Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 34


     ఇలా కొంతకాలం జరిగేసరికి  అపరబ్రహ్మగారి పొట్ట చాకలిబానలాగా తయారయింది. కైవారం కూడా మరీ పెరిగిపోయి తెరకు ఇమడనంతగా అయింది. అటువంటి సమయంలో  ఇంక ఈయన  తెరసన్యాసం చేస్తే బాగుండును. ఆయనకీ, ఆయన అభిమానులకీ కూడా క్షేమం!' అన్న గుసగుసలు  ఊరూవాడా వినిపించసాగాయి. అంతటితో అపర బ్రహ్మ గారిలో ఆత్మవిమర్శ చెలరేగసాగింది.


    "అసలు నేనెవరిని? ఎందుకు పుట్టాను?" అని పదేపదే ప్రశ్నించుకోసాగారు.


    కొంతకాలానికి ఆ ప్రశ్నకు సమాధానంగా "త్వమేవాహం... అహమే తత్వం!నువ్వే నేను - నేనే నీవు. నువ్వు ఈ రాజ్యాన్ని ఉద్దరించడానికి వచ్చిన  కారణజన్ముడివి" అని పదేపదే మనసులో వినిపించసాగింది. ఈవిధంగా సాక్షాత్తూ ఆ భగవంతుడే ప్రవర్తించినట్లు అనిపించసాగింది.

 
    "అసలు నేనెవరిని? ఎందుకు పుట్టాను?"అని పదేపదే ప్రశ్నించుకోసాగారు.

 
    కొంతకాలానికి ఆ ప్రశ్నకు సమాధానంగా"త్వమేవాహం.... అహమే తత్వం!  నువ్వే నేను -నేనే నీవు. నువ్వు ఈ రాజ్యాన్ని ఉద్దరించడానికి వచ్చిన కారణజన్ముడివి" అని పదేపదే మనసులో వినిపించసాగింది. ఈవిధంగా సాక్షాత్తూ ఆ భగవంతుడే ప్రవర్తించినట్లు అనిపించసాగింది.

 
    అచిరకాలంలోనే "అహం బ్రహ్మస్మి - నేనే బ్రహ్మను" అన్న బ్రహ్మజ్ఞానం కలిగింది. వెంటనే ఆత్మాభిమానం కోల్పోయి, అవమానాల మధ్య జీవిస్తున్న స్వజాతిని ఉద్దరించాలని నడుంకట్టాడు.


    అయితే... ఈ కానికాలంలో రాజులు లేరు కనుక, ప్రజలే ప్రభువులు కనుక ప్రజానాయకుడిగా పదవిలోకి రావాలని రాజ్యమంతటా సుడిగాలిలా చుట్టివచ్చాడు. ఆ ప్రభంజనంలో రాజ్యప్రజలు  - "రక్షకుడు వచ్చాడు" అనుకుంటూ అపరబ్రహ్మకి అధికారం కట్టబెట్టారు.

 
    అపరబ్రహ్మ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యమూ వార్తలలో వెలుగొందుతూ వుండాలని - రోజుకో సంచలనాన్ని సృష్టించసాగాడు.


    ఆయనకి  తాను చిన్ననాడు చరిత్రపాఠాలలో చదువుకున్న "తుగ్లక్" గుర్తుకివచ్చాడు. 'తుగ్లక్ ఆలోచనలన్నీ మంచివే. అయితే ఆరోజుల్లో వున్న పరిస్థితులవల్ల వాటిని అమలుచేయలేకపోయాడు' అని బాధపడుతుండేవాడు. అటువంటి తుగ్లక్ ను ఆదర్శంగా పెట్టుకుని రాజ్యమేలసాగాడు.


    ఒకరోజున అపరబ్రహ్మగారికి ప్రజలే నా దేవుళ్ళు. వారు నాకు అధికారం అప్పజెప్పిన ఆత్మీయులు. వారి ఋణం తీర్చుకోవాలి' అనిపించింది.


    వెంటనే ఓ బ్రహ్మముహూర్తాన శుభనిర్ణయం తీసుకుని "మీ అందరికీ నెలకి ఇరవై కిలోల బియ్యాన్ని కిలో రూపాయికే  ఇచ్చేస్తున్నాను. అలాగే ధోవతులు, చీరలూ కూడా సగంధరకే ఇస్తాను. అందరూ తీసుకుని అనుభవించండి" అని ప్రకటించాడు. ఇలా చేయడంవల్ల వచ్చిన నష్టాన్ని అడ్డమైన వాటిమీద పన్నులువేసి, జనాల పన్నులు ఊడపీకి వారిని ఆపన్నులను  చేశాడు.


    - అంతేవాసులతో "చూశారా.... నా లౌక్యం! ఈ చేత్తో ఇచ్చాను. ఆ చేత్తో పుచ్చుకున్నాను" అని చెప్పి మురిసిపోయాడు.


    మరో రోజున అపరబ్రహ్మగారికి చిన్నారిబాలలను చూస్తే బోలెడంత జాలివేసింది. వెంటనే "పిల్లలూ... .మీరంతా బడికిపోయి బాగా చదువుకోండమ్మా! మీకు రోజూ మధ్యాహ్నం పూట ఇంత పులుసన్నం పెట్తాను" అన్నాడు. ఆవెంటనే "పంతుళ్ళూ... మీరు పాఠాలు ఆపి వంటలు చేసి పిల్లలకి పెట్టండి!"అని ఆజ్ఞాపించాడు.


