"నేరస్తులు జైలునుండి వస్తూ పెంచుకొన్న రాక్షస బలంతో శిక్ష నిర్ణయించిన న్యాయమూర్తులను పట్టుకొన్న ఎస్సయిలను, శిక్షకు కారకులయిన వారినీ చంపివేసి పగతీర్చుకొన్న ఉదంతాలు చెదురు మదురుగా జరిగాయనుకో! అంతమాత్రాన న్యాయమూర్తులు శిక్ష విధించడం మానలేదు, పోలీసులు పట్టుకోవడం మానలేదు. నేరస్థుడిని పట్టుకోవడమూ జరుగుతుంది. శిక్షించడమూ జరుగుతూంది! నా గురించి నువ్వేం బెంగపడకు. నేను రిస్క్ లో పడ్డానని. నాకెప్పుడో తెలుసు కనుక, మొన్న సిటీ వెళ్ళినప్పుడు మా అంకుల్ దగ్గర ఈ రివాల్వర్ తెచ్చుకొన్నాను! దీనితో మానరక్షణ, ప్రాణరక్షణ చేసుకోవాలన్న నమ్మకం నాకుంది"
సుధ బాగ్ లోంచి తీసిన రివాల్వర్ నల్లనాగులా కనిపించింది శాలినికి. ముఖం భయంతో పాలిపోయినట్టుగా అయింది."సుధా! నువ్వు హంతకురాలివి అవుతావా?"
"ఆటైం వస్తే తప్పించుకోలేను! ప్రాణంపోతే, ముందు ప్రాణాలు తీసి మరీ పోతాను!" నిర్లక్ష్యంగా తల ఎగరవేసి రివాల్వర్ తిరిగి బాగ్ లో పెట్టుకొంది సుధ.
సుధలో ఆవేశం ఎక్కువని శాలినికి తెలుసు. కాని, అది ప్రాణాలను కూడా లెక్కచేయనిదయితే ఎవరు హర్షిస్తారు?
* * * * *
"మన బి. డి. వో గారు రేపు ఫామిలీతో వస్తున్నారు సుధగారూ! ప్రక్కిల్లే అద్దెకు తీసుకొన్నారు!" అని చెప్పారు ఆఫీసులో ఒకరోజు.
అన్నట్లుగానే మరురోజు సాయంకాలం ప్రక్కింటి ముందు సామానుతో లారీ ఆగింది.
లారీ వెంటే కారు వచ్చింది.
సుధ వరండాలో నిలబడి చూస్తూంది.
ముందుగా కారు దిగిన చంద్రకాంత్ భార్య కాబోలు ఆవిణ్ని చిన్న పిల్లలా చేతులమీద ఎత్తుకొని నెమ్మదిగా ఇంట్లోకి తీసికెళ్లాడు.
ఆ వీధిలో గుమ్మాలముందు నిలబడ్డ వాళ్లంతా విచిత్రంగా చూస్తున్నారు.
అదేమిటి? ఆవిడ నడవదా? ఎత్తుకెళ్లాడెందుకు? అనుకొన్నారు గుసగుసగా వాళ్ల గుసగుసలకు జవాబుగా లారీనుండి చక్రాలకుర్చీ దిగింది.
"అయ్యో! పాపం ఆవిడకేమైందో!"
పావుగంటలో లారీలో సామానంతా యింటిలోకి చేరిపోయింది.
సుధ వెళ్లింది. "సర్! నేను మీకేమయినా సాయం చేయగలనా?" అంటూ.
"అంతమాటన్నారు చాలు. మీకు శ్రమొద్దు. ఈ రాత్రి రెస్ట్ తీసుకొన్నానంటే మార్నింగ్ అంతా సర్దుకోగలను" చిరునవ్వుతో అన్నాడు చంద్రకాంత్.
"మీ మిసెస్ ని నాకు పరిచయం చేయరా?"
"కారు జర్నీ అయినా అవిడ బాగా అలసిపోయింది. అందుకే పడుకొమ్మని చెప్పాను" అన్నాడు గుండెలకు దుప్పటికప్పుకు పడుకొన్న భార్యకేసి చూస్తూ.
"వాటికేమిటి సుస్తీ?"
"కారు ఏక్సిండెంట్ లో వెన్నెముక దెబ్బతింది. పోవలసిందే! నా అదృష్టం బ్రతికింది."
"ఇవాళకి మీల్స్ నేను పంపిస్తాను"
"మీ అభిమానంచాలు!ప్యూన్ కారియర్ పట్టుకెళ్లాడు హోటల్ నుండి తీసుకురావడానికి?"
"మీరు చాలా అభిమానస్తులు. ఎవరినుండి పైసా ఎత్తు సహాయం తీసుకోరు. అవునా?"
"అదేంలేదు. ఎవరినీ శ్రమపెట్టడం నాకిష్టం వుండదు."
"ఎంత శ్రమ అయినా మీరొక్కరే మోస్తారన్నమాట."
"చేతనయినంతవరకు నాకు సంబంధించింది నేనే మోయాలని నా అభిలాష"
"వారు నడవలేరా?"
"వెన్నెముఖ నొప్పి. రెండడుగులువేస్తే నొప్పితో గిలగిల్లాడిపోతుంది?" ఆ మాట చెబుతూన్నప్పుడు భార్యపట్ల కరుణరసం ఉప్పొంగినట్టుగా అనిపించింది సుధకు.
