ముసుపటిలా దివ్య తల్లితో మాట్లాడలేకపోతోంది !
దివ్య మాట్లాడడం లేదని కావ్య మధనపడి పోతోంది. వీరిద్దరినీ కలపలేక సతమతమయి పోతున్నాడు వినోద్ !
"దివ్యా! నువ్వు మమ్మీతో సరిగ్గా మాట్లాడడం లేదని ఆమె ఎంత బాధపడుతోందో తెలుసా ?"
"నాకేం తెలుసు. మీకు తెలుసు."
"దివ్యా! చదువుకున్నదానివీ ,తెలివైనదానివీ, నువ్విలా మాట్లాడ్డం ధర్మమేనా ? చెప్పు ?"
"అదే తెలివి తేటలు ఎందుకున్నాయా ? అని బాధపడుతున్నాను. ఎందుకు చాడువుకున్నానా ? అని విచారిస్తున్నాను. ఈ రెండూ లేకుండా వుంటే, ఆమె పెట్టింది తిని ఓ మూల పడుండేదాన్ని ! ఆమె ఆటలకి అడ్డుగోడనై నిలిచేదాన్ని కాదు !"
"దివ్యా! నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా ? ఎవ్వరిని దూషిస్తున్నావో తెలుసా ?" అరిచాడు వినోద్ కోపంతో వొణికిపోతూ.
"ఓ....! మీకు పౌరుషం ఒస్తోందే ,నేను మా మమ్మీ గురించి మాట్లాడుతూ వుంటే" హేళనగా అంది.
"ఏ కూతురూ తన తల్లి గురించి అలా మాట్లాడదు."
"ఏ తల్లీ ఎదిగిన బిడ్డని ఇంట్లో పెట్టుకుని, ఇలా బహిరంగంగా ప్రేమ కలాపాలు సాగించదు"
"దివ్యా!" కొట్టాలన్నంత ఆవేశంతో చెయ్యెత్తబోయి, ఆపేశాడు.
"ఓ....అంతదాకా వొచ్చిందా వ్యవహారం ? మిస్టర్ వినోద్! మా అమ్మమీద హక్కు మీరు సంపాదించగలిగారేమో కానీ, నన్ను దూషించే హక్కు కానీ, నాకు నీతులు చెప్పే హక్కుగానీ మీకు లేదు! ఒస్తా!" వెనక్కి తిరిగింది వెళ్ళిపోవడానికి. వెళ్ళకుండా చెయ్యిపట్టుకుని ఆపాడు వినోద్!
ఆ పట్టు విడిపించుకోవడానికి పెనుగులాడింది కావ్య!
"డోంట్....బి....హిస్టీరికల్! చెప్పేది పూర్తిగా విను. మీ అమ్మ ఎవరనుకున్నావ్ ? ఒక దేవత!....ఆమె...." ఏదో చెప్పబోయేలోగా, ఇదంతా లోపలినుంచి వింటూ వెక్కివెక్కి ఏడుస్తూన్న కావ్య పరుగెత్తుకొచ్చి, "వినోద్! ప్లీజ్! నువ్వేమీ మాట్లాడకు! నామీదొట్టే!" అంటూ మాట్లాడకుండా తన చేతిని, అతని నోటికి అడ్డం పెట్టింది.
"కావ్యా! నన్ను చెప్పనీ !" ఆవేశంతో ఊగిపోతున్నాడు వినోద్ !
"నో....ఒద్దు! నన్ను చంపుకుతిన్నంత ఒట్టు !"
"కావ్యా....కావ్యా....కావ్యా...."! తల పట్టుకుని కుర్చీలో కూర్చుండిపోయాడు.
దివ్య విసురుగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి.
గుండెలవిసిపోయేలా, వినోద్ గుండెమీద తల ఆనించి ఏడ్చింది కావ్య!
మెల్లగా తీసుకెళ్ళి మంచంమీద పడుకోబెట్టాడు వినోద్ !
గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి తాగించాడు !
కాస్త ఉపశమనం కలిగింది కావ్యకి !
"కావ్యా! తన్నుమాలిన ధర్మం తప్పని, మన నీతిశాస్త్రాలే బోధిస్తున్నాయ్! నీ కోరికలనీ, నీ జీవితాన్నీ, ఆహుతి చేసుకుంటూ, ఆ పిల్లనలా నెత్తికెక్కించుకోవడం, అవివేకం! త్యాగానికైనా హద్దుండాలి !"
"వినోద్! దివ్యకేదైనా మంచి సంబంధముంటే చెప్పు. పెళ్ళి చేసేస్తే, నా బాధ్యత తీరిపోతుంది."
"హుఁ....! నీమీద అనుమానంతో వున్న మనిషి, నువ్వు తెచ్చిన సంబంధాన్ని చేసుకుంటుందనేనా నీ నమ్మకం!"
"వినోద్ ! నన్నేం చెయ్యమంటావ్ ?"
"అసలు ఆపిల్లకి మొదట్లోనే, నేను చెబ్దామన్నప్పుడు, నిజం చెప్పేస్తే బాగుండేది! అనవసరంగా, మన త్యాగాన్నీ, సహృదయతనీ గుర్తించకుండా, ఆ పిల్ల తన ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ వుంటే, దోషుల్లాగా మనం నోరుమూసుకుని పడుండడం, నాకెంత మాత్రం నచ్చలేదు. నువ్వు చెప్పకపోతే, ఏదో ఒక రోజు నేనే చెప్పేస్తాను ఆ పిల్లతో అన్ని విషయాలూ" అన్నాడు.
"వినోద్! తొందరపడి ఆ పని చెయ్యకు. సమయం చూసి నేనే చెబుతాను. ప్లీజ్!" అంటూ చేతిలో చెయ్యి వేయించుకుంది కావ్య !
కాస్సేపు కూర్చుని, భోంచేసి వెళ్ళాడు వినోద్!
కావ్యా, దివ్యలు మౌనంగా ఎవరి పన్లు వాళ్లు చేసుకుంటూ, నిద్రపోయారు ఇద్దరూ ఏ అర్దరాత్రికో!
ఇద్దరి మనసుల్లోనూ తుఫాను చెలగేరుతోంది !
ఇద్దరూ మౌనంగా బాధపడుతూ వున్నారు.
ఇద్దరి బాధా ఒక్కటే అయితే ఇద్దరి సమస్యలే వేరు.
కాలం గడుస్తోంది. ఎమ్.ఏ. ఫైనల్ పరీక్షలయిపోయాయి. పరీక్షలు బాగానే రాశానంది దివ్య!
కావ్య సంతోషానికి అవధుల్లేవు ! ఎప్పటి నుంచో దివ్యని ఒకప్రశ్న అడగాలనుకుంటోంది కావ్య! అదే దివ్య పెళ్ళి గురించి.
కానీ, పరీక్షలయిపోయినప్పటినుంచీ, ఒకరోజు ఫ్రెండింటికి లంచ్ కనీ ,ఇంకోరోజు ఇంకో ఫ్రెండుతో సినిమాకనీ, మరో రోజు అందరూ కలిసి ఎక్కడికో పిక్నిక్ కనీ, ఇలా తిరుగుతూనే వున్నారు. సాయంత్రం ఇంటికొచ్చి అలిసిపోయి, నాలుగు మెతుకులు తిని నిద్రపోతోంది దివ్య!
నిద్రపోతూన్న దివ్యని గుండెలకి అదుముకుని "ఎంత ఎదిగిపోయిందీ" అనుకుంటూ సంతోషంతో నిద్రపోతుంది కావ్య! "నాకే నీతులు చెప్పేంతగా ఎదిగిపోయింది!" అనుకుని మురిసిపోతుంది!
అంత నిద్దరలోనూ దివ్యకి తెలుసు, తల్లి చెయ్యి వొంటిమీద పడగానే, నిద్దరని ఇంకా కాస్త నటించి, ఆమెకి మరింత దగ్గరగా జరిగి, కౌగిట్లో ఒదిగిపోతూ, కరుచుకుని పడుకుంటుంది !
దివ్య తనని అలా పట్టుకుని పడుకోగానే, ఇద్దరిలోనూ, ఎంతో ఆనందం ,ఎంతో తృప్తి!
"అమ్మని అనవసరంగా అనుమానించి ,అవమానిస్తున్నానేమో! వినోద్ అంకుల్ కేవలం మా మమ్మీకి, ఒక మంచి ఫ్రెండయి వుండొచ్చు కదా! శ్రేయోభిలాషై వుండొచ్చు! నేనే వాళ్ళని అపార్ధం చేసుకుంటున్నానేమో ?"
ఆ ఆలోచన రాగానే, దివ్యకి వొంటిమీద రోమాలు నంచుంటాయ్! మమ్మీని ఏడిపిస్తున్న పాపానికీ, తానెలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ? అంకుల్ ని బాధపెట్టినట్టయితే, ఎలా క్షమాభిక్ష వేడుకోవాలి ? అంటూ తల్లడిల్లిపోతుంది. అంతలోనే, బయట తను వింటూన్న మాటలు గుర్తుకొచ్చి, ఇద్దరి మీదా విపరీతమయిన కోపం వొచ్చి, మాట్లాడ్డం మానేస్తుంది.
కావ్య పరిస్థితీ ఇంచు మించు అంతే! "పిచ్చిపిల్ల! నిజం తెలీక, లోకుల మాటలు విని, బెంబేలెత్తి పోతోంది." అనుకుంటూ తల నిమురుతూ, ముఖం నిండా ముద్దుల వర్షం కురిపిస్తుంది !
అంతలోనే, "ఎంత ఇతరుల మాటలు విన్నా, పుకార్లు విని మనసు పాడయినా, తను చెప్పేది కూడా వినిపించుకోవాలి కదా !"
"పెద్దవారూ అనే మర్యాద కూడా లేకుండా, వినోద్ ని పట్టుకుని ఇష్టం ఒచ్చినట్టు మాట్లాడడం, మర్యాద అవునో కాదో తెలసుకోలేదా ? తన శిక్షణలో నేర్చుకున్నది. అంతేనా ?" అంటూ, ఆవేశంతో ఊగిపోతుంది.
ఏది ఏమైనా, పరీక్షలయి పోయినప్పటి నుంచీ, సరిగ్గా ఇంట్లో వుండడం లేదు. దివ్య !
ఎలాగైనా, ఎంత రాత్రైనా, ఆ రోజు దివ్యని పట్టుకుని మందలించాలను కుంది కావ్య !
పైగా ఈ మధ్య ఎవరితోనో, ఒక అబ్బాయితో ఎక్కువగా తిరుగుతోందని చెప్పాడు వినోద్ !
అందుకని ఆమెలో ఆదూర్దా ఇంకా ఎక్కువైంది !
అతను ఎవరో ఏమిటో, ఆ స్నేహం ఎటువంటిదో, దివ్యని గట్టిగా అడగాలని నిశ్చయించుకుంది !
అందుకనే దివ్య రాగానే 'ఎక్కడి కెళ్ళావ్ ? ఎవరితో వెళ్ళావ్' అంటూ నిలదీసి అడిగింది !
దివ్య చెప్పిన సమాధానాలు ఆమె కోపాన్ని మరింత రెచ్చగొట్టాయి. "నా కథ చెప్తా వింటావా ? రా!" అంటూ లాక్కుపోయి సోఫాలో కూర్చోబెట్టింది !