    గత్యంతరంలేక 'సరే' నన్నారు పంతుళ్ళు.


    అయితే పంతుళ్ల వంటలు పిల్లలకు నచ్చలేదు. పంతుళ్లు కూడా - "మా భార్యలు ఇళ్లలోనూ, మేము బళ్లలోనూ వంటలు చేయడమా?"అని వాపోయారు. దాంతో అపరబ్రహ్మగారికి మరో ఆలోచన వచ్చింది.


     వెంటనే "పిల్లలూ... ప్రాణంకంటే మానం గొప్పది. అందువల్ల ఇంక మీకు ఒంటిపూట భోజనం వద్దు. సంవత్సరానికి రెండు గోచీలు నా ముద్రతో ఇస్తా. కట్టుకుని సుఖించండి!" అన్నాడు.

 
    ఒంటిపూట బోజనం రోజుల్లో భోజనం పొందేవారూ, తింటుంటే చూస్తుండే పొందనివారూ అని పిల్లలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకోసాగారు.

 
    పంతుళ్ళు కూడా - "మిగిలిపోయిన వంటకాలను ఎవరు తీసుకెళ్లాలి? అసలు వండకుండానే  బియ్యం, పప్పులు, చింతపండు వగైరాలు ఏ మేరకు, ఎవరు కాజేయాలి?".... వంటి విషయాలలో తగాదాలు వచ్చి కొట్టుకునేవారు.

 
    ఆ కొట్లాటలు చూస్తుంటే, వాటిని గురించి వింటుంటే అపరబ్రహ్మగారికి బ్రహ్మానందం వుండేది.

 
    ఆ సమయంలో ఆయనకి అంతరాత్మ ఘోష వినిపించసాగింది.


    ప్రభోధిస్తున్నట్లు మనోశ్రవణాలకు వినిపించసాగింది. అలా వినిపించగా, వినిపించగా ఒక శుభముహూర్తాన ఆయనకి ఆత్మజ్ఞానం కలిగింది. 'తాను గతజన్మలో దోమాడ కరణమనీ, తాను చేయవలసిన ఘనకార్యాలు ఇంకా ఎన్నో వున్నా' యనీ గుర్తుకివచ్చింది.


    వెంటవెంటనే  ఒకరోజున అపరబ్రహ్మ'నిత్య సంఘర్షణ వ్రతం' అన్న కొత్త వ్రతానికి రూపకల్పన చేశాడు. దీని మహాత్మ్యంవల్ల ఆయన ఏ పలుకు పలికినా, ఏ పనిచేసినా ప్రజలు రెండు వర్గాలుగానో, అంతకు ఎక్కువ ముఠాలుగానో చీలిపోవడం, నిత్యం కొట్టుకుంటూ వుండడం పరిపాటి అయింది.

 
    ఒకరోజున అపర బ్రహ్మకు పీడిత, తాడిత, బడుగు వర్గాలను చూస్తే గుండె చెరువైపోయింది. తన ప్రేమ హస్తం అందించి వారిని అమాంతం పైకి లాగాలనుకున్నాడు.

 
    వెంటనే ఓ రోజున " ఈరోజునుంచీ మీ అందరికీ చదువులు, ఉద్యోగాలలో డెబ్బది శాతం కేటాయిస్తున్నాను" అని అకస్మాత్తుగా ప్రకటించాడు.


    అదివిని మిగిలినవారు -  "ఇదేమి న్యాయం? ఇప్పటికే మేము మట్టికొట్టుకు పోయాం. మమ్మల్ని సజీవంగా సమాధిచేస్తారా? ఈ అదనపు కేటాయింపులు రద్దు కావాలి"  అంటూ ఆందోళన మొదలుపెట్టారు.

 
    అవతలివారు ఊరుకుంటారా?"అపర బ్రహ్మగారి మాట చెల్లవలసిందే!" అంటూ ప్రతిఆందోళన మొదలుపెట్టారు. దాంతో వారూ, వీరూ కొట్టుకోసాగారు.


    ఆ కలహభోజనానికి బ్రహ్మమానసపుత్రుడు, కలహభోజనుడు అయిన నారద మహర్షికంటె ఎక్కువగా సంబర పడిపోయాడు అపరబ్రహ్మ. ఆ భోజనం ఎక్కువైపోయి అసలు బోజనం మానేసి పాలూ, ఆకుకూరలూ, తినడం మొదలుపెట్టాడు.


    తర్వాత న్యాయమూర్తులు కల్పించుకుని, "పాత పద్దతే కొనసాగాలి" అని తీర్పిచ్చారు దాంతో ఆయన "ఆహా.... హతవిధీ! సత్సంకల్పమునకు అన్నియు విఘ్నములే కదా!" అని వాపోయాడు.

 
    కాలం గడిచిపోతోంది.


    ప్రజలు ఏవో చిన్న చిన్న జట్టీలతో కొట్టుకుంటున్నారు కాని, పెద్దగా వీధులంబడి పోట్లాడుకోవడం లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS