Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 34


    సుధాకర్ వ్యధాచత్తుడై 'ఇదంతా నావల్లే జరిగింది. నేనెంత స్టుపిడ్ ని. వాడనుమాన పడతాడనేనా గ్రహించలేదు. వాడు మూడీగా ఉన్నప్పుడైనా అర్ధం చేసుకోకుండా పూలిష్ గా ప్రవర్తించాను. వదినగారూ! ఇప్పుడే వస్తా - వాడికి నచ్చచెప్పి వాడ్ని వెంట బెట్టుకు వస్తా" అన్నాడు. జానకి కఠినంగా "నీవు అయన దగ్గరికి వెడితే నా మీద వట్టె - నీ సిఫార్సులు నాకనవసరం ' అంది.
    సుధాకర్ దీనంగా చూశాడు. "వదినగారూ ఇద్దరూ కలిసి నన్నెందుకిలా హింసిస్తారు. నా కారణంగా మీ కాపురం ఇలా అయితే నన్ను నేను ఎలా క్షమించుకోను. ఏం చెయ్యకుండా ఎలా ఊరుకోమన్నారూ!" కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు సుధాకర్.
    'సుధాకర్ ఈ పరిస్థితిలో నీవు చెపితే మాత్రం ఆయన తలకెక్కుతుందనుకున్నావా? లాభం లేదు. నా గురించి నీవేం బాధపడకు. నేనేం చచ్చిపోను. మా ఇంటికి వేడ్తున్నాను. రేపు కాకపొతే కొన్నాళ్ళకి ఏదో ఉద్యోగం దొరక్కపోదు. ఈలోగా మావాళ్ళు తరిమేయరనుకుంటాను. నవ్వింది పేలవంగా జానకి. సుధాకర్ ఆమెవంక ఒక్క క్షణం అలా చూస్తుండిపోయాడు. తరువాత ఏదో నిశ్చయం చేసుకున్నవాడిలా పదాలు బిగబట్టి "నా కారణంగా మిమ్మల్ని వంటరి అవనీయను. ఆ ఫూల్ , ఆ స్టుపిడ్ అన్న మాటలు నిజం చేద్దాం. లేవండి , నా రూమ్ కి రండి. నేనున్నన్ని రోజులు మీకే లోటు రాదు. రండి" ఆవేశంగా అంటూ లేచి నిల్చున్నాడు. జానకి చాకితురాలైంది. ఒక్క క్షణం "మతిపోయింది నీకు , ప్లీజ్ , ఇంటికి వెళ్ళు సుధాకర్" జానకి తల తిప్పుకుంది. "ఊహు పదండి రావాల్సిందే మీరు" చిన్నపిల్లాడిలా మంకుగా అన్నాడు.
    "అయన అన్నదంతా నిజమనుకునే అవకాశం ఆయనకి ఇస్తామనుకున్నావా? సుధాకర్! లోకం దృష్టిలో మనం దోషులుగా నిలబడడానికి ఎంత మాత్రం ఒప్పుకోను. ఇంకెవరన్నా ఫరవాలేదు. నీతో మాత్రం - సారీ, అదిగో ట్రైను వస్తుంది. గుడ్ బై. మరిచిపో నన్ను" జానకి దిగ్గున లేచి నిలబడింది. వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా రైలు ఎక్కిన జానకిని తీసుకుని కదిలిపోయిన రైలుని చూస్తూ వెర్రివాడిలా నిలబడ్డాడు సుధాకర్.

                                                    ***

    కాలచక్రం ఐదేళ్ళు గడిచాయి. ఈలోగా జానకి తల్లిదండ్రులు - సుధాకర్ , రామం జానకిలను కలపాలని చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్ధమాయిపోయాయి. తనని క్షమార్పణ కోరితే కాని వెళ్ళనని జానకి, ఆమె తప్పయిందని వప్పుకుంటే తనకేం అభ్యంతరం లేదని రామం, ఇద్దరికిద్దరూ పంతాలు పట్టి బింకంగా రాజీకి అంగీకరించకపోయేసరికి , అందరూ నిస్పృహతో వదిలేశారు ఇద్దరినీ. కాలం ముందుకు సాగుతూనే వుంది. జానకికి నాలుగేళ్ళ పాప ఇప్పుడు.
    అనుకోకుండా ఐదేళ్ళ తరువాత జానకి, రామం రైలులో కలిశారు. మొదట రామం జానకిని చూసి మొహం చిట్లించి తల తిప్పుకున్నాడు. తరువాత వద్దనుకుంటూనే జానకిని, కానకికి పక్కనున్న పాపని చూశాడు. రామాన్ని చూసి జానకి చిరునవ్వుతో "బావున్నారా" అంటూ ఆమె ముందు పలకరించింది. జవాబు చెప్పకూడదనుకుంటూనే అప్రయత్నంగా "ఊ' అన్నాడు. కుతూహలం చంపుకోలేక "నీ కూతురా" అన్నాడు. పాపని చూసి . జానకి చిరునవ్వుతో "ఊ" అంది. "పెళ్ళి చేసుకున్నావన్నమాట!" అసూయగా చూశాడు. "ఊ" అంది జానకి నవ్వి. "ఎప్పుడు?" "చాలా రోజులయింది" అంది జానకి. "హు" అన్నాడు రామం.
    'సుధాకర్ నేనా - నాకు తెలుసు చేసుకుంటావని , నా అనుమానం వట్టి అపోహేమోనని ఇన్నాళ్ళు కాస్త బాధపడ్డాను. నాకు బాధ తప్పించావు థాంక్స్' హేళనగా అని మొహం తిప్పుకున్నాడు. రైలు ఏదో స్టేషనులో ఆగగానే మరో కంపార్టుమెంటు లోకి మారిపోయాడు రామం. ఆ సంఘటనతో ఇద్దరికీద్దరికి ఒకరి పట్ల మిగిలిన కాస్త గౌరవం , అభిమానం ఏమన్నా వుంటే పూర్తిగా తుడుచుకుపోయింది.
    "వాంట్ టూ టాక్ విత్ యూ కమ్ ఇమ్మీడియట్లీ" అన్న టెలిగ్రాం జానకి నించి ఇరవై ఏళ్ళ తరువాత అందుకున్న రామం ఆశ్చర్యచకితుడయ్యాడు.
    ఆనాడు రైలులో జానకిని చూసాక - ఆమెపట్ల ద్వేషం పెరిగి , ఆ ఆవేశంలో రామం ముందు వెకలు ఆలోచించకుండా , వెంటనే మరో పెళ్ళి చేసుకున్నాడు. జానకితో పూర్తిగా తెగతెంపులు అయిపోయినట్టు కొత్త జీవితం ప్రారంభించాడు.
    మరో రెండేళ్ళ తరువాత అనుకోకుండా సుధాకర్ ని కలిశాడు రామం. జానకి వెళ్ళిన తరువాత, ఆ సంఘటన తరువాత , సుధాకర్ రామంని కనీసం చూడనుకూడ చూడలేదు. వెంటనే రెండు నెలలు శలవు తీసుకుని వెళ్ళిపోయి ఆ తరువాత అక్కడ నించి ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. సుధాకర్ ని చూసి రామం కసిగా "ఓహో - ఎన్నాళ్ళకి దర్శనభాగ్యం , జానకి కులాసానా , మీ అమ్మాయి క్షేమమా?" అన్నాడు. సుధాకర్ తిరస్కారంగా చూసి "జానకి, ఆమె కూతురు క్షేమసమాచారాల పట్ల నీకా మాత్రం ఆసక్తి వున్నందుకు సంతోషం. కాని నీ భార్య నీ కూతురు క్షేమ సమాచారం గురించి అడగవలసింది నన్ను కాదు' అన్నాడు కటువుగా. రామం తెల్లపోయాడు. "ఏమిటి - ఏమంటున్నావు , నా కూతురా!' అన్నాడు. "ఆ, అక్షరాల నీ కూతురు, జానకి ఇంట్లోంచి వెళ్ళిపోయేనాటికి గర్బవతి అన్న సంగతి, ఆమెకీ అప్పటికి తెలియదు. తరువాత ఎనిమిది నెలలకి పుట్టింది నీ కూతురు.
    'అబద్దం, జానకికి .... నీకు పుట్టిన కూతుర్ని నాకు అంటగట్టాలని చూస్తున్నారు. జానకి నీవూ ఇద్దరూ ...."ఆవేశంగా ఏవో అనబోయాడు. "షటప్ - వాగకు - జానకి చెప్పింది. ఆరోజు రైల్లో నీవు జానకిని చూసి అడిగిన ప్రశ్నలు, నీలాంటి  చదువుకున్న మూర్కుడిని చూడలేదు నేను. పెళ్ళంటే అందులో ఒకసారి పెళ్ళయిన ఆడదానికి రెండో పెళ్ళి అంత సుళువనుకున్నావా. అంత త్వరలో చేసుకునే మొగధీరుడు వున్నాడనా నీ ఉద్దేశం. ఒకవేళ చేసుకున్నా భర్త బతికుండగా అతని నించి చట్టబద్దంగా విడిపోకుండా ఆమె పెళ్ళాడగలదని ఎలా అనుకున్నావు. అంత పూలిష్ గా స్టుపిడ్ లా ఎలా ఊహించావు . జానకి అప్పుడే కాదు, ఇప్పటికీ పెళ్ళి చేసుకోలేదు. ఉద్యోగ చేసుకుంటూ నీ కూతుర్ని పోషిస్తూ బతుకుతుంది అర్ధమైందా ఆమె గురించిన అపోహాలు ఇప్పటికైనా తొలగించుకో" సుధాకర్ తీవ్రంగా అన్నాడు.
    "మరి - మరి మీ ఇద్దరూ పెళ్ళి చేసుకోలేదా , అవునందే' వెర్రివాడిలా అన్నాడు రామం.
    "హు, నీ కర్ధమయింది అంతేలే. జానకి నాకు వదిన. ఆమెకి నేను మరిదిని. సోదర సమానుడిని. అంతే మా మధ్యవున్న బంధం. నీతో జన్మ మాట్లాడ కూడదనుకున్నాను. కాని మా గురించిన నీ అపోహ , అపోహ మాత్రమే అని నీ అంతట నీవు ఇప్పటికీ గ్రహించలేదు. తెలుసుకో ప్రయత్నించలేదు గనక చెప్పాల్సివచ్చింది . నౌ, గుడ్ బై, ఐడోంట్ టూ మీట్ యూ ఎగైన్" సుధాకర్ మొహం తిప్పుకు వెళ్ళిపోయాడు.
    జానకి గురించిన నిజాలు విన్నాక, రామానికి మతిపోయినట్లయింది. పశ్చాత్తాపం మొదలయింది. కాని చాలా ఆలశ్యం అయింది. అసలే తనని క్షమించని జానకి, ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకున్న తనని ఎంతమాత్రం క్షమించదు! జానకి బతుకూ తనదీ, పూర్తిగా వేరైంది. ఇంక తమమార్గాలు ఎంత ,మాత్రం కలవ్వు. జానకి గుర్తు వచ్చినప్పుడల్లా ఇన్నాళ్ళూ రామం ఏదోలా బాధపడుతూనే వున్నాడు.
    ఇరవై ఏళ్ళ తరవాత జానకి తనతో మాట్లాడాలనుకోడం వింతగా తోచింది. ఇన్నాళ్ళ తరువాత తన అవసరం ఏమి వచ్చింది!

                                                   ***

    ఇరవై ఏళ్ళ తరువాత , రామం జానకి "శవాన్ని' మాత్రం చూడగలిగాడు. మాట్లాడాలని పిలిచిన జానకితో మాట్లాడలేకపోయాడు. ఆమె ఉత్తరం మాత్రం చదువుకోగలిగాడు. ఉత్తరం క్లుప్తంగా వుంది. "నవమాసాలు మోసి, కని , అష్టకష్టాలు పడి బిడ్డను పెంచిన తల్లికి యీయని స్థానం, హక్కులు తండ్రికి యిచ్చింది. మన సంఘం. మన సంఘమే కాదు ప్రపంచంలో ఎక్కడా అంతే!! లోకంలో తల్లిలేని బిడ్డల పట్ల సంఘానికి సానుభూతి, ఆదరణ వుంటుంది. తల్లి ఎవరో తెలీని బిడ్డలకి సంఘంలో స్థానం వుంటుంది. కాని తండ్రి ఎవరో తెలీని బిడ్డలని సంఘం క్షమించదు, ఆదరించదు. అన్నసత్యం ఇన్నాళ్ళకి తెలుసుకున్నాను. తెలుసుకున్నాక నా కూతురు కోసం, ఆమె సుఖసంతోషాల కోసం , ఆమె దృష్టిలో ఇంకా "నేరస్తురాలిని అవలేక" నా అత్మభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కన్న బిడ్డ కోసం బలి పెట్టుకుని ఇది మీకు రాస్తున్నాను.
    ఆమె మీ కూతురన్న సత్యం సుధాకర్ ద్వారా మీరు తెలుసుకున్నారన్న నిజం నాకు తెలుసు. నేను యింట్లోంచి వెళ్ళేరోజు, మీ బిడ్డకి తల్లిని కాబోతున్నాన్న సత్యం తెలిసి వుంటే, యీ కధ ఇలా ఉండేది కాదేమో! నే నీ ఉత్తరం రాయాల్సిన అవసరం వుండేది కాదేమో! బిడ్డ పుట్టాక అందరూ చెప్పినా వేడి రక్తం పొంగులో , ఆవేశంలో నా బిడ్డని తండ్రి లేకుండానే పెంచుకోగలనన్నాను. అన్నమాట ప్రకారం ఈనాటి వరకు తండ్రి పేరూ తెలీకుండా , తండ్రి అవసరం తోడూ లేకుండానే పెంచుకున్నాను. కాని దేముడు మొగుడే గనక, ఆడదానికింత ఆత్మవిశ్వాసం వుండకూడదనుకున్నాడు కాబోలు. ఆఖరికి నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి కల్పించాడు. మనం ఎంతో మారుతున్నాం. పురోగామిస్తున్నాం అనుకున్నా, అది అంతా వేషభాషలతో తప్ప, ఆచారాలలో, కట్టుబాట్లలో మార్పు లేదన్నది సత్యం. తల్లి చేసిన తప్పు, తప్పు కాకపోయినా సంఘం కూతురి మీద రుద్దుతుందని తెలుసుకున్నాను. పరువు గల యింట బుట్టినా విద్యా సంస్కారం వున్నా, గౌరావంగా బతుకుతున్నా కేవలం తండ్రి దగ్గర లేని కారణంగా, నా బిడ్డ పాతికేళ్ళు వచ్చినా అవివాహితగానే మిగిలింది. అందుకు కారణం నేనన్న సంగతి గ్రహించి నా సర్వస్వం ధారపోసి పెంచిన 'నాకూతురే" ఈనాడు ననన్ను ద్వేషిస్తుంది. అప్పటికి గాని నేను ఓడిపోయానన్న సత్యం గుర్తించలేకపోయాను.
    ఎన్ని యుగాలు గడిచినా ఆడదాని కధ మారలేదు. మారదు. అలనాటి సీత మొదలు ఈనాటి జానకి వరకు ఈ అవమానం, అవహేళనలు ఎదుర్కుంటూనే వుంది. ఎదురు దెబ్బలు తింటూనే వుంది. ఆఖరికి ప్రకృతి చేతిలో ఒడుపోతూనే ఉంది.
    ఎన్నిసార్లు రామాయణం విన్నా, చదివినా, సీతాదేవి అన్ని కష్టాలు భరించి ఆఖరికి భర్తని కలుసుకుని, భర్తా బిడ్డలతో సుఖంగా బతికే తరుణం ఆసన్నమయినప్పుడు , కోరి తన జీవితాన్ని ఎందుకు పరిసమాప్తి చేసుకుందో అర్ధం గాలేదు. ఎందర్ని అడిగినా ఆ సందేహ నివృత్తి కాలేదు. రెండుసార్లు అవమానించి నిర్ధాక్షిణ్యంగా (కారణం ఏదయినాగాని) అడవులకి పంపిన భర్త, మరోసారి ఇంకెవరి కోసమో మళ్ళీ ఆ పని చెయ్యడా అన్న అనుమానం వల్లా - సుఖపదవలసిన సమయం అంతా కన్నీరే నింపుకుని, తల్లిగా తన కర్తవ్యం పూర్తీ చేసి బిడ్డలని తండ్రికి అప్పగించాను. ఇంకేముంది అన్న విరక్తా - లేక జీవితంలో అన్ని కస్టాలు సహించి ఆఖరి క్షణంలో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం పోగొట్టుకోవలసిన అవసరం కనపడక, తన వ్యక్తిత్వం నిలుపుకోవాలని అలా చేసిందా? ఎన్నటికీ జవాబు దొరకని ప్రశ్నే అయింది ఇన్నాళ్ళూ.
    కాని ఈనాడు సీతాదేవి అలా ఎందుకు చేసిందో అర్ధం అయింది. సీతాదేవి పతివ్రత గనక, కావాలనుకున్న క్షణంలో భూదేవి వడిలో ఆశ్రయం సంపాదించుకుంది. కాని ఈ జానకి అంతటి పతివ్రత కాదు. కనక స్లీపింగ్ టాబ్లెట్స్ ఆశ్రయించుకుంది.
    నా టెలిగ్రాం అందగానే వచ్చి, మీ కుమార్తె బాధ్యత స్వీకరిస్తారన్న నమ్మకంతో నిశ్చింతగా దాటిపోతున్నాను. లోకం తల్లిలేని బిడ్డని తప్పక ఆదరిస్తుంది కనక, ఆమె వివాహం మీకో సమస్య కాదు.
    నా యీ పని అహంకారానికి, చిహ్నం అనుకోండి. అత్మభిమానానికి నిదర్శనం అనుకోండి. మీ యిష్టం వచ్చిన పేరు పెట్టండి - వుంటా " జానకి.

                                                       *జ్యోతి మంత్లీ ప్రత్యేక సంచిక , '82   
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS