Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 33

    
    ఆవిడ "నా దేవుడో..." అంటూ రోదిస్తూ చెంచాతో ఆ తీర్దాన్ని - ఆచార్యులుగారు "నారాయణ... నారాయణ.... "అంటూండగా నోట్లో పోసింది.

 
    మూడో గుటక సరిగ్గా వేశాడో, లేదో.... కరణంగారి ప్రాణాలు బయటకు  పోవడానికి  కొట్టుకోసాగాయి.

 
    ప్రాణం పోతుండగానే కరణంగారిని మంచం మీదనుంచి దించేసి బయట చాప మీద పడుకోబెట్టారు.

 
    మరు నిముషంలో ఆయన తుదిశ్వాస విడిచాడు.


    కొంచెంసేపట్లో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇంతలో  ఆచార్యులుగారు జ్ఞాపకం చేశారు -


    "కరణం గారు  తాను పోయిన వెంటనే సీల్డుకవరు తెరిచి అందులో రాసున్నది చదివి ఆ విధంగా చేయమన్నారు. అప్పుడే తన ఆత్మకి శాంతి కలుగుతుందని  చెప్పారు. మనచేత ప్రమాణం కూడా చేయించుకున్నాడు. కవర్లో ఏమి రాసుందో చూడండి!" అని.

 
    వెంటనే కరణంగారి తమ్ముడు ఆ కవర్ని తీసి అందరి సమక్షంలో  తెరిచాడు. అందులోని కాగితం మీద కరణంగారి స్వదస్తూరీతో  ఈ విధంగా రాసుంది -

 
    "నా ప్రియాతిప్రియమైన గ్రామస్థులారా... నాకు సర్వమతాలూ సమానమే! అందువల్ల నా అంత్యక్రియలను ఒక వినూత్నపద్తిలో జరిపించి సర్వమత సహనాన్ని చాటించాలని నా కోరిక.  అందుకుగాను నా శవాన్ని  ఈ ఊరి తురకల పెద్దమసీదు  ప్రాంగణంలో దహనం చేయండి. ఆ చితాభస్మాన్ని తీసుకువెళ్లి ఊరి చర్చిలో భద్రపరచండి. నా ఈ అంతిమవాంఛను తప్పక నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. మీరందరూ నిత్యమూ నన్ను మరవకుండా ఉండాలని కోరుతున్నాను.

 

                                                                                                  ఇట్లు

                                                                                             భవదీయుడు

                                                                                             చె. నా వ్రాలు

                                                                                             దోమాడ కరణం"


    - అని వుంది అందులో.


    ఈలోగా కరణంగారు కాలంచేసిన వార్త గ్రామమంతా గుప్పుమంది. జనం అంతా బిలబిలలాడుతూ  కరణంగారింటికి చేరుకున్నారు.

 
    కరణంగారి ఉత్తరం మీద చర్చ మొదలయ్యింది.


    "హిందువుల శవాన్ని మా మసీదులోకి ఎలా తీసుకువస్తారు? వీల్లేదు!" అన్నాడు పీర్ సాయిబు.


    "అవును... అదంతే!" అన్నాడు మసీదులో వుండే మౌల్వీ.

 
    "అవునవును... వీల్లేదు" అన్నారు ఇక్కడ చేరిన మహమ్మదీయులు.


    "ఒకవేళ మీరు ఒప్పుకున్నా కూడా హిందువుల చితాభస్మాన్ని మా క్రైస్తవుల చర్చిలో పెట్టడానికి ఎలా ఒప్పుకుంటాం?" అన్నాడు ఏసుపాదం.


    "ఇటువంటిది ఎక్కడన్నా వుందా? వీల్లేదు" అన్నారు అక్కడి క్రైస్తవులు.

 
    "అయ్యా ...ఇది కరణంగారి చివరికోరిక. అది తీరుస్తామని మీరంతా ప్రమాణం చేశారు... మర్చిపోయారా? ఆయన రాసినట్లు జరిపి తీరవలసిందే!" అన్నాడు కరణంగారి తమ్ముడు.


    "అవునవును. మాటతప్పితే మహాపాపం!" అన్నారు అక్కడున్న హిందువులు.


    వీల్లేదని మహ్మదీయులు, క్రైస్తవులు- జరిగితీరాలని హిందువులు వాదించుకోవడం మొదలుపెట్టారు.  వాదన ముదిరి మాటామాటా పెరిగి చివరకు చేతులు కలుపుకోవడం వరకు వచ్చింది. ఈలోగా ఎవరో వెళ్లి, 'దోమాడ గ్రామంలో దొమ్మీ జరుగుతోందని, జనం కొట్టుకు చస్తున్నా' రనీ పోలీసులకు ఉప్పందించారు.


    వారు హుటాహుటిన వచ్చేసరికి గ్రామప్రజలు బాహాబాహీ కొట్టుకుంటున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి జనాన్ని తరిమాక - రాజలాంఛనాలతో  కాకపోయినా, పోలీసులు వెంటరాగా కరణంగారి శవయాత్ర మొదలయింది. చివరికి హిందువుల స్మశానంలోనే ఆయనకి దహన సంస్కారాలు చేశారు.


    "చూశారా...మన దోమాడ కరణం లౌక్యం?!బ్రతికి బాధించాడు, చచ్చి సాధించాడు" అన్నాడు చౌదరిబాబు.


    "నిజమే! ఏదో మారాడనుకున్నాం  కాని, అది పుట్టుకతో  పుట్టిన బుద్ది పుడకలతో  కాని పోదు. తాను చచ్చినా కూడా ఊరివారు నిత్యమూ కొట్టుకుంటుండాలని ఇంతటి ఎత్తు వేశాడు. అదిచూసి ఆ మహానుభావుడి ఆత్మ సంతోషిస్తుందో, ఏమో....!"అన్నాడు రెడ్డినాయుడు.


    అందరూ ఎవరికి తోచింది వారు అంటూ ఇళ్ళకు చేరుకున్నారు. అప్పటినుంచి 'దోమాడ కరణం బ్రతికి బాధించాడు - చచ్చి సాధించాడు!' అన్న సామెత వచ్చింది.


    ఇది ఆనాటి ముచ్చట! మరీ, నేడో?!

 

                                                 *    *    *    *    *

    
    కాలగర్బంలో మూడువందల సంవత్సరాలు గడిచిపోయాయి.

 
    దోమాడ కరణం తారకనామ స్మరణ మధ్య కన్నుమూయడంతో ఆయన ఆత్మకి ఉత్తమగతులు ప్రాప్తించాయి. ఆయన ఆత్మ బ్రహ్మలోకం చేరింది.

 
    బ్రహ్మదేవుడు ఆయనకి వరం ఇచ్చాడు - "నువ్వు మరుజన్మలో చాలా ముఖ్యమైన పదవిని నిర్వహిస్తావు. నా పేరుతోనే ప్రసిద్ది చెందుతావు. అయితే నీ పుణ్యఫలం ఖర్చు అయిపోయే సమయానికి నీకు చంద్రగ్రహణం పట్తుంది. ఆ కారణంగానే నీవు మరణిస్తావు. అయినా నీ పేరు శాశ్వతంగా నిలుస్తుంది...." అని!


    సువిశాల భారతదేశంలో  ఒక అగ్రశ్రేణి రాష్ట్రానికి అధినాయకుడుగా అవతరించాడు దోమాడ కరణం! ఈ అవతారంలో ఆయనపేరు 'అపర బ్రహ్మ' పుట్టింది సామాన్య కుటుంబంలోనే అయినా అదృష్టం వరించి 'తేరవేల్పు' అయ్యాడు.


    అంచెలంచెలుగా ఆయన భక్తగణం కూడా పెరిగింది. అచిరకాలంలోనే ఊరూరా ఆయన పేరిట భజన సమాజాలూ, భక్త కూటాలూ, అభిమాన సంఘాలూ వెలిశాయి. రాముడు, కృష్ణుడు వంటి ఇలవేల్పులు ఎలా వుంటారో పాటకజనానికి తెలీదు అయితే..... తెరమీద వారివేషాలను అపరబ్రహ్మవేయగా చూశారు.   ఆ బొమ్మలు చూసీచూసీ 'ఓహో...... ఆ దేవుళ్ళు ఇలాగే ఉంటారన్నమాట!' అనుకుని, అటువంటి బొమ్మలు కొనుక్కొని ఇళ్ళలో, గోడలమీదా, పూజామందిరాల్లోనూ పెట్టుకుని పూజలూ, పునస్కారాలూ, ధూపదీప నైవేద్యాలు వంటివి మొదలుపెట్టారు.

 
     అంతేకాదు..., తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నాక అపరబ్రహ్మ గారుండే నగరానికి వెళ్లి అక్కడ ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకో సాగారు. ఆ జగన్మోహ రూపం చూసి  పరవశించిపోయేవారు. కొందరు వీరభక్తులు ఆయనముందు కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చేవారు. సాక్షాత్తూ వేంకటేశ్వర స్వామిలాగా అపరబ్రహ్మగారు దక్షిణహస్తం పైకెత్తి  భక్తులను దీవించేవారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS