"తాతా! మీ అందరి మాటని నేనెందుకు కాదనాలి? తప్పక మొక్కుతాను. కాని, స్వామివారు కొద్దిసేపు సింహాసనంనుండి పక్కకు తొలగవలసి ఉంటుంది." అంది.
సోమయాజి కోపంతో, "పాపిష్టిదానా! నీ అఘాయిత్యాలకి అంతులేకుండా పోతోంది. నీకు కళ్ళు నెత్తికెక్కాయి. స్వామివారంతటి వారిని సింహాసనం దిగమంటావా? కళ్ళు పేలిపోతాయి. చెంపలేసుకుని క్షమాపణ అడుగు" అంటూ ఆవేశపడిపోతున్నాడు. అందరి మనస్సులలోనూ అదే భావన. స్వామివారికి కోపంవస్తే తనని ఆహ్వానించిన ఊరివారందరినీ శపిస్తారేమో.
వెంకమాంబ ధైర్యంచూసి, ఆమె ప్రవర్తనలో ఏదో మర్మం ఉండి ఉంటుందని తోచింది స్వామివారికి. అది భగవంతుని ఆదేశం అనిపించింది. ఏది ఏమైనా ఒక్కసారి సింహాసనం నుండి దిగినంత మాత్రాన పోయేదేమీ ఉండదు. తానూ రోజూ సింహాసనం అధిరోహించటం, దిగటం జరుగుతూనే ఉంటుంది. ఇదీ ఆ నిత్య కృత్యంలో భాగం అనుకుంటే సరి. ఆ అహంకారికి బుద్ధి చెప్పవచ్చుకూడా. మౌనంగా ఆసనం దిగి కొద్దిదూరంలో ఉన్న శిష్యులవద్ద నిలబడ్డారు. స్వామివారు ఆసనం నుండి దిగినట్లు తెలియపరచగానే, వెంకమాంబ తెరపక్కకి జరిపి, రెండు చేతులూ జోడించి ఫాలభాగాన చేర్చి నమస్కరించింది.
అంతే! ఫెళఫెళారావాలు వినిపించాయి. అందరూ అదిరిపడి చూచేసరికి సింహాసనం నుండి అగ్ని జ్వాలలు పైకి లేచాయి. ఏం జరిగిందో అర్థంచేసుకునే లోపు సింహాసనం బూడిద కుప్ప అయిపోయింది. నివ్వెరపాటుతో స్వామివారితో సహా మరెవ్వరికీ నోట మాటలేదు. అంతా స్మశాన నిశ్శబ్దం. కొద్దిక్షణాల తర్వాత అందరూ భయంతో కేకలు పెట్టారు. కొంతమంది ఏడిచారు. కొద్దిసేపు అంతా అల్లకల్లోలం. ఆ కలకలం అణిగిన తర్వాత ముందుగా తేరుకున్న స్వామివారు వెంకమాంబను సమీపించి
"అమ్మా! జగన్మాతా! ఈ శ్రీశ్రీశ్రీ పుష్పగిరి పీఠ అధిపతి విద్యానృసింహ భారతి వందనాలు స్వీకరించు. నన్ను కరుణించి, నా అజ్ఞానాన్ని తొలగించటానికి వచ్చిన నిన్ను గుర్తించటానికి ఆలసించినందుకు మన్నించు" అంటూ నమస్కరించారు.
తాము తలచిందేమిటి? ఇక్కడ జరుగుతున్నదేమిటి? అందరూ కొయ్యబారిపోయారు. వారిని చూసి స్వామివారిట్లా సెలవిచ్చారు.
"మా నృసింహస్వామి పాలిస్తున్న తరిగొండ వాసులైన బ్రాహ్మణశ్రేష్ఠులారా! మీరేకాదు. ఈ గ్రామవాసులందరూ ధన్యులే. ఈ గ్రామం పవిత్రక్షేత్రం కనుకనే మీ గ్రామంలో వెంకమాంబ వంటి భక్తాగ్రగణ్యురాలు జన్మించటం జరిగింది. ఆమె పుట్టిన గ్రామంలోనే మీరూ పుట్టటం మీ పూర్వజన్మ సుకృతం. ఈ తల్లి సాక్షాత్తు భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుని అవతారం. మానవులను భక్తిమార్గంవైపు మళ్ళించటానికి రెండున్నర శతాబ్దాలముందు గుజరాతులో మీరాబాయిగా అవతరించి ఇప్పుడు మన భాగ్యవశాన తెలుగునాట మనమధ్య అవతరించటం జరిగింది. ఈ మాతృమూర్తిని గౌరవించి, సేవించి, ఆమె చెప్పిన మార్గంలో నడిచి ధన్యులుకండి.
"గొప్పవారి చరిత్రలు అర్థంచేసుకోవటం సామాన్యులకి చేతకాదు. అంతమాత్రాన అపార్థం చేసుకోటం తప్పు. ఈ భక్తురాలు, తనని మీరు అర్థంచేసుకోటం కోసం చూపిన మహిమల నన్నింటిని మీరు మాయలు, భూతప్రేతాలు అని అపార్థం చేసుకున్నారు. అది మీ అజ్ఞానం. మిమ్మల్ని ఉద్ధరించటానికి అవతరించిన మహాత్మురాలిని అవమానాలపాలు చేశారు. ఇప్పటికైనా మించిపోయిందేమీలేదు. చేసిన పొరపాట్లు గుర్తించి, మరెప్పుడూ ఆ తల్లిని బాధించక తెలివిగా మసలుకొని, భగవంతుని కృపకు పాత్రులు కండి. దైవం మిమ్ములను చల్లగా చూచి కాపాడుగాక! మీకందరకూ అనేక మంగళాశాసనాలు".
కొంతమంది సంతోషంతో చప్పట్లు చరిచారు. మరికొంతమండి కక్కలేక మింగలేక ముఖాలు జేవురించగా మౌనం పాటించారు. స్వామివారు మళ్ళీ వెంకమాంబను సమీపించి, ఆమె పాదాలవద్ద కొన్ని కానుకలుంచి,
"మాతా! సెలవిప్పించెదవా?" అని చేతులు జోడించి, అనుమతి తీసుకుని శిష్యబృందంతో పుష్పగిరికి వెళ్ళిపోయారు. వారిని అనుసరించి సాగనంపటానికి వెళ్ళిన సోమయాజి బృందాన్ని బుద్ధి కలిగి ఉండమని మందలించి వెంకమాంబను దైవసమానంగా పూజించమని, మరొక్కమారు ఆమె జోలికి వెళ్ళి బాధించవద్దని హెచ్చరించారు.
తాత్కాలికంగా గండం నుండి బయటపడ్డామని ఊపిరిపీల్చుకున్నా, సోమయాజికి ఈ సంఘటనతో కోపం, కసి పెరిగిపోయాయి. కాని స్వామివారి మాటలింకా ఊరి ప్రజల చవులలో మారుమ్రోగుతూనే ఉన్నాయి కనక కొంతకాలం వరకు తాను ఊరుకోటమే ఉత్తమం అనుకున్నాడు.
పీఠాధిపతి దేవాలయంలో ఒక పీఠంపై అధివసింపచేసి, గౌరవించటంతో వెంకమాంబకి ఆలయమ్లో ఆచార్యస్థానం లభించినట్లయింది. మనస్సులో ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవ్వరూ కాదనలేని పరిస్థితి. మందిరంలో ధ్యానం చేసుకుంటూ ఉంటే పూజారికి కంటగింపుగా ఉన్నా వద్దనలేడు. పుష్పగిరి స్వాములవారు తమ సమస్య తీర్చారని, ఇంకాపై తమ బిడ్డనెవ్వరూ అవమానించి, అపనిందలు వేసి బాధించరని కృష్ణయార్యుడు, మంగమాంబ సంతోషించినంత కాలం పట్టలేదు పరిస్థితులు యథాప్రకారంగా మారటానికి.
గొప్ప పండితులు, ఉపాసకులు అయిన పీఠాధిపతుల మెప్పుపొందిన వెంకమాంబ గొప్పతనం, చిన్నతనం నుండి ఆమె చూపిన మహిమలు ముచ్చటల్లోనూ, పిచ్చాపాటిలోనూ చోటుచేసుకున్నాయి. రానురానూ, స్వాములవారిని బోల్తాకొట్టించిందని, బుట్టలో వేసిందని, ఆయన మీద కూడ తన మంత్రాలు ప్రయోగించిందని, అంతటి స్వామి లొంగినప్పుడు మనమెంత అనీ, అందరూ జాగ్రత్తగా ఉండాలనీ,.....ఇలా మాటలు రకరకాలుగా రూపాంతరం చెందాయి.
నోటితో అనకపోయినా, బాహాటంగా ప్రకటించకపోయినా, ఊళ్ళోవాళ్ళు కృష్ణయార్యుని కుటుంబాన్ని వెలివేసినట్లుగానే చూడసాగారు. ఎవరూ వీరి ఇంటికి రావటంలేదు. తమ ఇళ్ళకి రానీయటంలేదు. శుభశుభాలకి పిలవటంలేదు. మంగమాంబ నీళ్ళకి వెడితే ఆమె వెళ్ళేవరకూ అందరూ దూరంగా ఉండటం, పలకరించక పోవటం, తానే పలకరించినా మారు పలకకపోవటం బాధనే కలిగిస్తున్నాయి. వెచ్చాలివ్వవద్దని సెట్టిని బెదిరించారని సుబ్బన్న దీక్షితులు బాధగా చెప్పాడు కృష్ణయార్యునికి. గ్రామవాసులంటే విరక్తి కలిగింది. శ్రీశ్రీశ్రీ విద్యానృసింహభారతీ స్వామివారు చెప్పిన తరువాత కూడ మార్పురాని మూర్ఖులంటే ఏవగింపు కలిగింది. ఇంకా అటువంటి వాతావరణంలో ఉండి, తాము బాధపడుతూ, తమబిడ్డని బాధపెట్టటంకన్నా ఊరువదిలిపోతే బాగుండుననిపించింది. ఎక్కడైనా తమ గురించి తెలియనిచోట గుట్టుగా కాలం వెళ్ళదీస్తే వెంకమాంబ సాధన విఘ్నంలేకుండా సాగుతుందని తోచింది. తన అభిప్రాయాన్ని శ్రేయోభిలాషులైన సుబ్బన్న దీక్షితులకి తెలిపాడు కృష్ణయార్యుడు.
తన దగ్గిర చదువుకున్న ఉత్తమ విద్యార్థి అయిన వెంకమాంబ మీద ఎంతో అభిమానం, ఆప్యాయత, వాత్సల్యం ఉన్న సుబ్బన్న దీక్షితులు కృష్ణయార్యుని కుటుంబం ఊరు వదలి వెళ్ళటం తనకి బాధ కలిగిస్తున్నా వారి క్షేమం దృష్ట్యా అదే మంచిదని చెప్పాడు. అంతేకాదు. ఎక్కడికి వెళ్ళాలో కూడ సూచించాడు. "వెంకమాంబ తెలివితేటలకి మెరుగు పెట్టగల గురువు మదనపల్లిలో గొప్ప యోగిగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యశాస్త్రులవారు. కనక మీ కాపురం మదనపల్లికి మార్చండి. వెంకమాంబ పాండిత్యంతో పాటు యోగసాధనకూడ వారివద్ద అభ్యాసం చెయ్యవచ్చు. అప్పుడు మళ్ళీ తరిగొండకి వచ్చేయచ్చు. అప్పుడు నా శిష్యురాలికి ఈ ఊరు బ్రహ్మరథం పడుతుంది. నేనారోజు కోసం ఎదురుచూస్తూ ఉంటాను." అని ప్రేమగా కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు.
* * *
