మూడు
శరీరంలో అనవసరమైన జీవకణం విపరీతంగా పెరిగిపోవటమే కేన్సర్!! మశూచి, టి.బి., ప్లేగు మనిషిని వంద సంవత్సరాల క్రితం పిశాచాల్లా భయపెట్టేవి. వాటి పేరు చెప్తేనే మనుషులు స్పృహతప్పి పడిపోయేవారు. కాలక్రమేణా మనిషి వాటికి మందు కనుక్కొన్నాడు. ఆ పోరాటంలో ఎంతోమంది తమ ప్రాణాల్ని కోల్పోయేరు. ప్రస్తుతం మనం టి.బి.ని చాలా సామాన్యమైన వ్యాధిగా చూస్తున్నాం. కానీ పాత వ్యాధులు నశిస్తూ వుంటే మనిషి క్రొత్త రోగాల్ని ఎదుర్కొనవలసి వస్తూంది. పరిస్థితి వత్తిడులు హార్టు అటాక్ లనీ, వాతావరణ కాలుష్యం కేన్సర్ నీ తయారు చేసేయి. ఈ రెండూ ప్రస్తుతం మనిషిని అమితంగా భయపెడుతూన్న మారణహోమాలు. ఈ కేన్సర్ అనే రాక్షసి దావానలంలా వ్యాపిస్తూ 'రాజు-కూలి' అనే తేడా లేకుండా కాల్చేసుకుంటూ పోతూంది. ప్రతి సంవత్సరం 3,00,000 మంది కేవలం ఈ వ్యాధివల్ల మరణిస్తున్నారు. వాతావరణ కాలుష్యం ఇలాగే కొనసాగి, ఈ లోపులో కేన్సర్ కి మందు కనుక్కోబడకపోతే 1999 నాటికి వేలసంఖ్యలో మాత్రమే ప్రపంచ జనాభా మిగులుతుంది.
కేన్సర్ అన్న పదానికి అర్థం లాటిన్ లో "పీత" (క్రాబ్). పీతలాగా అది అన్ని వైపులకీ పాక్కుంటూ పోతుంది. కాబట్టి దానికా పేరు పెట్టారు. దాదాపు డెబ్భై సంవత్సరాల క్రితం కేన్సర్ తో యుద్ధం ప్రారంభమయింది. కానీ కేన్సర్ కి మందు కనుక్కోబడటం కొన్ని "పెద్ద" కంపెనీలకీ, ఇన్ స్టిట్యూట్ లకీ ఇష్టంలేదు. ఒక చిన్న మారో టాన్స్ ప్లాంటేషన్ కి ఆరేడు లక్షల రూపాయల దాకా ఖర్చవుతుంది. బాగా డబ్బున్న వాళ్ళకి వచ్చే ఈ ఖరీదయిన జబ్బుకి ఓ వంద రూపాయలు ఖర్చుతో నయమయ్యే మందు కనుక్కోబడితే- అప్పుడింత పెద్ద పెద్ద ఆస్పత్రులూ, ఖరీదయిన ఫీజులు వసూలుచేసే డాక్టర్లూ ఏమవుతారు? అందుకే "కొన్ని చోట్ల" దీన్ని నొక్కెయ్యటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇది ఆగదు.
శరీరంలో అవసరమైన జీవకణాలు విపరీతంగా పెరిగిపోయి మనిషిని చంపటమే కేన్సర్! దీన్ని నిరోధించాలి అంటే మామూలు జీవకణానికీ, కేన్సర్ జీవకణానికీ తేడా కనుక్కోవాలి. అలా కనుక్కున్న సైంటిస్టు కోసం భవిష్యత్తులో నోబెల్ బహుమతి సిద్ధంగా వుంది.
మనిషి తనను ఛిద్రం చేసుకుంటూ- తనను సృష్టించేదేమిటో కనుక్కోవటానికి ప్రయత్నిస్తున్నాడు. లోతుకు వెళ్ళిన కొద్దీ సమస్య మరింత జటిలమవుతూంది.
ఉదాహరణకు రక్తంలో వుండే ఒక హిమోగ్లోబిన్ని తీసుకుంటే, దాని మాలిక్యూలర్ బరువు 67,000. కానీ అందులో వుండేవి నాలుగు ఇనుము పరమాణువులు మాత్రమే. వీటి బరువు (4 x 56) మొత్తం కణపు బరువులో మూడు వందలో వంతు (1/300). మరి మిగతాది? మిగతావన్నీ ఎమినో యాసిడ్స్. ఒక ఎమినో ఆసిడ్ బరువు సగటున 120. కాబట్టి ఈ లెక్కన ఒక కణంలో 550 ఎమినో ఆసిడ్స్ వుండి వుండాలి.
ఈ విధంగా సైంటిస్ట్ లు లెక్క కట్టేసరికి ఒక అద్భుతమైన రహస్యం బయటపడినట్టూ అనిపించింది.
కానీ 1935లో ఆఖరి ఎమినో ఆసిడ్ కనుక్కోబడి మొత్తం పంతొమ్మిది రకాల ఎమినో ఆసిడ్స్ వున్నాయని నిర్థారణ అయింది. సంక్షిప్తంగా వీటిని గ్లెయి-వాల్- లియో-ప్రొహిస్- ఇలా పంతొమ్మిది పేర్లతో పిలుస్తారు.
దీనిని బట్టి తేలిందేమిటంటే జీవకణంలో కేవలం ఒక్క ఎమినో ఆసిడ్ తన స్థానం మార్చుకోవటం ద్వారా మొత్తం కణం యొక్క రూపునే మార్చేస్తుందన్న మాట.
ఒక ప్రొటీన్ కణంలో ఈ అమరిక ఏ వరుసక్రమంలో వుంటుందో కనుక్కున్నందుకు 1958లో 'సింగర్'కి నోబెల్ బహుమతి వచ్చింది.
అప్పట్నుంచీ మనిషికీ, దేముడికీ యుద్ధం జరుగుతూనే వుంది. దేముడి సృష్టి రహస్యాన్ని కనుక్కోవటానికి మనిషి అనుక్షణం ప్రయత్నిస్తున్నాడు. ఒక్కో విషయం తెలుస్తూన్న కొద్దీ మనం ఎంత అజ్ఞానంలో వున్నామో బయట పడుతూంది. మొన్న మొన్న 1962లో 'మిల్లర్' కనుక్కొనేవరకూ మన శరీరంలో ప్రవేశించిన శత్రువుల్తో యుద్ధం చెయ్యటానికి కావల్సిన యాంటీ బాడీస్ ని తయారుచేసేది మెడ క్రిందుగా వుండే థైమన్ గ్లాండ్ అని మనకు తెలీదు. (ఇరవై సంవత్సరాల క్రితం మనం ఇంత అజ్ఞానంలో వున్నాం).
'పెరిగిపోవటానికీ' కేన్సర్ కీ దగ్గిర దగ్గిర సంబంధం వుందని పైన చెప్పటం జరిగింది. సృష్టికి కారణభూతమయిన సెక్స్ హార్మోను తప్పుదారి పడితే, అది కేన్సర్ ని సృష్టించటం మొదలు పెడుతుందని హెన్రీచ్ వేలెండ్ కనుక్కున్నాడు. ఇతడికి 1927 సంవత్సరపు నోబెల్ బహుమతి లభించింది. ఇది కేన్సర్ రంగంలో రెండో గెలుపు.
అప్పటివరకూ మామూలుగా వుండి, ఒక వయసు వచ్చేసరికి తొందరగా పెరిగే అవయవాలే కేన్సర్ కి గురికావటం గమనార్హం. బాలికల్లో పన్నెండు నుంచీ పధ్నాలుగు సంవత్సరాల వయసులో ఆకస్మికంగా పెద్దవయ్యే స్థనాలూ, జననాంగాల్లో ఆ వయసులో వచ్చే మార్పులూ, పురుషులలో ప్రొస్టేట్స్ లో వచ్చే మార్పులూ- ఇలా 'తక్కువ' సమయంలో పరిణతి చెందే అవయవాలే ఎక్కువ కేన్సర్ కి లోనవుతాయి.
కేన్సర్ రంగంలో ఈ విధంగా శాస్త్రజ్ఞులు ముందుకు వెళుతున్నారు. ఎంత ముందుకు వెళ్ళినా రహస్యం శోధింపబడటం లేదు, అదంత సులభం కాదు. ఎందుకంటే ఆ రహస్యం కనుక్కున్న మరుక్షణం స్త్రీ పురుషులు లేకుండా జీవోత్పత్తి ప్రారంభానికి అంకురార్పణ జరుగుతుంది.
* * *
ఆఫ్రికా ఖండపు దక్షిణ భాగాన ఒక ప్రాంతం పేరు బోచ్వానా. ఈ ప్రాంతమంతా చిట్టడవి. 'లింపోపో' అనే నది ఈ ప్రాంతం నుంచే ప్రవహిస్తుంది. ఇక్కడ మనుష్యులు 'చిమాంగ్ వాతో' తెగకి చెందిన వాళ్ళు. ఈ దేశపు దక్షిణ ప్రాంతమంతా పెద్ద కల్హరా ఎడారి. ఈ ఎడారిలో వుండే బుష్ మెన్ అనే అదివాసులు చాలా ప్రమాదకరమైన ఆటవికులు.
ఈ దేశం యొక్క పూర్వచరిత్ర ఎవరికీ తెలీదు.
మొట్టమొదటి మానవుడు ఈ ప్రదేశాల్లోనే పరిణతి చెందాడని చరిత్రకారులు చెపుతారు.
అయిదువేల సంవత్సరాల క్రితం బోయర్లు అనే తెగవారికీ, బుష్ మెన్లకీ ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతూ వుండేవి. చాలా దారుణమైన యుద్ధాలు అవి. విషం పూసిన బాణాల్తోనూ, బల్లేల్తోనూ దాడులు జరిపేవారు.
ఎలా వచ్చాయో తెలీదు కానీ, దక్షిణ భారతదేశపు అడవుల్లో వుండే మరిశ జాతి కోయలకీ, చిమాంగ్ వాతో తెగకీ దగ్గిర పోలికలు వచ్చాయి. కొన్నివేల సంవత్సరాల క్రితం బహుశా వీళ్ళు వలస వచ్చినవారై వుండాలి. అది వేరే సంగతి.
