Previous Page Next Page 
యువత నవత పేజి 34

 

  "మీరూ నేనేకాదు, సమాజంకూడా ఉందికదండీ? ఒంటరిగావుంటే ఒక మగవాడితో ఒకింట్లో ఒక రాత్రంతా వున్నానంటే సమాజం నన్ను ఎంత చెడ్డగానైనా చిత్రించుకొనే అవకాశం వుందికదా? అంతేకాని, మీరు పులిఅనీ నేను లేడిననీ, అనుకోవడంవల్ల కాదు."

    "ఆ ఇద్దరు పాసింజర్లతో మీరెందుకు వెళ్లలేదు లారీలో? లేడినని అనుకోక పోవడంవల్లనేనా?"

    "లారీ డ్రైవర్లు బాగా తాగేసి వుంటారు"

    "ఉంటే?"

    "ఏమిటివాళ నన్ను అవమానించాలని పనిగట్టుకొన్నారు?"

    "ఏం అవమానించానండీ? ఆ ఇద్దరు మగపాసింజర్లు నిక్షేపంగా లారిఎక్కి వెళ్లిపోయారుకదా? మీరెందుకు వెళ్లలేదూ అని అడిగాను అంతేకదా?"

    "మీ ఇంటికి పదండి? వెళ్లాక చెబుతాను జవాబు." దుఃఖం బిగబట్టు కొంటున్న స్వరంతో అంది శాలిని.

    చిన్న చిన్న సందులు.

     ఇళ్లలో వెలుగుతూన్న లాంతరు దీపాల వెలుతురు కొద్దికొద్దిగా వీధిలో పడుతూంటే, శాలిని జాగ్రత్తగా క్రిందికి చూస్తూ నడవసాగింది శర్మకీదారి సుపరిచితం కనుక అతడు కళ్లు మూసుకునైనా నడవగలనన్నట్టుగా వెడుతున్నాడు.

     పది నిమిషాల తరువాత శర్మ ఒకింటిముందు ఆగి తలుపుకి ఉన్న తాళం తీశాడు. లోపల అంతా చీకటి. శర్మ తలుపులు బార్లా తెరిచి టేబిల్ మీద గుర్తుగా పెట్టిన అగ్గిపెట్టె తీసుకొని లాంతరు వెలిగించి, మిద్దెనుండి వ్రేలాడుతున్న ఇనుపరాడ్ కి తగిలించాడు. అప్పుడు గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి స్వాగతం  చెబుతున్నట్టుగా "లోపలికిరండి శాలినిగారూ!" అన్నాడు చాలా మర్యాద వింపుకొన్న కంఠస్వరంతో.

    శాలిని లోపలికి వచ్చింది.


     "కూర్చోండి!" ఈజీఛెయిర్ చూపాడు.

    శాలిని కూర్చుంది ఒళ్లో బాగ్ పెట్టుకొని.

     అతడు లోపల గదిలోకి వెళ్లాడు. లోపలినుండి వస్తూన్న శబ్దాలని బట్టి అతడు స్టౌ వెలిగించి టీనో కాఫీనో పెడుతున్నట్లుగా అనిపించింది.

    తలంతా వక్కలైపోతున్నట్టుగా, అలసటగా వున్న శాలినికి వేడి వేడి టీని తలుచుకోగానే చెప్పలేనంత సంతోషం వేసింది.

    శర్మ తిరిగివచ్చి "ప్రక్క కిచెన్ దాటుతూనే దొడ్డి తడకలు  కట్టిందే బాత్ రూం అక్కడే సోపు, నీళ్లు వుంటాయి. వెళ్లి కాళ్లు కడుక్కురండి ఇదిగో టవల్" ఇస్త్రీ టవల్ తీసి అందించాడు.

     ముఖం కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ వచ్చింది శాలిని.

    "మీరు టీ తీసుకుంటారా? కాఫీ తీసుకొంటారా?"

    "ఏదైనా ఫర్వాలేదు."

    అయిదారు నిమిషాల మించకుండా చిక్కటిపాలు కలిపిన వేడి వేడి టూ  మెల్లి మెల్లిగా సిప్ చేస్తూ కూర్చుంది శాలిని.

    "షుగర్ సరిపోయిందా?"

    "సరిపోయింది."

    శర్మ ఆమెకెదురుగా ఉన్న ఛెయిర్ లో కూర్చొని టీ తాగుతున్నాడు.

    "ఇందాక మీరడిగిన ప్రశ్నకు జవాబు చెబుతాను వింటారా?"శాలిని  అడిగింది

    "వొద్దొద్దు! మనం ఇప్పుడు వాగ్వివాదం పెట్టుకోవద్దు. మీరిప్పుడు నాకు దేవీతుల్యులు! చప్పున ఇంకో అర్దానికి వెళ్లిపోకండి! అతిధిని దేవత అన్నారుమనవాళ్లు. అందుకని మీరివాళ నకు అతిధి దేవతలన్నమాట. కేవలం మిమ్మల్ని సంతోషపెట్టడమే  నేటి నా కర్తవ్యమన్నమాట. మనం వాగ్వివాదం పెట్టుకొంటే మీ మనసు గాయపడొచ్చు. అది గృహస్థులకు ఎంత కళకం"  హాస్యాన్ని, చిరునవ్వుని మేళవించి అన్నాడు శర్మ.

    "గాయపడేదిఏదో ఇదివరకే గాయపడింది. ఇప్పుడు కొత్తగా గాయపడదులెండి ఆ మగ పాసింజర్ల తోపాటు  నేనూ ఎందుకు వెళ్ళలేదంటే  వాళ్లని ఎవడో చెడగొడతాడన్న భయంలేదు. ప్రకృతి వాళ్లను ఆభయం లేకుండా పుట్టించింది. కాని, అదే ప్రకృతి మిమ్మల్ని అందుకు భిన్నంగా పుట్టించింది. అదే నేను లారీలో వెళ్లని కారణం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS