Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 35

 

    ఆ ఆశ కూడా లేదండీ! అదీ తెలిసిపోయింది. డాక్టర్ ను సంప్రదిస్తే ఈమెకు ఎటువంటి రోగమూ లేదని తేల్చి చెప్పేశాడు" అన్నాడు.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి రవంత సేపు ఆలోచించింది.
    "అయితే ఇది చిత్రమయిన వ్యాధి అనుకోవాలి. ఆరు నెలల సంసార సుఖం తరువాత ఆమె కోల్పోయిన దాన్ని ఎవరూ తిరిగి ఇవ్వలేరు. ముఖ్యంగా నేనేం చెయ్యగలనో నాకు అర్ధం కావటల్లేదు. మీ అభిప్రాయమేమిటో చెప్పండి" అన్నదామె. ఇక సస్పెన్స్ భరించలేక అతడు కుర్చీలో సర్దుకుని కూర్చున్నాడు.
    కరిగి జారుతున్న కన్నీటిని మరోమారు అద్దుకుని చెప్పటం ప్రారంభించినాడు.
    'అమ్మా! మీరోకమారు మా యింటికి రావాలి. మనస్తత్వ శాస్త్రంలో మీరు గొప్ప పండితులట కదా! అమ్మాయిని చూచి మీరు ఏదయినా సలహా యిస్తే అక్షరాలా దాన్ని పాటిస్తాను.
    మీరంటే అమ్మాయికి ఎంతో గౌరవం. మీరు మరచిపోయినారేమో కాని అది మీ దగ్గర కొంతకాలం చదువుకుంది ." అన్నాడు గద్గదా స్వరంతో. ప్రొఫెసర్ శ్రద్దాదేవికి జాలి అనిపించింది.
    "ఇంత చిన్న విషయం మాట్లాడేందుకు మీరు ఇంత దూరం రావాలా! ఇంటి దగ్గరే చెప్తే సరిపోయేది కదా!" అన్నదామె అంగీకరిస్తూ.
    "ప్రొద్దుటే వెళ్ళిపోతారు. ప్రొద్దుపోయాక వస్తారు. ఇంటి దగ్గర వున్న కాస్సేపయినా ఊరికే ఉండరు కదా! ఎప్పుడూ విద్యార్ధులూ విద్యార్దినులూ వెంట వుంటారు. అంత బిజీగా వుంటే మిమ్మల్ని కలియుటం అసాధ్యమే అవుతోంది.
    వ్యాపారం పని మీద విజయవాడ నించి గుంటూరు వెడుతూ ఇక్కడయినా మీతో మాట్లాడేందుకు వీలు అవుతుందేమోనని ఇలా వచ్చాను. మీరు అంగీకరించారు. అదేనాకు పదివేలు." అన్నాడు ఉపాధ్యాయుడు సంతోషపడిపోయి.
    తన నించి ఎవరికయినా అనందం కలిగినప్పుడు ప్రొఫెసర్ శ్రద్దాదేవి కి  ఎంతో తృప్తి కలుగుతుంది. అర్ధం వున్నదో లేదో ఇంకా నిర్ణయం కాని బ్రతుకులో ఏవో అర్ధాలు వున్నాయనే అనిపిస్తుంది.
    ఆశాపూర్ణమయిన ఆలోచనలు మనసుని క్రమ్ముతాయి.
    తానింకా చేయవలసింది ఏమీ చేయలేదు. ఊరికే వస్తానని అన్నందుకే సంతోషంతో పొంగిపోయినాడు.
    "వస్తానండీ! ఇంటి దగ్గర కలుస్తాను. మీ రుణం ఉంచుకోను. నన్ను నమ్మండి." అన్నాడు ఉపాధ్యాయుడు కృతజ్ఞతగా.
    "నేను మీకేం చేశానని రుణపడిపోయానంటారు! ఊరికే వస్తాను, చూస్తాను. నాకు చేతనయిన సలహా ఏదయినా , వుంటే యిస్తాను . అంతే. కాని భర్తతో పాటుగా ఆమె పోగొట్టుకున్న దాన్ని నేను తెచ్చి ఇవ్వలేను కదా!" అన్నది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    ఆమె మంచితనానికి తాను ఎడ్మయిరర్ గా మారిపోయినట్లు అభినయించి ఉపాధ్యాయుడు తిరిగి పోయినాడు.
    తీసుకోవలసిన క్లాసు ఇంక ఒక్కటే మిగిలి వుంది. ఆ అవర్ ముగించి  ఇంక ఎటువంటి జాప్యమూ లేకుండా తిరిగి వచ్చిందామే. ఇంటి దగ్గరకు రాగానే ఆమెకు ఆశ్చర్యమయింది.
    ఉపాధ్యాయ మహాశయుడు అప్పటికే ఆమె కోసం ఎదురుతెన్నులు చూస్తూ వాకిట కూర్చుని కన్పించాడు.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి కొన్ని పుస్తకాలు కూడ పెట్టేందుకు వీలుగా ఉన్న కాష్ బాగ్ ని ఇంట్లో ఉంచేసి ముఖమయినా కడుక్కోకుండా ఉపాధ్యాయ మహాశయుని వెంట బయలుదేరింది.
    అతడు కారు తీసుకు వచ్చాడు.
    భర్తనీ, అతనితో పాటు తనకి కావలసిన ఆ సౌభాగ్యాన్ని కోల్పోయిన యువతి మన్హ ప్రవృత్తి గురించి ఊహిస్తూ కూర్చుందామె. కారాగింది . ఒక ఇంటి లోకి అతడు దారి తీశాడు.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి ప్రొఫెసర్లకు అలంకార ప్రాయమయిన పరధ్యానంలో పరిసరాలను పరిశీలించకుండా అతని వెంట నడిచింది . లోపలకు పోయాక వెనుక నించి తలుపులు మూసుకున్నాయి.
    ఉపాధ్యాయ మహాశయుడు వికటంగా నవ్వాడు విలన్ లాగ!

                                 11


    బ్యాటరీ ఎందుకు పనిచేయలేదో జయకృష్ణకు రవంత అయినా అర్ధం కాలేదు. కేవలం పది పన్నెండు అడుగుల పొడవు వెడల్పు వుండే రాకాసి గుహలోకి ప్రవేశించిన జ్యోతి తాను కంఠనాళం చీరుకుపోయెలా అరిచినా ఎందుకు పలకలేదో అసలే అర్ధం కాలేదు.
    అది కేవలం నూరు నూట యాభై చదరపు అడుగులు మాత్రమే వైశాల్యం కలిగిన గుహ. బదులు రాకపోవడంతో మరింత కంగారు అయిపొయింది ఏం చెయ్యాలో తోచలేదు.
    కాళ్ళ క్రింద చిప్స్ లాంటి రాతి ముక్కలు తగులుతున్నాయి. రాత్రి పలకలను ఆధారం చేసుకుని నడవటం ప్రారంభించాడు . నాణాలు దట్టించిన బూట్లూ రాతి చిప్స్ మీద కరకరలాడుతున్నాయి.
    రాతి పలకలను పట్టుకుని ముందుకు ప్రొసీడ్ అయినాడు జయకృష్ణ. పది నిమిషాల సేపు అలా అడుగులు లెక్కించాడు.
    కాటుకలాంటి చీకటి గుంపుల మధ్య అతనికి ముందుకు పోతున్నట్లే అనిపించింది. కాని యు ఆకారపు సమాధి గుహలో ఒక అంచున బయలు దేరినవాడు మరొక అంచుకు తిరిగి వచ్చాడు. ఆ చోటుకు రాగానే తిరిగి రవంత వెలుగు కిరణం సోకినట్లు అయింది. ఇప్పుడు సమాధి గుడి ముఖ ద్వారం దగ్గర వున్నాడు జయకృష్ణ.
    ఆదిమజాతి జనులు అతడు కన్పించగానే ఉత్సాహంతో కేరింతలు కొట్టినారు. లచ్చిమి పరుగున అతని దగ్గరగా వచ్చింది.
    "దొరా! అక్క ఏదీ?" అని అడిగింది. బదులు ఇచ్చేందుకు అతని దగ్గర ఎటువంటి సమాధానమూ సిద్దంగా లేదు. అందు నించి జయకృష్ణ అవనతడు అయినాడు. ముఖం రవంత పాలిపోయింది.
    "దొర ! అక్క ఏదీ?" అంటూ ఉద్విగ్న మయిన స్వరంతో ఆర్తి పూర్వకంగా అడిగింది మళ్ళీ! ఆమె కనులు ఆర్ద్రమయినాయి.
    జయకృష్ణ దిక్కు తోచని పిచ్చి చూపులు చూశాడు.
    "దొరా! నేను వెళ్ళనా!" అప్పటికి కేవలం రెండు రోజుల క్రితమే పరిచయమయిన అక్క క్షేమం గురించిన ఆరాటంలో పరితపిస్తూ చీకటి గుయ్యారంలా వున్న గుహ అంతర్భాగానికి వురకాలని ప్రయత్నించింది. ఆదిమజాతి యువతి లచ్చిమి.
    చేయి ఆడుంచి ఆమెను అపు చేయించినాడు జయకృష్ణ.
    "లచ్చిమి! నిన్ను నేను పోనివ్వను. నీ అక్క నీకు కన్పించాలంటే కప్పుగా ఉన్న రాతి పలకలను పగుల గొట్టాలి. అంతకు మించిన మార్గం లేదు." అన్నాడు అతడు.
    తల ఎత్తి సమాధి గుడికి కప్పుగా ఉంచిన రాతి పలక వంక చూసింది లచ్చిమి. అది పన్నెండు అడుగుల పొడవూ, పది అడుగుల వెడల్పూ కలిగిన రాతి పలక. దాన్ని మూడు వేల సంవత్సరాల నాటి నాగులు ఎలా మలచినారో అర్ధం కాలేదు.
    దాని మందం పన్నెండు అంగుళాలకు మించి వుంది. ఎలా అక్కడకు చేర్పించినారో -- కాఫీ కప్పుని ఎత్తుకోవటం కష్టతరమైపోతున్న ఈ శతాబ్దపు మనుషులకు అర్ధం కానేకాదు.
    పన్నెండు అంగుళాలను మించిన రాతి పలకను డైనమైట్ లేకుండా కేవలం పలుగులతో పగులగొట్టడం సాధ్యం కాదు. కనీసం ఉలి పోగారు వున్నా పని కొంత సులభతరమవుతుంది.
    అలాంటిదేమీ లేని స్థితిలో చెంచు లచ్చిమి రవంత అయినా నిరుత్సాహపడలేదు. తనవారయిన ఆదిమ జనులను ప్రోత్సహించింది.
    వానర దండులా ఆదిమ జనులు రాకాసి గుహపైకి ప్రాకినారు. వారికి స్త్రీ రూపంలో వున్న హనుమాత్ స్వామి లాంటి చెంచు లచ్చిమి నాయకురాలయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS