దాంతో అపర బ్రహ్మగారికి ఆకలి కరకరలాడింది. అవకాశంకోసం ఎదురుచూస్తున్న ఆయనకు మంచి తరుణం వచ్చింది. రాజ్యంలో దుర్బిక్షం ఏర్పడింది. నాలుగు సంవత్సరాలుగా పంటలకు తీవ్రనష్టం రావడంతో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకోసాగారు.
"ఇదంతా అపరబ్రహ్మగారి పరిపాలనా నిర్వాకం!" అని కిట్టనివాళ్ళు గట్టిగా అనడం మొదలుపెట్టారు.
ఈ విమర్శలను తిప్పికొట్టడానికి ఆయనకొక అధ్బుతమైన ఆలోచన వచ్చింది.
వెంటనే ఆదరాబాదరాగా రైతు సదస్సు ఏర్పాటుచేశాడు. దాంట్లో రైతులు "మహాప్రభో.. పంటలు పండక తిండికే గతిలేదు. ఈ పరిస్థితిలో బ్యాంకులూ, అప్పులిచ్చిన వాళ్లూ బాకీలు తీర్చమని ఒత్తిడి చేస్తున్నారు. వడ్డీ కాదుకదా.... అసలు కూడా తీర్చే శక్తి అసలు లేదు. మీరే తరుణోపాయం చూపించాలి" అంటూ మొత్తుకున్నారు.
వెంటనే అపరబ్రహ్మగారు కళ్లు మూసుకుని ఆలోచించాడు. ఆయన మనోనేత్రానికి అధ్బుతమైన పరిష్కారం గోచరించింది. వెంటనే కళ్లు తెరిచాడు.
"నా ప్రియమైన రైతు బాంధవులారా... మీరే నా దేవుళ్ళు! నా దైవాలకు ఆపద వస్తే ఈ భక్తుడు ఊరుకుంటాడా?మీకు "నీకు బెబ్బే.... నీ యబ్బకు బెబ్బే' - కథ తెలుసుగా?"అని అడిగాడు.
"తెలుసు" అని అడిగాడు.
"ఇంకేం.... అదే తారకమంత్రం!మీరు తీసుకున్న ఋణాలను నిర్భయంగా ఎగవేయండి. అడిగితే 'అసలుకు బెబ్బే.... వడ్డీకి బెబ్బేబ్బే....!' అని చెప్పండి. ఇది మా ఆజ్ఞ!" అని సదస్సు చాలించాడు.
అపరబ్రహ్మగారి ఆజ్ఞానుసారం రైతులు ఋణాలు ఎగవేయడంతో ఇచ్చినవాళ్లూ, ఎగవేసినవాళ్లూ వీధుల్లోపడి కొట్టుకోసాగారు. దాంతో ఎవరు, ఎవరికి, ఎంత అవసరం వచ్చినా పైసా అప్పు కూడా ఇవ్వడం మానేశారు. బ్యాంకులు సరేసరి!
అపరబ్రహ్మగారి లీలలు భరించే శక్తి ప్రజలకు నశించింది.
'తమలో తమకు నిత్యమూ కొట్లాటలు పెట్టి ఆనందించడమే ఆయన ధ్యేయం!' అని వారు గ్రహించారు. వెంటనే రాసున్న ఎన్నికలలో అయ్యవార్ని గద్దె దించాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
అపర బ్రహ్మగారికి దడ పట్టుకుంది. కలహభోజనం కరువైపోతోందన్న దిగులు ఎక్కువ కాసాగింది.
తరుణోపాయం కోసం జ్యోతిషులను సంప్రదించడం మొదలుపెట్టాడు, కాషాయం కట్టాడు, ఒంటి చెవికి కుండలం తగిలించాడు. తలపాగా చుట్టాడు. రాత్రుళ్ళు చీరకట్టి తిరగసాగాడు, మెడలో రుద్రాక్షలు ధరించాడు. ముఖానికి విభూతి - కుంకుమ దట్టించి భూతవైద్యుని వేషం వేశాడు, శవ పూజలు చేశాడు.
ఎన్ని చేసినా గతజన్మలోని పుణ్యశేషం హరించుకుపోతూండడంతో ఏమీ ప్రయోజనం లేకపోతోంది. ఎన్నికల ప్రకటన వెలువడింది. మరోసారి ప్రభంజనంలా రాష్ట్రాన్ని చుట్టసాగాడు అపరబ్రహ్మ.
"నా అనుంగు ప్రజలారా! నాకు మరోసారి పదవిని ఇవ్వండి. మీ సేవలోనే నా తనువు చాలింపనివ్వండి!" అంటూ వేడుకోసాగారు.
అయితే... ఎక్కడికి పోయినా - "నీకు బెబ్బే.. నీ పదివికి బెబ్బే. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!"అంటూ ఆయన పాఠాలు ఆయనకే అప్పజెప్పసాగారు.
ఇంక అపరబ్రహ్మగారికి ప్రజల మద్దతు అంతకంతకీ అడుగంటిపోతోందన్న వాస్తవం ఆయన పార్టీవారికి అవగతం అయింది.
"మీరు మర్యాదగా పదవినుంచి తప్పుకుని, యువకుడు - సమర్దుడు అయిన చంద్రశేఖరం గారికి నాయకత్వ బాధ్యతను అప్పజెప్పండి" అని అంతేవాసులు అపర బ్రహ్మగారిని చెవినిల్లు కట్టుకుని పోరాడసాగారు.
"పదవి వదులుటయా? అది కల్ల! సింహాసనము పైననే నా పంచప్రాణములు పంచైక్యము చెందవలె!" అన్నాడు అపరబ్రహ్మ.
పార్టీపరువు బజారున పడి అధికారం పరహస్తగతం అయ్యో ప్రమాదం ప్రస్పుటంగా కానవచ్చింది. పత్రికలకి, కార్టూనిస్టులకి కరువు లేకుండా కావలసినంత సరుకు లభిస్తోంది. అపర బ్రహ్మగారి లీలావిశేషాలను, దేశమంతా కథలు - కథలుగా చెప్పుకోసాగారు. అవి విన్నవారికి 'ప్రతాపరుద్రీయం' నాటకంలో 'పేరిగాని పాత్ర' గుర్తుకిరాసాగింది.
ఈ పరిస్థితులన్నీ గమనించిన చంద్రశేఖరం - అయ్యగారి అంతేవాసులలో అత్యధికులను తనవైపు తిప్పుకుని రక్తరహిత విప్లవంతో అపరబ్రహ్మగారిని అధికార పీఠం నుంచి తప్పించి సింహాసనాన్ని తాను అధిరోహించాడు.
అపరబ్రహ్మ "అహో.... విధి ఎంతటి వైచిత్రము? నేను పైకి తీసుకువచ్చిన నావారే నాకన్ను పొడిచిరిగా! నమ్మినందుకు నాపై వెన్నుపోటుకు పాల్పడితిరిగా! కానిండు..... నాకు మరల మంచికాలము రాకుండునా!" అంటూ దిగులుగా రోజులు గడపసాగాడు. ఆ దిగులు మరీ బరువై పక్షవాతం వచ్చి, ఎక్కువ కాలం మంచాన పడకుండానే గుండెజబ్బు కూడా వచ్చి కన్నుమూశాడు.
చంద్రశేఖరం తప్పనిసరియై అపర బ్రహ్మను పదవీచ్యుతుని చేసినా, సీతను అడవికి పంపిన శ్రీరాముడు - 'సీత స్వర్ణ ప్రతిమ' తో అశ్వమేధ యాగాన్ని నిర్వర్తించినట్లు అపరబ్రహ్మగారి కాంస్యవిగ్రహాన్ని ప్రక్కన, చిత్రపటాన్ని వెనుక పెట్టుకుని పరిపాలన సాగించసాగాడు.
ఆ విధంగా 'చంద్రగ్రహణం' కారణంగా కర్మశేషం పరిపూర్తి అయి అపరబ్రహ్మ అశువులు బాసి బ్రహ్మవాక్కు నిజమయ్యింది.
ఇంతకీ... చంద్రశేఖరం ఎవరో కాదు, అపరబ్రహ్మగారి అనుంగు అల్లుడు. ఈ 'దశమ గ్రహ' గ్రహణంతో అపరబ్రహ్మగారి అవతారం పరిసమాప్తి చెందింది.
- సోమేశ్వర సాహితీ సమితి కథల పోటీ..... '98
