Previous Page
నా కథవింటావా పేజి 34


    "అలాగా! అయితే రెడీ!" అంటూ షణ్ముగాన్ని పిలిచి, వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళి, రేపు పెళ్ళుందని, కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యమని చెప్పు!" అన్నాడు.
    "దివ్యా! మరి నీ ఫ్రెండ్సు  అందరూ రావొద్దూ ? వాళ్ళని పిలవాలికదా, భోజనాలకి ఎంతమంది
వస్తారు ?"
    "బాగా కావలసిన వాళ్ళు తప్ప ఎక్కువమంది రారంకుల్ ! అయినా, అలా ఊరందరినీ, పిలవడం, అనవసరం !"
    "కరెక్ట్ మై చైల్డ్ ! నేనూ అలాగే అనుకుంటాను ! దివ్యా ! ఇవ్వాళ నా చరిత్రలో  ఎంతో సుదినం ! నువ్వు  నన్నర్ధం  చేసుకుని నా దగ్గరకొచ్చి ,నాతో మాట్లాడావు!" దివ్యా రేపు పెళ్ళికి, నీకేం కానుక కావాలో చెప్పు !" అన్నాడు ప్రేమగా  దివ్య తల నిమురుతూ !
    "రేపే అడుగుతాను. తప్పకుండా  నేనడిగిన  బహుమతి  నాకివ్వాలి" అంది దివ్య నవ్వుతూ !
    "ఓ....యస్ ! నీ ఇష్టం !" అన్నాడు ధీమాగా.
    యుద్ధంలో గెలిచినంత  సంతోషంగా వుంది  వినోద్ కి, దివ్య తనకి తానుగా వొచ్చి, ఇంత చక్కగా మాట్లాడడం.
    కాస్సేపు కూర్చుని  వెళ్ళిపోయింది దివ్య !
    దివ్య చెప్పినదంతా  విని, తృప్తిగా  నిట్టూర్చాడు రోహిత్. రోహిత్ తల్లిదండ్రులు దివ్యని  ఆమోదించినా, కావ్యపైనున్న  దుష్ప్రచారాన్ని  అంగీకరించలేకపోయారు !
    "నువ్వెళ్ళు  దివ్యా ! మిగలినదంతా  నేను  చూసుకుంటానులే" అన్నాడు రోహిత్ !
    అక్కడి నుంచి  సంతోషంతో  తిరిగొచ్చింది దివ్య !
    పట్టలేని ఆమె సంతోషాన్ని  చూసి  "ఏంటమ్మా ! మహా ఇదై పోతున్నావు ?" అంది.
    చాలా రోజుల తరవాత తల్లి ముఖంలో  సంతోషాన్నీ, తృప్తినీ చూడగలిగింది దివ్య ! పట్టుచీరలో, తలంటి పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటూన్న  తల్లి  ఎంతో  అందంగా  కనిపించింది. యౌవనంలోని  వొంపు సొంపులు పూర్తిగా పోలేదు. మధ్య వయస్కులోని  ఆ అందం, ఏదో కొత్తగా  అనిపించింది దివ్యకి! అయినా  ఏదో లోటు, ఆమె మొహంలో  గమనించింది ! 'అది వుండకూడదు' అనుకుంటూ  నవ్వుకుంది !
    "దేవాలయంలో రేపు అమ్మవారి ప్రతిష్ట జరుగుతుందట  అమ్మా ! ఎంత బాగుందనుకున్నావ్ గుడి !" అంది.
    "ఊఁ ?" అంది నవ్వుతూ !
    ,మర్నాడు  గుళ్ళో మంగళ  వాయిద్యాలు  మ్రోగుతున్నాయి ! శ్రీ వేంకటేశ్వర స్వామివారి  పక్కన  అలివేలుమంగమ్మ  వొయ్యారంగా  నుంచుంది! ఆ ఆది దంపతుల సమక్షంలో  వేద మంత్రాల  మధ్య  కూర్చున్నారు  దివ్యా, రోహిత్ ! వారి వెనకే  నుంచునున్నారు  కావ్యా, వినోద్ లు !
    దివ్య రోహిత్ చెవులో ఏదో చెప్పింది ! రోహిత్  పౌరోహిత్యుని చెవిలో  ఏదో చెప్పాడు. అతను దివ్య చేతికి కుంఖం భరిణ  అందించాడు. దివ్య లేచి  నుంచుని, బోసిగా  వున్న కావ్య నుదుటి మీద బొట్టు పెట్టింది.
    "దివ్యా! ఏం చేశావ్ ?" తుడుచుకోబోయింది కావ్య!
    దివ్య ఆమె చేతిని పట్టుకుని  ఆపింది.
    వినోద్  ఆశ్చర్యంగా  చూశాడు !
    రోహిత్ వినోద్ చెయ్యి  పట్టుకుని, పీటలమీద కూర్చోబెట్టాడు.
    దివ్య, కావ్య చేయి పట్టుకుని  వినోద్ పక్కనే  కూర్చోబెట్టింది.
    హఠాత్తుగా  జరిగిన ఈ సంఘటన షాక్ లోంచి  తేరుకుని.
    "ఏమిటిదంతా ?" అన్నాడు వినోద్ !
    "అంకుల్ ! నిన్న మీరు నాకు పెళ్ళి కానుకగా, నేనేదడిగితే  అది ఇస్తానన్నారు ! ఇప్పుడడుగుతున్నాను ! నాకు నాన్న కావాలి"! అంది.
    వినోద్ ఆశ్చర్యంగా  నోరు తెరిచాడు !
    "అమ్మా ! నా పెళ్ళి శాస్త్రోక్తంగా  చేస్తానని  ప్రామిస్  చేశావు. నాన్న లేకుండా  కన్యాదానం ఎలా చేస్తావమ్మా ?" అంది.     గుడ్లు తేలేసింది కావ్య !
    "ఊఁ....కానివ్వండి" అన్నాడు రోహిత్ !
    భజంత్రీలు మ్రోగాయి !
    మాంగల్యం  తంతునావేనా, మమజీవన  హేతువా" ఊ....లేవండీ తాళి కట్టండీ, అంటూ మంగళసూత్రాన్ని  వినోద్ కి అందించాడు పౌరోహితుడు.
    వినోద్ కంగారుగా  చూశాడు! కావ్య  అయోమయంగా  చూసింది. "కానివ్వండి" అరిచాడు పురోహితుడు.
    కావ్య మెడలో  మూడుముళ్ళూ  వేశాడు  వినోద్.
    నాలుగు హృదయాలూ వర్షించాయి !
    "నాన్నా ! నన్ను మన్నించండి" అంది  దివ్య  వినోద్  చెవిలో  నెమ్మదిగా.
    వినోద్  దివ్య  నుదుటిమీద  ప్రేమగా  ముద్దు  పెట్టుకున్నాడు.
    "ఊఁ.... ఊఁ.... లేవండి  అంటూ" వినోద్ నీ, కావ్యనీ లే నుంచోమన్నారు పురోహితులు.
    మంత్ర  ముగ్దుల్లా  లేచి  నుంచున్నారు  ఇద్దరూ !
    ఆ స్థలంలో  రోహిత్, దివ్యా  కూర్చున్నారు !
    "అయ్యా  పెళ్ళికొడుకుగారూ ! మీరిప్పుడు  కన్యాదానం  చెయ్యాలి" అంటూ వినోద్ కి చెప్పాడు పురోహితుడు.
    కావ్య చెంబుతో   నీళ్ళు  పోస్తూ వుంటే, వినోద్  రోహిత్  కాళ్ళు  కడిగి కన్యాదానం చేశాడు.
    "అమ్మా! నా పెళ్ళి  శాస్త్రోక్తంగా  చేయించినందుకు  థాంక్స్" అంది దివ్య!
    దివ్య  తనకోసం, తన కళంకాన్ని  తుడిచి  పెట్టడానికి  దేవతలు పంపిన  దేవదూతలా  అనిపించింది కావ్యకి !
    రెండు చేతులూ  జోడించి  నమస్కరించబోయింది.
    "కాదు! ఆశీర్వదించాలి !" అన్నాడు వినోద్ !
    కావ్య దివ్యని  కౌగిలించుకుని  మనసారా  ఆశీర్వదించింది !
    వినోద్, రోహిత్ లు కరచాలనం  చేసి  కౌగిలించుకుని, ఒకరిని చూసి  ఒకరు నవ్వుకున్నారు  స్నేహితుల్లా,
    ఆ మామా, అల్లుడూ !
    భోజనాలయ్యాయి !
    "మమ్మీ! ఇంకొక్కటే  మిగిలింది!" అంది.
    "ఏమిటది ?" అంది కంగారుపడుతూ  కావ్య! ఈ రోజున  దివ్య తనకి తల్లి లాగా, తను బిడ్డలాగా  అనిపిస్తోంది కావ్యకి! తను బిడ్డకి పెళ్ళి చెయ్యడం కాదు. బిడ్డే  తనకి పెళ్ళి చేసింది !
    "ఏమీలేదు మమ్మీ! చెప్పానే, దేవాలయంలో అమ్మవారి  ప్రతిష్ట జరుగుతుందని ! మనం అక్కడికి వెళ్ళాలి" అంది.
    "ఓ....పదండి" అంది సంతోషంగా.!
    వినోద్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. పక్కనే  కూర్చుంది కావ్య.
    వెనక సీట్లో కూర్చున్నారు దివ్యా, రోహిత్ లు.
    "అంకుల్ ! మీరు వెనక్కి రండి. నేను డ్రైవ్ చేస్తానన్నాడు రోహిత్ !
    నిజానికి ఆ ఆనందంలో వినోద్  డ్రైవ్  చెయ్యలేకపోతున్నాడు. స్టీరింగ్ వొదిలేసి, వెనక సీట్లో  కూర్చున్నాడు! కావ్యా వెనక్కొచ్చేసింది. దివ్య  ముందుకెళ్ళింది !
    కారు ఆపాడు  రోహిత్ !
    దివ్య దిగి తలుపు తీసింది.
    "ఏమిటీ ? ఇక్కడెందుకు  ఆ పేరు ?" అడిగింది కావ్య !
    "రండి! అంటూ వినోద్ చెయ్యి పట్టుకుని  లోపలికి  నడిపించాడు  రోహిత్ !
    "మమ్మీ ! ఈ దేముడుండే  దేవాలయం ఇదే! ఈ దేవాలయంలో అమ్మవారి ప్రతిష్ట ఈ రోజే!" అంటూ  కావ్యని  చెయ్యి  పట్టుకుని  నడిపించి, వినోద్ పక్కగా  నుంచోబెట్టింది ! గుండెమీద మంగళసూత్రాలు ధగ ధగా మెరుస్తూంటే, సిగ్గుతో తలవంచుకుంది కావ్య!
    షణ్ముగం  భార్య  చేత  వీళ్ళ  నలుగురికీ  దిష్టి తీయించాడు !
    కావ్య కళ్ళనిండా  నీళ్ళే !
    అవి దుఃఖాశ్రువులు  కావు! ఆనంద బాష్పాలు !
    "మమ్మీ టా టా! తరువాత కలుస్తాం" అంటూ రోహిత్ చెయ్యి పట్టుకుని, బయటికి నడిచింది దివ్య !
    "దివ్యా! ఎక్కడికి  వెళుతున్నావ్ ?" అడిగింది అయోమయంగా కావ్య!
    "మనింటికి !"
    "ఉండు ! నేనూ....వొస్తాను!"
    "నో! మమ్మీ!....నువ్వు మీ ఇంట్లో  వుండు! బై.... బై....నాన్నగారూ!" అంటూ ఇద్దరికీ పాదాభివందనం చేసి, ముందు నడిచింది దివ్య !
    "దివ్యా! అంటూ అడుగులు ముందుకు వేస్తున్న  కావ్య చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు వినోద్ !
    తూలి అతని గుండెలమీద వాలిపోయింది  కావ్య!
    పరస్పరా లింగనంలో  తడిసి  ముద్దాయి, ప్రేమస్నానాలు  చేశారు ఇరువురూ !
    దాదాపు  రెండు దశాబ్దాలు  గుండెలో  యిమిడి నలిగిపోతూన్న మమతానురాగాలు, ఒక్కసారి  ఉప్పెనగా  ఉప్పొంగి  బుసలు కొట్టాయి....!
    నిక్షిప్తంగా  అంతరాంతరాల్లో  ఎక్కడో  దాక్కున్న  ప్రేమాగ్ని చల్లారి గడ్డకట్టి  మంచు ముద్దలా  అయిపోయింది యిన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ! ఒక్కసారిగా  ఈ శరీరాల  వెచ్చదనంలో  అది కరిగి, కుంభవృష్టిని  కురిపించింది !
    ఆ అమృత  ధారల్ని  జుర్రుకుంటూ  ఆనందసాగరంలో  ఈదుకుంటూ, తన్మయత్వంలో  తేలిపోయారు కావ్యా వినోద్ లు !
    వీరి కలయిక అమోఘం !
    ఆ  మధుర క్షణాలు  మాటలకందని  ఆణిముత్యాలు !
    ఆ అనుభవం, అరచేతిలో  వున్న  అమృత ఖాండం !
    ఆ బంధం పాలూ, నీరూలా  కలిసిపోయిన  విడదీయలేని అనుబంధం !
    అదే జీవిత పరమార్ధం !
    అదొక  దివ్యమైన  అనుభూతి !
    అద్భుత కావ్యం !
    ఈ కావ్య కథనానికి  అంతులేదు. సాగుతూనే వుంటుంది, సృష్టి జరుగుతూన్నంతవరకూ ! మలయమారుత  సమీరంలా ! మధుమాసపు కోయిల గానంలా !
                                                                   (శుభం)


 Previous Page

WRITERS
PUBLICATIONS