సాయంత్రం నీరెండ బంగారంలా మెరుస్తూ చల్లటి గాలితోపాటు శరీరాన్ని తాకుతోంది. గుడి లోపల నుండి గంట చప్పుడు ఆగి ఆగి వినిపిస్తోంది. పూజారి మంత్రోచ్ఛారణ సన్నగా వినిపిస్తోంది. హారతి కర్పూరం, అగర బత్తీల వాసన గాలితో కలిసి గుడి పరిసరాలకు వ్యాపించింది.
"నీ ఆలోచనలు, అభిప్రాయాలు ఇంట్లో నిర్భయంగా చెప్పగలవా?" అడిగాడు రామకృష్ణ.
"చెప్పడానికి నేనెప్పుడూ భయపడలేదు. ణా తండ్రి నన్నెంతో ప్రేమిస్తారు." చెప్పింది.
నవ్వి అన్నాడు రామకృష్ణ.
"తండ్రి ఎప్పుడూ కూతుర్ని ప్రాణంలా చూసుకుంటాడు. కూతుళ్ళు కూడా తండ్రులను ప్రేమిస్తారు. ఇదంతా సహజ సిద్దంగా జరుగుతుంది. నేను అడిగేది వీటికి లోబడి జరిగే దాని గురించి కాదు మీ నాన్నగారికి ఇష్టంలేని పనిని చెయ్యాల్సివస్తే ఒప్పించి చేస్తావా? లేక ఎదిరించి చేస్తావా?"
అతనివైపు ఆశ్చర్యంగా చూసింది.
"ఇంతవరకూ నా తండ్రిని ఎదిరించే అవసరం రాలేదు." చెప్పింది.
"ఒకవేళ వస్తే?"
ఎప్పుడూ అటువంటి ఆలోచన మనసులోని రాకపోవడం వల్ల ఆమె జవాబు చెప్పలేకపోయింది.
"మీ తాతగారు ధనవంతులా?" సంభాషణ మళ్ళిస్తూ అడిగాడు.
"కాదు. ఆయన షుగర్ ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేశాడు. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకుని నా తండ్రిని చదివించాడు. కాలేజీలో విద్యార్ధి సంఘం నాయకునిగా ఎన్నికయ్యాడు తండ్రి. చదువు పూర్తయిన తరువాత యువజన సంఘం జిల్లా ప్రెసిడెంట్ గా నియమించబడ్డాడు. నా చిన్నతనంలో సభలు, సమావేశాలు అంటూ తిరిగేవాడు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ఉద్యమంలో ప్రధానపాత్ర వహించాడు. ఉద్యమం ముగిసిన తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యాడు...."
"మీ అమ్మగారు ఎప్పుడూ కన్పించరేం?"
"ఆమె వంటగది వదిలి ఎప్పుడూ బయటకు రారు. నా తండ్రితో కూడా తలుపు వెనుక నిలబడి మాట్లాడుతుంది."
భాగ్యలక్ష్మి నిట్టూర్చింది.
"ఇంట్లో మా నాన్న చెప్పిందే వేదం. ఆయన ఎవర్నీ గొంతు విప్పి మాట్లాడనివ్వడు. నా తల్లి పట్ల మరింత కఠినంగా ఉంటాడు. ప్రతిరోజూ ఇంట్లో చెయ్యాల్సిన కూర కూడా ఆయనే చెబుతాడు. నా తల్లి ఇంటి వ్యవహారాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోదు...."
తల్లి గురించి చెబుతున్నప్పుడు భాగ్యలక్ష్మి మొహం చిన్నబోవడం రామకృష్ణ గమనించాడు. భాగ్యలక్ష్మి తండ్రి రాజకీయాల్లో ప్రముఖవ్యక్తి. దినపత్రికలో ప్రతిరోజూ అతనికి సంబంధించిన వార్త వస్తుంది. అప్పుడప్పుడు అంతర్జాతీయ రాజకీయాలపై కూడా అతని వ్యాఖ్యలు వెలువడతాయి. రాష్ట్రంలో అతని పార్టీ అధికారంలో లేకపోయినా విజటర్స్ లో ఇల్లెప్పుడూ సందడిగా ఉంటుంది.
"నా గురించి ఏమనుకుంటున్నావ్?" అడిగాడు.
"ఏమనుకుంటున్నానో మీకు తెలియదా?" ఎదురు ప్రశ్నించింది.
"ఎప్పుడయినా చెబితేకదా తెలియడానికి"
"కొన్ని వేలమంది మధ్య 'ఐ లవ్ యూ" అని చెప్పినా అమ్మాయి. అలా చెప్పడానికి కారణమైన అబ్బాయి గురించి ఏమనుకుంటుందని మీరనుకుంటున్నారు....."
రామకృష్ణ నవ్వాడు. మొదటి రోజు జరిగిన సంఘటన గుర్తొచ్చింది. భాగ్యలక్ష్మి చాలా తెలివైన అమ్మాయి. ఆమె మాట్లాడుతుంటే గంటల తరబడి విన్నా విసుగుపుట్టదు. తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా వెల్లడిస్తుంది.
"మీ గురించి నేను ఏమనుకుంటున్నానో చెప్పడానికి మాటలు దొరకడం లేదు. మాటలు దొరకలేదని చెప్పకపోవడం ధర్మం కాదు. మీ గురించి నేను ఏమీ అనుకోవడం లేదు, మీతో జీవితం పంచుకోవాలని కోరుకోవడం తప్ప!"
రామకృష్ణ కళ్ళు మెరిశాయి.
"ఆ మధ్య ఓ రచయిత ఒక పాఠకూరాలి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. తనకి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని పెళ్ళిచేసుకుని అతనికి శరీరం అప్పగించడం కంటే మనస్పూర్తిగా ప్రేమించిన వాడితో శారీరక సంబంధం పెట్టుకోవడం తప్పు కాదన్నాడు. ఈ సమాధానాన్ని నువ్వెలా రిసీవ్ చేసుకుంటావ్?"
అతని మొహంలోకి అనుమానంగా చూసింది భాగ్యలక్ష్మి. తనని ఆట పట్టించడానికి అడగలేదని గ్రహించింది.
"ఆ పాఠకూరాలి ప్రశ్న ఏమిటి?" అడిగింది.
"ముక్కూ మొహం తెలియని వాడిని చేసుకుని అతనికి శరీరాన్ని అప్పగించే కంటే ఆడది తను ప్రేమించిన వాడితో శారీరక సంబంధం పెట్టుకుంటే తప్పేమిటి?" అని."
ఆ ప్రశ్న విన్న తరువాత తనకి తెలియకుండానే తల అడ్డంగా ఊపింది భాగ్యలక్ష్మి.
"అసలు పెళ్ళికి ముందు సెక్స్ అనుభవాన్ని ఎందుకు కోరుకోవాలి? ఇక్కడో సంగతి గుర్తు పెట్టుకోవాలి. ప్రేమించడమంటే శారీరక సంబంధానికి అంగీకరించడం కాదు. ప్రేమించడం, శారీరక సంబంధం అనేవి ఒక దానితో ఒకటి కలవని విషయాలు. ప్రేమించిన ప్రతి ఆడదీ శారీరక సంబంధం పెట్టుకుంటే, ప్రేమ విఫలమైనప్పుడు ఆమె ఏం చెయ్యాలి?"
"రచయిత పాఠకురాలి అభిప్రాయంతో ఏకీభవించాడు కదా!"
"రచయిత చెప్పింది కరెక్ట్ అనుకోవడానికి అతనేం దేవుడా! ఒక అమ్మాయి పెళ్ళికి ముందే సెక్స్ కి ఒప్పుకుంటే, తన జీవితంలోని అత్యంత విలువైన కలయికని, జీవితాంతం పదిలపర్చుకోవాల్సిన క్షణాలను దొంగతనంగా అనుభవిస్తున్నదని అర్ధం. ఆ జ్ఞాపకం జీవితాన్ని వెంటాడుతుంది. తను ప్రేమించిన వాడితో సెక్స్ అనుభవించి, మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుని సంసారం చెయ్యాల్సి వస్తే అది ఆమెకు ఎంత కష్టమో ఆ రచయితకి తట్టి ఉండదు."
"అటువంటి సలహా ఇవ్వడం తప్పంటావా?"
"తప్పు కాదు, తప్పున్నర! మనిషికి తన జీవితంలో తప్పు చెయ్యడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అది మానసికం కావచ్చు, శారీరకం కావచ్చు. తప్పు ఏ పరిస్థితిలో జరిగిందో తెలుసుకుని సలహా చెప్పాలి. అంతేకాని తన రచనలు చదువుతున్న పాఠకులకు అదో జీవిత సత్యమ్లా బోధించకూడదు."
"నీ ఎత్తెంత?" అడిగాడు.
"ఐదున్నర అడుగులు, ఎందుకు?"
"సంభాషణ మళ్ళించడం కోసం. రేపు సాయంకాలం ఇక్కడే కలుసుకుందాం." చెప్పాడు.
భాగ్యలక్ష్మి తలూపింది.
* * * *
రామకృష్ణ ఉదయానికి విశాఖపట్టణం తిరిగొచ్చాడు. తల్లిని తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో వెళ్ళాడతను. స్వంత ఇంటిని వదిలిపెట్టి విశాఖపట్టణం రావడానికి ఆమె ఒప్పుకోలేదు. ఇంటి మీద తల్లికి అపారమైన అభిమానం ఉందని రామకృష్ణకి తెలుసు. కాని విడదీయలేని అనుబంధం ఉందని మాత్రం అనుకోలేదు. అతని చిన్నతనంలో తండ్రి దానిని నిర్మించాడు. తల్లిదండ్రులు నిద్రాహారాలు మాని ఇంటి కోసం శ్రమించడం అతనికి గుర్తుంది.
ఆ ఇంటి లోపల నేల మీద తండ్రి ప్రాణాలు వదిలాడు. ప్రతి ఆదివారం పేడతో ఇల్లు అలుకుతుంది తల్లి. ఇంటిలో చాలా భాగం శిథిలమయింది. తిండి కోసం తిప్పలు పడే స్థితిలో ఇంటిని బాగుచేయించలేకపోయారు. తల్లికి ఎన్నిరకాలుగా నచ్చచెప్పినా వినలేదు. కష్టపడి కట్టుకున్న ఇంటిమీద అభిమానం పెంచుకుంటారని, పరిసరాలని ప్రేమిస్తారని, నిత్యం ఉపయోగించే వస్తువుల మీద ఆత్మీయత ఏర్పడుతుందని తెలుసు. అయితే వీటిని వదులుకుని కొడుకుతో బ్రతకడానికి కూడా ఇష్టపడరని ఊహించలేదు. తన జీవితంలో ఓ ముఖ్యమైన సందర్భంలో తల్లి వెంట లేకపోవడం అతనికి వెలితిగా ఉంది.
అతను పదకొండు గంటలకు బ్యాంక్ చేరుకున్నాడు. తన ఎకౌంట్ నుంచి ఐదు వేలు డ్రా చేశాడు. ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో చేరిన తరువాత ప్రతి నెల కొంత మొత్తం దాయడం వల్ల ఆ డబ్బు ఉంది.
బ్యాంక్ నుండి తిన్నగా బట్టల షాపుకి వెళ్ళాడు. పట్టుచీర సెలెక్ట్ చెయ్యడానికి ఆ షాపులోని సేల్స్ గరల్ సహాయపడింది. ఆ చీర కట్టుకోబోయే స్త్రీ వయస్సు, ఎత్తు, రంగు అడిగి తెలుసుకుని ఎన్నిక చేసిందామె. తనో జత బట్టలు కొనుక్కున్నాడు. తెలిసిన టైలర్ షాపుకెళ్ళి బట్టలు ఇచ్చాడు. జేబులోంచి ఒక లిస్టు బయటకు తీశాడు. ఆ లిస్టులోని వస్తువులు మొత్తం కొన్న తరువాత చివరగా నగల షాపుకి వెళ్ళి ఒక ఉంగరం తీసుకుని ఇంటికి తిరిగొచ్చాడు.
భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఇంట్లోని వాళ్ళంతా పెళ్ళి పనులతో బిజీగా ఉన్నారు. వాళ్ళు మూడు రోజుల క్రితమే మార్కెట్ పని ముగించుకొచ్చారు. ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కట్టారు.
