వేదాంతవిద్యలో సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అంతటి పండితులు చుట్టుపక్కల లేరు. ప్రస్తుతం శిష్యులను ఎవరినీ స్వీకరించటంలేదు. పూర్తిగా యోగసాధనలో మునిగిపోయారు. వారిముఖం బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. మదనపల్లిలోని సోమేశ్వరాలయంలోనే వారి సాధన అంతా సాగుతూ ఉంటుంది. వారిని కలవటానికి అనువైన ప్రదేశం అదే. రోజంతా ఎదురుచూస్తే ఏదో ఒక సమయంలో వారితో మాట్లాడటానికి వీలుపడచ్చు.
ఈ విషయాలన్నీ తెలుసుకునే కృష్ణయార్యుడు మదనపల్లిలో సోమేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఇల్లు తీసుకున్నాడు. సుబ్రహ్మణ్య యోగిని దర్శించుకుని, ప్రవర చెప్పి పాదాభివందనం చేశాడు. ప్రశాంతంగా ఉన్న వారి ముఖం చూస్తూనే కృష్ణయార్యుని ఆవేదన మటుమాయం అయ్యింది. చిరునవ్వుతో ఆప్యాయంగా "శుభం భూయాత్" అన్నారు.
"స్వామీ! మీ కోసమే ఈ గ్రామం వచ్చాను. మీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను."
"అలాగా! మంచిది. నాతో మీకేంపని?"
"అయ్యా! నాకు ఒక్కతే కుమార్తె. పేరు వెంకమాంబ".
"విన్నాను అమ్మాయి గురించి. క్షేమమా?"
"అమ్మాయి క్షేమం గురించే మీతో మాట్లాడాలని, మిమ్మల్ని అర్థించాలని వచ్చాను".
"ఊఁ!"
"మీరూ విన్నానన్నారు కదా అమ్మాయి వింతధోరణి. అంతులేని భక్తి. మాడి పల్లెటూరు. ఎక్కువగా చదువుకునే వీలులేదు. అయినా పండితులతో వాదించి నెగ్గగలుగుతోంది. మీవంటి మహానుభావుల శిష్యరికం తనని సరైన మార్గంలో పెడుతుందని ఆశ. ముక్కుపచ్చలారని వయసులో తనకి వచ్చిన కష్టం సామాన్యమైంది కాదు. మేమున్నంతకాలం చూసుకుంటాం. తరవాత అమ్మాయి భవిష్యత్తు తలుచుకుంటే అంధకార బంధురంగా కనిపించి భయంకలుగుతోంది. మా అమ్మాయిని మీ శిష్యురాలిగా స్వీకరించండి" అని ప్రాధేయపడ్డాడు.
"నాకిప్పుడు శిష్యులకు బోధించే ఓపిక, సమయంలేవు."
"మీరు ప్రత్యేకించి బోధించనవసరం లేదు. మీరు కాదంటే మీ సేవ చేసుకుంటూ మీ పాదాలవద్దే పడి ఉంటుంది. అదే తన సాధన".
"నావల్ల కాదు. నాకు ధ్యానానికి సమయం అయ్యింది".
సుబ్రహ్మణ్యయోగి కన్నులు మూసుకున్నారు. కృష్ణయర్యునికి మిన్నువిరిగి మీద పడినట్లయ్యింది. దేవాలయం లోపలికి వెళ్ళి సోమేశ్వరుడికి చేతులు జోడించి తన కూతురి జీవితానికొక దారి చూపించమని వేడుకున్నాడు. ఇంటికి వెళ్ళలేక అక్కడే కూలబడ్డాడు. వచ్చేవారిని పోయేవారిని రిక్త దృక్కులతో గమనిస్తూ. ధ్యానంలోంచి లేచిన సుబ్రహ్మణ్యయోగి దీనవదనంతో ఉన్న కృష్ణయార్యుని చూచి రమ్మని సైగ చేశారు.
"రేపు ఉదయం అమ్మాయిని తీసుకుని ఇక్కడికే రండి" అని, తిరిగి కళ్ళు మూసుకున్నారు.
కృష్ణయ్య ఆనందంగా ఇంటికి వెళ్ళి ఆ సంగతి భార్యకి చెపుతూ "ముందు కాదన్నా ఎందుకనో మనసు మార్చుకున్నారు" అన్నాడు.
"సోమేశ్వరుడి ఆజ్ఞ." అంది వెంకమాంబ కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ.
* * *
మర్నాడు ఉదయం సుబ్రహ్మణ్యయోగి గారు రావటానికన్నా ముందే తండ్రీ కూతుళ్ళిద్దరూ గుడికి వెళ్ళి దైవదర్శనం చేసుకుని గురువుగారి రాకకి ఎదురుచూస్తూ కూర్చున్నారు. వారు రాగానే ఎదురేగి పాదాలంటి నమస్కరించారు. యోగి తనస్థానంలో కూర్చుని పిలిచారు.
"అమ్మాయీ! వెంగమాంబా!"
"అమ్మాయి పేరు వెంకమాంబ అయ్యగారూ!" అన్నాడు కృష్ణయార్యుడు.
"అది నిన్నటిదాకా! ఈనాటి నుండీ వెంగమాంబ" అన్నారు.
"ధన్యోస్మి" అంది వెంకమాంబ.
"ఎందుకని?" గురువుగారు ప్రశ్నించారు.
"నాకు దీక్షానామ మొసగి, శిష్యురాలిగా స్వీకరించారుకదా!" ఆనందంగా చెప్పింది.
"నేను సన్న్యాసిని కాదు. నాకు పీఠం గాని, పరంపర గాని లేదు. అటువంటప్పుడు దీక్షానామమెట్లా అవుతుంది?"
"శిష్యులకు ద్విజత్వం ప్రసాదించటానికి అవన్నీ అక్కరలేదు. గురువు సద్గురువైతే చాలు."
"సద్గురువు అంటే ఎవరు?"
"తాను బ్రహ్మానందాన్ని పొంది శిష్యులను ఆనందానుభూతి మార్గంలో నడిపించి, రుచి చూపించ గలవాడు."
"మరి, మామంచి శిష్యుని లక్షణం ఏమిటి?"
"గురువే దైవమని త్రికరణశుద్ధిగా నమ్మి, గురు వాక్యాన్ని తు.చ. తప్పకుండా ఆచరించటం."
"అటువంటి గురుశిష్యులు ఈ కాలంలో కనపడతారా?"
"ఇక్కడే ప్రత్యక్షంగా కనపడుతుంటే సందేహమెందుకు?"
"నేనడిగింది 'శిష్యుడు' అని శిష్యురాలనికాదు."
"ఆడ మగ అనే తేడా శరీరానికే కాని ఆత్మకి కాదని మీకు తెలియనిది కాదు. ఆ తేడా ప్రాపంచిక జీవితంలో కొన్ని అవసరాలకి పాటించబడుతూ ఉంటుంది. కాని, ఆధ్యాత్మిక సాధనలో కాదు. మీరు చేసే బోధనలని స్వీకరించేది, పరిణామం చెందేది ఆత్మ మాత్రమే. ఈ శరీరం ఆత్మ ధరించిన వస్త్రం లాంటిది. ఉండే ఇల్లు లాంటిది. కనక జీవులకే లేని లింగభేదం శిష్యులకెట్లా ఉంటుంది. అందుకని నన్ను నేను శిష్యుడు అన్నాను".
"మంచి శిష్యుడని ఎట్లా చెప్పావు?"
"మంచి గురువు స్వీకరించటంచేత. అయినా అది ఎప్పటికైనా మీ నోటివెంట రావలసినమాట. మీరు చెయ్యవలసిన నిర్ణయం."
"గురుశిష్య సంబంధం ఎటువంటిది?"
"తల్లిలో ఉండే ప్రేమ, వాత్సల్యాదులు, తండ్రిలో ఉండే శిక్షణ, న్యాయం మొదలైనవి భగవంతుని లక్షణాలైన అనుగ్రహం మూర్తీభవించిన వాడు గురువు. శిష్యుడికి తల్లి, తండ్రీ, దైవం తానే అయి సన్మార్గంలో నడిపించి ఉద్ధరించేవాడు. భౌతిక శరీరానికి జన్మనిచ్చింది తల్లితండ్రులైతే ఆధ్యాత్మిక శరీరాన్ని, జన్మని ఇచ్చేది గురువు. శిష్యుడికి తల్లి, తండ్రి, దైవం గురువే".
"బాగానే చెప్పావు. కాని, నేర్చిన దానినెంతవరకు అభ్యాసం చేస్తున్నావో చూడాలి".
వినయంగా నమస్కరించింది వెంకమాంబ.
ఉదయం దేవాలయం పరిమార్జన చేసి, గురువుగారు వచ్చే సమయానికి వారికి ఆసనాదికాలు సిద్ధంచేసి ఎదురుచూస్తూ ఉండటం, వారు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎవరూ విఘ్నం కలిగించకుండా చూడటం, వారి అవసరాలు కనిపెట్టి చూడటం, వారి నోటివెంట వచ్చే మాటలని అపురూపంగా మనసులో భద్రం చేసుకుని మననం చేయటం, వారు ఇంటికి వెళ్ళాక తాను ధ్యానంలో నిమగ్నం కావటం - ఇదే వెంగమాంబ నిత్యకృత్యం. రాత్రి నిద్రకి మాత్రమే ఇంటికి చేరటం. పగలు గుడిలో ప్రసాదంగా పెట్టిన పండుతోనో, కొబ్బరి ముక్కతోనో కడుపు నింపటం. కృష్ణయార్యుడు కూడ తన సమయాన్ని వీలైనంతవరకు సోమేశ్వరాలయంలోనే గడపటం మొదలుపెట్టాడు. మంగమాంబకి సాయంత్రం కాలక్షేపం గుడే.
