Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 33

   
    అప్పటిదాకా మనసులోని దిగులు దూరం అయిపోగా చిన్నగా నవ్వింది దీప ఇద్దరూ ఆటో ఎక్కి ఆలయానికి చేరారు.

    మోహన్ మాట్లాడి ఉంచిన పురోహితుడు సిద్దంగా ఉన్నాడు. వీళ్ళని చూడగానే "రండి బాబూ! ఇంతాలస్యం చేశారేం? నేనిమకా మీ పెద్దవాళ్ళకిగానీ తెలిసిపోయిందేమో ఇంట్లోనే పెళ్ళీగట్రా చేసేశారేమో అని భయపడుతున్నాను" అన్నాడు.

    అంతటితో వూరుకోక "బొత్తిగా మీరిద్దరేనా? ఫ్రెండ్స్ ఎవరూ  రారా?" అడిగాడు  మంత్రం ఆపేసి.

    "మా ఫ్రెండ్స్ వస్తారు!" మోహన్ మాట పూర్తి కానేలేదు.....చిట్టిబాబు,  పద్మని వెంటేసుకొని వచ్చేశాడు. స్నేహితుడి పెళ్ళికదా అని కొనుక్కున్న కొత్తబట్టలు, చేతుల్లో పూలదండలు ఇతనే పెళ్ళికొడుకా అనిపించేటట్లు ఉన్నాడు.

    వీళ్ళని చూడగానే హుషారుగా విజిల్ వేసాడు.

    "వెరీగుడ్ అప్పుడే పెళ్ళి మొదలయిందన్న మాట" అంటూ వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు అతనికంత హుషారుగా ఉందిగానీ ఆ పెళ్ళి చూస్తే పద్మకి నీరసం వచ్చింది పెళ్ళికూతురిమీద జాలికూడా వేసింది.

    మెల్లిగా వెళ్ళి పెళ్ళికూతురి పక్కనే కూర్చుంది. "మీ వాళ్ళు ఎవరూ లేకుండా ఇలా పెళ్ళి చేసుకోవడం బాధగా లేదూ మీకు?" అని అడిగింది.

    "ఏం చేస్తాం?" పరిస్థితులు అలా నచ్చాయి మరి నాక్కూడా ఇలా  పెళ్ళిచేసుకోడం అంత ఇష్టం లేదు కానీ ప్రొఫెసర్  గారు చెప్పాక కాదనలేకపోయాను" అంది మెల్లిగా.

    "ప్రొఫెసర్ గారా? ఎవరాయన?" చిట్టిబాబూ, పద్మ ఒకేసారి అడిగేశారు.

    ఉత్సాహంగా చూసింది దీపిక. "ఆయనా? ఆయన ఒక మహానుభావుడు" ఆవేశంగా చెప్తూ పీటమీదనించి లేవబోతూ వుంటే రెక్కపుచ్చుకుని కూర్చోబెట్టేశాడు మోహన్.

    "ఆయన గురించి తర్వాత చెప్పుకుందాం ముందు పెళ్ళి చేసుకో" అన్నాడు. "త్వరగా కానీండి" అని పురోహితుడిని తొందరపెట్టేశాడు.

    "అదేంమాట జన్మకి ఓ సారి వచ్చే ముచ్చట ఇది. తాపీగానే కానివ్వండి" అన్నాడు చిట్టిబాబు.

    ఇక్కడ పెళ్ళి అవుతుండగా అక్కడ ఇంటిదగ్గర మోహన్ అటు వెళ్ళగానే మేడమీద బాల్కనీలో పక్కింటి వాకిలి బాగా కనపడేచోట కుర్చీ వేసుకుని కూర్చున్నాడు సూర్యంగారు.

    వరండా మధ్యలో గేటుకి ఎదురుగా పడక్కుర్చీలో కూర్చుని కన్నార్పకుండా అతిజాగ్రత్తగా రోడ్డువంక చూస్తున్నారు సత్యంగారు.

    సత్యంగారిని చూసి పళ్ళుకొరుక్కున్నారు సూర్యం గారు. ఎక్కడికో వెళ్ళడానికి సిద్దమై కూర్చున్నాడు. కదిలేడా కాళ్ళు విరిచేస్తాడు వెధవని. అనుకున్నారు.

    యదాలాపంగా పక్కింటి వైపు చూసిన సత్యానికి తనవంకే మింగేసేలా చూస్తున్న సూర్యం కనిపించాడు మరుక్షణం ఆయన కూడా మింగేసేలా చూసేడు.

    అలా కాసేపు కళ్ళతో యుద్ధం చేసుకున్నాక కర్ర చూపించి నీ కాళ్ళు విరగ్గొడతా అని సైగ చేశాడు సత్యం. వెంటనే చెయ్యెత్తి పళ్ళు రాలగొడతా అని సైగ చేశాడు సూర్యం.

    అలా కాసేపు సైగల యుద్ధం అయ్యాక నాలిక బయటపెట్టి వ్వె వ్వె  అని వెక్కింరించాడు సత్యం. వెంటనే సూర్యం కూడా వెక్కిరించాడు.

    అలా వెక్కిరించుకుంటూ వుండగానే కాంపౌండరు కామేశాన్ని వెంటబెట్టుకుని వచ్చేరు చలపతిరావుగారు.

    ఆ సమయంలో ఆయన రావడం సత్యంగారికి అంత నచ్చలేదు. అయినా విధిలేక ఆహ్వానించి కుర్చీ చూపించాడు. డాక్టరుగారూ కామేశంగారూ కూర్చున్నారు.

    డాక్టరుగారికి అంతా అయోమయంగా వుంది. ఈయన చూస్తే బాగానే వున్నాడు. ఏమిటో మరి అనుకుంటూ కూర్చున్నాడు. యెవరూ ఏమీ మాట్లాడుకోడంలేదు.

    గడియారం పదిన్నర కొట్టింది గేటు తెరుచుకుంది. కృష్ణ సూట్ కేస్  పట్టుకుని లోపలికి వచ్చాడు ఆఫీసు పని మీద నాల్రోజుల క్రిందట హైదరాబాదు వెళ్ళాడు.

    "ఏరా ప్రయాణం బాగా జరిగిందా?" పలకరించారు సత్యంగారు.

    "బాగానే జరిగింది డాక్టరుగారొచ్చారేం? మీ ఆరోగ్యం ఎలా వుంది?" అన్నాడు కృష్ణ.

    "ఆరోగ్యం బాగానే వుంది. డాక్టరుగారు వూరికే వచ్చారు" అన్నారాయన.

    లోపలికి వెళ్ళాడు కృష్ణ. రాధని పలకరించి తల్లిని పలకరించి "చెల్లాయ్ ఏది?" అన్నాడు.

    "ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్ళింది" అంది వర్ధనమ్మ.

    అతని కనుబొమలు ముడిపడ్డాయి. ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ గారు అంటారు. అసలు ఎవరాయన? ఆయనతో చెల్లాయికేం పని?" అడిగాడు.

    "ఏమో మరి, నాకేం చెప్తారా పాడా? తండ్రీ కూతురూ ఒకటే గుసగుసలు" విసుక్కుంది ఆవిడ.

    వెంటనే ఆ యువకుడు గుర్తొచ్చాడు కృష్ణకి అనుమానం మరింత బలపడింది" ఆయనిల్లు ఎక్కడో ఎవరికైనా తెలుసా?" అడిగాడు.

    బీచ్ రోడ్ లో వుంది. మనం ఆ వేళ వెళ్ళోస్తుంటే చూపించింది దీప." అని గుర్తులు చెప్పింది రాధ.

    వెంటనే బయలుదేరాడు కృష్ణ.

    మేడమీద కూర్చున్న సూర్యంగారికి నడుం నేప్పేట్టింది. తలపోటుగా వుంది వీడికి కాపలా కాయడం కాదుగానీ నా ప్రాణానికి వచ్చింది అని విసుక్కున్నారు. పోనీ అలా కాస్త వీధి చివరి దాకా వెళ్ళి ఓ కొబ్బరి బొండం తాగివస్తేసరి. కాస్త మార్పుగానూ వుంటుంది. ఈ సన్నాసి ఒకవేళ వెళ్ళినా అటే వెళ్ళాలి కాబట్టి తప్పించుకుపోతాడనే భయంలేదు. ఈ ఐడియా వచ్చేక ఆలస్యం చెయ్యకుండా వెంటనే లేచారు ఆయన.

    డాక్టరుగారితో మాట్లాడుతూ మామూలుగా అటు వైపు చూసిన సత్యంగారు ఉలిక్కిపడ్డారు ఏడీ వీడు? ఇప్పటిదాకా యిక్కడే ఉన్నాడుగా యింతలో ఏమైపోయాడు. అనుకుంటూ లేచి కంగారుగా వీధిలోకి వచ్చారు.

    అప్పుడే రోడ్ మీదికి వచ్చియిట్టే వస్తున్నా సూర్యం కనిపించేసరికి ఆయనకి కోపం వచ్చేసింది. కర్ర చూపించి "ఒరేయ్ యెక్కడికిరా బయలుదేరావు. ఫో లోపలికి" అన్నాడు.

    సూర్యంగారికి చాలా కోపం వచ్చింది. "నువ్వెవడి వోయ్ నన్ను పోమ్మనడానికి. "నా యిష్టం" అంటూ నాలుగడుగులు చేశాడు.

    "నీ దొంగ ఎత్తులు నాకు తెలుసులే. అడుగు ముందుకి వేశావో కాళ్ళిరగ్దోడతాను నేను  యిక్కడున్నంత సేపూ నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను!" అంటూ మీదికి వచ్చాడు సత్యం.

    ఇద్దరూ పెద్దగా అరుచుకుంటూ హొరాహొరీ పోట్లాడుకున్నారు. నువ్వుకంతిరీ వెధవ్వి అంటే కాదు నువ్వే కొంపలు కూల్చేరకానివి అనుకున్నారు.

    క్రమంగా తారాస్థాయికి చేరింది వాళ్ళపోట్లాట.

    చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు వాకిళ్ళల్లోకి వచ్చేశారు చేస్తున్న పని ఆపేసి వాకిట్లోకి పరుగున వచ్చేసింది.  వర్ధనమ్మ వాళ్ళిద్దర్నీ అలా చూసి ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు అని సంబర పడింది. వదినా  నువ్వే వుంటే ఎంత ఆనందించేదానివో కదా అని మహాలక్ష్మమ్మను తల్చుకుని బాధపడింది. భారతి, రాధ  వచ్చి వరండాలో నిల్చున్నారు.

    వీళ్ళ పోట్లాట ఇలా సాగుతుండగానే కారు వచ్చి సత్యంగారింటి ముందు ఆగింది.

    "అదుగో చూడరా! నీ పొగరు అణిగే సమయం వచ్చింది. నీ కూతురు నీకు మాట మాత్రం చెప్పకుండా పెళ్ళిచేసుకుని వచ్చింది" అన్నాడు సూర్యంగారు.

    నా కూతుర్ని అన్నావంటే చెప్పుపెట్టి కొడతాను నా మాట సరేలే ముందు నీ విషయం చూసుకో నీ గర్వం గంగలో కలిసేలా నీకాబోయే అల్లుడు వేరే అమ్మాయిని పెళ్ళిచేసుకొచ్చాడు" అన్నాడు సత్యం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS