"ఏం జరిగింది? ఏం జరుగుతోంది.....?" అన్న ఉత్కంఠ కలిగించేలా?
చెయ్యి తిరిగిన సీరియల్ రచయిత ప్రతివారం కధని అత్యంత ఉత్కంఠ పూరితమైన సన్నివేశం దగ్గర కట్ చేసి సస్పెన్స్ క్రియేట్ చేసినట్లు!
ఈ అమ్మాయి మంచి సీరియల్ రాయగలదా?
ఒక్కసారి తల విదిలించి, ఆలోచనల్లో నుంచి బయటపడ్డాడు ఎడిటరు. తన ఆలోచనలకు తనకే నవ్వొచ్చింది.
పొద్దస్తమానం మేగజైను గురించి అలోచించి అలోచించి తనకు కధలూ, సీరియల్సూ, ఫీచర్సూ తప్ప వేరేమీ గుర్తు రాకుండా పోతున్నాయా?
ఈ స్థితినేనా అంటారు వృత్తికి అంకితమై పోవడమని?
* * * *
"ఉదయార్కర్ ! అర్ధరాత్రి అయింది లే!" అని తట్టి లేపుతున్నాడు బ్రహ్మచారి.
లేచి కూర్చుని బద్దకంగా వళ్ళు విరుచుకున్నాడు ఉదయార్కర్. పడుకుని ఇంకా అర నిమిషం కూడా అయినట్లు లేదు. అప్పుడే గంట గడిచిపోయిందా?
"ఉదయార్కర్! ఇది చూడు" అన్నాడు బ్రహ్మచారి.
చూశాడు ఉదయార్కర్. బ్రహ్మచారి చేతిలో చిన్న కాటుకకాయ లాంటిది వుంది.
"ఏమిటది" అన్నాడు ఉదయార్కర్.
"అంజనం"
"అంజనమా! అంటే ఏవైనా వస్తువులు పొతే చూడడానికి ఉపయోగిస్తారు! అదేనా?"
:అదే! ఎక్కడో నిక్షిప్తమై వున్న వస్తువులు ఈ అంజనం పూసుకుంటే కళ్ళకు కట్టినట్లు కనబడతాయి. ఎక్కడో జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా చూస్తున్నట్లు చూడవచ్చుదీని ప్రభావంతో.
అనుమానంగా చూశాడు ఉదయార్కర్. ఇవన్నీ నిజమేనా! లేక మూడ నమ్మకాలా!
అయినా ఆ అనుమానం బయటపడనివ్వకుండా , పైకి మాత్రం మాములుగానే అన్నాడు.
"కళ్ళకి పూసుకుంటారు కదూ దీన్ని?"
"కళ్ళకి పూసుకునేది నేత్రంజనం. అదేకాక నఖాంజనం, పత్రాంజనం, సర్వంజనం, హస్తాంజనం, చౌరాంజనం, బాలాంజనం ఓ.......చాలా ఉన్నాయిలే రకాలు. ఇది హస్తాంజనం! ఇంకో విషయం వుంది." అని ఆగాడు బ్రహ్మచారి.
"ఏమిటి?"
"ఈ అంజనాలు మాములు మనుషులు వాడితే ప్రయోజనం ఉండదు. పిల్లికళ్ళు ఉన్నవాళ్లకే ఇవి ఫలితాన్ని ఇస్తాయి." అన్నాడు బ్రహ్మచారి ఉదయార్కర్ కళ్ళలోకి చూస్తూ.
ఉదయార్కర్ వి తేనేరంగు కళ్ళు.
"నీవి పిల్లికళ్ళు అందుకని నీకు అంజనాలు బాగా పనిచేస్తాయి. ఇది చేతికి పూసుకుని ఏం కనబడుతుందో చూడు" అన్నాడు బ్రహ్మచారి.
సందేహంగా ఆ అంజనాన్ని చేతికి రాసుకున్నాడు ఉదయార్కర్. తర్వాత దృష్టి కేందీకరించి చేతిలోకే చూడడం మొదలెట్టాడు.
కొద్ది క్షణాలపాటు ఏమీ కనబడలేదు అతనికి. తర్వాత మసక మసగ్గా కొన్ని రేఖలు కనబడ్డాయి. ఆ తర్వాత ఆ రేఖలు ఒక నిర్దుష్టమైన రూపు దాల్చడం మొదలెట్టాయి.
కళ్ళు చిట్లించి చూస్తున్నాడతను.
ఏదో ఇల్లు......గులాబీ రంగులో వుంది. మేడ మీదకి మెట్లు. కనబడుతున్నాయి. అక్కడ తలుపు.
ఆ తలుపు తన దృష్టికేమీ అడ్డం రాలేదు. ఇంటి;లోపల వున్న దృశ్యం కూడా కనబడుతోంది.
అప్పుడు చటుక్కున స్పురించింది ఉదయార్కర్ కి.
అది అభిషేకన్ ఇల్లు.
అంత రాత్రి అయినా అభిషేకన్ ఇంకా నిద్రపోలేదు. పురుగు లాగా మంచం మీద అటూ ఇటూ కదులుతూనే వున్నాడు.
అలా కాసేపు మెదిలి, దుప్పటితో సహా అపళంగానే పక్కమీద కూర్చున్నాడు. దుప్పటిలో నుంచి తల కాస్త బయటికి పెట్టి అటూ యిటూ దొంగ చూపులు చూశాడు.
ఇంటిల్లిపాదీ గాడ నిద్రలో వున్నారు.
పిల్లిలా లేచాడు అభిషేకన్. మెల్లిగా నడుస్తూ మూల ఉన్న పాత కాలపు ట్రంకు పెట్టె దగ్గరికి వెళ్ళాడు. మోకాళ్ళ మీద కూర్చుని అలికిడి కాకుండా పెట్టె మూట తీశాడు.
ఉత్సుకతతో చూస్తున్నాడు ఉదయార్కర్.
ఏం చేస్తాడు అభిషేకన్?
ట్రంకు పెట్టెలోంచి కొన్ని బట్టలు తీశాడు అభిషేకన్. లేచి , గోడకి అభిముఖంగా నిలబడి బట్టలు మార్చుకోవడం మొదలెట్టాడు.
ఆ విశ్వరూపం కనబడకుండా కళ్ళు మూసుకోవాలనిపించింది ఉయార్కర్ కి.
కానీ కళ్ళు మూసుకుంటే అంజనం ప్రభావం పోతుందేమోనన్న భయం.
అంజనం ప్రబావం పొతే అభిషేకన్ ఏం చేయ్యబోతున్నాడో కనిపెట్టలేడతను.
అభిషేకన్ బట్టలు మార్చుకోవడం పూర్తయింది. ఇప్పుడతను కంప్లీట్ వీరపాండ్య కట్ట బ్రహ్మాన శివాజీగణేశన్ గెటప్ లో వున్నాడు. అద్దం ముందు నిలబడి, పిడికిళ్ళు బిగించి, కొండవీటి చాంతాడు కంటే పొడుగైన తమిళ డైలాగులు గడగడ చెబుతూ ఊగిపోతున్నాడు.
