Previous Page
సంపూర్ణ గోలాయణం పేజి 36


    కానీ అతనుమాత్రం తీక్షణంగానేచూశాడు. అంతే కాదు అతని దగ్గరకువెళ్ళి, ఆయనంటే సరేనంటే సరే ఏదో పెద్దవాడు చాదస్తాన పడ్డాడు దీప ఏమీతెలీని వెర్రి మొద్దు కానీ మీరు కూడా ఇలా అయోమయంగా రిసెర్చ్ చెయ్యడం!" అంటూ వుండగానే అతన్ని వారించి పక్కకు లాక్కుపోయాడు మోహన్.

    "ఏం చెయ్యను కార్యార్థిని. మీ చెల్లెలిని చూసి మనసు పారేసుకున్నవాడిని ఆవిడకోసం ఆయన మాట నమ్మినట్లు నటించక తప్పలేదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి" తనుపడ్డ పాట్లు టూకీగా చెప్పేశాడు.

    అంతా విని తృప్తిగా నిట్టూర్చాడు క్రిష్ణ "అమ్మయ్య అమ్మయ్య అయితే ఫర్వాలేదు మీరుకూడా ఆయన బాటనే నడుస్తున్నారేమో పనిలో మీకూ బ్రెయిన్ వాష్ చేసేద్దామనుకున్నాను"

    "అయినా నాకు తెలీక అడుగుతాను. ఇంత అవస్థయెందుకు? డైరెక్టుగా నన్ను కలిసి నాతొ చెప్తే మీ పెళ్ళి జరిపేసేవాడిని కదా!" అన్నాడు.

    "మొదట్లో మీ చెల్లెలు అభిప్రాయంకోసం ఆగాను ఆ తర్వాత మీతో చెప్దామనే అనుకున్నాను. కానీ చెప్పేలోగా మీరు నరికేస్తానన్నారు" వినయంగా చెప్పాడు మోహన్.

    బోలెడంత బాధపడిపోయాడు కృష్ణ "ఐయాం వెరీ సారీ! పొరపాటు పడిపోయి మిమ్మల్ని అంతమాట అనేశాను. ప్రధమ తప్పిదంగా భావించి మన్నించెయ్యండి. ఇక ముందు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని గౌరవంగా చూసుకుంటాను" అన్నాడు.

    "ఛ యెంతమాట మనలో మనకు ఈ క్షమాపణలు ఏమిటి?" అనేశాడు మోహన్.

    "వడ్డించేశాను చల్లారిపోతుంది రండి!" లోపలినించి కేకపెట్టింది వర్ధనమ్మ.

    అందరూ భోజనాలకి కూర్చున్నారు నేనిప్పుడే తిన్నానుగా అంటున్నా వినకుండా ప్రొఫెసర్ గార్నికూడా కూర్చోబెట్టేశారు.

    "ఒరేయ్ మోహన్ అల్లుడిని. వెతకాలంటే కాళ్ళ చెప్పలరిగేలా తిరగాలిట నాకా ఓపిక లేదు. అల్లుడిని కాబోయి తప్పించుకున్నావు నువ్వు. కాబట్టి భారతికి సంబంధం వెతికే బాధ్యత నీదేమరి!" అన్నారు సూర్యంగారు.

    మోహన్ వెతకనక్కరాలేదురా! నువ్వు వెతికిన వరుడు నా అల్లుడైనపోయాడు కాబట్టి భారతమ్మకి నేనే వరుడిని వెతుకుతాను!" హామీ ఇచ్చారు సత్యంగారు.

    గతుక్కుమన్నాడు శ్యామ్. నోట్లో ముద్ద మింగుడు పడలేదు. భారతి నేతి గిన్నె పట్టుకొని తలవంచుకుంది.

    వాళ్ళిద్దరివంకా చూసిన మోహన్ చిన్నగా నవ్వుకున్నాడు.

    "ప్రత్యేకంగా వెతికే పనిలేదులెండి మామగారూ! భారతి అభిప్రాయం గ్రహించుకుంటే చాలు" అనేశాడు.

    అందరూ తెల్లబోయారు. "ఏమిట్రా నువ్వనేది? ఏమిటే అమ్మాయ్?" అంటూ ఇద్దరినీ ఏక కాలంలో ప్రశ్నించారు సూర్యంగారు.

    తలోంచుకుని పారిపోయింది భారతి.

    చిన్నగా నవ్వి శ్యామ్ ని చూపించాడు మోహన్.

    అందరూ మరోసారి తెల్లబోయారు. సూటిగా శ్యామ్ వంక చూసారు సూర్యంగారు.

    "ఏమోయ్ ఇది నిజమేనా?" అడిగారు.

    "ఏదండీ?" వినయంగా అడిగాడు శ్యామ్.

    "అదేనయ్యా! నువ్వు భారతిని పెళ్ళి చేసుకుంటావా?"

    "మహారాజులా! కళ్ళకద్దుకొని"

    "మరి మీ వాళ్ళు అంగీకరిస్తారా?"

    "తప్పకుండా అంగీకరిస్తారు"

    "మరయితే ఆలస్యం ఎందుకు? రేపే బయలుదేరి వాళ్ళ వూరు వెళ్దాం. భారతి పెళ్ళి, కృష్ణ పెళ్ళి కలిసి ఒకేసారి బ్రహ్మాండంగా చేసేద్దాం!" అన్నారు సత్యంగారు.

    "సత్యనారాయణమూర్తిగారూ! మరి మీ  లంకెబిందెలు" ఏదో చెప్పబోయారు సుబ్బారావుగారు.

    మధ్యలోనే వారించారు సత్యంగారు "ఇక ఆ విషయం వదిలెయ్యండి నాకు వాటిమీద నమ్మకం పోయింది" అన్నారు.

    "అదేమిట్రా అయితే జ్యోతిష్కుడి మాటమీద నమ్మకం పోయిందన్నమాట....." అమితాశ్చర్యంగా అడిగారు సూర్యంగారు.

    చిన్నగా నవ్వారు ఆయన "కాదురా! ఆ జ్యోతిష్కుడు చెప్పింది అక్షరాలా నిజమే. అరవై రాబోతుండగా ఐశ్వర్యం లభిస్తుంది అన్నాడు. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు దస్కమూ మాత్రమే అని భ్రమపడ్డాను. కానీ అనలయిన ఐశ్వర్యం ఏమిటోగ్రహించుకోలేకపోయాను ఇదుగో నా ఐశ్వర్యం. రత్నంలాటి కోడలు, వజ్రంలాటిఅల్లుడు అనాయాసంగా అభించారు నాకు. ఈ వయసులో బిడ్డల సుఖంకంటే మించిన అదృష్టం ఇంకేముంటుందిరా!" అన్నారు వింటున్న పెద్డలంతా ఆయనతో ఏకీభావించారు.

    తాపీగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి కాసేపు కూర్చుని భుక్తాయానం తీర్చుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు.

    మర్నాడు పొద్దున్నే తన కంపెనీకి వెళ్ళగానే ఇప్పుడున్న మేనేజర్ని పిలిపించి అతన్ని బ్రతిమాలి బామాలి అతనికో ఏడాది జీతం ఇచ్చి, అతనిచేత రిజిగ్నేషన్ ఇప్పించాడు చిట్టిబాబు. ఆ జాగాలో మోహన్ ని వచ్చి జాయిన్ అవమన్నాడు. కొత్త సూటర్ కూడా ఇచ్చేసి తనమాట నిలబెట్టుకున్నాడు.

    ప్రొఫెసర్ గారింట్లో ఆ వేళ బోలెడంత హడావిడి. మోహన్ దీపికా, శ్యామ్ భారతీ అక్కడే ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన కాగితాలన్నీ బయటికి తీసి పాతకాగితాలవాళ్ళని పిలిపించి ఆమేశారు. పురుగులు తినేసివని పోగా మిగిలిన కాగితాలకే పన్నెండోందల రూపాయలు వచ్చింది.

    ఆ డబ్బుతో ఇంటికి సున్నం వేయిస్తానని చెప్పారు ఆయన. ఇనుప బీరువాలు, పెద్ద పెద్ద బల్లలు ఒక లైబ్రరీకి ఇచ్చేశారు.

    ఇల్లు సున్నం అదీ కొట్టించాక మంచిరోజు చూసి మోహన్ దీపికా ఆ ఇంట్లో కాపురం పెడతారు. ప్రొఫెసర్ గారు  కొడుకు దగ్గరకు  వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు మీరు వెళ్ళాక నెలనెలా ఇంటి అద్దె మీకు పంపిస్తాను అన్న మోహన్ మీద దెబ్బలాడారు. నువ్వు నా  కొడుకులాటివాడివి. నీ దగ్గర  అద్దె తీసుకుంటానా? నువ్వు నిశ్చింతగా ఇంట్లో వుండు మంచి వృద్దిలోకి వచ్చి స్వంత ఇల్లు కట్టుక్కున్నాక అందులోకి వెళ్ళు. అప్పుడు ఈ యిల్లు అమ్మేసి ఆ డబ్బు నాకు పంపించు. నా కొడుక్కి యిస్తాను అన్నారు.

    ప్రొఫెసర్ గారు యిల్లు సర్దడానికి హైరానాపడ్డ శ్యామ్ కి తన రూం ఖాళీ చెయ్యడం ఏమంత శ్రమ అనిపించలేదు. అరగంటలో అన్నీ సర్దేశాడు. పుట్టిలక్ష్మి ఆ పూట వాళ్ళింటిలోనే భోజనం పెట్టింది "నే చెప్పలేదుటండీ, ఈ యిల్లు మహా మంచిది. రెండు నెలలు తిరక్కుండా లక్షాధికారికి అల్లుడిగా వెళ్ళిపోతున్నారు" అంది.

    రిక్షాలో సామానువేసుకుని తిన్నగా సూర్యం గారింటికి జేరి మోహన్ ఖాళీ చేసిన గదిలో ప్రవేశించాడు శ్యామ్. ఇంటి అద్దె లేదు కాబట్టి పార్ట్ టైం జాబ్ అవసరంలేదు. అయినా అర్థాంతరంగా మానేస్తే వాళ్ళకి కష్టం కాబట్టి వాళ్ళకి మరో మంచి టీచర్ దొరికేదాకా చేస్తానని చెప్పాడు. అయితే రోజూ లైబ్రరీనించి పుస్తకాలు వేవడం మాత్రం మానేసాడు.

    భారతికి రోజు పొద్దున పూట కమ్మని కథలు తనే కల్పించి స్వయంగా చెప్తున్నాడు.

    సూర్యం, సత్యం అదివరకులాగా పొద్దున్నే లేచి ఒకే పేపరు తెప్పించుకుని యిద్దరూ చెరో ముక్కా చదువుకుంటున్నారు. అదివరకులాగే కలిసిమెలిసి ఉంటున్నారు.

    క్రిష్ణకి రాధ లేకపోతే బొత్తిగా తోచడంలేదు. "రాధ వెళ్ళాక యిల్లు చిన్నబోయింది కదమ్మా!" అన్నాడు తల్లితో.

    వాత్సల్యంగా నవ్వింది ఆవిడ. "ఎంతరా! ఇంకొద్ది రోజులేగా. ఈసారి తీసుకొస్తే యిక పంపొద్దు దాన్ని. ఇక్కడే ఉంచుకుందాం" అనేసింది. తలొంచుకు వెళ్ళిపోయాడు కృష్ణ.

    ఒకదారికి వచ్చిన తన సంసారాన్ని చూసుకుని తృప్తి నిట్టూర్చింది ఆవిడ.


                     ____శుభం____


 Previous Page

WRITERS
PUBLICATIONS