Previous Page Next Page 
యువత నవత పేజి 33

   
    రెండు మూడు రోజులు గడిచాయి.

     చంద్రకాంత్ పర్సనల్ విషయాలు ఆఫీసులో కుతూహలంగా చెప్పుకోగా వింది సుధ.

    అతడి విద్యార్ది జీవితమంతా "పుస్తకాల పురుగు" అన్న బిరుదుతో గడిచిపోయింది. ముప్పయ్యోయేట శ్యామల అనే అతిబీదింటి అమ్మాయిని వివాహం చేసుకొన్నాడు. కాని కట్నం తీసుకోలేదు. ఆమె అపురూప సౌందర్యం చూసి చేసుకొన్నాడా అంటే అదేంలేదు. ఆమెది చాలా సాదా అందం అందం విషయానికివస్తే. అతడికి ఆమె ఏమాత్రం సరిపోదు.

     ఆ సంగతే అతడితో ఎవరయినా అంటే,

    "స్త్రీతో ఒకటి రెండు అనుభవాల తరువాత  ఆమె బాహ్య సౌందర్యం చూడడం మానేసి ఆత్మసౌందర్యం వెతకడం మొదలు పెడతాడు పురుషుడు. అప్పుడది కనిపించకపోతే జీవితమే ఒక నరకమని భావించవలసి వస్తుంది. ఆ ఆత్మ సౌందర్యానికి నేను ముందే వెదికి నాకు సరిపోయిన అమ్మాయిని నేను ఎన్నుకుని పెళ్లి చేసుకున్నాను!" అని చెబుతాడట.

    మగవాళ్లలో ఇంత ఉదాత్తంగా ఆలోచించే వాళ్లున్నారా? సుధ ఆశ్చర్యానికి అంతులేదు.

                 
   5

    సాయంత్రం బడి వదిలాక వనపర్తికి రావడానికి బస్ స్టాండ్ లో నిలబడింది శాలిని. ఆమె ముఖం ఆందోళనతో నిండిపోగా, బస్సు వచ్చే దారివైపు రెప్పవాల్చకుండా చూస్తూంది.

     సాయంత్రపు షికారుకు ఆ రోడ్డుమీదే వెడుతున్నాడు శర్మ. "లాభం లేదు: మీరెంత కళ్లు చించుకు  చూసినా బస్సు రాదివాళ. పై ఊళ్ళో  జనం నీళ్లలో పోసిన తాజా సున్నంలా ఉడికిపోతున్నారట. కండక్టరు  ఆ ఊరి ఆడమనిషితో అమర్యాదగా ప్రవర్తించాడట. అందుకని ఆ కండక్టర్ క్షమాపణ చెప్పుకోవాలట.  అంతవరకూ ఊళ్లోకి ఏ బస్సునీ రానివ్వం వచ్చిన బస్సుని తగలబెట్టేస్తాం, అంటున్నారట ఆ ఊరి యువకులు" అని చెప్పాడు.

     "కండక్టర్ తప్పైతే బస్సులన్నీ ఏం తప్పుచేశాయి?"

    "ప్రభుత్వం మీదా, ప్రభుత్వోద్యోగులమీదా తమ కోపాన్ని చూపెట్టుకోవాలంటే చాలా తేలిగ్గా దొరుకుతాయి బస్సులు, రైళ్ళు."

    "ఏమిటో! మనవాళ్లలో కల్చర్ పెరుగుతూందో, తరుగుతూందో తెలియడంలేదు."

    అరగంట తరువాత శర్మ వాకింగ్ నుండి తిరిగి వస్తూ , శాలిని అక్కడే నిలబడి వుండడం చూశాడు. "ఇవాళ బస్సురాదని చెప్పానుగా?"

    "మీరేకాదు! మరో ఇద్దరుచెప్పారు ఆ సంగతి. ఏం చేయాలి మరి? నాకెవరూ తెలియదు ఈ ఊళ్లో! ఈ రోడ్డుమీదే తెల్లవార్చాలో ఏమో!" అంది కొంచెం దీనంగా.

     "ఎవరింట్లోనో ఒకరింట్లో ఈరాత్రి తలదాచుకోవాలి"

    " నాకెవరూ ఇక్కడ పరిచయం లేరే!"

    "అభ్యంతరం లేకపోతే  మా ఇంటికిరండి!"

    "మీ ఇంటికా? మీరొక్కరే వుంటారేమో?"

    "ఒక్కడినే వుంటే?" శర్మ చురుగ్గా చూసాడు. "ఎప్పుడు ఏ ఆడపిల్ల వంటరిగా దొరుకుతుందా, దాన్ని పాడుచేయన అని చూస్తున్న మనిషిలా కనిపిస్తున్నానా  మీకు? మీ ఆడవాళ్లు ఎంత అభ్యుదయంగా మాట్లాడే వాళ్లయినా ఇంతకంటే వేరే ఆలోచించలేరుకదూ?"

    ఆ మసక వెలుగులోనూ  శాలిని ముఖం రక్తసింధూరం కావడం శర్మ చూపులను దాటిపోలేదు.

    "మీ ఆడవాళ్లే కాదు! కొందరు మగవాళ్లకి కూడా కొన్ని నియమాలు, కొంతనీతి వుంటుందని మీరు గుర్తించడం మంచిది" అన్నాడు మళ్లీ పదునుగా.

     దాదాపు కొయ్యబారినట్టుగా నిలబడిన శాలినినుండి ఇప్పటికీ మాట రాలేదు.

     అంతలో ఓ లారీవచ్చి ఆగింది.

    బస్సుకోసం నిలబడిన ఇద్దరు ప్రయాణీకులు పరిగెత్తి ఎక్కారు.

    శర్మ లారీ దగ్గరికి వెళ్లి వచ్చాడు. "ఈ లారీ వనపర్తికే వెడుతుందట. బస్సు టికెట్ డబ్బులుఇస్తే మిమ్మల్ని  తీసికెడతానన్నాడు డ్రైవరు వెడతారా?"

    "..........."

    "చప్పున ఏదో ఒకటి నిర్ణయించుకోండి. ఈ లారీకూడా  వెళ్లిపోతే ఈ రాత్రికి ఇక్కడ చిక్కుబడిపోక తప్పదేమో!"

    "పోనీండి! మీ ఇంటికి వస్తాను"

     "పులిబోనులోకి తల దూరుస్తున్నట్లుగానా?" అన్నాడు కదులుతూ.

    "ఏం లేదు? నేనేం భయపడడంలేదు!" శాలిని  అతగాడిని అనుసరిస్తూ బింకంగా అంది.

     "ఒంటరిగా ఉంటారేమో అని ఎందుకన్నారుమరి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS