Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 32

   
    "అంటే అప్పటికే నీ బుర్రని పురుగులు తొలుస్తూ  వుండాలి. సరస్వతి ఇంటికి వెళ్ళడానికి నిశ్చయించుకొని వుండాలి." అంది ఉక్రోషంగా.

    "న్నో న్నో న్నో" అరిచాడు.

    " అరవకు పరుశురాం. ఇది రోడ్డు. లేకపోతే నేను సీషోర్ కివెళ్దాం రమ్మని అడిగితే మీ మామయ్య ఏదో పని చెప్పాడని నాతో అబద్ధం చెప్పవలసిన అవసరం నీకు  లేదు."

    పరశురాం దోషిలా తల దించుకున్నాడు.

    "సరస్వతి పుస్తకం కావాలని  అడిగింది.సాయంత్రం ఇంటికి తెచ్చి స్తానని చెప్పాను. అందుకని వెళ్ళాను."

    అనూష నవ్వింది. ఆ నవ్వులో అతనంటే ఎక్కడలేని అసహ్యం కనిపించింది.

    "మామయ్య చెప్పిన పని మానేసి సరస్వతి ఇంటికి వెళ్ళానంటావు?"

    "సరస్వతి ఇంటికి వెళుతున్నానని  చెపితే నీకు కోపం వస్తుందని నీకలా చెప్పాను" మెల్లగా అన్నాడు.

    "నువ్వు కల్పనవెంత  రంగు పులుముతున్నావో అర్థం అవుతోంది. రామ్. తోటి క్లాస్ మేట్ ఇంటికి నువ్వెళ్లితే  నేను ఎందుకు వద్దంటాను. ఆ విషయాన్ని దాయడంలోనే నీ ప్లాన్ అర్థం అవుతోంది నాకు."

    "అనూ!" పిచ్చిగా అరవాలనిపించిందతనికి.

    "అవును రామ్! పుస్తకం కావాలని ఆమె అడిగితే ఇచ్చి రావడానికి ఎంత సేపు పడుతుంది. నీకు నిజంగా  ఏ విధమైన దుర్భుద్ధి లేకపోతే పుస్తకం ఇచ్చి వెంటనే దగ్గరను వచ్చేవాడివి. నాకు వేరే ఏదో పనుందనీ రానని చెప్పడం చూస్తే జరిగింది యదార్థం అని నేను నమ్మడంలో తప్పులేదు కదూ!"

    "నీకెలా చెబితే నమ్ముతావో తెలీడంలేదు  అనూ!

    నన్ను సరస్వతి ప్రాక్టికల్ నోట్స్ అడిగిన మాట నిజం. నా దగ్గర లేదని చెబితే సాయంత్రం ఇంటికి తెచ్చివ్వమని అడిగింది. టీకి ఇన్త్వైట్ చేసింది. అక్కడికి వెళ్ళాక ఆలస్యం అవుతుందనే నీకు అలా చెప్పాను" అన్నాడు పరుశురాం.

    అనూష పెదవులపై విషాదమైన నవ్వు కదిలింది.

    "తప్పుని కప్పిపుచ్చుకోవడానికి  ఎంత సిల్లీగా కథ అల్లుతున్నావో తెలుసా రామ్!"

    ఎక్కడలేని విరక్తి ఆమె మాటల్లో ధ్వనించింది.

    "నువ్వే నన్ను మోసం చేస్తే నేనింకెవర్ని నమ్మను?"

    అనే వైరాగ్యం ఆమెలో కనిపిస్తోంది.

    పరుశురాంకి తన పరిస్థితి ఏమిటో పూర్తిగా అర్థం అయ్యింది.

    ప్రియురాలినే కన్విన్స్ చేయలేని తను న్యాయస్థానం ఎదుట తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలడా?

    ఆమె అంతరాంతరాల్లో ఇప్పుడు తనకి గల స్థానం ఏమిటో తెలుసుకున్నాడు.

     ద్వేషిస్తే పరవాలేదు.

     కానీ అసహ్యించుకుంటేనే భరించలేడు.

    తనని అరెస్ట్ చేశారని తెలసేక కాలేజీ నుంచి ఏ ఒక్క స్నేహితుడు వచ్చి పలకరించలేదు. ఆఖరికి మేనమామ కూడా రాలేదు. తనని విడిపించుకెళ్ళవలసి రక్త సంబంధీకుడు ఆయనే వదులుకున్నాడు.

     అనూష వచ్చిందని  సంతోషించాడేగానీ ఆమె మనసులో తను దోషి గానే మిగిలాడు. అయితే అతనికి ఒక్కటే అర్థం కాలేదు.

    ఆమె తనని బెయిల్ పైన ఎందుకు విడుదల చేయించినట్టు?

    "నువ్వు నాకు బెయిల్ ఇవ్వకుండా వుండాల్సింది అనూ!" లేకపోతే పోలీసు దెబ్బల్తో చచ్చిపోయేవాడిని." అన్నాడు జాలిగా పరుశురాం.

    ఆమె మొహం ఎర్రగా కందిపోయింది.

    పెదిమలు అదురుతున్నాయి. ముక్కుపుటాలు ఎగిరెగిరి పడుతున్నాయి.

    "నిన్నెవరూ పట్టించుకోకుండా నీ మానాన నిన్ను విడిచిపెట్టేశారు. ఆఖరికీ నీమేనమామ కూడా."?

    కానీ నేను అలా ఊరుకోలేకపోయాను.

    అందరిలా నేనూ మొహం చాటేస్తేనా ప్రేమకి అర్థం ఏముంది రామ్."

    ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. పరుశురాం క్షణంపాటు కళ్ళు మూసుకున్నాడు.

    "అయితే నువ్వు నన్నింకా ప్రేమిస్తున్నావా అనూ!"అడిగాడు పరుశురాం ఆర్తితో.

    కళ్ళెత్తి అతనికేసి అరక్షణం పాటు చూసింది.

    దెబ్బతిన్న నాగులా వుందామె చూపు.

     "అదే నాకు తెలీడం లేదు" అని బ్యాగ్ లోంచి పేకని తీసి అతనికి అందిస్తూ-

    " నాల్రో జుల క్రితం వీటిని నా  బ్యాగ్ లో పెట్టావు" అంది.

    పరుశురాం పేకముక్కల్ని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు.

    ఆమె జీపులో కూర్చుంది.

     "వెళ్ళిపోతున్నావా?" అడిగాడు  దిగులుగా.

    "అవును" ముక్తసరిగా ఎటో చూస్తూ అంది అనూష.

    "నేనూ వస్తాను" చిన్న పిల్లాడిలా అడిగాడు.

    "డ్రయివర్ జీపు పోనియ్!"అంది అనూష.

    షాక్ తిన్నట్లు నిలబడిపోయాడు. జీపులో ఆమె వెళ్ళి పోయింది.

    పరుశురాం విషాదంగా  చూస్తూ నిలబడిపోయాడు.

    ఆవేశంలోనూ,ఉక్రోషంలోనూ వున్న అనూష ఇప్పుడు తనేం చెప్పినా వినే స్థితిలో లేదు.

     ఆరోజు శనివారం.

     ఆమె నాగేంద్రస్వామి గుడికి వస్తుంది.

     సాయంత్రం గుడిలో ఆమెని కలుసుకోడానికి నిశ్చయించుకున్నాడు పరుశురాం.

     అనుకున్నట్లుగానే ఆమెని అదే రోజు సాయంత్రం కలిశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS