Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 33


    అతని మొహంలో రక్తం పొంగింది. "నిజంగా ... నిజంగానా ....అలా రామం అన్నాడా? నిజంగా యింత నింద వేశాడా?' వెర్రివాడిలా చూస్తూ అన్నాడు.
    'ఆహా, అక్షరాలా, సుధాకర్ , నీవూ నేనూ ఎప్పుడన్నా హాద్దు మీరి ప్రవర్తించామా?' జానకి గొంతు వణికింది. సుధాకర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆయనేగా అసలు, నా సగం ప్రాణం , ప్రాణ మిత్రుడు అంటూ ఇంటికి తీసుకొచ్చింది. టిఫిన్లు, కాఫీలు, భోజనాలు పెట్టించింది ఆయనేగా - ఇప్పుడు - ఇప్పుడిలా ' ముంచెత్తిన ఆవేశం ఆమె గొంతుని నొక్కేసింది.
    తలుచుకున్న కొద్ది జానకి మనసు ఉడికిపోతుంది. అవమానంతో ఆవేశంతో ఆమె రక్తం సలసల మరుగుతుంది. ఆ మనిషిలో ఇంత అనుమానం , అసూయ వున్నప్పుడు తన స్నేహితుడు, నా సగం ప్రాణం అంటూ ఇంటికి తీసుకొచ్చి "పెళ్ళానికి పరిచయం చేయడం ఎందుకు? తన నెత్తి కెక్కించి టిఫిన్లు, కాఫీలు, భోజనాలు పెట్టించి, సినిమాలు, షికార్లు తమతో సమంగా ఆనాడు తిప్పింది ఆయనేగా, యింట్లో వ్యక్తిగా చనువుగా తిరుగుతుంటే తను మాట్లాడకుండా ఎలా వుంటుంది. అక్కడికి కొత్తలో "బెడ్ రూంలోకి కూడా తీసుకొస్తారెందుకు ' అంటే ఆ! మా మధ్య అలాంటి బేధాలు లేవు" అన్న పెద్ద మనిషి , యిలా మారిపోతాడని తనకేం తెలుసు. 'వదినగారు వదినగారు" అంటూ చనువుగా నవ్వుతూ, జోక్స్ వేస్తూ యింట్లో తిరిగే అతనితో తను ముభావంగా ఎలా వుండగలుగుతుంది. అయినా ఆయనంత ప్రాణస్నేహితుడు అన్న అతన్ని తనెలా కాదంటుంది. అందుకే చనువు, అభిమానం పెంచుకుని ఫ్రీగా అతనితో మాట్లాడడం, పెకాడ్దాం అన్నీ చేసింది, హాస్యంగా 'మరిదీ లక్షణా" అని పిలుస్తూ - అలాంటి తమిద్దర్ని ఎంత మాట అన్నాడు. అసలు తను కనిపెట్ట లేకపోయింది గాని , మూడు నెలలుగా అయన మూతి ముడుచుకోడానికి , సుధాకర్ లో ముభావంగా ఉండడం, ఏదన్నా అంటే వ్యంగ్యంగా ఎత్తి పొడవడం వగైరాల అర్ధం తను తెలుసుకోలేకపోయింది. తెలుసుకున్నాక జాగ్రత్త పడింది. కాని యివేవి తెలియక నిష్కపటంగా, నిర్మలంగా, చనువుగా వుండే సుధాకర్ ని ఒక్కసారిగా ఏం చెప్పి దూరం చేయగలదు. రామంలో మార్పు అర్ధం చేసికొని సుధాకర్ అమాయకత్వానికి, రామం అసూయ అనుమానాల మధ్య గత నెల రోజులుగా నలుగుతూనే వుంది. ఆఖరికి ఈ రోజు అయన పూర్తిగా బయటపడ్డాడు.
    నిజస్వరూపం చూపించాడు. సాయంత్రం జరిగినది గుర్తుకొచ్చి జానకి ఒళ్ళు మరింత ఉడికింది.
    ఆరోజు రామం మామూలుకంటే ఆలస్యంగా వచ్చాడు ఆఫీసు నించి, "ఏం యింతాలశ్యం అయింది" అంది మాములుగా జానకి.
    'తొందరగా వస్తే నీకూ అడ్డుకాదూ- వచ్చి యింట్లో జరిగే భాగవతం చూడకుండా వుండాలని ఆలశ్యంగా వచ్చాను" రామం వ్యంగ్యంగా అన్నాడు. జానకి తెల్లబోతూ "ఏమిటీ" అంది. రామం కటువుగా "అర్ధం కాకపోవడానికి నేను తెలుగే మాట్లాడుతున్నాను" అన్నాడు. జానకి మొహం ఎర్రబడింది. "ఏదో పాపం నేను ఆలశ్యంగా వస్తే నష్టం, కష్టం అన్నట్టు నటించావు. నీకు తోడు, కంపెనీ యివ్వడానికి సుధాకర్ వున్నాడుగా. ఇంకా యీ మొగుడి రాకపోకలు గురించి నీకుందుకు బాధ. నాకంతా తెలుసు. నీ నటన నా దగ్గర కాదు " కటువుగా అన్నాడు. జానకి మొహం ఎర్రబడ్డింది. 'మీరేం మాట్లాడుతున్నారో తెలుసా . సుధాకర్ గురించా మీ యీ అనుమానం. ఇందుకా ఈ మధ్య ఈ మూతి ముడుచుకోడాలు దేప్పుళ్ళు- ఆహా   యిప్పటికైనా మీ అసలు స్వరూపం బయటపెట్టారు.  థాంక్స్ - కాని పాపం ఒక సంగతి మరిచిపోకుండా సుధాకర్ ని తీసుకొచ్చింది , ప్రాణ స్నేహితుడంటూ - నా నెత్తిన ఎక్కించింది. పక్కల మీద సయితం పడుకోబెట్టింది మీరన్న సంగతి గుర్తించండి." జానకి తీవ్రంగా అంది.
    "వాడిని పక్క ఎక్కించాను కాని, వాడితో నిన్నూ ఎక్కమనలేదు' రామం హేళనగా అన్నాడు. జానకి కళ్ళు నిప్పులు చెరిగాయి. ఆగ్రహావేశాలతో ఒక్క నిమిషం మాట్లాడలేకపోయింది. అవమానం, అసహ్యం ఆమెని ముంచెత్తాయి. తిరస్కారంగా చూసింది. "ఛీ.... ఛీ.... మీరింత నీచంగా మాట్లాడగలరని, ఇంత కుసంస్కారులని ఎప్పుడూ అనుకోలేదు."
    'సంస్కారమంటే పెళ్ళాన్ని మరో మగాడికి అప్పగించడం అనుకోను, అంత సంస్కారం , సహృదయత నాకు లేదు-"
    'ఆపండి యింక చాలు. మీరు మరేం చెప్పనక్కరలేదు. మీలాంటి వారితో మాటలు యింక అనవసరం నాకు. నన్ను గురించి అంత నీచంగా మాట్లాడగలిగిన భర్తని క్షమించలేను. బార్య నీతి నిజాయితీ లేనిదని మీరనుకున్న తర్వాత, యింక మన మధ్య మాటలు అక్కరలేదు. భార్యాభర్తల సంబంధమూ అక్కరలేదు' జానకి తీవ్రంగా అంది.
    జానకి నోట సంగతి విన్న సుధాకర్ మొహం పాలిపోయింది. "వదినగారూ మీరు చాలా తొందరపడ్డారు. కనీసం మీరయినా కాస్త ఓర్పు వహించాల్సింది- ఇంత తొందరపడి యిల్లు వదలాల్సింది కాదు. నచ్చచెప్పాల్సింది."
    'అంతా విని కూడా ఈ మాట ఎలా అంటున్నావు సుధాకర్. అంత నీచంగా అయన మాట్లాడాక కూడా, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం వదలి అయన కాళ్ళు పట్టుకుని, తప్పు చేయకపోయినా , "తప్పయింది నాదా" ని ప్రార్ధించమంటారా?" జానకి హేళనగా అంది.
    'అదికాదు"
    "ఏది కాదు, ఇదేం , సినిమా , నవలా కాదు. ఏదో రెండు మాటలు పక్క నించి వినో, ఏదో చూసి పెళ్ళాన్ని అనుమానించి ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి , ఆవిడ దీనాతిదీనంగా ప్రార్ధించి విఫలురాలై అష్టకష్టాలు పడడానికి మనిద్దరి మధ్య ఏదో ఉందనడానికి అయన ఏం చూశారు - ఏం విన్నారు? మనం కవ్వుతూ మాట్లాడుకోడం ఓక తప్పా - కలిసి పేకాడడం మరో తప్పా - నిజంగా ఇవే మన అపరాధాలయితే , భార్య అంత పరాయి పురుషుడితో మాట్లాడకూడదన్నప్పుడు , నిన్ను ఇంటికి రమ్మనడం ఎందుకు? హు - ఈ మగాళ్ళకి భార్య సోషల్ గా వుండాలి కాని మరో మగాడితో మాట్లాడితే సహించలేరు. ఇదీ ఈనాటి మగాళ్ళ వరస - కాని మొగుడు అవమానపడి హింసిస్తే, సహించి , పాదాల చెంత పడి ఉండనీయండి, అని ప్రార్ధించడానికి నేను అంత ప్రతివ్రతనూ కాదు- అంత ఆత్మాభిమానం లేని దానను కాను. అయన తప్పు అయన తెలుసుకునేవరకూ నేను ఆయనని క్షమించను. అయన తప్పు అయన తెలుసుకోకపోతే ఫరవాలేదు , నా బతుకు నేను బ్రతకగలనన్న ఆత్మవిశ్వాసం నాకుంది. అంతేగాని నామీద నమ్మకం లేని భర్తతో నన్నునుమానించి అవమానించిన భర్తని గౌరవించడం మాత్రం నా వల్ల కాదు. అందుకే యీ ప్రయాణం " జానకి దృడంగా అంది.
    "రామం- రామం ఏం అనలేదు మీరు వచ్చేస్తుంటే ' జానకి అదోలా నవ్వింది.
    "నీవెంత పిచ్చివాడివి సుధాకర్? మగమహారాజు ఒకవేళ మనసులో ఉన్నా పైకి అంటారా - అహం విడిచి భార్యని వుండమని బతిమిలాడుతారా? అసలు అయన ఈ వ్యవహారం ఇంత దూరం వస్తుందనుకోలేదు అనుకుంటా. అందుకే నేను ఇల్లు వదులుతున్నానని తెలుసుకోగానే కలవరపడ్డారు. అది పైకి కనిపించకుండా వుండాలని తంటాలు పడ్తూ ఇదంతా నేను చదువుకున్నదాన్నని , ఉద్యోగం చేసుకు బ్రతికే ధైర్యం వుంది కనక, ఇలా అహంకారంగా ప్రవర్తిస్తున్నానని , మొగుడంటే లెక్కలేదని, ఏవేవో ఉక్రోషంగా అన్నారు. ఇల్లు కదిలితే మరి ఇంట్లో ప్రవేశం వుండదని బెదిరించారు. కేకలు వేశారు. కాని నేను నిజంగా వచ్చేస్తుంటే ఇంకా ఆయనకి నమ్మకమే నాలుగు రోజులు పుట్టింట్లో వుండి వస్తానని. మొగుడ్ని కాదని బతికే ధైర్యం నాకు లేదని ఆయనకి చాలా నమ్మకం అనుకుంటూ -- అందుకే వ్యంగ్యంగా "వెళ్ళు - వెళ్ళు - నాలుగు రోజుల్లో పుట్టింటి వాళ్ళు తరిమిస్తే అప్పుడు ఎవరు గతో తెలుస్తుంది" అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS