Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 35



    విశ్వనాధంగారు, సూర్యం భుజంచుట్టూ చెయ్యి వేశారు. ఆవేదనగా స్నేహితుడివంక చూశారు సూర్యం. అది గమనించారు విశ్వానాధంగారు "సూర్యం జరిగిందానికి నాకు చాలా బాధగా వుందిరా! కానీ ఏం చేస్తాం చెప్పు" అన్నారు.

    వెంటనే లేచి సత్యంగారిదగ్గరకు వెళ్ళారు "అయ్యా సత్యనారాయణమూర్తిగారూ! నా కొడుకు చేసిన పనికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా మా కోడలిగా అంగీకరిస్తూన్నా. మా బిడ్డ లాగా చూసుకుంటాం మీరు నిశ్చింతగా ఉండండి" అన్నారు.

    "నా కూతురు నాకు చెప్పకుండా పెళ్ళి చేసుకుందనే బాధకన్నా సూర్యం నా గురించి ఏమనుకుంటాడో అనే బాధ ఎక్కువగా ఉంది నాకు" అన్నాడు సత్యం.

    "బావుంది నాకు  బాధ ఎందుకు? నాకు భారతి, దీపిక ఇద్దరూ సమానమే" అనేశాడు సూర్యం.

    సత్యం కళ్ళు నిలబడిపోయాయి. "నాకు తెలుసు వాడి మనసు అమృతం నేనే తలతిక్క వెధవని. నేనే ఎప్పుడూ తొందరపడి వాడిని బాధపెట్టేవాడిని" అన్నాడు.

    "ఏమీ కాదు. నేనే ఒళ్ళు పొగరు వెధవని. అనవసరంగా పోట్లాడి వాడిని చిరాకు పెట్టేవాడిని" అన్నాడు సూర్యం. ఆ తరువాత ఆ ఇద్దరు కలిసి కాదులే నాకే కోపం ఎక్కువ. అంటే కాదు నాకే చిరాకు ఎక్కువ నేనే మొండి వాడిని అంటే కాదు నేనే కోపిష్టిని , అని దెబ్బలాడుకోడం మొదలుపెట్టారు.

    చలపతిరావుగారికి భలే కోపం వచ్చేసింది "అయ్యా! ఇద్దరూ మొండివాళ్ళే ఇద్దరికీ కోపాలు ఎక్కువే. నామీద దయవుంచి మళ్ళీ దెబ్బలాడుకోకండి. మీకేం అరుచుకుని అరుచుకుని దభీమని విరుచుకు పడిపోతారు. ఆ తరువాత నేను తంటాలుపడాలి. అసలే పొద్దుటినించి మీ యిద్దరి మధ్యా పరిగెట్టి నీరసం వస్తోంది" అని విసుక్కున్నారు.

    "మేము పోట్లాడుకోడం లేదండీ, మాట్లాడు కుంటున్నాం" అన్నాడు సూర్యం లేచివెళ్ళి సత్యంవెళ్ళి సత్యంపక్కన కూర్చుని.

    వెంటనే స్నేహితుడిని గాఢంగా కౌగిలించుకున్నాడు సత్యం. ఇదంతా చూస్తూన్న మోహన్ గుండెనిండా ఊపిరి పీల్చుకున్నాడు.

    పెద్ద ప్రళయం వస్తుందేమో అని భయపడుతుంటే గాలి వచ్చి మబ్బు కొట్టుకుపోయినట్లే అనిపించింది అతనికీ.

    మిగిలినవాళ్ళంతాకూడా సంతోషించారు. ఇక మేము వెళ్ళొస్తాం అని లేచాడు చిట్టిబాబు" అదేమిటి ఇంతదాకా ఉన్నారు ఇప్పుడు వెళ్ళడం ఏమిటి? ఏకంగా భోజనం చేశాక వెళ్దురుగాని" అంది వర్ధనమ్మ.

    "అవును. ఎంత అరగంటలో వంట చేసేస్తాం" అనేసి కొంగు బిగించుకొని తయారైపోయింది రాధ.

    గంటలో వంట అయిపోయింది. హఠాత్తుగా కొడుకు విషయం గుర్తొచ్చింది వర్ధనమ్మకి.

    "రాధా వీడు ఏడి?" అంది.

    "ఏమో ఎక్కడికి పోయాడో!" విసుక్కుంది ఆవిడ.

    విశ్వానాధంగారూ, శారదమ్మా స్నానాలు చేశారు. మధ్యగది సర్దేసి వడ్డన మొదలుపెట్టారు.

    "భోజనానికి రండి!" అని పిలిచింది రాధ. అందరూ లేచారు.

    అంతలోనే గేటు చప్పుడయింది. ముందు కృష్ణ, ఆయన వెనక ప్రొఫెసర్ గారు. ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాడు మోహన్.

    రోజులా సూటూ బూటూ వేసుకోలేదు. తెల్లటి ధోవతి కట్టుకొని దానిమీద తెల్లటి లాల్చీ వేసుకున్నారు. తలకి నూనె రాసుకొని దువ్వుకున్నారు. చక్కగా కడిగిన ముత్యంలా వున్నారు.

    ఆయన్ని చూడగానే ఎదురు వెళ్ళాడు మోహన్. అతని చెయ్యి అందుకుని "విష్ యూ హేపీ మేరీడ్ లైఫ్" అన్నారాయన. థాంక్స్ చెప్పాడు మోహన్.

    "దీప ఏదీ?" అడిగారు. లోపలినుంచి వచ్చింది దీప. ఆయన్ని చూడగానే ముఖం  ఇంతచేసుకొని దగ్గరికి వచ్చింది దీపికని కూడా విష్ చేశారు.

    "ఏమ్మా? నీ పెళ్ళి విషయం తెలిసి మీ నాన్నగారు ఏమన్నారు? మోహన్ వాళ్ళ మామయ్యగారు యేమన్నారు? అసలే ఇద్దరిదీ ఉప్పూ నిప్పూ వ్యవహారం!" అడిగేశారు.

    సమాధానం గుమ్మంలోంచి వచ్చింది. "ఏం లేదు లెండి. ముందు కాస్త ఖంగుతిన్నా తర్వాత సర్దుకున్నాం. పిల్లలని క్షమించేసి ఆశీర్వదించేశారు" అన్నాడు సూర్యం.

    "తమరూ?" ప్రశ్నార్థకంగా చూసాడు పృధ్వి.

    వీడా? నా స్నిహితుడు సూర్యం!" అంటూ వచ్చి స్నేహితుడి భుజంమీద చెయ్యివేసాడు సత్యం.

    వాళ్ళిద్దర్నీ అలా చూసి ముందు ఆశ్చర్యపోయి ఆ వెంటనే ఆనందించారు ప్రొఫెసర్ గారు.

    "వెరీ గుడ్ అయితే భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు మీరిద్దరూ మళ్ళీ కలుసుకున్నారన్నమాట!" అన్నారు.

    స్టన్ అయిపోయాడు మోహన్ "సార్ యేమిటన్నారు మీరు? నేను సరిగ్గా విన్నాన్నా?" అన్నాడు అమిత ఆశ్చర్యంతో.

    చిన్నగా నవ్వేరు ఆయన "మోహన్" మనం పొరబాటు పడ్డామయ్యా! భూమి గుండ్రంగానే ఉంది. లేదేమో అనుకుని అనవసరంగా పరిశోధన చేసాం!" అన్నారు.

    మరింత ఆశ్చర్యపోయాడు మోహన్! "అసలు ఈ సత్యం మీ కెవరు చెప్పారు సార్? మీకెలా తెలిసింది?"

    "కృష్ట చెప్పాడు" నవ్వుతూ సమాధానం చెప్పారు ప్రొఫెసర్.

    ప్రొద్దున ఇంటినించి బయలుదేరిన కృష్ణ వెతుక్కుంటూ ప్రొఫెసర్ గారి ఇంటికి చేరాడు. తలుపు ధన ధన తట్టాడు. లోపనించి వచ్చి చిరాగ్గా తలుపు తీశారు పృధ్విగారు.

    ఎవరుమీరు? ఇది నా స్టడీ అవర్. తర్వాత రండీ!" అంటుండగానే ఆయన్ని తోసుకుని లోపలికి జొరబడి పోయాడు కృష్ణ జర్రున కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.

    "మా చెల్లాయ్ ఏది? రోజూ దీపిక మీ దగ్గరికివస్తూ వుంటుందిట ఎందుకు?" అని  అడిగాడు సూటిగా!

    అప్పటిదాకా దొంగవాడేమో అని బెదిరిపోయిన ప్రొఫెసర్ గారు అతను దీపిక అన్నయ్య అని తెలుసుకుని సంతోషించారు ప్రూట్ జ్యూస్  కూడా ఇచ్చారు. దీపికని అరగంటసేపు పొగిడారు.

    దాంతో  క్రిష్ణకోపం చల్లారింది. దీప మీకు రిసెర్చ్ లో సాయం చేస్తోంది? దాని మొహం దానికేం తెలుసనీ! ఇంతకీ మీరు చేసే రిసెర్చ్ ఏమిటీ?" అని అడిగాడు.

    ఆ విషయంమాత్రం తనని అడగొద్దన్నారు అదో పెద్ద రహస్యం అన్నారు. లోక కళ్యాణంకోసం శ్రమపడుతున్నానన్నారు.

    కానీ  క్రిష్ణ వినలేదు. ఏమిటా రహస్యం చెప్పమన్నాడు. నిజంగా లోకకళ్యాణంకోసమే రిసెర్చ్ చేస్తుంటే అంత రహస్యంగా దాచవలసిన పనేమిటని నిలదీశాడు. మర్యాదగా చెప్పకపోతే ఈ ఇంట్లో ఏదో గూడుపుఠాణి వుందని పోలీసులకి కంప్లయింట్ యిస్తాను అని బెదిరించాడు.

    పృధ్విగారు బెదిరిపోయారు. "సరే చెప్తానయితే. కానీ ఇంకెవరితో అనకు" అని హెచ్చరించి నిజం చెప్పేశారు అప్పుడే గడియారం పదకొండున్నర కొట్టింది.

    నోరు తెరుచుకుని ఆయన చెప్పింది విన్న  క్రిష్ణకి ముందర మతిపోయింది. ఆ తరువాత చిర్రెత్తుకొచ్చింది.

    గదిలో పచార్లుచేస్తూ నిర్నిమేష నేత్రాలతో తన పరిశోధనల గురించి చెపుతున్న ప్రొఫెసర్ గారిని అమాంతం లాక్కొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. మరో కుర్చీ లాక్కుని ఎదురుగా కూర్చున్నాడు.

    "ఏమిటండీ ఇది? పెద్దవారు అనకూడదుగానీ మీకేమైన పిచ్చా? చాదస్తమా? అంటూ మొదలుపెట్టి దులిపేశాడు.

    ముందు ప్రొఫెసర్ గారు కూడా  గట్టిగా వాదించారు గానీ  క్రిష్ణ ముందు నిలవలేక నీరసపడిపోయారు. అప్పటికే రెండయింది టైం ఆయన కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. "నా లంచ్ టైమైపోతోంది టీ టైం కూడా అయిపోతోంది నన్ను భోంచేసి రానీవయ్యా అప్పుడు మాట్లాడుకుందాం" అని మొత్తుకున్నాడు.

    కానీ  క్రిష్ణ వినలేదు "భోజన విషయం తరవాత ఆలోచిద్దాం. ముందు ఈ విషయం తేలనివ్వండి" అని కూర్చోబెట్టేశాడు భోజనంమాట దేవుడెరుగు మంచినీళ్ళచుక్కకూడా తాగనివ్వలేదు.

    అప్పటికీ ఓపిక తెచ్చుకొని వెళ్ళితను గీసుకున్న మేప్ లూ అవీ చూపించాడు అవన్నీ లాక్కుని చింపి పారేశాడు కృష్ణ లబోదిబోమన్నాడు ఆయన.

    "ఇదేం జబర్దస్తీ మహానుభావా? నేనేం నీ దారికి అడ్డం వచ్చానా? నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా నా మానాన నేను ఏదో ఎక్స్ పరిమెంట్ చేసుకుంటూ వుంటే వచ్చియిలా దౌర్జన్యం చెయ్యటం ఏమైనా బాగుందా?" వాపోయాడు.

    అయినా కరగలేదు  క్రిష్ణ "చూడండి మీరు మేధావులు. డబ్బున్నవారు ఏదైనా మంచి చెయ్యాలనే నదుద్దేశ్యం వున్నవారు. అటువంటి మీరు ఇలా తలా తోకాలేని పనులు చెయ్యడం ఏమిటి చెప్పండి.

    మీ తెలివితేటలు, డబ్బు వెచ్చించి ఏదైనా మంచి పని చెయ్యగలిగితే చెయ్యండి, లేదా మాట్లాడకుండా కూర్చోండి" అన్నాడు.

    కొన వూపిరితో మళ్ళీవాదించారు ప్రొఫెసర్ గారు. కానీ కృష్ణ తగ్గలేదు. సామ దాన భేద దండోయాలు వినియోగించి ఆయన్ని దార్లోకి తీసుకొచ్చాడు. స్నానం చేయించి బట్టలు మార్పించి భోజనంచేశాక యింటికి తీసుకొచ్చాడు దార్లో దీపిక మోహన్ ల విషయంకూడా చెప్పాడు పృధ్వి. తల పంకించి వూరుకున్నాడు క్రిష్ణ.

    ఇంటికొచ్చాక ప్రొఫెసర్ గారు నవ దంపతులని విష్ చేశాక ఆయన భూమి గుండ్రంగా వుందని చయపోయాక, దానికి కారణం కృష్ణే అని తెలుసుకున్నాక అతనివంక గౌరవంగా చూశాడు మోహన్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS