Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 32


                                                    కలియుగ సీత


    ఆదరా బాదరా స్టేషను కి చేరిన జానకి - రైలు గంటన్నర లేటని తెలియగానే హతశురాలైంది. ఒక గంటన్నర ప్లాటు ఫారం మీద గడపడం అంటే - అందులో ఈ పరిస్థితిలో , ఎంత ఇబ్బందో గుర్తు రాగానే, ఆమెకి నీరసం ముంచుకు వచ్చింది. తెల్సిన వాళ్ళేవరన్నా కనిపిస్తే అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పడం ఎంత కష్టం? ఎక్కడికి ప్రయాణం- మీరొక్కరేనా- మీవరేరి - వగైరా వగైరా ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఎంత చిరాకు? కాని తప్పదు. జానకి చిరాగ్గా ప్లాట్ ఫారం బెంచి మీద కూలబడింది. తెలిసిన వాళ్ళెవరూ కనపడకూడదని దేముళ్ళకి మొక్కునో, ఫెమీనా వెనకాతల మొహం చాటు చేసుకుంది.
    ఆ దేముడు జానకి మొర అలకించలేదు. ముఖ్యంగా ఎవరి కంటయితే పడకూడదనుకుందో ఆ వ్యక్తీ చూడనే చూశాడు.
    దూరం నించి జానకిని చూసి, పెద్ద పెద్ద అంగలేసుకుంటూ నడిచి వచ్చేశాడు. సుధాకర్ . "హలో ....హలో....ఏమిటిది. హటాత్తుగా ఎక్కడికీ ప్రయాణం?" హడావుడిగా దగ్గరికి వచ్చి పలకరించాడు. జానకి తలెత్తి బలవంతంగా నవ్వింది. "ఏమిటంత హటాత్తుగా బయలుదేరారు. ఎక్కడికి - ఎందుకు - క్విక్ జవాబు చెప్పండి " జానకి పక్కన సూట్ కేస్ , బాస్కెట్టు చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు. "అరె, ఏమిటలా వున్నారు. ఎవరికైనా వంట్లో బాగులేదా?' జానకి నించి జవాబు రాకుండానే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు.
    "ఊరికేడుతున్నాను. అమ్మకి వంట్లో బాగులేదు. టెలిగ్రాం వచ్చింది" పొడిగా అంది జానకి.
    "అరె, ఎప్పుడు - ఏడు గంటల వరకు అక్కడనే వున్నాగా - తరువాత వచ్చిందా - ఆదుర్దాగా అడుగుతూ 'రామం ఎడి?' చుట్టూ చూస్తూ అడిగాడు.
    జానకి మొహం తిప్పుకుంటూ "రాలేదు ' అంది. సుధాకర్ ఆశ్చర్యంగా చూచాడు.
    'అదేమిటి?" రాకపోవడం ఏమిటి?"
    "ఏం? ఆయనగారు వచ్చి రైలేక్కిస్తే గాని ఎక్కలేననా నీ ఉద్దేశం!"
    "అదికాదు -అదికాదు - మీరు వూరికి వేడ్తుంటే - అందులో రాత్రి ట్రైన్ , వచ్చి రైలెక్కించకుండా ఏం చేస్తున్నాడు. అంత రాచకార్యం ఏం వెలగబెడ్తున్నాడు?' సుధాకర్ అపనమ్మకంగా అడిగాడు.
    "ఏమో, మీ మగ మహారాజులకే పని వుంటుందో మాకేం తెలుస్తుంది?' జానకి నవ్వింది. ఆ నవ్వు పేలవంగా వుందని , ఆమె ఎంత నవ్వినా ఆమె కళ్ళల్లో విషాదపు నీడలు, ఆమె మాటల్లో ఓ రకం విరక్తి సుధాకర్ పట్టేశాడు. ఆమె వంక పట్టిపట్టి చూస్తూ "ఏం జరిగింది వదిన గారూ - నిజం చెప్పండి" అన్నాడు.
    "బలేవాడివే , ఏం జరుగుతుంది?"
    "కాదు మీరు అబద్దం ఆడినా మీ మొహం అబద్దం ఆడదు. నిజంగా మీ అమ్మగారికి వంట్లో బాగులేక వూరు వేడ్తుంటే , రామం కనీసం రైలెక్కించడానికైనా రాలేదంటే నేను నమ్మను కనక నిజం చెప్పండి.' సూటిగా అడిగాడు జానకి జవాబివ్వకుండా మొహం తిప్పుకుంది. ఆమె మౌనం అతనికి అర్ధమైంది.
    'ఓహో....ప్రణయకలహమా - వాడితో దెబ్బలాడి , అలిగి, పుట్టింటికి పారిపోతున్నారన్నమాట!" వేళాకోళంగా అన్నాడు సుధాకర్. జానకి చివ్వున రోషంగా తలెత్తింది. "పారిపోవడం లేదు, వెళ్ళగొట్టబడ్డాను" అంది కటువుగా . సుధాకర్ తెల్లబోయాడు. "ఏమిటి మీరంటున్నది?"
    "ఆ అవును చదువుకున్నవారు, సంస్కారులు , అభ్యుదయ వాదులు అయిన మీ ఫ్రెండు గారు - అదే నా భర్త గారి చేత ఇంట్లోంచి వెళ్ళగొట్టబడ్డాను. ఏం ఇంకా నమ్మలేవా?' ఆవేశంగా అంది జానకి. సుధాకర్ మొహం పాలిపోయింది. కలవరంగా చూచాడు. "హాస్యం ఆడుతున్నారా - నిజమా ఇది?' అపనమ్మకంగా అన్నాడు.
    "హాస్యం - రాత్రి పనిగట్టుకుని రైల్వే ప్లాటు ఫారం మీద నీతో హాస్యాలాడడానికి రాలేదు" జానకి తీవ్రంగా అంది. సుధాకర్ మొహం నల్లబడింది. నిలబడే శక్తి లేనివాడిలా ఆమె పక్కన కూలబడ్డాడు. "నాకేం అర్ధం అవడం లేదు. సరిగా చెప్పండి వదినగారూ!"
    'చెప్పడానికి ఏముంది సుధాకర్. మీ మగవాళ్ళు అనుమానానికి, అహంకారానికి మీ మగవాళ్ళ జులుంకి , ఎన్ని యుగాలు గడిచినా మేము తల వగ్గాల్సిందే గదా! అలనాటి సీత మొదలు ఈనాటి జానకి వరకు ఇది తప్పలేదు" జానకి మొహం ఎర్ర్రబడింది. ఆమె కళ్ళలో నీరు తిరిగింది. సుధాకర్ చప్పున ఆదుర్దాగా అటు ఇటు చూచాడు.
    "వదినగారూ ప్లీజ్ ఇంటికి పదండి రామం ఏదో కోపంతో తొందరపడి ఏదో అని వుంటాడు. ఆమాత్రం దానికోసం మీరూ ఇంత తొందరపడడం బాగులేదు. ప్లీజ్ రండి - నేను తీసుకు వెడతాను. వాడిని చివాట్లు పెడతాను" జానకి విసురుగా తల తిప్పింది. "ఈ మాత్రం - అంటే ఏమాత్రం అని నీ ఉద్దేశం?' జానకి గొంతులో కరకుదనానికి , ఆమె కళ్ళల్లో కోపానికి బిత్తరపోయాడు సుధాకర్. ప్లాట్ ఫారం ఎంతసందడిగా వున్నా - జనం ఎవరి గోలలో ఎవరున్నా జానకి గొంతులో తీవ్రత కొందరిని ఆకర్షించి, తలలు తిప్పి వింతగా చూశారు. జానకి చప్పున సిగ్గుపడి తలదించుకుంది. ఆవేశాన్ని బలవంతంగా దిగమింగింది. సుధాకర్ ఏం మాట్లాడాలో తెలియనివాడిలా కూర్చుండిపోయాడు. పరిస్థితి తనూహించిన దానికంటే సీరియస్ గానే వుందనిపించింది కాని - కాని ,ఎంత స్నేహితుడైనా వారి స్వంత విషయాలలో తనెలా కలుగజేసుకోగలడు . అలా అని పట్టనట్టు మాత్రం ఎలా వూరుకోడం? రామంతో స్నేహం ఈనాటిదా? జానకితో మాత్రం ఆమె పెళ్ళయి వచ్చిన దగ్గిర నుంచి స్వంత వదినగారిలా గౌరవించాడు. అభిమానించాడు. అలాంటిది చూస్తూ , తెలిసి కూడా తనని కాదన్నట్టు ఎలా వూరుకోగలడు? ఇద్దరి మధ్య అసలేం జరిగింది? జానకి స్థిమితపడడానికి ఒక నిమిషం టైమిచ్చి , గొంతు తగ్గించి 'అసలేం జరిగిందో సరిగా చెపుతారా వదినగారూ ' స్థిరంగా అడిగాడు.
    'సుధాకర్ ప్లీజ్ ఆ విషయం వదిలేయి ప్రస్తుతం నేను మా యింటికి వెడుతున్నాను. తరువాత - తరువాత్ ఏదో ఆ మాత్రం ఉద్యోగం దొరక్కపోదు. ఆ మాత్రం నా బతుకు నేను బతకగలనని నమ్మకం వుంది" జానకి బికంగా అంది.
    'నన్నింకా చంపవద్దు. అసలేం జరిగిందో చెపుతారా. ఇంటికి వెళ్ళి రామాన్ని అడిగి రమ్మంటారా. రైలుకి ఇంకా గంట  టైముంది ."
    "హు ....చెపితే భరించలేవు సుధాకర్. అర్ధమయిందా . ఇంకా నన్ను రెచ్చగోట్టకు. అయినా అయినవారే కాదన్నప్పుడు నీకెందుకి తాపత్రయం. సుధాకర్! అనవసరంగా మా మధ్యకు రాకు నా దారిన నన్ను పోనీ, నా ఖర్మ గాకపోతే ఈ రైలు అలా ఆలశ్యం అవాలా. పిల్చినట్టు వేళకి నీవు రావాలా" విసుగ్గా అంది జానకి.
    సుధాకర్ "సరే చెప్పకండి. నేను వెడుతున్నాను. వాడ్ని నాలుగు తగిలించి యీడ్చుకు వస్తాను"
    "వెళ్ళు నా మీద చల్లిన పెడ నీళ్ళు యింకా మిగిలే వుంటాయి నీవూ చల్లించుకో." 'ఫరవాలేదు మీ కోసం ఆమాత్రం సహించగలను.' అతని అభిమానానికి జానకి చలించింది. 'సరే చెప్పమన్నావా -౦ నేను యింట్లోంచి వెళ్ళవలసి వచ్చిన కారణం ఏమిటో తెలుసా - నీవే!" జానకి ఒక్కొక్కమాట వత్తి పలికింది . సుధాకర్ చకితుడయ్యాడు. "నేనా" అయోమయంగా చూశాడు. 'ఆ....మనిద్దరి మధ్య ఏదో వుందని అయన అనుమానం. ఏం ఇంకా విడమర్చి చెప్పాలా?' సుధాకర్ దిమ్మెరపోయాడు. ఒక్కక్షణం మాట్లాడలేక పోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS