Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 34


    జ్యోతిని ఆదర్శంగా ఉంచుకుని మీరు కూడా జీవితంలో పురోగమించాలని నేను మనసారా కోరుకుంటాను" అంటూ చెప్పటం ముగించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఆమె మాటలు వింటున్నప్పుడు విద్యార్ధినులు బొమ్మల్లా అయిపోయారు. మిగిలిన ప్రపంచాన్ని మరచి ఆ మాటల్లో లీనమయినారు. అలా జరగటం సర్వసాధారణమే అయినా ఈ రోజు ఆమె చెప్పిన జ్యోతి వ్యక్తిత్వం ఆ విద్యార్ధినులందర్నీ విశేషంగా ఆకర్షించింది.
    జ్యోతి గురించి వారు అనేక ప్రశ్నలు వేయటం ప్రారంభించారు. వారికి ఒర్పుగా సమాధానాలు యిస్తోంది ఆమె.
    ఆ సమయంలో ఓ విద్యార్ధిని లోపలకు వచ్చి "ప్రొఫెసర్ మీ కోసం ఎవరో వచ్చారు" అని చెప్పింది.
    "విజిటింగ్ కార్డ్ ఇచ్చారా" అని అడిగింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి .
    "లేదు" అని బదులు యిచ్చిండా అమ్మాయి.
    "వారెవరో తెలుసుకుని వచ్చావా?"
    "లేదు మేడమ్! సారీ!" అంటూ వెనుదిరిగి వెళ్ళబోయింది విద్యార్ధిని.
    "నేను వెళతాను ఎక్కడున్నారు?" అంటూ ఆమెను తిరిగిపోకుండా నిరోధించి తాను లేచి నిలబడింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    "డిపార్ట్ మెంటాఫ్ ఫిలాసఫీ హాలులో వున్నారు."
    "సరే వెళ్తున్నాను. గుడ్ బై టు అల్" అని చెప్పేసి చురుకుగా అడుగులు వేస్తూ అక్కడ నించి బయలుదేరిందామే.
    ఎదురు అయిన విద్యార్ధులు, విద్యార్ధినులు వినయంగా ప్రక్కకు ఒదిగిపోయి దారి యిస్తున్నారు. చిరునవ్వుతో వారిని పలుకరిస్తూ వారి చదువుల పురోగమనం గురించి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ , వారు చెప్పే సమాధానాలు వింటూ, అవసరమయిన సూచనలు అందిస్తూ ముందుకు వెళుతోంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    డిపార్ట్ మెంట్ ఫ్ ఫిలాసఫీ హాలులోకి వచ్చిందామే.
    జూనియర్స్ గౌరవ సూచకంగా లేచి నిలబడి విష్ చేశారు. సీనియర్స్ దగ్గరకు వెళ్ళి తానే నమస్కారాలు చెప్పిందామె.
    సభ్యతాపూర్ణమయిన విద్యాలోకం అది. యూనివర్శిటీ అనగానే అదొక పవిత్రమయిన వెలుగు లోకం. ఆ లోకంలో చదువులు, చర్చలు, తప్ప మరొక దానికి తావులేదు.
    మానవత, మహనీయత నిండి వుండే అ జ్ఞాన ప్రపంచంలో ఎంతో ఒద్దికగా ఒదిగిపోయింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఆమెను అందరూ ప్రేమిస్తారు , విద్యార్ధినులు గౌరవిస్తారు.
    ఆమె సహాధ్యాయులందరినీ గౌరవిస్తుంది. విద్యార్ధినులను ప్రేమవాత్సల్యాలతో చూచుకుంటుంది. ఆమె నిలిచినచోట పవిత్రత వుంటుంది. విజ్ఞానపు వెలుగులు విరజిమ్ముతుంటాయి.  
    యూనివర్శిటీ అంతటికీ ఆమె ఆదర్శ ప్రొఫెసర్! వుండేది విజయవాడలో అయినా ఆమె పంచ ప్రాణాలు ఎల్లవేళలా యూనివర్శిటీలోనే వుంటాయి. తాను సంపాదించానని కాక ఎందరు ఉత్తమ విద్యార్ధులకు దారి చూపగలిగానని అనుక్షణం లెక్కిస్తుందామే.
    అటువంటి పని తాను చేయగలిగానని ఏ క్షణమయినా అనిపిస్తే, ఆ క్షణంలో లక్షలు ఆర్జించిన దాని కన్నా ఎక్కువ తృప్తి పడుతుంది.
    ఆమె కన్నా జూనియర్స్ అయినా, సీనియర్స్ అయినా ఆమె వచ్చిందనగానే రెస్పాన్స్ చూపుతారు. ఇప్పుడు డిపార్ట్ మెంటాఫ్ ఫిలాసఫీ హాలులో అటువంటి సంచలనమే కల్గింది.
    తనకై ఎదురుచూస్తున్న వ్యక్తీ కోసం వెదికిందామె. ఇంత పూర్వం తాను ఎన్నడూ చూచి ఉండని ఒక వ్యక్తీ కనిపించాడు. అతడు కూడ కుర్చీలోంచి లేచి ప్రొఫెసర్ శ్రద్దాదేవి కి అభివాదం చేశాడు.
    "మీరెవరో తెలుసుకోవచ్చా" అని అడిగింది ప్రొఫెసర్.
    "నాకు మీరు చాలా కాలం నుంచి తెలుసు. నా గురించి మీకు తెలియక పోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే మీకు తెలియవలసినంత గోప్పవాడను కాను" అన్నాడా వ్యక్తీ.
    "మీరు ఎక్కడుంటున్నారు?"
    "విజయవాడలోనే ! మీ యింటి ప్రక్కనే!" అని బదులిచ్చాడతడు. నా అజ్ఞానమే కావచ్చు. సారీ ! ఇంతకూ మీరిప్పుడు వచ్చిన పనేమిటో అడగవచ్చా?" అని ప్రశ్నించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    "మీతో మాట్లాడాలి. అలా కూర్చోండి" అంటూ సావధానంగా తానొక విషయం గురించి మాట్లాడదల్చుకున్నట్లుగా అన్నాడతడు.
    "ఏమిటది -? ప్రొఫెసర్  కూర్చుంది    "అమ్మా! నాకు చాలా డబ్బుంది కాని మనశ్శాంతి లేదు. అందుకు కారణం నా కూతురు. నేనొక ఎలిమెంటరీ స్కూలు టీచర్ని" అంటూ ప్రారంభించాడతడు.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి నవ్వింది.
    "వృత్తి రీత్యా మీరు మాకు సోదరులే నన్నమాట" అంది.
    "అమ్మా! అంతమాట అనకండి. మీరు యూనివర్శిటీలో, నేను ప్రాధమిక పాఠశాలలో!" అన్నాడతడు వినయంగా.
    'అక్కడ మీరు బోధిస్తారు. ఇక్కడ నేను భోదిస్తాను. ఉపాధ్యాయ ప్రాణులకు భోధన అనేది సమాన ధర్మం. అలాంటి అభ్యంతరాలేమి పెట్టుకోక మీ సోదరిగా భావించండి. చెప్పదలచుకున్నదేదో నిరభ్యంతరంగా చెప్పెయ్యండి." అంటూ అతడు ప్రదర్శించే ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్సు ను కాదంటూ ప్రోత్సహించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    అతడి నేత్రాలు అనందం తాలుకూ అనుభవంతో తరళాయితం అయినాయి. ముఖం విప్పారింది.
    "అమ్మా! నాకొక కూతురు ఉన్నదనే విషయం  జ్ఞాపకం వచ్చినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. కాని దాని స్థితిని చూస్తే మనసు వ్యధా పూర్ణమవుతుంది. పెళ్ళి అయ్యాక ఆరు నెల్లకే భర్త పోయాడు.
    అప్పటినించీ అది దాదాపు పిచ్చిది అయిపొయింది. ఎల్లప్పుడూ దేనికోసమో శూన్యంలో వెతుకుతుంది. ఆరునెలలు దాంపత్య జీవితం గడిపిన తరువాత దానికి మిగిలింది శ్వేత వస్త్రాలు మాత్రమే!" అంటూ పై ఉత్తరీయం అంచుతో కళ్ళు అడ్డుకున్నాడు ఉపాధ్యాయుడు.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి కి ఆరునెలల దాంపత్య సుఖం అనుభవించి అంతలోనే ధవళ వస్త్రాలు దరించవలసి వచ్చిన ఆ అమ్మాయి మీద జాలి కలిగింది. అవును మరి! ఆరు నెలలు భర్తతో జీవితం అనుభవించాక వారి ఆలోచనలు అన్నీ అటువైపు తిరిగిపోతాయి.
    అతడు హటాత్తుగా కన్ను మూస్తే పెద్ద షాక్! అంతే కాదు . వారు అందివచ్చిన ఆ సౌభాగ్యం అంతలోనే చేజారిపోవటం వల్ల నిరాశాపతులయిపోతారు. చేజారిన ఆ సౌభాగ్యం కోసమే శూన్యంలో వెతుక్కుంటున్నట్లు గా అయిపోతారు.
    అది సహజం!
    అయినా ఈ విషయాలన్నీంటిని ఉపాధ్యాయుడు తనతో ఎందుకు చెప్తున్నాడో ప్రొఫెసర్ శ్రద్దాదేవి కి రవంత అయినా అర్ధం కాలేదు. ఆమె కోల్పోయిన ఆ సౌభాగ్యాన్ని తాను అందించలేదు కదా!
    "అవునండీ! ఆరు నెలలకే భర్తను కోల్పోయి ధవళ వస్త్రాలు ధరించవలసి వస్తే ఆడదానికి అది శాపమే! అయినా అలాగని బ్రతుకు అర్ధాలను బండలు కానివ్వకూడదు.
    ఆమె బ్రతుకు మెరుగు అయేలాగా , పిల్లలు లేరు కాబట్టి భర్తను మర్చిపోయేలాగ చెయ్యటం మంచిది అనుకుంటాను" అంటూ తనకు తోచిన మాట చెప్పింది. అతడు తన నించి ఏమి ఆశిస్తున్నాడా అని ఆలోచించి అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ!
    'ఆమెలో అటువంటి మార్పులు వస్తాయన్న ఆశ రవంతయినా లేదు. పైగా ఉన్మాదిని అవుతుందని భయంగా కూడ ఉంది." అన్నాడతను మరింత దిగులుపడిపోతూ.
    "అలాంటి అనుమానం వస్తే ఎవరయినా మెంటల్ స్పెషలిస్ట్ కి చూపించండి. ఇలాంటి విషయాల్లో డాక్టర్ ని సంప్రదించటం అత్యవసరం" అని సలహా యిచ్చింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. పరిస్థితిని కొంత వరకూ అర్ధం చేసుకుని. ఆ మాటకు అతడు మరింత దిగులుగా చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS