Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 34


    కారులోంచి ముందుగా ముందు సీట్లోంచి పద్మ దిగింది. ఆ తరువాత డ్రైవింగ్ సీట్లోంచి చిట్టిబాబు దిగివెనుక డోర్ తీసాడు. వెనక సీట్లోంచి దిగాడు శ్యామ్.

    ఆ  తరువాత మెల్లిగా కారులోంచి దిగాడు మోహన్ పసుపు బట్టలతో మెళ్ళో పూలదండతో పెళ్ళికొడుకు వేషములో తలొంచుకుని నిలబడిన అతన్ని చూడగానే బిగుసుకు పోయాడు సూర్యం.

    మోహన్ అందించిన చెయ్యి అందుకొని మెల్లిగా దిగింది దీపిక. కూతుర్ని చూసి స్టన్ అయిపోయాడు సత్యం.

    వర్ధనమ్మ, రాధ, భారతి, చలపతిరావుగారు అంతా రోడ్ మీదికి పరిగెత్తుకొచ్చారు. నోటమాట రానట్లు నిలబడిపోయాడు. తల గిర్రున తిరిగిపోతుంటే కళ్లు మనకలుకమ్మి ముందుకు తూలాడు సూర్యం. నాన్నా అంటూ పరుగున వెళ్ళి పట్టుకుంది భారతి. మామయ్యా! ఆదుర్దాగా వచ్చేసాడు మోహన్. అంతా సాయంపట్టి ఇంట్లోకి తీసుకొచ్చారు గోడకానించి పెట్టిన మంచం తీసుకొచ్చి వాల్చింది రాధ దానిమీద పడుకోబెట్టారు.

    చలపతిరావుగారు చకచక వైద్యం మొదలుపెట్టారు కూతుర్ని చూస్తున్నాకోలదీ ఆవేశం అవధులు దాటగా నోటమాటకూడా రాక రొప్పటం మొదలుపెట్టారు సత్యంగారు.

    "నాన్నా" అని కేకపెట్టి పరిగెట్టుకొచ్చింది దీపిక. ఆ కేక విని సూర్యంగారిదగ్గర నిలబడిన చిట్టిబాబు, శ్యామ్, మోహన్, వాకిట్లోకి పరిగెట్టారు.

    మొహం అంతా ఎర్రబడిపోగా చెమటలు కక్కుతూ నాగుపాములా బుసకొడుతున్న సత్యంగారిని పట్టుకొని నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లారు.

    వరండాలో వున్న రెండో మంచం తెచ్చి గబ గబ వాల్చేసింది రాధ. ఆయన్ని దానిమీద పడుకోబెట్టారు.

    సూర్యంగారిని కామేశానికి అప్పగించి సత్యంగారి దగ్గరకు వచ్చాడు డాక్టరుగారు. ఇంజక్షనులు చకచకా పొడిచేశాడు.

    ఈ హడావిడి అంతా చూసి జనం బోలెడుమంది గుమికూడారు "ఏమిటిది?" అని ప్రశ్నలు కురిపించ సాగారు.

    "ఏమీ కాలేదండీ ఏదో కుటుంబ సమస్యలు మీరంతా వెళ్ళండి" అని కసిరేసి పంపేశాడు చిట్టిబాబు.

    చలపతిరావుగారి దగ్గరకు వెళ్ళి "డాక్టర్ గారూ! యెలావుంది వాళ్ళిద్దరికీ? ఏమీ ప్రమాదంలేదు కదా! హాస్పిటల్ కి తీసుకువెళ్దామా?" అని అడిగాడు చిట్టిబాబు.

    "పేషెంట్లుబానే వున్నారు. ట్రీట్  చేస్తున్నానుగా అవసరం అయితే చెపుతానులెండి" అన్నాడు ఆయన హడావిడిగా. వరండాలో కిందే వరసగా కూర్చున్నారు చిట్టిబాబు, శ్యామ్, మోహన్, భారతి, దీపిక, వారివారి తండ్రుల దగ్గర నిలబడ్డారు. గడపకి అనుకుని కూర్చుంది వర్ధనమ్మ కుర్చీలో కూర్చుంది పద్మ.

    రెండు మంచాలమధ్యా పరిగెడుతూ ఇద్దరికీ వైద్యం చేస్తున్నారు డాక్టర్ గారు కామేశం.

    ఇంతమంది వున్నా నిశ్శబ్దంగా వుంది అక్కడ. ఓ గంట గడిచిపోయింది. "అమ్మయ్య" చెమటలు తుడుచుకున్నాడు డాక్టర్ గారు. ఇహ ఫర్వాలేదు. ఇద్దరి బ్లడ్ ప్రెషర్లూ కంట్రోల్లో తెచ్చిచ్చాయి అన్నారు. "నాకు కాస్తకాఫీ పెట్టమ్మా" అన్నారు రాధతో.

    అప్పటిదాకా టెన్షన్ గా వున్న  అందరూ ఊపిరి పీల్చుకున్నారు కూతురివంక చూసి వర్ధనమ్మ "ఎంతపని చేశావే దీపా! మేము చచ్చిపోయామనుకున్నావా? అంతా నీ  యిష్టమేనా?" అంది ఆవిడ కోపంతో.

    ఆవిడని వారించాడు మోహన్ "చూడండమ్మా, ఇందులో దీప తప్పేంలేదు. తప్పంతా నాదే. మీరు ఏమైనా అనదల్చుకుంటే నన్ను అనండి" అన్నాడు.

    "అనక వూరుకుంటానా? ఎంత పనిచేశావయ్యా! నలుగురిలోనూ ఎంత తలవంపులు తెచ్చి పెట్టావు. అసలీ పాపిష్టి ఆలోచన నీకెలా వచ్చింది? రేపు అన్నయ్య మొహం ఎలా చూడగలం?" అంటూ వాపోయింది.

    ఇంతలోనే పక్కింటివాకిట్లో ఆగింది. అందులోంచి దిగారు కంకిపాడు విశ్వనాధంగారు, శారదమ్మ ఆ అలికిడి వాకిట్లోకి వెళ్ళాడు మోహన్.

    "నాన్నగారూ!" అంటూ దగ్గరికి వెళ్ళాడు. "ఏవిట్రా మోహనా? అర్జంటుగా రమ్మని టెలిగ్రాం యిచ్చావు. నీ ఒంట్లో బాగా  లేదేమో అని కంగారుగా ఏడుస్తూ కూర్చుంది మీ అమ్మ!" చెప్పుకుపోతూ కొడుకునీ అతని అవతారాన్నీ చూశారు.

    "లోపలికి వెళదాం రండి నాన్నా!" ఆయనకి మరో మాటకి అవకాశం యివ్వకండా చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు.

    లోపలికి వచ్చీ రాగానే అక్కడి మనుషులనీ, మంచాలనీ, పేషెంట్లనీ, దాక్లార్నీచూసి మరింత మతిపోయింది ఆయనకి. "ఏమిటీ? ఏమైంది? " అని అడిగారు.

    అంతా వివరించిచెప్పింది భారతి మరుక్షణం ఆయన ముఖం ఎర్రబడిపోయింది కొడుకుని ఛేడామాడా తిట్టారు.

    వర్ధనమ్మ లేచి శారదమ్మ చేతులుపట్టుకుంది. "మీరు మమ్మల్ని మన్నించాలి. ఇదంతా మేమే చేయించామని అనుకుంటారేమో. భగవంతుడి సాక్షిగా మాకేం తెలీదు. మీరు నన్ను నమ్మాలి" అంది దీనంగా.   

    "నమ్ముతాంలెండమ్మా మీమీద మాకేం కోపం లేదు. మా వంశోద్ధారకుడు మాతో చెప్పాడు కనకనామీ అమ్మాయి మీతో చెప్పిందని మేము అనుకోడానికి" అన్నారు విశ్వనాథం.

    "అసలైనా నోట్లో వేలుపెడితే కొరకలేకుండా వుండేవాడివి నీకింత ధైర్యం యెలా వచ్చిందిరా" అంటూ మళ్ళీ కొడుకుమీద దండెత్తుతారు.

    ఇదంతా చూస్తున్న చలపతిరావుగారికి చిరాకు వేసింది. "అయ్యా! ఇక్కడ మీరిలా అరుస్తుంటే పేషెంట్లకి డిస్ట్రబన్స్ గా వుంటుంది. అబ్బా మాట్లాడకుండా కూర్చోండి లేదా మీ అబ్బాయిని అలా లోపలికి తీసుకెళ్ళి అక్కడ మందలించండి" అని వార్నింగ్ యిచ్చారు. దాంతో ఆయన మాట్లాడకుండా కూర్చున్నారు.

    ఆయన పక్కన కూర్చుని అంతా చెప్పాడు మోహన్.

    రాధ అందరికీ కాఫీలు యిచ్చింది. గడియారం రెండున్నర కొట్టింది.

    సూర్యంగారికి మెలకువ వచ్చింది. నెమ్మదిగా  కదిలి కళ్ళు విప్పారు. విశ్వనాధంగారు లేచి వచ్చి స్నేహితుడి పక్కన కూర్చున్నాడు.

    యెదురుగా వున్న వ్యక్తి వంక పరిశీలనగా చూశాడు సూర్యం. ఆదరంగా ఆయన చెయ్యి పట్టుకున్నాడు విశ్వనాధం.

    "సూర్యం గుర్తుపట్టరేదుట్రా! నేను, విశ్వాన్ని" అన్నాడు వెంటనే లేచి మిత్రుడిని కావలించుకున్నారు సూర్యంగారు.

    "ఎన్నాళ్ళకి చూశాన్రా నిఒన్ను ఎప్పుడొచ్చావు?" అంటూ వుండగా హఠాత్తుగా జరిగిన విషయం గుర్తు వచ్చింది. తల తిప్పి చుట్టూ చూశారు. కాస్త దూరంలో మంచంమీద పడుకున్న సత్యంవంక చూడగానే వుసూరు మంది ఆయన ప్రాణం. స్టేత్ గుండెమీద పెట్టి టెస్ట్ చేస్తున్న డాక్టర్ గార్ని వారించారు.

    "నా విషయం వదిలెయ్యండి డాక్టర్ గారూ! నేను లక్షణంగా వున్నాను. వాడి విషయం చూడండి. బొత్తిగా అనారోగ్యం మనిషి" అన్నారు.

    సత్యంగారికి కూడా మెలకువ వచ్చింది. కళ్ళు విప్పగానే యెదురుగా కనిపించింది దీపిక. ఆవేశం ముంచు కొచ్చింది. అంతలోనే దుఃఖం వచ్చింది. చివాల్న లేచి కూర్చున్నారు.

    అది చూసి సూర్యంగారుకూడా లేచి కూర్చున్నారు ఇద్దరూ ఒకరివంక ఒకరు చూసుకున్నారు. ఆ చూపులో కోపం లేదు. ఎగతాళికూడా లేదు. జాలి, సానుభూతి ఉన్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS