప్రకారం చేసుకుపోతున్నారు వాళ్ళు.
మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఓ టాక్సీ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. పెళ్ళి పీటల మీదకు అవసరమైన సామాను లిస్టు ప్రకారం కారు డిక్కీలో పెట్టారు. ఏదైనా వస్తువు అవసరమైతే మధ్యలో వెళ్ళి తేవడానికి అవకాశం ఉండదనే ఆలోచనతో రామకృష్ణ జాగ్రత్త తీసుకున్నాడు. అతను ప్రొద్దున్నే తల స్నానం చేసి కొత్త బట్టలు తొడుక్కున్నాడు. అందరూ టాక్సీ ఎక్కినా తరువాత ఇంటికి తాళంపెట్టి వెనక్కి తిరిగాడు రామకృష్ణ. ఓ క్షణం పాటు అతని దృష్టి ఎదురింటిపైన నిలిచింది. భాగ్యలక్ష్మి ఆ బిల్డింగ్ లో ఎక్కడున్నా తనని గమనిస్తుంటుందని తెలుసు. అతను కారు ఎక్కి కూర్చున్నాడు.
సరిగ్గా ఒకటిన్నరకి టాక్సీ అక్కడ నుంచి బయలుదేరింది.
ఉదయం నుంచి మేడమీద గదిలో కిటికీ వెనుక కూర్చుంది భాగ్యలక్ష్మి. రామకృష్ణ ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూనే ఉంది. టాక్సీ వెళ్ళిపోయిన తరువాత కొంతసేపు కదలకుండా కూర్చుంది. కారు ఎక్కేముందు రామకృష్ణ చూసిన చూపు తన కోసమేనని గ్రహించింది.
వెంకటేశ్వరస్వామి గుడిలో రామకృష్ణని కలుసుకున్నతరువాత మనసులో జరుగుతున్న సంఘర్షణ ఆమెకు నిద్రలేకుండా చేసింది. తెగని ఆలోచనలతో తుఫాన్ లో చిక్కిన నావలా అల్లకల్లోలం ఉంది ఆమె మనసు. తెలియని దిగులు ఏదో గుండెల్ని పిండేస్తుంది.
ఉదయం తల్లి వంట గదిలోకి పిలిచింది. తన విషయం ఆమెకు తెల్సిపోయిందేమోననే సంశయం కలిగింది. ఆ రోజు ఏం కూర చెయ్యాలో అడగడానికి పిలిచింది. అన్నయ్య మేడ మీదకు తనకోసం వచ్చినప్పుడు కూడా అలాగే భయపడింది. ఎక్కడో గుడి మెట్లమీద రామకృష్ణకి తనకి జరిగిన సంభాషణ వాళ్ళకెలా తెలుస్తుందనే ఆలోచన అప్పుడు రాలేదు. రామకృష్ణ ఇచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్ తెస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని అనుమానించి తన గదిలోకి వెళ్ళి వెంటనే తలుపు మూసుకుంది. సంచిలోని వస్తువులు బయటకు తీసి చూసింది. అందులో కొత్త బట్టలు, గాజులు వంటి వస్తువులు ఉన్నాయి. ఆ బ్యాగ్ ఎక్కడ దాచాలో ఆమెకు అర్ధం కాలేదు. చివరికి మంచం క్రింద దాచింది. నిజానికి ఆ గదిలోకి ఎవరూ రారు. ఆ విషయం భాగ్యలక్ష్మికి తెలిసినా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్ళి అనేసరికి తెలియని భయాలు చుట్టుముట్టాయి. ఆలోచనల నుండి తేరుకుని టైమ్ చూసింది.
రెండు కావస్తోంది.
కంగారుగా లేచి మేడ దిగి క్రిందకొచ్చింది. టవల్ తీసుకుని బాత్ రూమ్ వైపు నడిచింది. ఆమె స్నానం ముగించి వచ్చేసరికి పని మనిషి భోజనానికి రమ్మని పిలవడానికొచ్చింది. తను భోజనం చెయ్యలేదనే విషయం అప్పుడు గుర్తొచ్చింది. డైనింగ్ టేబుల్ వైపు నడవబోతూ ఆగిపోయి కొన్ని క్షణాలు ఆలోచించింది. భోజనం వద్దని రెండు అరటిపళ్ళు, ఓ గ్లాసు పాలు తీసుకురమ్మని చెప్పింది.
సరిగ్గా రెండు నలభైకి ఇంట్లోంచి బయటకొచ్చింది. ఆమె చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. అటువైపు వెళుతున్న ఆటో పిలిచి ఎక్కింది. పది నిముషాల తరువాత రామ్ నగర్ లో ఒక ఇంటి దగ్గర దిగి తలుపుకొట్టింది.
ఒక యువతి తలుపు తీసింది.
* * *
అరగంటలో టాక్సీ సింహాచలం కొండకి చేరింది. అంతా తలో సామాను అందుకుని గుడివైపు కదిలారు. పెళ్ళికొడుకు గెటప్ లో ఉన్న శీతయ్య అరటిగెల పట్టుకున్నాడు. తెల్ల దుస్తులు పాడవుతాయనే ఆలోచన వచ్చి అతన్ని వారించింది అర్చన. అందరూ మండపంలోకి ప్రవేశించారు.
చెల్లెల్ని అంటి పెట్టుకుని నడిచింది అర్చన. ఉదయం నుంచి ఒక్కక్షణం కూడా వదల్లేదు. పెళ్ళికూతుర్ని చేసిన తరువాత చెల్లెల్ని తనివితీరా చూసుకుంది ఆమె. అంతవరకూ మనసులో అంతర్లీనంగా దాగిన సంతోషం ఒక్కసారిగా ఉప్పొంగింది. సులోచనని తన గుండెలకు గాఢంగా హత్తుకుని ముద్దులతో ముంచేసింది. చెల్లెలు తన కాళ్ళకి నమస్కారం చేసినప్పుడు ఆమె కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.
చిన్నతనంలో చెల్లెల్ని ఎత్తుకుని గ్రామంలోని వీధులు తిప్పేది. ఎత్తుకోవడం అలవాటుగా మారటం వల్ల ఎత్తుకుంటేనే కాని ఊరుకునేది కాదు. సులోచనకి మూడోసంవత్సరం వచ్చేసరికి తల్లి మరణించింది. అందుచేత ఆమె బాల్యం అర్చనతో ముడివేసుకుని ఉంది. చెల్లెలు చెయ్యాల్సిన పనులు తను చేస్తున్నందుకు ఎన్నోసార్లు పిన్ని చేతిలో తన్నులు తింది. పెల్లికూతురిగా చూసినప్పుడు, ఏడుస్తూ ఎత్తుకోమని రెండు చేతులూ చాచిన చిట్టి చెల్లెలి పసిరూపం గుర్తొచ్చింది. కళ్ళముందే ఎంత ఎదిగి పోయింది. ఆశ్చర్యంగా అనుకుంది.
