Previous Page Next Page 
నా కథవింటావా పేజి 33


    ఉన్న దున్నట్లు  అంతా చెప్పేసింది  కావ్య! గుండెలోని  భారం దించినట్టయింది !
    "మమ్మీ! ఇంకేమీ  చెప్పకు ! అంకుల్  చెప్పినట్టు నువ్వు మామూలు మనిషివి కావు! దేవతవి! ఈ దిక్కుమాలినదాన్ని దగ్గరకి తీసి, నీడనిచ్చి, ఇంతటిదాన్ని  చేసిన మనిషివి ?
    కొవ్వొత్తిలా  నువ్వు కాలిపోతూ, నాకు  వెలుగు ప్రసాదించిన జ్యోతివి !
    మమ్మీ ! నా కోసం, నిన్నూ, తన జీవితాన్నీ  కూడా త్యాగం చేసిన దేముడు అంకుల్ ! ఆయన్ని నేను ఎన్నోసార్లు ఎన్నో విధాల అవమానించాను, హేళన చేశాను ! అయినా  ఆయన నన్ను అసహ్యించుకోలేదు. మమ్మీ! మమ్మీ!....నన్ను  క్షమించు!" అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ, కావ్య కాళ్ళమీద పడిపోయింది.
    "దివ్యా ! ఏంటమ్మా ఇది ? నీలో వున్న అపోహలనీ, అవమానాలనీ, తొలగించడానికే, ఇదంతా చెప్పేను కానీ, ఆ మనసుని కష్టపెట్టడానికి  కాదు తల్లీ! అసలు జన్మలో  ఈ సంగతి  నీకు తెలీకూడదనుకున్నానమ్మా! కానీ, తెలీకపోతే, నువ్వు మానసికంగా  నాకు రోజు రోజుకీ దూరమై పోతున్నావనే బాధతో, ఇంకా దూరమైపోతావేమోనన్న భయంతో చెప్పేను కానీ, నిన్ను కించపరచాలనో, నా గొప్పతనాన్ని  చాటుకోవాలనో  కాదమ్మా!" దివ్యని  కౌగిలించుకుని, తల నిమురుతూ, కన్నీరు మున్నీరుగా ఏడ్చింది కావ్య!
    కన్నీళ్ళు  ఇద్దరి  హృదయాలలోని  అనుమానాలనీ కడిగేసాయి! గుండెలనిండా  ఆప్యాయతా, అభిమానం నిండిపోయాయి!
    "మమ్మీ! నా అశ్రుధారతో  అంకుల్  కాళ్ళు కడగాలి! అప్పుడే నాకు తృప్తి" అంది, తల్లి పక్కనే ఆమెని గట్టిగా పట్టుకుని  కరుచుకుని పాడుకుంటూ !
    "దివ్యా ! నీ మనసును  అలుముకున్న  చీకట్లను తొలగించి  జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నావు. నా పెంపకానికి  పవిత్రతని  ఆపాదించావు. నాకు అదే చాలు!
    అది సరే ! ఎవరీ రోహిత్ ? మంచివాడేనా ? నీకు ఇష్టమేనా ?" అడిగింది లాలనగా కావ్య!
    "మమ్మీ ! రోహిత్, బి.ఏ, నుంచీ  నా క్లాస్ మేట్ ! తెలివైన వాడు. నేనంటే చాలా ఇష్టం!....
    "మరి నీకూ ?"....దివ్య కళ్ళల్లోకి  చూస్తూ  అడిగింది కావ్య !
    ఆ కళ్ళల్లో  అప్పుడు  వెయ్యి  కాండిళ్ళ బలుబు  వెలిగినంత  తేజం కనబడింది.
    "ఊఁ.... నీకూ ఇష్టమే నన్నమాట ! అయితే  ఇంకేం ? వెంటనే పెళ్ళి ఏర్పాట్లు చేస్తాను."
    "మమ్మీ! నాదో  చిన్న  కోరిక!" అంది, తల్లి కేసి చూస్తూ దివ్య !
    "ఏమిటో చెప్పు ?" ప్రేమగా అడిగింది  కావ్య !
    "నా పెళ్ళి  శాస్త్రోక్తంగా  జరగాలి !"
    "అలాగే ! తప్పకుండా !"
    "ప్రామిస్ !"
    "ప్రామిస్" చేతిలో చేయ్యేసింది !
    ఆ రాత్రి వాళ్లిద్దరూ  పరితప్త హృదయాలతో, ఎంతో తృప్తిగా  నిద్రపోయారు.
    ఇద్దరి మనసులలో  ఒకటే  ఆలోచన ! ఒకరి మీద ఒకరికి గౌరవం ! ఇద్దరి హృదయాలలోనూ  ఒకటే  ఆవేదన ! ఎదుటివారి కోసం  ఏ త్యాగమైనా  చెయ్యాలి !
    తెల్లవారక ముందే  గబగబా లేచి, స్నానాదులు  ముగించి  రెడీ అయిపోయింది దివ్య !
    కావ్య లేచి పళ్ళు తోముకుని  ఒచ్చేసరికి, కాఫీ కప్పుతో  సిద్ధమైంది.
    "ఏమిటే  ఇది ? ఇవాళ  వ్యవహారం  తారుమారైంది. నువ్వు నాకు కాఫీ ఇస్తున్నావా ? అంటే నేను ఆలస్యంగా లేచావా ? నువ్వప్పుడే స్నానం కూడా చేసేసి, ముస్తాబై వున్నావు." గడియారం వైపు చూసింది. అయిదూ,నలభై ! పొద్దున్నే  ముస్తాబయ్యావు, ఎక్కడికి ప్రయాణం ?" నవ్వుతూ అడిగింది.
    "దేముడి గుళ్ళోకి!"
    "ఓ....! ఏమ్మా, ఉన్నట్టుండి దేముడిమీద  అంత  భక్తొచ్చింది. వరాలు కోరుకోవాలా ?"
    "అవును మమ్మీ! ఒక్కటే వరం అడగాలి!"
    "అది ముందే ఇచ్చేశాడు కదమ్మా! నువ్వు కోరుకున్న  రోహిత్ తోటే నీకు పెళ్ళవుతుంది....  ఇంకా...."
    "అమ్మా! నేను వెళ్ళొస్తాను!"
    "సరే వెళ్ళిరా!" అంటూ "నీలో ఈ మార్పు నాకెంతో  సంతోషంగా  వుంది" అంది మెల్లగా !
    కాఫీ తాగుతూ  పేపర్ చదువుతూన్న  వినోద్  దివ్యని  చూసి, కంగారుగా లేచి  నుంచున్నాడు. "ఏమైందమ్మా! పొద్దున్నే వొచ్చావు ? అంతా బాగానే వున్నారా ?" అన్నాడు.     
    దూరం నుంచి అతణ్ణి  చూస్తూ  నడిచొస్తున్న  దివ్యకి, అతను నిజంగానే  దేముడులా  కనిపించాడు. ఆ యిల్లు ఒక దేవాలయంలా  కనిపించింది ! అరవిందుడు  మరో జన్మెత్తి  వినోద్ అంకుల్ గా పుట్టలేదు కదా" అనుకుంది. ఆమె నయనాలు  అశ్రుపూరితాలయ్యాయి ! ఏకధాటిగా  కళ్ళ నుండి కారుతున్న  ఆ అశ్రు ధారను  ఆపలేకపోతోంది  దివ్య !
    "అంకుల్ ! నన్ను క్షమించండి ! నా కన్నీటితో మీ పాదాలను కడిగి, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలని  ఒచ్చాను." అంటూ  అతని పాదాలపై  పడిపోయింది.
    "భుజాలు పట్టుకుని లేవనెత్తాడు వినోద్ ! పిచ్చిపిల్లా ! ఏం జరిగింది ?" అంటూ కుర్చీలో కూర్చోబెట్టాడు. బహుశః కావ్య  అంతా చెప్పేసి వుంటుంది అన్న అనుమానంతో !
    "అంకుల్!" వెక్కిళ్ళతో మాట  సరిగ్గా  రావడంలేదు .కన్నీళ్ళు ఆగడం లేదు!
    ఆమె గుండెలో  చెలరేగుతూన్న  తుఫానుని అర్ధం  చేసుకున్నాడు వినోద్ !
    షణ్ముగాన్ని  పిలిచి  దివ్యకి  కాఫీ  తెమ్మన్నాడు. "ముందు 'రిలాక్స్' అవమ్మా ! టేక్.... ఇట్....ఈజీ !" అంటూ  వీపు రాసి బుజ్జగించాడు.
    షణ్ముగం తెచ్చిన  వేడి కాఫీ కప్పుని  దివ్యకందించి, 'తాగు' అంటూ  దగ్గరనుంచున్నాడు.
    అతని  మాటల్లో  వాత్సల్యం, అతని ప్రవర్తనలోని  మాధుర్యం, అతని హృదయంలోని ఆప్యాయతా  దివ్యని  మరో లోకాల్లోకి  తీసుకుపోతున్నాయి ! అతని మనసే ఒక మందిరంలో  అనిపించింది. అయితే అందులో అతను ప్రతిష్టించుకున్న  దేవతని, తనులాగేసింది ! అయినా ఎంత సహనం! తన పట్ల  ఎంత అభిమానం !" తలుచుకున్న కొద్దీ తన ప్రవర్తనకి  తనకే  సిగ్గువెయ్యడం  కాకుండా, తన హృదయం  కరిగిపోయి కట్టలు తెగిన ప్రవాహంలా, దుఃఖం ముంచుకొస్తోంది !
    "చెప్పు ఏం జరిగిందో ? అమ్మ కోప్పడిందా ?" లాలనగా  అడిగాడు.
    "కాదు !"
    "మరి ?"
    అతని కళ్ళలోకి  చూసింది. అతని నయనాలు  అమృతాన్ని  వర్షిస్తున్నాయి ! ఆ కళ్లల్లో  పితృ వాత్సల్యాన్ని  చూడగలిగింది దివ్య ! మెల్లగా  గొంతు సవరించుకుని, మాటలు కూడగట్టుకుని  అంది, "అంకుల్! పెళ్ళి చేసుకోవాలి!" అని !
    పకపకా నవ్వాడు వినోద్ ! ఆ నవ్వులో వనంలోని పూలన్నీ   విరసినట్టున్నాయి !
    పున్నమి జాబిల్లి  పుట్టి  వెన్నెలనంతా  ఒక్కసారి  విరజిమ్మినట్టయింది.
    "పెళ్ళి  చేసుకోవడానికి  ఇంత  సందేహమెందుకు ? అమ్మ కాదందా ?" అడిగాడు.
    "అమ్మనింకా అడగలేదు"
    "మరి ? కాదంటుందేమోనని  భయం !"
    "అమ్మ నీమాట కాదని  ఎన్నడూ  అనదమ్మా ! ఆమె పంచప్రాణాలూ నువ్వే! నీ శ్రేయస్సే  ఆమె లక్ష్యం !"
    "అంకుల్ ! కానీ  ఈ విషయంలో...."
    "నేనొప్పిస్తాను ! సరేనా ?"
    "ప్రామిస్ ?"
    "ప్రామిస్!" చేతిలో చెయ్యేశాడు.
    "అంకుల్  దైవ సాన్నిధ్యంలో  జరిగే  పెళ్ళికి  ముహూర్తాలు చూడఖ్కర్లేదంటారు! గుళ్ళో పెళ్లయితే, రేపయినా చేసుకోవొచ్చుగా"! వినోద్ నవ్వుతూ "అంత  తొందరగా  వుందా ?"
    "అవును !
    "సరే అయితే ! మమ్మీతో ఒక్కసారి మాట్లాడి"
    "అంకుల్ ! మమ్మీ అన్నింటికీ ఒప్పుకుంది ! ఒక్కసారి మీతో చెప్పి ఏర్పాట్లు చేయించమంది!" అంది కొంటెగా చూస్తు !


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS