"మీరు మామూలు తెల్లకాగితంమీద వ్రాసిస్తే అది చెల్లదనీ, మిమ్మల్ని ఇరుకున పెట్టి అది వ్రాయించుకున్నామనీ రేపు మీ భర్త వాదించవచ్చు. అందుకని ప్రతీది చట్టబద్దంగానే చెయ్యాలి.
ఆమె లేచి "సరే" అంది.
"రేప్రొద్దున రమ్మంటాను లాయర్ని..."
ఆమె తలూపి బయటకొచ్చేసింది. ప్రార్థన వున్న గదివైపు నడుస్తూ ఆమె అనుకుంది. "రేపు భార్గవ కాస్త మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఈ విషయం చెప్పాలి. ఉత్తరం ఇస్తేగానీ వాళ్ళు ట్రీట్ చెయ్యమని అన్నారంటే అతడు మరింత మండిపడవచ్చు... జాగ్రత్తగా సర్ది చెప్పాలి. పాపకి కాస్త గుణం కనిపిస్తే అంతా పొగమంచులా విడిపోతుంది. అంతవరకూ తనే వీటిని చక్కబెట్టాలి. ఒక భార్యగా తన బాధ్యత అది. ఈ పరిస్థితుల్లోనే తను బెదిరి పోకూడదు. భర్త మానసిక వ్యధతో తల్లడిల్లిపోతూవుంటే అతడి బాధని తనే స్వీకరించాలి. అతడికి వాటినుంచి విశ్రాంతి నివ్వాలి.
ఆమె అలా ఆలోచిస్తూ వెళ్ళిపోయాక డాక్టర్ మహేంద్ర ఫోన్ దగ్గరికి లాక్కొని తనకు తెలిసిన లాయర్ కి ఫోన్ చేశాడు.
ప్రతివాద భయంకర వేంకట శేషాచలపతిరావు పంతులు.
ఉరఫ్ లాయర్ పంతులు.
పేరులోలా భయంకరంగా ఉండడు. సన్నగా, పొట్టిగా, గాలొస్తే పడిపోయేలా వుంటాడు. రైల్వే స్టేషన్ లో కనబడితే కూలీ అనుకుంటాం. ఆస్పత్రిలో కనపడితే టి.బి. పేషెంట్ అనుకుంటాం.
కోర్టు మధ్యలో అతడు నల్లపిల్లిని కూర్చోపెట్టి తెల్లకుక్క అని నిరూపించగలడు. వాల్మీకి రామాయణం వాల్మీకి వ్రాయలేదని మేజిస్ట్రేటుతో జడ్జిమెంట్ ఇప్పించగలడు. అతడు రాజకీయాల్లో చేరుంటే రాష్ట్రపతి అయివుండేవాడు. స్మగ్లర్లలో చేరివుంటే పెద్ద పారిశ్రామికవేత్త అయి వుండేవాడు. అవేమీ చేయక లాయరుగా మిగిలిపోయాడు. ఫోనెత్తి 'హలో' అన్నాడు.
"నేను డాక్టర్ మహేంద్రని మాట్లాడుతున్నాను".
"చెప్పండి సార్"
"ఒక కేసుంది, కాస్త సాయం చెయ్యాలి".
"ఏది సార్? కేన్సర్ కేసా?"
ఒక డాక్టర్ ఫోన్ చెయ్యగానే ఒక లాయరు "ఏమిటి? కేన్సర్ కేసా?" అని వెంటనే ఎందుకు అడిగాడో తెలుసుకోవాలంటే కేన్సర్ కీ కోర్టుకీ సంబంధం తెలుసుకోవాలి.
చాలా రకాల కేన్సర్ లలో, ట్రీట్ మెంట్ ఇవ్వటం ద్వారా మనిషి జీవితాన్ని అయిదారు సంవత్సరాలపాటూ పొడిగించవచ్చు. కొన్ని రకాల ట్రీట్ మెంట్ లకి లక్షనుంచీ ఎనిమిది లక్షలదాకా ఖర్చవుతుంది. ఉదాహరణకి ఎముకల్లో మూలగనంతా తీసేసి వేరే మూలగని ఎక్కించటానికి నాలుగైదు లక్షలు ఖర్చవుతుంది. ఒక మనిషిని (కేవలం) అయిదారు సంవత్సరాలపాటూ బ్రతికించటానికి ఇంత డబ్బు ఖర్చుపెట్టాలా? అన్నది ఎప్పుడూ సమస్యే. రోగికి బ్రతకాలని వుంటుంది. మిగతా కుటుంబ సభ్యులకు వుండదు. ఉండదంటే పూర్తిగా వుండదని కాదు- ఇరవై ముప్పై సంవత్సరాల్నుంచీ కూడబెట్టిన డబ్బునంతా ప్రయోజనం లేని (?) పనికి ఖర్చు పెట్టటానికి ఇష్టం వుండదు. అది పైకి చెప్పలేరు. మధ్యతరగతి కుటుంబాల్లో అయితే మనసుకీ మనిషికీ ఘర్షణ జరుగుతుంది. పెద్ద తరగతిలో అయితే స్వార్జితమా పిత్రార్జితమా అన్న సమస్య తలెత్తుతుంది. తన ఆస్తి తన కుటుంబసభ్యుల తన అనారోగ్యానికి ఖర్చు పెట్టటం లేదని కోర్టుకు వెళతాడో వృద్ధుడు. గార్డియన్, డబ్బున్న మైనర్ యొక్క కేన్సర్ ని శ్రద్ధగా ట్రీట్ చేయడం లేదని కేసుపెడ్తాడు మరొకడు. చిన్న కుటుంబాల్లో మరీ కష్టం. రేడియం ట్రీట్ మెంట్ కి రెండు వేలంటాడు డాక్టర్. అంత డబ్బు వుండదు. రోగికి విషయం తెలియనివ్వరు. తలలో కేన్సర్ కి తలనొప్పి మందు వాడతారు. ఇదంతా జరుగుతుందా? మనుష్యులింత హీనంగా వుంటారా- అంటే? వుంటారు. కేన్సరూ, చావు తాలూకు భయమూ, మనిషిని ఆ స్థితికి తీసుకెళతాయి, కోర్టుకు లాగుతాయి. అదే కేన్సర్ కీ, కోర్టుకీ వున్న సంబంధం.
లాయరు పంతులుకి సెక్షన్లన్నీ నోటి చివర వుంటాయి. ప్రతి వాక్యం చివరా ఒక కేసు తాలూకూ వివరం చెబుతూ వుంటాడు. వినేవాడికి తన లీగల్ పరిజ్ఞానంతో స్పెల్ బౌండ్ చేయటం అతడికి వెన్నతో పెట్టిన విద్య. "చెప్పండి సార్! ఏం చెయ్యాలి?" అని అడిగాడు.
"ప్రార్థన అని ఒక పన్నెండేళ్ళ పాపని ఆస్పత్రిలో చేర్చారు. తండ్రి పేరు భార్గవ. అతడు ట్రీట్ మెంట్ వద్దంటున్నారు" అన్నాడు డాక్టర్ మహేంద్ర కేసు వివరాలు చెబుతూ.
"డబ్బు ఖర్చవుతాయనా?"
"కారణాలు ఏమయితేనేం... తల్లి మాత్రం చాలా మంచిది. నెమ్మదస్తురాలు. ఆమెకి సాయం చెయ్యాలి. అందుకే మీకు ఫోన్ చేసేను. వీలు అవుతుందా?"
"హిందూ మైనారిటీ అండ్ గార్డియన్ షిప్ ఆక్టు, సెక్షన్ 6 ప్రకారం, అయిదు సంవత్సరాలు దాటిన పిల్లలకు న్యాచురల్ గార్డియన్ తండ్రే. తల్లికే విధమైన హక్కూ లేదు".
"అంత సులభంగా తేల్చేస్తే ఇక మీలాంటి లాయర్లెందుకు?"
పంతులు నవ్వేడు. "... నారాయణ దాస్ వర్సెస్ సువర్ణా కౌర్ అన్న కేసులో తండ్రి పట్టించుకోకపోతే తల్లి కోర్టుద్వారా సంరక్షణ హక్కు పొందవచ్చునని పాట్నా కోర్టు తీర్పు యిచ్చింది 1969లో" అన్నాడు.
"కానీ ఈ కేసులో తండ్రి తనే సంరక్షణ వహిస్తానంటున్నాడు. ఏ పరిస్థితిలో కూడా తల్లికి హక్కులేదా?"
"ఒక రకంగా అయితే ఉంటుంది".
"ఎలా?"
"ఆ కూతురు అక్రమ సంతానం అయి, ఆమె పుట్టుక్కీ, తండ్రికీ ఏ సంబంధమూ లేకపోతే, సెక్షన్ సిక్స్, బి ప్రకారం తల్లికే సర్వహక్కులూ వుంటాయని రాజ్యలక్ష్మి వర్సెస్ రామచంద్రన్ అనే కేసులో 1967లో కోర్టు తీర్పు ఇచ్చింది".
"మిమ్మల్ని తగలెయ్య. ఇంతకన్నా మామూలు పద్ధతులేమీ లేవా?"
"ఎందుకు లేవు! మీరు పంపించండి, నేను చేసుకుంటాను. ఏ న్యాయసూత్రం చెప్పినా, పిల్లలకి అన్యాయం జరక్కూడదనే చెబుతుంది. ఈ విషయం 1977లో సుప్రీంకోర్టు ధృవపర్చింది".
"అవును, పాప ఆరోగ్యం ముఖ్యం. అందుకే నేనూ ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ కేసుని మీ దగ్గరికి పంపుతున్నాను. ఫీజు తీసుకోకండి".
"మీరు చెప్పారు కాబట్టి తీసుకోను".
"రేపు సాయంత్రానికల్లా ఆమెని గార్డియన్ గా ధృవీకరిస్తూ నాకు కోర్టునుంచి ఆర్డర్లు కావాలి. తెప్పించగలరా?"
"లాయర్ పంతుల్ని మీరు తక్కువ ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఒక పాప ప్రాణాన్ని రక్షించటం కోసం- కావాలంటే ప్రార్థన అనే అమ్మాయి, భార్గవ అనే వాడికి పుట్టలేదని నిరూపించి అయినా సరే కోర్టు ఆర్డరు తెప్పిస్తాను".
"గుడ్" అని ఫోన్ పెట్టేసేడు మహేంద్ర.
* * *
