Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 35

    మొదట్లో అంతగా పట్టించుకోకపోయినా క్రమంగా వెంగమాంబ నియమనిష్ఠలకి, భక్తి శ్రద్ధలకి, కుటుంబ సంప్రదాయానికి, అన్నింటినీ మించి ముఖంలో ఉన్న వర్చస్సుకి ముగ్ధుడై సుబ్రహ్మణ్యయోగి బోధించటం మొదలుపెట్టారు. ఆమె జీవిత పరమార్థం తెలిసినట్టుగా ముందు వ్యాకరణం, ఛందస్సు, అలంకార శాస్త్రం, రస సిద్ధాంతం మొదలైన కావ్యరచన కుపకరించే శాస్త్రాలన్నీ అధ్యయనం చేయించారు. ఈ లక్షణాలన్నింటికి లక్ష్యాలుగా పురాణాలన్నీ ఔపోసన పట్టించారు. వాటికి మూలమైన షట్ చ్చాస్త్రాలు, అవసరమైన మేరకి వేదాన్ని వల్లె వేయించారు. తాను చేస్తున్న యోగాన్ని లక్ష్యంగా చూపి యోగవిద్యని ఉపదేశించారు. శిష్యులకి బోధించటంకన్నా యోగసాధన ఆనంద దాయకం అనుకున్న యోగిగారికి, వెంగమాంబకి బోధించటంలో ఎంతో ఆనందం లభించటంతో, తాను ఆచరించి, బోధించి, ఆచరింపచేసి ఆచార్యపదవిని సార్థకం చేసుకున్నారు. ఉత్తమ శిష్యులు లభించటంకన్న సద్గురువుకి కావలసిందేముంటుంది?
    "ప్రవేదిరే ప్రాక్తన జన్మవిద్యా" అని పార్వతీదేవి గురించి కాళిదాసు చెప్పినట్టు జన్మాంతర సంస్కారం వల్ల వెంగమాంబలో బీజరూపంగా నిక్షిప్తమైన జ్ఞానం అంతా గురువుగారి దోహదంవల్ల మొలకెత్తి, తీవ్రసాధనవల్ల చిగురించి, కొమ్మలు రెమ్మలు వేసి వటవృక్షంగా విస్తరించింది. హఠయోగాదులన్నీ జ్ఞాన సముపార్జనా దృష్టితో నేర్చినా, కుండలినీ యోగాన్ని అభ్యాసదృష్టితో సాధనాపరంగా నేర్చింది. శిష్యవత్సలుడైన గురువు శిష్యులని తనంతటివారిని చేయటం సహజం. వెంగమాంబ దీక్షకి తగినట్టుగా తన పర్యవేక్షణలో సాధన చేయించారు. చేయిపట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా నడిపించి అష్టాంగ యోగ మార్గంలోకి ప్రవేశపెట్టారు.
    యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, మనన, సమాధులనే అష్టాంగాలన్నింటిని క్షుణ్ణంగా అభ్యాసంచేసి, వాటిపై అధికారం సంపాదించింది. శుభముహూర్తాన, సుబ్రహ్మణ్యయోగి వెంగమాంబలోని కుండలినీ శక్తిని జాగృతం చేశారు. ఎంతకాలంగానో నిద్రాణంగా ఉండి, మేలుకొనటానికి ఎదురుచూస్తున్న కుండలినీ శక్తి, రెచ్చగొట్టబడిన కోడెనాగులా ఒక్కసారి బుస్సున పైకిలేచింది. కుండలినీ శక్తి ఒక్కొక్క చక్రాన్ని ఛేదించి, దాటివెడుతున్నప్పుడు, శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. మానసికమైన వికారాలు కూడ కలుగుతాయి. వాటిని తట్టుకొనే శక్తి శరీరానికి కలిగించటానికే అంతకుముందు చేసిన యోగసాధనలోని ఎనిమిది అంగాలు ఉపకరిస్తాయి. మూలాధారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని నిద్రిస్తున్న కుండలినీ శక్తి స్వాధిష్ఠానం చేరుకున్నప్పుడు, స్థూల, సూక్ష, కారణ శరీరాలు తట్టుకుని స్థిరపడిన తర్వాత మణిపూరక చక్రాన్ని దాటే సాధన చేయాలి. ఆపైన క్రమంగా మిగిలిన చక్రాలు. కాని, వెంగమాంబ విషయంలో ఇవన్నీ అవ్యవధానంగా జరిగిపోయాయి. ఆమెలో అతివేగంగా కలుగుతున్న మార్పులని, దానికి తగినట్లుగా శరీరం వెదజల్లుతున్న వివిధ వర్ణకాంతులని గమనిస్తూ, తన్మయత్వంతో ఉండిపోయారు యోగిగారు. హెచ్చుతగ్గులెక్కడైనా వస్తే సరిదిద్దటానికి సిద్ధంగా ఉన్నారు. వెంగమాంబ శరీరంలోనూ, వర్చస్సులోనూ వస్తున్న మార్పునిబట్టి కుండలినీ ప్రయాణం ఎంతవరకు జరిగిందీ తెలుస్తూనే ఉంది
    క్షిప్ర ప్రసాదిని అయిన జగన్మాత సూక్ష్మరూపం కదా కుండలినీ శక్తి. ఆ ఆదిపరాశక్తి అర్హురాలైన వెంగమాంబని తక్షణం అనుగ్రహించటంతో క్షణమాత్రంలోనే కుండలినీశక్తి ఆరు చక్రాలని అధిగమించి, సహస్రారం చేరుకుంది. వెంగమాంబ శరీరంనుండి బంగారు కాంతి వెలువడి, ఆమె చుట్టూ కాంతివలయంగా నిలిచింది. సహస్రారం నుండి, బిందుసరం, ఇంద్రయోని, సోమమండలాల ద్వారా స్రవిస్తున్న అమృత రసాస్వాదనలో వెంగమాంబ సిద్ధజీవి అయ్యింది. ఒక్క ముహూర్తకాలం త్రిపుట భేదనస్థితిలో, సచ్చిదానందాన్ని అనుభూతిచెంది ఆనంద స్వరూపిణి అయ్యింది. ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత అష్టసిద్ధులు కైవశం కావటం ఆశ్చర్యం కాదుకదా!
    సుబ్రహ్మణ్యయోగి "ధన్యోస్మి" అనుకున్నారు. ముందు వెంగమాంబ తలపై చేయిపెట్టినప్పుడు కుండలిని జాగృతం అయింది. ఆ శక్తి లోక కల్యాణానికి ఉపయోగపడాలంటే యథాస్థానానికి చేరాలి. అందుకే మళ్ళీ వెంగమాంబ తలపై తనకుడి అరచేతినుంచి,
    "చిరంజీవీ! ధన్యజీవీ! లే!" అన్నారు.
    అరమోడ్పు కన్నులను విచ్చి, పరిసరాలు పరికించి యథాస్థితికి రావటానికి కొద్దిసమయం పట్టింది వెంగమాంబకి. నెమ్మదిగా పూర్వజన్మలోని విషయాల లాగా ఒక్కొక్కటి గుర్తు వచ్చాయి. తనకు జరిగిన అనుభవం గుర్తులేకపోయినా, అనుభూతి తాలూకు ఆనందముద్ర నిలిచి ఉంది పరమానందంతో గురువుగారి పాదాలకు ప్రణమిల్లింది.
    అంతకుముందు లేని అలౌకిక కాంతితో వెలిగిపోతున్న వెంగమాంబని చూచి అందరూ భయంతోనూ, భక్తితోనూ పక్కకి తొలగి నమస్కరించటం మొదలుపెట్టారు. తల్లి తండ్రులకు కూడా ఆశ్చర్యమే.
                                   * * *
    మర్నాడు యథాప్రకారం సూర్యోదయానికన్నా ముందుగా నిత్యకృత్యాలు పూర్తిచేసుకున్న వెంగమాంబ సోమేశ్వరాలయం చేరి, గురువుగారి రాకకి కావలసిన సన్నాహాలు చేసి, ఇంకా చాలా సమయం ఉంది కదా అని పద్మాసనంలో కూర్చుని కన్నులు మూసింది. శరీరం గాలిలో తేలుతున్న అనుభూతి. కన్నులు తెరచి చూస్తే తను భూమిపై లేదు. కొద్ది అంగుళాలు పైగా నేలకి తగలకుండా ఉంది. ఈ వికారం ఏమిటి? అని అనుకోగానే, "అణిమ" అని ఎవరో చెవులో ఊదినట్లైంది. "తల్లీ! నీతో నాకేంపని?" అని అనుకోగానే శరీరం నేలమీద ఉంది. అంతలో అది బరువెక్కి కదలలేనట్టుగా అయింది. "ఇదేమిటి?" అని అనుకునే లోపుగానే "గరిమ" అని మనసుకి తట్టింది. వెంగమాంబ వెంటనే
    "అష్టసిద్ధులారా! నాపై దయ తలచినందుకు కృతజ్ఞురాలను. మేమీ యథాస్థానాలకు వెళ్ళండి." అని చేతులు జోడించి ప్రార్థించింది.
    అష్టసిద్ధులు వెంగమాంబని ఆశీర్వదించి "తలచినప్పుడు రాగల" మని చెప్పి అదృశ్యమయ్యాయి.
    కన్నులు తెరచిన వెంగమాంబకి చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్న గురువుగారు కనిపించారు. వారి రాక గమనించక, వచ్చే సమయానికి కూర్చునందుకు నొచ్చుకుంటూ లేచి నిలబడి పాదాభివందనం చేసింది.
    "వెంగమాంబా! నువ్వు చేసిన పని ఏమిటి?" సుబ్రహ్మణ్యయోగి కూర్చుంటూ ప్రశ్నించారు.
    "అయ్యగారూ! ఏ పని?" వెంగమాంబ అడిగింది.
    "అష్టసిద్ధులు వశమైతే నీ ఆధీనంలో ఉంచుకోక, పంపేశావెందుకు?"
    "మీకు తెలియదా అయ్యగారూ! అవి బంగారు సంకెళ్ళు. వాటి ఆకర్షణలో పడితే ఎటువంటి సాధకుడు ఏవిధంగా పతనమై భ్రష్టుడైపోతాడో - ఎన్నో ఉదాహరణలున్నాయి. అవన్నీ లౌకిక ప్రపంచంలో ఏదో కావాలని, సాధించాలని అనుకునేవారికి ఉపయోగం. పేరు ప్రఖ్యాతులు రావాలని, పదిమందిలో గుర్తింపు పొందాలని, అందరి నమస్కారాలూ అందుకుంటూ, గౌరవింపబడాలనీ అనుకునే వారికి అవసరం. బయటి ప్రపంచపు ఆకర్షణలనే కాదు, ఇటువంటి అలౌకికమైన సిద్ధుల ఆకర్షణనుండి కూడ సాధకుడు బయటపడ్డాడా, లేదా అని పరీక్షించటానికి కల్పించబడినవి ఇవన్నీ!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS