Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 35


                                             ప్రకృతి - పురుషుడు

    'అమ్మా! అమ్మా!' బాధతో లుంగచుట్టుకుపోతూ వరలక్ష్మీ కేక పెట్టింది. ఆకేక విని ఏ అమ్మా పరిగెత్తి రాలేదు. పిల్లల్ని కన్న అమ్మలు, అమ్మల్ని కన్న అమ్మమ్మలు అంతా ఎవరి పనుల్లో వారున్నారు. బియ్యం ఏరుకుంటూ , ఉల్లిగడ్డలు తరుక్కుంటూ, రొట్టె లోత్టుకుంటూ ఉదయం పూట పనితో ఎవరి హడావుడిలో వారున్నారు.
    వరలక్ష్మీ నిస్సహాయంగా చూసింది. కళ్ళ నీళ్ళు గిర్రున తిరిగాయి. మళ్ళీ నొప్పి వస్తుంటే వెనుతిరిగి లోపలికెళ్ళి ఓ సంచిలో ఓ చీర, జాకట్టు , దుప్పటి, తువాలు పెట్టుకుని దిండు కింద దాచిన చిన్న పర్సు సంచిలో పెట్టుకుని బయటికి వచ్చింది. మహిళల మొహాల్లో రంగు ఓ క్షణం ,మారి మళ్ళీ మాములయింది. ఎవరి పనుల్లో వారు మునిగారు.
    అంతా పిల్లల్ని కన్నతల్లులే - కంటున్నా తల్లులే - తోటి ఆడదాన్ని కాస్తంత ఆదుకోవాలనే జాలి కూడా లేదా? కాదు, కానేకాదు , ఎవరింట్లో శుభం, అశుభం జరిగినా మేమున్నాం అంటూ ఆవాడ వాడంతా కదిలి వస్తుంది. మరి అయితే పాపం వరలక్ష్మీ నెందుకమ్మా అట్లా అంతా చూస్తూ కూడా వదిలేశారు? "లేచ్చొచ్చినదాన్ని , వుంచుకున్నాడితో కడుపులు తెచ్చుకున్నదాన్ని ఎలేయక ఎట్టా కలుపుకుంటామమ్మా? మాకూ పెళ్లీడుకొచ్చిన పిల్లలున్నారు. ఇలాటి రకాలని సూసి అల్లుసెడిపోరూ"
    పాపం వరలక్ష్మీ అయినింట పుట్టి బొద్దుగా, కళగా ముద్దబంతిలా పూవులా వుండేది. ఉన్న వూర్లో స్కూలు, ఫైనల్ చదివేసి తోట వెంట, చెరువు గట్లంట వనలక్ష్మీలా స్నేహితురాళ్ళతో కల్సి పాటలు పాడుకుంటూ, ఉయ్యాళ్ళుగుతూ , సినిమాలు, టి.వి. లు చూసుకుంటూ , చదన్నం తిని, చాపేసుకుని పత్రికలు, నవల్లు చదువుకుంటూ కడుపులో చల్ల కదలకుండా ఉండే పిల్ల.
    సినిమా షూటింగు ఆ వూరు సినిమావాళ్ళు రావడం, అసిస్టెంట్ డైరెక్టర్ భాస్కర్ కంట వరలక్ష్మీ పడడం, బొద్దుగా, ముద్దబంతిపూవులా , సావిత్రిలా ఉన్న వరలక్ష్మీని స్టారు చెయ్యాలన్న ఆలోచన అతనికి రావడం యీ పిచ్చిపిల్ల ఆ మాటలు నమ్మి సినిమా వ్యామోహంలో యిల్లు విడిచి అతనితో వెళ్ళడం , స్టారు కాలేక, ఏక్ స్ట్రాగా మిగిలిపోవడం, అతన్ని గుడ్డిగా నమ్మి సర్వం అతనికర్పించడం గర్బం అని కూడా తెల్సుకోక అమాయకత్వంతో నాలుగు నెలలు గడిచిపోవడం, గర్బవతి అని తెలిసి ఆ డైరక్టరు ఆమెని వదిలి పోవడం, వరలక్ష్మీకి పరిస్థితి అర్ధమయ్యే వేళకి ఆరునెలల కడుపు చేతిలో ఆరొందలు మిగిలాయి. కడుపు ముందుకు వస్తుంటే వేషాలు వెనక్కి వెళ్ళాయి. తోటి ఏక్ స్ట్రా నర్సమ్మ ఆమె పరిస్థితికి జాలిపడి తన వాడలో ఇల్లు కుదిర్చి పెట్టి చాతనయినంతగా ఆడుకోవడం గుడ్డిలో మెల్ల, మూతి విరుపులు, చీదరింపులు మధ్య ఓ పూట తిని, ఓ పూట తినక చావలేక, బతకలేక బతుకుతున్న వరలక్ష్మీ జాలికద యిది.
    నడుం పట్టుకుని నాలుగడుగులు వేయగానే దేముడే పంపినట్టు అన్వర్ అటో వచ్చి ఆగింది. ఎర్రబడ్డ మొహం, నొప్పితో గిలగిలలాడుతున్న బాధ ఆమె మొహంలో చూసి అన్వర్ ఆదుర్దాగా అటో దిగాడు. వరలక్ష్మీకి ప్రాణం లేచొచ్చింది. 'అన్నా , నన్ను కాస్త దవాఖానాకు తీసుకుపోతావా' అంది ఆయాసపడుతూ, అన్వర్ నలుగురు బిడ్డల తండ్రి, ఆడకూతురు అవస్థ అర్ధమైంది ఎక్కమ్మా" అన్నాడు.
    అది జనానా ఆస్పత్రి! ఏ కాలం నాటిదో ఆ ఆడవాళ్ళ ఆస్పత్రి, పటిష్టమైన బండరాళ్లతో కట్టిన ఆస్పత్రి. ఈనాటికీ , చెక్కుచెదరక ఎన్ని లక్షల జననాలో కళ్ళ చూసిన ఆస్పత్రి అది. అక్కడ నిర్విరామంగా 'పుట్టుకలు' జరిగిపోతుంటాయి. కొండోకచో ' గిట్టుకలు' కూడా! పురుళ్ళు పోయడమే మా పని అన్నట్టు లేబర్ రూములో నాలుగు బల్లలు- ఆ బల్లలు ఎప్పుడూ ఖాళీ వుండవు. బిడ్డ పుట్టినా, చచ్చినా ప్రయత్నం అంతా యాంత్రికంగా జరిగి పోతుంటుంది. నిమిషానికో,ఐదు నిమిషాలకో బిడ్డ పుడ్తుంటే అక్కడ విచారాలకి, సంతోషాలకి తావుండదు.
    అలాంటి జనానా ఆస్పత్రికి జనారణ్యంలోకి అటో వచ్చి ఆగింది. ఔట్ పేషంటు వార్డు దగ్గిర, నెమ్మదిగా అన్వర్ చేయి అందించి వరలక్ష్మీని దింపాడు.
    అక్కడ బారులు తీరి క్యూలో రకరకాల జబ్బులతో ఆడవాళ్ళు నిలబడ్డారు. అంతా చకచక ఎవరి పనులు వారు యంత్రాల్లా చేస్తున్నా తరగతిని క్యూ - బిక్క మొహంతో బాధని బిగపట్టిన వరలక్ష్మీ వంతు వచ్చేవరకు కాన్పు ఆగదని మగాడైన అన్వర్ కి అర్ధమై ముందుకెళ్ళి 'సలాం , డాక్టరమ్మా , యీ అమ్మకి నెప్పులు బాగా వస్తున్నాయి. నిలబదలేకపోతుంది. జరముందీమేను చూడండమ్మా' చేతులు జోడించి అన్నాడు. డాక్టరు రాత ఆపి కళ్ళెత్తి వరలక్ష్మీని చూసింది. మొహం చూసి నిప్పుల తీవ్రత , కాన్పు ఆయె సమయం అనుభవంతో లెక్క కట్టగలిగే ఆమె ఇన్ పేషెంట్ చీటీ రాసి ఎటు వెళ్ళాలో చూపిస్తూ "ఈ చీటీ తీసికెళ్ళి అక్కడ నర్సుంటుంది చూపించి చేర్పించు" అంది. ఆక్షణంలో వరమిచ్చిన దేవతలాగా అన్పించింది యిద్దరికీ.
    ఆ వరండా దాటి మలుపు తిరిగితే అక్కడ లేబర్ వార్డు. లేబరు రూము . అక్కడో బల్ల ముందు తెల్లబట్టల నర్సు. ఆ నర్సు వరలక్ష్మీని లోపలికి తీసికెళ్ళి పరీక్షల రూములో ఓ బల్ల ఎక్కించింది. 'డాక్టరమ్మ వచ్చి చూస్తారు' అని చెప్పి వెళ్ళింది. 'అ డొల్లు ఎవరూ లేరా. నీవిక్కడ వుండరాదు. యింటికెళ్ళి ఆడవాళ్ళని పంపు' అంది బల్ల దగ్గిర నర్సు "యాదమ్మని పంపిస్తానని ఆ అమ్మకి చెప్పు తల్లీ" అన్నాడు అన్వర్.
    కొన్ని యుగాలనంతరం అన్నట్టు ఓ డాక్టరమ్మ వచ్చి యాంత్రికంగా పొట్ట నొక్కి పొజిషన్ చూసింది. స్కేతస్కోపు తీసి హార్ట్ బీట్ వింది.
    వరలక్ష్మీకి పాపం తొలికాన్పు. ఇప్పుడు తల్లిలేని, ఎవరూ లేని వంటరి, నడుం దగ్గిర నొప్పి వచ్చినప్పుడల్లా గిలగిల్లాడుతూ "అమ్మా" అంటోంది. తల్లిని తలుచుకొంటుంటే వరలక్ష్మీ చెంపల బడి వెచ్చటి కన్నీరు జారింది.
    వరలక్ష్మీని నెప్పుల జోరు అందుకుంది. ఓ గంట తరువాత మగబిడ్డ పుట్టాడు. అయాలిద్దరూ సాయం పట్టి తల్లిని, పిల్లాడిని స్త్రేచ్చార్ మీద పడుకో బెట్టి వార్డులో ఖాళీ మంచం మీదకి చేర్చి వెళ్ళిపోయారు.
    నిస్త్రాణతో పక్క మీద పడుతున్న వరలక్ష్మీ గొంతు తడార్చుకు పోసాగింది. గొంతు తడిసే దిక్కేలేదు. గుక్కెడు నీళ్ళిచ్చె దిక్కే లేదు. పక్కనున్న మంచం మీద ఓ అమ్మాయి మగతగా పడుంది. తల్లి కాబోలు మాటిమాటికి కళ్ళు, ముక్కు తుడుచుకుంటోంది. 'పాపం బిడ్ద దక్కలేదు గాబోలు' యిటు అటు మంచాల మీద వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆవిడ టేబిల్ దగ్గర మంచినీళ్ళ సీసా చూసి 'అమ్మా కాసిని మంచి నీళ్ళిస్తారా గొంతెండిపోతుంది" అంది బిడియంగా వరలక్ష్మీ. 'అయ్యో దానికేమమ్మా నీ వాళ్ళెవరూ లేరా దగ్గిర, తొలిచూలా అమ్మలేదా , అత్తింటి వాళ్ళన్నా లేరా'అంటూ నీళ్ళు గ్లాసులోకి వంపి యిచ్చింది. 'అయ్యో బిడ్డ ఏడుస్తున్నాడు. రెండు పాలచుక్కలు , లేదంటే కాస్తంత తేనే చుక్కలు , నీళ్ళు కలిపి పట్టాలమ్మా' అంటూ ఆవిడ ప్లాస్కూ లోంచి కొద్దిగా పాలు తీసి చిన్న గ్లాసులో పోసి నీళ్ళు కలిపి చెమ్చాతో రెండు మూడు చెంచాలు పిల్లవాడికి పట్టింది. వరలక్ష్మీ చటుక్కున ఆవిడ చేయి పట్టుకుంది. 'అమ్మా యీ బిడ్డని మీరు తీసుకుంటారా అమ్మా. ఈ బిడ్డని నేను పెంచలేను. మీరు కాదంటే ఏ అనాధశ్రమంలోని వదలాలి' గబగబ ఆరాటంగా అంది. ఆవిడ తెల్లపోయింది. 'బిడ్డ నిచ్చేస్తావా, నీ వాళ్ళూరుకుంటారా' అంది. వరలక్ష్మీ టూకీగా తన కష్టాల కధ అంతా చెప్పింది. "పిల్లాడికి పరచడానికి పక్క బట్టలన్నా గతిలేని దాన్ని, వీడ్ని ఎలా పెంచాలమ్మా. మీరు అయినింటి వాళ్ళలా వున్నారు . మంచి వాళ్ళలా వున్నారు. మీ ఇంట నా బిడ్డ పెరిగితే నాకు నిశ్చింతగా వుంటుంది' అంది దండం పెడుతూ ఆవిడ కళ్ళు మెరిశాయి. కనపడని దేముడికి చేతులెత్తి దండం పెట్టింది. వరలక్ష్మీ పక్కలో బిడ్డ యిప్పుడు ఆ అమ్మాయి పక్కలో కదులుతున్నాడు. తెలివి వచ్చాక తల్లి విడమర్చి కూతురికి చెప్పింది. అల్లుడి కింకా ఫోనుచేయక ముందే యిలా జరగడం, స్పెషల్ రూము యింకో గంటలో ఖాళీ అవుతుందని, అంతవరకు వార్డులో వుండవలసి రావడం , ఇలా జరగడం అంతా దైవేచ్చ అనుకున్నారు. వరలక్ష్మీ చేతులు పట్టుకున్నారు. ఈ రహస్యం తమ మ్మధ్యనే వుండాలని షరతు పెట్టారు. పిల్లాడిని ఎప్పుడు చూడడానికైనా రాకూడదన్న మాట తీసుకున్నారు. వరలక్ష్మీ అన్నింటికీ తలవూపింది. ఆమె కింకా తను తల్లినయానని ఆ బిడ్డ తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అనే భావమే కలగలేదు. తనున్న ప్రస్తుత పరిస్థితిలో ఆ బిడ్డ భారం ఎలా వదల్చుకొడం అన్న చింత యిప్పుడు బిడ్డ మంచి యింట్లో పెరుగుతాడన్న భావం నిస్చింత వచ్చింది. పేరు, ఊరు, వివరం అడిగింది. అల్లుడు బెంగుళూరు లో కన్నడ సినిమాలకి అసిస్టెంటు డైరక్టర్ గా పనిచేస్తాడని, పెళ్ళయ్యాక అమ్మాయికిది మూడో కాన్పు అని, పుట్టక ముందు ఒకరు, పుట్టాక ఒకరు పోయారని ఈ కాన్పు అయినా దక్కలేదన్న విచారంలో వున్న వారికి ఇది భగవంతుడిచ్చిన వరంగా భావిస్తున్నామని చెప్పింది సినిమాలు, డైరెక్టరు, అనగానే కుతుహలంగా పెరడిగినవరలక్ష్మీ మాన్పడిపోయింది ఆ పేరు విని! ఎంత విచిత్రం భగవంతుడు లీల ! ఒక్క క్షణం ఏదో ఆవేశం వరలక్ష్మీని చుట్టూ ముట్టింది. బిడ్డ నివ్వనని చెప్పాలనిపించింది. మరోక్షణం వివేకం మేల్కొంది. పక్క మీద నున్న ఆమె వంక చూసింది. కాస్తంత మొద్దావతారం. అందుకే తన వెంట పడ్డాడు. ఆమె మౌనం మొహంలో భావం చూసి ఆవిడ మరోలా అర్ధం చేసుకుని భర్త నడిగి ఒక కవరు తెచ్చి వరలక్ష్మీ చేతిలో పెట్టింది. 'అమ్మా బిడ్డ నమ్ముకున్నాననుకోకు. నీవున్న యీస్థితిలో యీ డబ్బు నీకవసరం. కాదనకు' అంది. వరలక్ష్మీకాదనలేదు. గత నాలుగైదు నెలలుగా డబ్బవసరం ఎంతటిదో వరలక్ష్మీకి బాగానే అర్ధం అయింది. కవరు గుప్పిటలో గట్టిగా పట్టుకుంది. అపుడు చూసింది , ఆమె పక్కనున్న బిడ్డ వంక, గుప్పిటమూసి, కళ్ళు మూసిన ఆ చిన్నారి ముఖం భాస్కర్ మొహంలాగే వుంది. క్షణంలో చప్పున మొహం తిప్పుకుంది. ఆమె జీవితంలో ఓ అధ్యాయం ముగిసింది.

                                                ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS