ఒక సినీ నిర్మాత అతని దగ్గరకు వచ్చి తనకో చిత్రం తీసిపెట్టమని అడిగాడు. అప్పటికే అతని చిత్రం ఒకటి దెబ్బతింది. ఈసారి తక్కువ బడ్జెట్ తో తియ్యాలని రవితేజని అడిగాడు. ప్రతివాడూ జీవితంలో పై మెట్టు అధిరోహించాలని ఆశిస్తాడు.
అందుకే రవితేజ ఆ సినిమా అంగీకరించాడు.
చక్కటి కథను ఎన్నుకున్నాడు. మంచి సినిమా తయారు కావాలంటే ముందుగా చిత్రం కోసం ఆరు నెలలయనా పని చెయ్యాలి. సృష్టిని జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. స్క్రిప్ట్ కి అనుగుణంగా నటీనటులను ఎన్నుకోవాలి. అనుకున్న కథని సెల్యులాయిడ్ ఎక్కించే ముందు ప్రతీ షాట్ క్షుణ్ణంగా ఆలోచించాలి. అప్పుడే చిత్రం సంతృప్తికరంగాను, జనరంజకంగాను తయారవుతుంది. రవితేజ క్షణం కూడా వృధా చెయ్యకుండా తన పనిలో నిమగ్నమయ్యాడు.
ఒక రోజు రాత్రి హోటల్ గదిలో రచయిత తీసుకొచ్చిన సంభాషణలు పరిశీలిస్తున్న సమయంలో చిత్ర నిర్మాత రవితేజ వద్దకు వచ్చాడు. అతను అప్పటికే త్రాగుతున్నాడు.
ఒక సన్నివేశంలో రచయిత రాసిన మాటల్ని చూపిస్తున్నాడతను. ఇంటికి, కాలేజీకి, పార్కుకి, స్నేహితురాలి దగ్గరకు వెళ్ళి హీరోయిన్ రాలేదని తెలుసుకుంటాడు హీరో. ఆ సన్నివేశం ఎలా చిత్రీకరించాలో స్క్రిప్టులో రాసుకున్నాడు రవితేజ. హీరోయిన్ కనిపించిన తరువాత హీరో చెప్పే డైలాగుల దగ్గర వచ్చింది అనుమానం.
"నీ కోసం ఇంటికెళ్ళాను, లేవు. కాలేజీకి వచ్చాను, కనిపించలేదు. పార్కులో చూశాను, అక్కడా లేవు. నీ స్నేహితురాలిని కలుసుకున్నాను, రాలేదని చెప్పింది...." హీరో నిష్టూరంగా అంటాడు.
చిత్రీకరణలో హీరో ఆమె కోసం తిరగడం చూపించి, డైలాగుల్లో తిరిగి అదే విషయం చెప్పడం అనవసరం. ప్రేక్షకుడుకి ఆ విషయం తెలిసిన తరువాత అన్ని డైలాగులు అక్కర్లేదు.
"నీ కోసం చాలా చోట్ల తిరిగాను....." అంటే చాలు.
తెరమీద వస్తున్న దృశ్యం చూసి ప్రేక్షకుడు ఏ విధంగా స్పందిస్తాడో దర్శకుడు అంచనా వెయ్యగలిగినప్పుడే ఆ చిత్రం విజయం సాధిస్తుంది.
"మన సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయి?" అడిగాడు నిర్మాత .
"రెండు" చెప్పాడు రవితేజ. అతను డైలాగుల మీద నుంచి తన దృష్టి మరల్చలేదు.
"కనీసం నాలుగన్నా లేకపోతే ఎలా?" అడిగాడు. అతని రక్తంలో కలిసిన విదేశీ మద్యం తన ప్రభావం చూపుతోంది.
రవితేజ సమాధానం చెప్పలేదు.
"శివశంకర శాస్త్రితో పాటలు రాయించాలి. అతను పాటలు రాసిన రెండు చిత్రాలు వంద రోజులు ఆడాయి."
"ఉదయం మాట్లాడుకుందాం...." శాంతంగా చెప్పాడు.
"ఇప్పుడే తేలుద్దాం" అన్నాడు నిర్మాత.
రవితేజ నిర్మాతతో వాదించదల్చుకోలేదు. తన పనిలో తలదూర్చ వద్దని అతనికి ముందే చెప్పాడు. మధ్యాహ్నం ఆ నిర్మాత కొడుకు వచ్చాడు. సినిమాలో ఫైట్లు ఎన్ని ఉండాలో చెప్పి వెళ్ళాడు.
మరికొన్ని రోజులు ఓపిగ్గా పనిచేశాడు రవితేజ. నిర్మాత బంధువులు ఒక్కొక్కరు రావటం సలహాలు ఇవ్వటం ఎక్కువయింది. వాళ్ళు తనని సినిమా తియ్యనివ్వరని అర్ధం చేసుకున్నాడు రవితేజ. ఫలితంగా ఆ చిత్రం సెట్స్ కి వెళ్ళకుండానే దర్సకత్వ బాధ్యత వదులుకున్నాడు.
నెలరోజుల క్రితం దూరదర్శన్ వాళ్ళు మత సామరస్యంమీద ఒక లఘు చిత్రం తీసి పెట్టమన్నారు. ఆ ఆఫర్ ని తిరస్కరించాడు. మత సామరస్యం ఆవశ్యకతని ఎవరికి చెప్పడం కోసం చిత్రం తియ్యాలో తెలియక ఒప్పుకోలేదు.
ముస్లిం నడుపుతున్న టీ స్టాల్ దగ్గర ఇతర మతస్తులు టీ త్రాగుతారు. క్రిస్టియన్ టీచర్ అన్ని మతాల పిల్లలకు పాఠాలు చెబుతాడు. హిందువు దుకాణంలో అందరూ సరుకులు కొంటారు. వీళ్ళ మధ్య మతాల ప్రస్తావన రాదు. ఇలా జీవిస్తున్న ప్రజలకు మతసామరస్యం చెప్పడంలో ఔచిత్యం ఏముంది?
రవితేజ తండ్రి దగ్గర ఓ ముస్లిమ్ ఫ్యూన్ గా చేసి రిటైర్ అయ్యాడు. అతను తనని ఎత్తుకుని ఆడించటమే కాకుండా తనతోపాటు ఇంటికి తీసుకుపోయేవారు. అక్కడ తను రొట్టెలు తినేవాడు. రిటైర్ అయినా తరువాత కూడా తరచుగా ఇంటికొచ్చేవాడు. తన తండ్రి అతన్ని స్నేహితునిలా పండగలకు పిలిచేవాడు. తనని చూసినప్పుడు ఆ ఫ్యూన్ కళ్ళల్లో కదలాడే మెరుపు చూడటానికి భాషచాలదు. అటువంటి వారికి మత సామరస్యం గురించి ఏం చెబుతాడు?
ఆకలి వేసినప్పుడే అన్నం తింటాం. మత సామరస్యం గురించి చెబుతున్నామంటే అది లేదనేగా అర్ధం.
రెండో కాఫీ కూడా త్రాగి డబ్బులు చెల్లించాడు. అక్కడినుంచి తిన్నగా యస్. టి. డి. బూత్ దగ్గరకు నడిచాడు. బూత్ అప్పుడే తెరవడంవల్ల దుమ్ము గుడ్డతో తుడుస్తున్నాడు. రవితేజని చూసి పలకరింపుగా నవ్వాడు. రవితేజ ఫోను ముందుకి లాక్కుని రిసీవర్ తీసి నెంబరు డయల్ చేశాడు. కొన్ని క్షణాల తరువాత హైదరాబాద్ లోని ఓ భవనంలో ఫోను మ్రోగింది. నాలుగుసార్లు రింగ్ అయినా తరువాత రిసీవర్ లిఫ్ట్ చెయ్యబడింది. అవతలవాళ్ళ గొంతు విని చెప్పాడు రవితేజ.
"గుడ్ మార్నింగ్ సార్! నేను రవితేజని....."
"వెరీ గుడ్ మార్నింగ్! నీ ప్రాజెక్టు ఎంతవరకూ వచ్చింది?"
"రేపు షూటింగ్ చేస్తున్నాను....."
"ఎన్ని రోజులు పడుతుంది?"
"ఓకే రోజులో చిత్రీకరణ పూర్తవుతుంది. పాచ్ వర్క్ రెండు రోజులు పడుతుంది...."
"కాఫీ ఎప్పటికి ఇవ్వగలవు?"
"పదిహేను రోజుల్లో మొత్తం పూర్తవుతుంది."
"తొందరగా ఇస్తే మంచిది...."
"అలాగే......థాంక్యూ వెరీమచ్...." చెప్పి రిసీవర్ పెట్టేశాడు. మీటర్ రీడింగ్ చూసి డబ్బులు ఇచ్చి రూం వైపు నడిచాడు.
రాత్రి మేలుకుని తను నిర్మించబోతున్న డాక్యుమెంటరీ వర్క్ చేశాడు. నిజానికి డాక్యుమెంటరీ వర్క్ పేపరు మీద ఎప్పుడో పూర్తయింది. ఇంతవరకు తను తీసిన డాక్యుమెంటరీలలో ఇది సబ్జెక్ట్ ప్రధానమైనది.
వైద్యశాస్త్రానికి చెందిన డాక్యుమెంటరీ అంటే మామూలు విషయం కాదు. నిపుణులైన డాక్టర్లు మూడు గంటలపాటు దీక్షగా చేసే పనిని ఇరవై నిముషాల కార్యక్రమంలో పొందుపరచాలి. చెప్పినట్టు వినే నటీ నటులతో అనుకున్న లొకేషన్ లొ చిత్రీకరించటం కాదు. జరుగుతున్న దానిని యధాతధంగా తియ్యాలి. కెమెరా గురించి తెలియని వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆగకుండా తమ పని చేసుకుపోతున్న వ్యక్తుల మధ్య ఆ పనిని షూట్ చెయ్యాలి.
తను చిత్రీకరించే అంశానికి అవసరమైన వైద్య శాస్త్ర సమాచారం సేకరించాడు. ప్రేక్షకులకు తేలిగ్గా అర్ధమయ్యేటట్లు పిక్స్ లో ఉపయోగించాలి. చూసేవాళ్ళకు ఏమాత్రం జుగుప్స కలగకూడదు. ఎవరూ తియ్యడానికి సాహసించని రీతిలో డాక్యుమెంటరీ నిర్మించబోతున్నాడు.
ఇరవై నాలుగు గంటల తరువాత చిత్రీకరించే డాక్యుమెంటరీ రవితేజ మస్తిష్కంలో ప్రాణం పోసుకుని సిద్దంగా ఉంది.
* * * *
యాక్సిడెంటు కేసు విచారణ పూర్తయింది.
ఆ రోజు జడ్జిమెంట్ చెప్పెరోజు. ఇద్దరూ కానిస్టేబుల్స్ వెంకటేశాన్ని తీసుకొచ్చి బయట వరండాలో కూర్చోబెట్టారు. అతను గచ్చుమీద నిర్వికారంగా కూర్చున్నాడు. దూరంగా అతని తల్లి నిలబడి చూస్తోంది. తన కొడుకులో వచ్చిన మార్పు ఆమెకు అంతుబట్టడం లేదు. బెయిల్ పిటిషన్ పెట్టడానికి అతనోప్పుకోలేదు. నచ్చచెప్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతను తల్లితో మాట్లాడి చాలా రోజులయింది.
కోర్టు కార్యక్రమాలు మొదలయ్యాయి. ఒక్కొక్క కేసు పిలుస్తున్నారు. కొన్ని వాయిదా పడితే, కొన్ని విచారణకు వస్తున్నాయి. సాయంకాలం ఇదుగంతలకు వెంకటేశాన్ని పిలిచారు. అతనికి ఇదు సంవత్సరాలు శిక్ష పడింది. పోలీసులు కోర్టు నుంచి బయటకు తీసుకొచ్చారు. అప్పుడు కూడా వెంకటేశం మొహంలో ఎటువంటి మార్పులేదు. ఒక కానిస్టేబుల్ కి ఆశ్చర్యం కలిగింది.
"శిక్ష పడినందుకు బాధగా ఉందా?" అడిగాడతను.
వెంకటేశం అతనివైపు చూసి నవ్వాడు మొదటిసారిగా.
"అవును." అన్నాడు.
"నిజమే బాధగా ఉంటుంది. ఐదు సంవత్సరాలంటే మాటలు కాదు..." సానుభూతిగా అన్నాడు.
"ఐదు సంవత్సరాలు పడినందుకు కాదు బాధ. తక్కువ శిక్ష వేసినందుకు...." చెప్పాడు వెంకటేశం.
ఆ కానిస్టేబుల్ మతిపోయినవాడిలా చూస్తుండిపోయాడు.
* * * *
భాగ్యలక్ష్మి చూసి పలకరింపుగా నవ్వాడు రామకృష్ణ.
ప్రతిరోజూ నాలుగైదుసార్లు ఒకరినొకరు చూసి నవ్వుతారు. ముందుగా అనుకున్న స్థలంలో కలుసుకుంటారు. ఆమెను చూడకపోతే పిచ్చెక్కినట్టుంటుంది రామకృష్ణకి. భాగ్యలక్ష్మికి కూడా అంతే. ఆ రోజు ఇద్దరూ వెంకటేశ్వరస్వామి గుడి వద్ద కలుసుకున్నారు. ఇద్దరూ ప్రక్క ప్రక్కనే కూర్చున్నారు.
