Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 33


    ఆమె మండపం దగ్గరికి వచ్చేవరకూ ఎదురు చూస్తూ గడిపాడు.

    ముందు తనని చూడనట్టే నటించింది అనూష.

    ఆమె సంవత్సరంపాటు కలుసుకోకూడదని ఆంక్ష పెట్టింది.

    ఎంతో బాధ కలిగినా ఆమె పుట్టినరోజున వచ్చి అదే గుడిలో కలుసుకుంటానని చెప్పాడు పరుశురాం.

    అనూష తన క్లాస్ మేట్ అయినా ఆమెతో తొలిసారి పరిచయం అదే దేవాలయంలో జరిగింది.

                                                                            14

    అనూష ముందు పరుశురామ్ ని పలకరించింది. కాలేజీలోగానీ, క్లాసులోగానీ అతనామెతో అంతవరకూ మాట్లాడలేదు.

    గుడి మండపం మీద కూర్చున్న అతని దగ్గరకొచ్చి కూర్చుంటూ--

    "నీకు భక్తి కూడా వుందన్నమాట!" అంది.

    "దేవుడున్నాడనే నమ్మకం నాకు ధైర్యాన్నిస్తుంది" చెప్పాడతను.

    అనూష అతని మాటలకి మనోహరంగా నవ్వింది.

    "ఏమో! ఇక్కడ కూడా పేకాట ఆడుకోడానికి వచ్చావేమో అనుకొన్నాను?"

    "దేవాలయం, దాని పవిత్రత నాకు తెలుసు అనూషా!" అతని మొహం సీరియస్ గా మారిపోవడంతో అనూష తేలికగా నవ్వుతూ---

    "కాలేజీ ప్లే గ్రౌండ్ లో, నేరేడు చెట్టుక్రింద, క్లాసులో ఒంటరిగా కూర్చుని నువ్వొక్కడివే పేకాట ఆడుకోవడం చూశాను. పేకాటని అంతగా అవపోసన పట్టటానికి నువ్వు చేసే ప్రయత్నం చూస్తుంటే నువ్వో పెద్ద గాంబర్లవి అయిపోతావనిపిస్తుంది నాకు" అంది అనూష.

    పరుశురాం ఆమెకేసి నిశితంగా చూశాడు. ఆమె తనని చాలా రోజులుగా గమనించి వుంటుందని గ్రహించాడు.

    "నాకు అలాంటి ఉద్దేశ్యం లేదు" అన్నాడు.

    "మరి అంత ఏకాగ్రతతో ఎందుకు ఆడుకుంటావు?" అడిగింది అనూష.

    ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం అతనికిష్టం లేదు.

    "నాకు స్నేహితులు లేరు. ఒంటరితనం నుంచి నన్ను నేను ఆ విధంగా ఎంగేజ్ చేసుకొంటాను" అన్నాడు.

    ఆ సమాధానం ఆమెకి నచ్చలేదు.

    "నన్ను నీ స్నేహితురాలిగా ఎంచుకోవచ్చు!" అంది అతనికేసి కళ్ళార్పకుండా చూస్తూ--

    పరుశురామ్ వెంటనే అన్నాడు.

    "ఆడపిల్లతో స్నేహమేమిటి?"

    "ఆడపిల్లలు స్నేహం చేయడానికి పనికిరారా? అసలు స్నేహం అంటే ఆడపిల్లలతోనే చేయాలి!"

    అతను మాట్లాడలేదు.

    ఆమె అతని చేతికి కొబ్బరి చిప్పని ఇచ్చింది.

    అతను ఆ చిప్పని అటూ ఇటూ తిప్పి చూసి రెండు చేతులతో పట్టుకుని కొరికాడు. అనూష చిరుకోపంతో అంది.

    "కోతి బుద్ధి పోనిచ్చుకొన్నావు కాదు. కొబ్బరి చిప్పని నువ్వు కోతిలా కొరుక్కు తినడానికి కాదు ఇచ్చింది. దాన్ని కొట్టి ప్రసాదం ఇద్దరం తినడానికి" అని తిరిగి అతని చేతిలోంచి చిప్పని తీసుకుని నేలపైన కొట్టి అతనికి ఓ ముక్క ఇచ్చి, అతను కొరికిన వైపు కొబ్బరి మానుని తను నోట్లో పెట్టుకుంది అనూష.

    పరుశురామ్ అప్రయత్నంగా ఆమె చేతిని పట్టుకుని---

    "అది నేను ఎంగిలి చేసింది" అన్నాడు కంగారుగా. అతని చేతినించి తన చేతిని విడిపించుకొనే ప్రయత్నం ఏదీ చేయలేదామె.

    అనూష కళ్ళతోనే నవ్వింది.

    "అందుకే అది నేను తీసుకున్నాను. ఇప్పుడు చెప్పు నేను నీ స్నేహితురాలిగా పనికి వస్తానా?" అంది.

    అతని కళ్ళు మెరిశాయి. ఆమెకి తనంటే ఎంత ఇష్టం వుంటే అలా తన ఎంగిలి తింటుంది?

    "ఏమిటలా చూస్తున్నావ్?" అడిగింది.

    "ఇది నిజమా" అడిగాడు.

    ఆమె అటూ ఇటూ చూసి "నిజమే!" అంది.

    "ఇదే మన తొలి పరిచయం!"

    అనూష అతని చేతిపైన నాజూకైన తన హస్తంతో నిమిరింది.

    "నీకు నాతో తొలి పరిచయం కావచ్చు. కానీ నాకు నీతో చాలా రోజులుగా పరిచయం వుంది. నీ చర్యల్ని జాగ్రత్తగా గమనిస్తూ నీ పట్ల ఆకర్షణలో నా మనసులో నాకో స్థానాన్ని ఎప్పుడో ఇచ్చేశాను" అంది అనూష తలొంచుకుని.

    తొలి పరిచయంలో ఓ అందమైన అమ్మాయి మనసు విప్పి అలా మాట్లాడుతుంటే ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు పరుశురాం.

    అనూష స్నేహం తనకు దొరుకుతుందని అతను కలలో కూడా ఊహించలేదు. ఆమె సబ్ కలెక్టర్ గారమ్మాయి. ఆమె కొంటె చూపు కోసం కాలేజీ స్టూడెంట్స్, కొందరు కుర్ర లెక్చరర్స్ వెర్రిగా ఎదురు చూస్తుంటారు.

    లేబరేటరీలో డిమాన్ స్ట్రేటర్స్ ఆమె బల్ల దగ్గర కూర్చునే డిమాన్ స్ట్రేషన్ చేసి చూపిస్తారు.

    అనూష తనలాగే తాను తనతో పరిచయం చేసుకోవడంతో అతనిలో కొత్త ఊపిరి పుట్టింది. స్ఫూర్తి కలిగింది.

    "రామ్!"

    ఆ పిలుపుకి ఉలిక్కిపడ్డాడు పరుశురామ్.

    ఆమె కెళ్ళెత్తి అతనికేసి చూసింది.

    "రామ్!" మళ్ళీ పిలిచింది.

    ఆమె అలా పిలుస్తుంటే ఎంతో ఆనందంగా వుందతనికి.

    "రామ్! ఎంత మధురంగా పిలుస్తోంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS