ప్రస్తుతానికి మన పనులు ఇతని వల్ల అవుతాయి.
చాకులాంటి కుర్రాడు.
దారి తప్పుతాడేమో! ఫాలో చెయ్యండి. బుద్దిమంతుడిలా దారిన బడితే వొదిలెయ్యండి. అడుగు ప్రక్కకు వేస్తే నిర్ధాక్షిణ్యంగా కాల్చి పారెయ్యండి" చిరునవ్వు నవ్వింది.
ఆ వ్యవస్థలో ఒక మనిషిని బుల్లెట్స్ కి గురి చెయ్యటం యెంత సునాయసమో ఆ చిరునవ్వే వివరిస్తోంది.
వారిద్దరూ వెంటనే డ్రస్ మార్చుకొని జయసింహను వెంబడించారు. టైం టేబిల్ ప్రకారం ఇప్పుడు తను బస్ స్టాప్ లో వుండాలి.
ఎనిమిది బి. కోసం ఎదురు చూస్తుండాలి.
ఆ యిద్దరూ దూరం నించే గమనించారు.
జయసింహ బస్ కోసం ఎదురు చూస్తున్నాడు.
"మాష్ట్రారు టైమెంత యిందండి" ఎవరో యువకుడు అడిగాడు.
"మూడు ముప్పై " బదులు చెప్పాడు జయసింహ!
"ఎనిమిది బి ఎన్నింటికొస్తుంది?"
సిటీ బస్సులు కదా సార్! వాటి దయ! పూర్వకాలంలో వాన రాకడ ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరు అనేవారు. కాలం మారింది కదా! వాన రాకడ చెప్తున్నారు. రాడార్ల సాయంతో!
ఇప్పుడు సామెతలు కూడా మారాలి.
"సిటీ బస్ ల రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియదు"
"భలే చెప్పారు మాష్టారూ! మీరే బస్ కిపోవాలి"
"మీరు అడిగిన నంబరే!"
"అదుగో వచ్చేసింది" ఝూమ్మని దుమ్ము రేపుకుంటూ వచ్చి ఆగింది సిటీ బస్! అక్కడ దానికి ఒక నిమిషం స్టాఫ్! కాని ఇరుకులోంచి పాతిక మంది బయట పడాలి. పాతికమంది ఎక్కాలి! ఎలా! భయంకరమయిన త్రోక్కిసలాట!
జేబు దొంగలు దాన్ని పెంచి పెద్ద చేస్తున్నారు.
ఆడవాళ్ళు , పిల్లలు ఆర్భకులు హైరానా పడుతున్నారు. కొందరింకా పూర్తిగా క్రిందికి దిగలేదు. కొందరింకా పుట్ బోర్డు మీద నుంచి పైకి రాలేదు.
సిటి బస్ "బోయ్ ' మని హరన్ మ్రోగించుకుంటూ కదిలింది.
చేతిలో ఉన్న బ్రీఫ్ లో ఏమున్నాయో దాని వెలువ ఎంతో తెలియదు. జాగ్రత్తగా పట్టుకుని నలువంకలా చూచాడు జయసింహ!
ఓంటికాలి మీద నిలబడిన వాళ్ళు పర్సులో చిల్లర కోసం వెతుక్కుంటున్న వాళ్ళు, చంక నెత్తిన పిల్లలు జారిపోకుండా జాగ్రత్త పడుతున్న వాళ్ళు! ఎవరి గొడవలో వాళ్ళున్నారు.
వారి మధ్య జేబుదొంగలు, సరి అయిన జాగాల కోసం తంటాలు పడుతున్నారు. ప్రక్కవాడే జేబు కత్తిరించటం కన్పించినా నోరు మెదిపెందుకు అవకాశం లేని చోటు!
జయసింహ బ్రీఫ్ లో ఏముందో ఆలోచించే అవకాశం ఎవరికుంది. బస్ మరో స్టాప్ లో ఆగింది. అది యిన్ డస్ట్రియల్ ఏరియా!
డ్యూటీలు ముగించుకుని మధ్యాహ్నం ఇళ్ళకు పోవలసిన జనం ఎక్కారు. బొటనవ్రేలు అనిపించేందుకు కూడా చోటు చాలని బస్సులో మరో పాతిక మంది దాకా ఎక్కారు.
బస్సు బయల్ద్గెరగానే ,మరో మూల కలకలం బయలుదేరింది.
"అమ్మో నా గొలుసు! బాబోయ్ నా గొలుసు!" ఓ స్త్రీ కంఠం వినిపిస్తోంది.
"పోనిద్దూ! నకిలీ గొలుసు కదా?
"కాదు బాబోయ్ బంగారం గొలుసు! లాగేశారు దేవుడోయ్!"
"అయినా అదేం బడాయి? సిటీబస్సులో బంగారపు గొలుసు పెట్టుకుని ఊరేగేలా? అంతే జరగాలి" సమాజం మీద పెంచుకున్న కసి అంతా కక్కాశాడొకాయన!
జనం అలజడి! నెట్టుకుంటున్నారు. పెనుగాలిలా విసురు వచ్చింది.
"జరగండి" అంటూ తోసేశాడొకడు. చెయ్యి ఇద్దరు మనుషుల అవతల ఉంది. తన బ్రీఫ్ తనకే కన్పించటం లేదు.
ఆ విసురుకి దూరం జరిగాడు. బ్రీఫ్ చేతి నించి వేరు అయింది. మరు క్షణంలో దాన్ని దొరికించుకున్న వ్యక్తీ జనాన్ని ఒక్క తోపు తోసి దారి చూసుకున్నాడు.
డోరు వరకూ వెళ్లి నడుస్తున్న సిటి బస్సు లోంచి దూకేశాడు.
మెరుపులా ఆ వంకకు కదిలాడు జయసింహ!
డోరు దగ్గరున్న ఓ పెద్ద మనిషి అడ్డుకున్నాడు.
"ఏం ప్రాణాల మీద ఆశలేదా?"
"నా బ్రీఫ్ తీసుకుపోయాడు. నేను వెళ్ళాలి. దూకనీ!"
"బీఫ్ పొతే పోయింది. ఈ స్పీడులో దూకావంటే ప్రాణాలు కూడా పోతాయి. బస్ అగిందాకా ఉండు"
"యూ స్తుపిడ్! నన్నోడులు" అతన్ని బలంగా తోసేసి క్రిందికి దూకాడు జయసింహ.! బ్రీఫ్ తో దిగిన వ్యక్తీ తొందరలో క్రింద పడ్డాడు.
అప్పటికే లేచి దుమ్ము దులుపుకుని బ్రీఫ్ అందుకున్నాడు.
తన వైపు వేగంగా కదిలి వచ్చే ఆకారాన్ని చూచాడు. కేవలం పదిగజాల్లోకి వచ్చేశాడు.
ఆ వ్యక్తీ బ్రీఫ్ అందుకుని ట్రాఫిక్ మధ్యలోంచి ఉడాయించాడు. జయసింహ వెంటపడ్డాడు.
సిగ్నల్స్ దగ్గరకు వచ్చాడు. ఒకవంక వాహనాలు ఆగాయి. మరో వంక నించి ప్రవాహంలా కార్లు!
ట్రాఫిక్ ఆగిపోవటం నించి రోడ్డు మధ్యకు పరుగు తీశాడా వ్యక్తీ .
రెండో వంక నించి కార్ల ప్రవాహం ఎదురయింది. ఒకదాని వెంట ఒకటి తరుముకుంటున్నట్లు వరుసగా వతున్నాయి.
ప్రాణాలకు తెగించి అయినా వాటి మధ్యనించి చొచ్చుకుపోయేందుకు దారి కన్పించలేదు. ఆగిపోయి వేనుదిరిగాడు.
అప్పటికే దగ్గరగా వచ్చి కాలర్ పట్టుకున్నాడు జయసింహ!
"నన్ను కొట్టొద్దు "నీట్ గా డ్రసప్ అయివున్న అతడు బ్రీఫ్ క్రిందికి వదిలేశాడు. దాన్ని తీసుకున్నాడు జయసింహ!
ఈ దృశ్యాన్ని గమనించిన ట్రాఫిక్ సిబ్బందిలో ఒకరు వారి దగ్గరగా వచ్చాడు." ఏం జరుగుతోందిక్కడ?" అన్నాడు కోపంగా.
"ఏమీ లేదు. త్వరగా పోవాలి. అందుకే రోడ్డుకి అడ్డం పడి పరుగు తీశాం" అంటూ బదులు చెప్పాడు జయసింహ!
తనని పోలీసులకి అప్పగిస్తాడని భయపడుతున్న ఆవ్యక్తి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.
"అవును సార్! త్వరగా పోవాలి. అంతే!" అన్నాడు.
"ఇంకోసారి యిలా జరిగితే పెనాల్టి కట్టాలి. ముప్పై రూపాయలు సిగ్నల్స్ పెట్టింది ఎవరిష్టం వచ్చినట్టు వారు పరుగులు తీయటానికి కాదు. నేను కాబట్టి ఊరుకుంటున్నాను" తన మంచితనాన్ని నిరూపించుకుంటున్న అతడు వెళ్ళిపోయాడు.
బ్రతుకు జీవుడా అనుకుంటూ బయట పడ్డారు.
అక్కడి నించి ఆటోలో బయల్దేరి సెట్ నట్వర్ లాల్ బంగారు నగల దుకాణం చేరుకున్నాడు.
షాపు బయట నిలబడితే అద్దాల్లోంచి ఎ సి చేయబడిన షాపు చాలా విశాలంగా కన్పిస్తోంది. కస్టమర్స్ చాలామంది ఉన్నారు. కౌంటర్ లొ ఉన్న వ్యక్తీ నట్వర్ లాల్ అనిపించలేదు.
ప్యాంటు షర్టు వేసుకుని ఉన్నాడు. చేతికి వజ్రాల ఉంగరం పెట్టుకున్నాడు. మెడలో లావుపాటి బంగారు గొలుసు వ్రేలాడుతోంది.
కష్టమర్స్ కీ సేల్స్ మెన్ కీ మధ్య జరుగుతున్న ప్రతి సంభాషణ ప్రతి కదలికా ఎంతో నిశితంగా పరిశీలిస్తున్నాడు వచ్చే పోయేవారిని వేయి కళ్ళతో కనిపెట్టి చూస్తున్నాడు.
ఒక క్రొత్త వ్యక్తీ బ్రీఫ్ కేసుతో రావటం తన వంక పరిశీలనగా చూడటం అతడు గమనించాడు. అయితే ఏమీ తెలియని వాడిలా ఉండిపోయాడు. నగరం మధ్యలో నగల దుకాణం కాపాడుకోవటమనేది ఎంత భాధ్యతాయుతమయిన కార్యక్రమం? దాన్ని అతడు నిరూపిస్తున్నారు.
జయసింహ లోనికి అడుగు పెట్టాడు.
"నమస్తే సాబ్! వెల్ కం"
"నమస్తే! నమస్తే!" నల్దిక్కులా చూచాడు.
