"దాన్దేముంది! ప్రచారం! మన అభిషేకన్ గాడు ఇలాంటి పన్లు చాలా ఎఫెక్టివ్ గా చేస్తాడు"
"అభిషేకన్ ఎవరు?"
"వాడు వాడు పెకాట్లో జోకరు. పుకార్లకీ బ్రోకరు. తమిళాన్ని పొగిడితే పొంగిపోతాడు. తెలుగుని తిడితే తన్మయంగా వింటాడు. మనకి గులాం"
అందరూ నవ్వారు.
తర్వాత స్కాచ్ చప్పరిస్తూ మనసులో అనుకున్నాడు. ప్రేమ్ కుమార్.
యా! హై స్టేక్స్ తో ఆడుకున్న పెకాటలాంటీదే ఇది! ఈ ఆటలో తను సదానంద్ ని ట్రంప్ కార్డు లా యూస్ చేస్తున్నాడు. అభిషేకన్ జోకర్ లా ఉపయోగించుకుంటున్నాడు. ఈ గేమ్ లో చివరికి షో చెప్పి గెలిచేది తనే! ఇది తప్పదు!
అప్పడు వచ్చాడు అభిషేకన్. వస్తూనే "సార్! హోటల్సంటే తమిళనాడు లో హొటల్స్ సార్! మెద్రాసులో అయితే ........"అని మొదలెట్టాడు.
"అవునవును. మెద్రాసు లో చెట్టుకింది అయ్యరు హొటలు కూడా ఇక్కడి స్టార్ హొటలు కంటే బాగుంటుంది" అని కాసేపు ఉబ్బేసి, "ఏమిటి విశేషాలు" అన్నాడు ప్రేమ్ కుమార్.
ఉదయార్కర్ చెత్త కుండీ దగ్గర స్పృహలేని స్థితిలో పడి ఉండడమూ, తను కొంతమంది సాయంతో అతన్ని నర్సింగ్ హోమ లో చేర్చడమూ, ఉదయార్కర్ మీద ఎవరో డ్రగ్స్ ప్రయోగించారని డాక్టర్స్ చెప్పడమూ అంతా వివరంగా చెప్పాడు అభిషేకన్.
అది వినగానే ప్రేమ్ కుమార్ మొహంలో కాంతి తగ్గింది.
ఉదయార్కర్ మీద ఎవరో డ్రగ్స్ ప్రయోగించి స్పృహ తప్పేలా చేశారా? ఎందుకు చేశారు? ఎవరు చేశారు?
తను చెయ్యలేదు అలాగా!
ఎడిటర్ కి అలా చెయ్యవలసిన అవసరం లేదు.
మరి మరి!
ఆ మూడో మనిషి ఎవరు? ఈ గేమ్ లో ఇంకో మూడో హాండ్ కూడా ఉందా?
ఎవరిదా అజ్ఞాత హస్తం!
ఏదో తెలియని భయం ఆవరించింది అతన్ని!
11
ఎడిటరు దగ్గర ఫోన్ మోగింది.
రిసీవర్ ఎత్తి "హల్లో?" అన్నాడు.
"హలో! నేను."
దట్ మిస్టరీ గర్ల్! అరుణ!
ఆ సమయంలో చాలా బిజీగా ఉన్నాడతను. అయినా, తుంచేసినట్లు మాట్లాడి నొప్పించడం అతని తత్త్వం కాదు.
దిస్ టెలీఫోన్ ఈజ్ ఏ నేసేసరీ ఈవిల్
"చెప్పండి" అన్నాడు సహనంగా.
"ట్రెజర్ హంట్ మీద చాలా పుస్తకాలు చదివాను నేను. నిధి నిక్షేపాల మీద చాలా కధలు విన్నాను కూడా! మంచి ఇన్ ఫర్మేషన్ ఉంది నా దగ్గర పంపమంటారా?"
"వెల్ కమ్! తప్పకుండా పంపండి."
"ఒక్క నిముషం!" అంది అరుణ. ఆ వెంటనే లైన్లో క్లిక్ మన్న ధ్వని. ఎక్స్ టెన్షన్ లైన్ లో ఎవరితోనో మాట్లాడుతూ వుంది వుండాలి ఆమె.
కొద్ది క్షణాల తర్వాత తిరిగి వినబడింది అరుణ గొంతు.
ఇంకో అరగంటలో మా సర్వెంట్ మీ ఆఫీసుకి వస్తాడు. నేను పంపించే మేటరు మీకు తప్పకుండా పనికి వస్తుందనే అనుకుంటున్నాను."
"చాలా నమ్మకంగా చెబుతున్నారేం"
"చాలా ఇంపార్టెంట్ అది! మీరే చూస్తారుగా! అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఇవాళ మోర్నింగ్ మా బాబాయి రష్యా నుంచి తిరిగి వచ్చాడు."
"ఐసీ!"
"వస్తూ వస్తూ మీకో శుభవార్త తెచ్చాడు."
"నాకా?"
"అవును"
"ఏమిటది?"
"రష్యాలో కూడా మీ మేగజైను దొరుకుతుందట. రీడర్స్ దేర్ గెట్ ఈజ్ ఫ్రమ్ ఈస్ట్ జర్మనీ ఇట్ సీమ్స్!" అని నవ్వుతూ "ఆర్ యూ హాపీ సర్" అంది.
"నాచురల్లీ" అన్నాడు ఎడిటరు.
అప్పటిదాకా సరదాగా మాట్లాడుతున్న అరుణ గొంతు హటాత్తుగా సీరియస్ గ మారిపోయింది.
ఎవరో తనని సమీపిస్తుంటే గొంతు మార్చేసినట్లు.
"ఉంటాను సర్" అంది త్వరత్వరగా.
ఫోన్ పెట్టేయ్యాలన్న తొందరలో ఉన్నట్లుంది తను. ఆమె పలికిన చివరి అక్షరంతో బాటే లైన్ కూడా కట్ అయిపొయింది.
చేతిలోని రిసీవర్ వైపు ఒకసారి చూసి, తర్వాత దాన్ని క్రెడిల్ మీద ఉంచేశాడు ఎడిటరు.
మిస్టరీ గర్ల్! వెరీ మిస్టీరియస్!
ఆమె ఫోన్ చేసిన ప్రతిసారి అంతే! సరదాగా మొదలెట్టి సీరియస్ గా ఎండ్ చేస్తుంది.
