Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 35


    నీ వాలకం చూస్తుంటే శోభనం రాత్రి కూడా నేనే తంటాలు పడాలేమో అనిపిస్తోంది" అని పదే పదే నవ్వసాగింది ఊర్మిళ.

    పరుశురాం ఆమె చెవులు పట్టుకుని సాగదీస్తూ-

    "నీ చెవులు పిండేస్తాను" అన్నాడు. కిసుక్కున నవ్వింది ఊర్మిళ.

    "ఎందుకా నవ్వు?"

    గభాల్న అతని చెంపపైన ముద్దు పెట్టుకుని-

    "ఆడపిల్ల ఒంటరిగా దొరికితే ఎవరయినా చెవులు పట్టుకుంటారా?"

    "ఛ, బరితెగించి పోతున్నావు" కోపంగా అన్నాడు.

    "ఊరికే కోపం తెచ్చుకోకు బావా! దిక్కులేని దానికి మేనత్త కొడుకే మొగుడన్నారు. నువ్వా బుద్ధావతారానివి, చెవులు పట్టుకోవడం తప్పితే నీకేం చేతకాదు. అంచేత ఏ ఆడపిల్లా నీ లోపం చూసి నిన్ను చేసుకోదు. అందుకని మనిద్దరం ఒకరికొకరం అడ్జెస్ట్ అయిపోదాం" అంది ఊర్మిళ.

    "మీ నాన్నకి చెబుతాను."

    "మన పెళ్ళి త్వరగా చేసేయమనా?" అతని నడుం చుట్టూ చేతులు చుట్టేస్తూ అంది.

    "పెళ్ళి కాదు, పిచ్చాసుపత్రిలో చేర్పించమని"

    ఊర్మిళ కళ్ళలో నీరు తళుక్కున మెరిసింది.

    "నువ్వొచ్చి రోజూ చూస్తానంటే పిచ్చాసుపత్రిలోనే కాదు బావా! నరకంలో అయినా వుంటాను"

    ఉద్వేగంతో ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి.

    "పిచ్చిపిల్ల!" అనుకుంటూ లోపలికి నడిచాడు పరుశురాం.

    ఆ రాత్రి అంతే నిద్ర పట్టలేదతనికి అనూష గురించి ఆలోచనలు.

    లేచి కూర్చుని పేకముక్కల్ని షఫల్ చేసి పంచడం మొదలుపెట్టాడు.

    గుమ్మంలో నించుని ఊర్మిళ అంది.

    "నాన్న నిద్రపోతున్నారు పేకాటకంటే మనం ఇంకేదైనా ఆడుకోవచ్చుగా!" పరుశురాం లేచి వెళ్ళి "గుడ్ నైట్" అంటూ తలుపు మూసేశాడు.


                                                                            15

    అనూష చిరుకోపంతో అంది.

    "నేను పక్కన ఉన్నా కూడా నీకు ఆ పేకతోనే లోకం. ఒళ్ళు మండిపోతుంది"

    పరుశురాం మాట్లాడకుండా పేకముక్కల్ని పంచుతున్నాడు.

    "అయ్యా! నువ్వు పేషన్స్ ఆడుతుంటే చూడ్డానికి రాలేదు. కాసేపు ముచ్చట్లు చెప్పుకోడానికి వచ్చాను" అతని భుజాలను పట్టి కుదుపుతూ అంది అనూష.

    అతను ఆమెకేసి చూశాడు.

    "నాకంటే కూడా నీకు ఆ పేకముక్కలే యిష్టం అనుకుంటాను" ఉక్రోషంతో అడిగింది అనూష.

    "అవును."

    అతని మాటలకి ఉలిక్కిపడింది అనూష.

    అతన్ని కళ్ళప్పగించి చూస్తుండిపోయింది.

    "ఎందుకాలుక? వున్నమాటే చెప్పాను" అని తిరిగి పేకని షపుల్ చేయబోయాడు.

    అనూష సుతారంగా అతని చేతిలోంచి కార్డ్స్ తీసుకుంది.

    "నాకంటే కూడా నీకు ఈ కార్డ్సే యిష్టమని నువ్వంటుంటే నాకు చాలా జెలసీగా వుంది. నీకు గాంబ్లింగ్ అంటే యిష్టమా?"

    "లేదు"

    "మరి ఎప్పుడూ పేక ఆడుతూ ఒంటరిగా కూర్చుంటావు దేనికి?"

    "అనూ డియర్! దయచేసి ఆ వివరాల్లోకి వెళ్ళకు"

    "అంటే?" "చెప్పలేను"

    అతని చెంపని తన అరచేతులతో సవరదీసింది అనూష.

    "అంత చెప్పకూడనిదైతే అడగను. కానీ నీకు తెలుసా రామ్!"

    "ఏమిటి?"

    "నువ్వెప్పుడూ మూడీగా ఉంటావు. లేకపోతే పేకముక్కలతో గడుపుతుంటావు. కాలేజీలో నిన్నందరూ ఎలా హేళన చేస్తుంటారో కూడా నీకు పట్టదు"

    "అనుకోని.... దానివల్ల నష్టం ఏమీ లేదుగా!"

    అనూష కోపంగా చూసింది.

    "ఇదివరకటి విషయం వేరు రామ్! కానీ ఇప్పుడు ఈ అనూష రామ్ కి ప్రేమికురాలు"

    "అయితే?"

    "నిన్నెవరన్నా హేళన చేసినా, ఈసడించుకున్నా నన్ను కూడా చేసినట్లేకదూ! మనం కలిసి తిరుగుతున్నాం.

    అది చాలామందికి తెలుసు. కొందరు వెనకనుంచి జోక్ చేస్తుంటారు. మరికొందరు ఏడుస్తున్నారు. ఇదంతా ఎందుకో తెలుసా? మనం ప్రేమికులం ఆపడమే!"

    "మన సంగతి యితరులకెందుకు?" అన్నాడు రామ్.

    "కావల్సిందే వాళ్ళకి. కారణం అసూయ! తనకి అందుబాటులో లేనిదానికి, అనుభవంలోకి రానిదాని కోసం మనిషి అర్రులుచాస్తాడు. అది ఎదుటివాడికి లభ్యమైనప్పుడు అసూయతో రాళ్ళు విసరడం మొదలు పెడతాడు. అదే ఈ లోకం టెండెన్సీ రామ్!" అంది అనూ,

    "అయితే నన్నేం చేయమంటావు?" అడిగాడు పరుశురాం సిగరెట్ వెలిగిస్తూ.

    "మొహానికిదొకి తక్కువ!" అంది అతను సిగరెట్ కాలుస్తుంటే!

    "ఎందుకంత కోపం? నన్నేం చేయమంటావో చెప్పు" ఆమె భుజం పైన చేయివేస్తూ అన్నాడు.

    "ఏం చేయమంటావు అని ఆడపిల్లనే అడిగేవాడిని అసలు మగాడనుకోవచ్చా?" అంది అనూష బుంగమూతి పెట్టి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS