Previous Page Next Page 
ప్రార్థన పేజి 35


    ఈ బుష్ మెన్ లు యుద్ధంలో శత్రువుల్ని జయిస్తే అతడిని మామూలుగా వదిలిపెట్టేవారు కాదు. శిరస్సు కత్తిరించి తెచ్చేవారు. నిండు పౌర్ణమి రోజు ఎనిమిది రకాల మూలికలతో మంటపెట్టిన రసాయనంలో ఆ తలని వేసేవారు.

 

    రెండు నిమిషాలలో ఆ శిరస్సు చిన్న టెన్నీస్ బంతి పరిమాణంలోకి కుదించుకుపోయేది. అయినా ఆ మనిషి తాలూకు కళ్ళు జీవంతో ఉట్టిపడేవి. నుదురు, నోరు, ముక్కు అన్నీ స్పష్టంగా తెలిసేవి. పుట్టుమచ్చలు కూడా మాయమయ్యేవి కావు. కాని తల మాత్రం చిన్నదైపోయేది. ఈ 'కుదింపు'కి హేతువు వాళ్ళకి తెలీదు. ఆ బంతిలాంటి శిరస్సులని మాత్రం తమ విజయానికి చిహ్నంగా తమ ఇళ్ళకి తోరణాల్లా కట్టుకునేవారు ఆ ఆదిమవాసులు.

 

    తరువాత చరిత్ర మారింది.

 

    బోయర్లకీ, చిమాంగ్ వాతో తెగలకీ జరిగిన యుద్ధంలో వీళ్ళు ఓడిపోయి, బ్రిటీష్ ప్రభుత్వ రక్షణ ఆశ్రయించారు. రెండు పిల్లులు- కోతికథలాగ బ్రిటీషు వారు ఈ దేశాన్ని ఆక్రమించి పాలించటం మొదలుపెట్టారు. 1966లో బోచ్వానా స్వతంత్ర దేశమైంది.

 

    ఆటవికులు, రెడ్ ఇండియన్లు, బుష్ మెన్ లు క్రమక్రమంగా అంతరించి, అక్కడ నాగరికత విస్తరిస్తూంది.

 

    మనిషి, శరీరం కుంచించుకు పోయేటట్టూ చేసిన ఆ మూలికలేమిటో వివరించే సత్యం చరిత్ర పుటలలో నిక్షిప్తమై పోతూంది.

 

                                        *    *    *

 

    ఒక సైన్సు జర్నల్ లో ప్రచురితమైన ఈ వ్యాసాన్ని లాబ్ లో కూర్చొని అతడు చదువుతూ వుండగా శంకర్ లాల్ దగ్గర్నుంచి పిలుపు వచ్చింది. అప్పుడే ఈ వార్త ఆఫీసంతా పాకిపోయినందుకు మనసులోనే ఆశ్చర్యపడుతూ అతడు ఎమ్.డి. గదిలోకి వెళ్ళాడు.

 

    "కూర్చోండి భార్గవా! ఐయామ్ సారీ. మీ కూతురికీ..." అంటూ అతడేదో చెప్పబోతూంటే 'ఇట్సాల్ రైట్' అన్నాడు కూర్చుంటూ.

 

    శంకర్ లాల్ కొంచెంసేపు మౌనంగా వుండి "ఏ స్టేజిలో వుంది?" అని అడిగాడు.

 

    "అక్యూట్... సిక్ట్సీ థౌజండ్ కౌంట్".

 

    "మైగాడ్"

 

    భార్గవ మాట్లాడలేదు.

 

    "నేను అకౌంటెంట్ తో చెప్పాను. అడ్వాన్స్ ఎంత కావల్సినా తీసుకోండి. ఫ్యామిలీ ఇన్సూరెన్స్ క్రింద తర్వాత క్లెయిమ్ చేద్దురుగాని".

 

    "థాంక్స్" క్లుప్తంగా అన్నాడు భార్గవ.

 

    "డాక్టర్ మహేంద్రతో నన్ను మాట్లాడమంటారా?"

 

    "ఎవరు మాట్లాడి మాత్రం చేసేదేముంది?"

 

    అతడు ఎక్కడికక్కడ మాటల్ని తుంచేస్తూ ముభావంగా మాట్లాడటాన్ని శంకర్ లాల్ మరోలా అర్థం చేసుకుని "పోనీ కొన్నాళ్ళు శలవు తీసుకుని వెళతారా? మీ కూతురి దగ్గర వుండండి" అన్నాడు సానుభూతితో.

 

    "అక్కర్లేదు. ఇంకెంత? పన్నెండు రోజులు"

 

    అతడు పచ్చినిజాన్ని అంత నిర్లిప్తంగా మాట్లాడటంతో శంకర్ లాల్ అవాక్కయ్యాడు.

 

    అతడికేం మాట్లాడాలో తోచలేదు. "మీ ఆస్పత్రి బిల్లు సరాసరి మనకి పంపమని వ్రాయమని చెప్పాను" అన్నాడు.

 

    "థాంక్స్" అన్నాడు భార్గవ. "కానీ ఇప్పటికే అది ఎనిమిదివేలు అయింది. ఈ పదిరోజులలో ఇంకో యాభయ్ వేలదాకా అవుతుంది. ఒకటి రెండు రోజులు నా కూతురు ఎక్కువ బ్రతుకుతే, మరో అయిదారు వేలు ఎక్కువవుతుంది".

 

    "మైగాడ్! మీరెంత దారుణంగా మాట్లాడుతున్నారు".

 

    "ఉన్న నిజాన్ని పచ్చిగా మాట్లాడుతున్నాను. నాకు ఇన్సూరెన్స్ పదివేలకంటే ఎక్కువ రాదు".

 

    "బోర్డులో పెట్టి మిగతా ఖర్చుకూడా రి-ఇమ్ బర్స్ చేయిస్తాము".

 

    ఈ మాటకి భార్గవ కాస్త చలించి, "థాంక్స్. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియటం లేదు" అన్నాడు.

 

    "సల్ఫా-3 కనుక్కోవటం ద్వారా" తాపీగా అన్నాడు శంకర్ లాల్. భార్గవ ఉలిక్కిపడి చూసేడు.

 

    "అవును భార్గవా! మన చంపాలాల్ ఫార్ములా స్ల్ఫా-2 చాలా అవుట్ డేట్ డ్ అయిపోయింది. ఈ సంవత్సరపు పద్మశ్రీ రికమండేషన్ల తారీఖు కూడా దగ్గర పడింది. ఇక నీదే ఆలస్యం-"

 

    భార్గవ విసురుగా కుర్చీలోంచి లేచాడు.

 

    "ఒక తండ్రిగా సర్వస్వం ధారపోసయినా నా కూతుర్ని రక్షించుకోటానికి వెనుదీయను నేను. కానీ ఒక డాక్టర్ గా, ఒక సైంటిస్ట్ గా మీ కాన్స్-క్యూర్ మందేమిటో తెలిసేక- నా కూతురి కోసం ఆ మందులువాడుతూ మిమ్మల్ని తిట్టుకోని క్షణం లేదు. రేపు నేను సల్ఫా-3 ఫార్ములా మీకిస్తే దానికో అందమైన పేరుపెట్టి మార్కెట్ లోకి వదుల్తారు మీరు. ఎంతో మంది తండ్రులూ, తల్లులూ కొండంత ఆశతో దాన్ని వాడటం మొదలు పెడ్తారు. చివరికి రోగి చచ్చిపోతే- ఎలాగూ చచ్చిపోతాడు కాబట్టి, వాళ్ళ ఉసురు మీతోపాటు నాకూ తగులుతుంది. ఒక నిరర్థకమైన మందు వాడుతూ నేనెంత బాధపడుతున్నానో, అంత నిరర్థకమైన మరో మందు నా పేరు మీద మీకివ్వలేను, క్షమించండి..." అంటూ అక్కణ్నుంచి వెళ్ళిపోయాడు.

 

    అతడి వెనకే స్ప్రింగ్ డోర్స్ మూసుకుపోయాయి.

 

                                        *    *    *

 

    భార్గవ తిరిగి తన లాబ్ కి రాబోతూంటే వరండాలో ఒక వ్యక్తి తగిలాడు. లూజు చొక్కా ఇన్-షర్ట్ వేసేడు. కాళ్ళకి మాసిన చెప్పులున్నాయి. చేతిలో చిన్న షార్టుహాండు పుస్తకంలా వుంది.

 

    "గుడ్ ఈవెనింగ్. నేను 'గుడ్ మార్నింగ్' పత్రికా విలేఖరిని. రేపు పేపర్లో కేన్సర్ గురించి ఒక వ్యాసం ప్రచురిస్తున్నాం. మీలాంటి ప్రముఖుల అభిప్రాయాలు సేకరించి వేద్దామని వచ్చాను" అన్నాడు.

 

    "క్షమించండి. నేను బిజీగా ఉన్నాను" అన్నాడు భార్గవ. నిజానికి అతడు ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ ఇచ్చే మూడ్ లో లేడు. శంకర్ లాల్ అన్న మాటలే మనసులో మెదుల్తున్నాయి. అదీగాక- ఎంత తొలగించినా ప్రార్థన తాలూకు ఆలోచనలు వచ్చి ముసురుకుంటున్నాయి.

 

    ఇంతలో వరండా ముఖద్వారం తెరుచుకుని విసురుగా చంపాలాల్ వచ్చాడు. అతడి మొహం కందిపోయి వుంది. వచ్చీ రాగానే పెద్ద కంఠంతో "ఏమిటి? కాన్స్- క్యూర్ గురించి ఎమ్.డి. దగ్గర ఏదో అన్నారట" అన్నాడు. అతడి స్వరంలో, ఈ రోజు అటో ఇటో తేల్చుకోవాలి అన్న నిర్ణయం కనబడుతూంది.

 

    తను గదిలో వచ్చీ రాకముందే ఆ వార్త చంపాలాల్ కి క్షణాల మీద చేరిపోవటం గమనించి భార్గవ విస్మయం చెందాడు. అతడికి పట్టలేనంత అసహ్యం కూడా వేసింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS