Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 33

 


            అభినవ మనువు అంబేద్కర్


    
    ఈ రోజు ఎంతో సుదినం. మానవజాతి చరిత్రలో చిరస్మరణీయులైన మహామహుల కోవలకు చెందిన ఒక మహనీయమూర్తి డా|| అంబేద్కర్ గారు అవతరించిన మహత్తర దినం ఈనాడు.
    భారతీయ సమాజానికి తీరని కళంకం అంటరానితనం అని పూజ్య బాపూజీ ఏనాడో ప్రవచించిన విషయం అందరికీ విదితమే. అస్పృశ్యత వంటి ఘోరమైన సాంఘిక దురాచారాన్ని రూపుమాపడం, అట్టడుగుణ పడి అజ్ఞానంలో, దారిద్ర్యంలో, అంధకారంలో అలమటిస్తున్న అసంఖ్యాక దళిత జనావళిని ఆదుకోడానికి, వారి అభ్యున్నతికి కృషి చేయడానికి అవతరించిన పవిత్ర మూర్తి బాబా సాహెబ్ అంబేద్కర్ అంటే అతిశయోక్తి లేదు. తాను చిన్నతనం నుండి ఏ బాధలకు, ఏ అవమానాలకు, ఏ అలక్షానికి గురియై, ఏ సాంఘిక అసమానతలకు వ్యతిరేకింగా పోరాడుతూ స్వశక్తివల్ల, స్వయం ప్రతిభవల్ల పైకి వచ్చారో, ఆ అసమానతలను, ఆ అవమానాలను, ఆ సాంఘిక దురాచారాలను తన తుది శ్వాసవరకు ప్రతి ఘటిస్తూనే వున్నారు బాబా సాహెబ్. ఆయన అచంచలమైన దీక్ష, పట్టుదల మనకు ఆదర్శం కావాలి. ఆయన ఏ ఆశయాలకై తన జీవితాన్ని ధారపోశారో ఆ ఆశయాలు మనకు మార్గదర్శకాలు కావాలి. తరాలు గడచినా తలరాత మారలేదన్నట్లు మనం 20వ శతాబ్దపు చివరి భాగంలో వున్నా, ఎంతో శాస్త్రీయమైన అభివృద్ధిని సాధించినా మనం మనిషికీ మనిషికీ మధ్య గీసుకొన్న గళ్ళు చెదరిపోలేదు. మనం పెంచుకున్న బ్రహ్మజముడు ముళ్ళదళ్లు చెదరిపోలేదు. మన సమాజాన్ని పీల్చి పిప్పిచేస్తూ అనైక్యతకు దారి తీస్తూ, పరస్పర విద్వేషాలకు, అనుమానాలకు, అసూయలకు అవకాశం యిస్తూ వున్న విషవృక్షం కుల వ్యవస్థను సమూలంగా పెకలించి వేయవలసిన అవసరాన్ని గురించి బాబా సాహెబ్ నిరంతరం బోధిస్తూనే వున్నారు. మనిషి చంద్రమండలంలోకి అడుగు పెట్టగలిగాడు.ఒక భారతీయుడు అంతరిక్షంలోకి ఎగిరి మన దేశ పతాకను వ్యోమపథంలో ఎగురవేయ గలిగాడని మనం ఎంతో గర్వపడుతున్నాం. అయినా మన మధ్యనే వున్న అంతరాలను చెరిపివేయలేక, అడ్డు గోడలను పడగొట్టలేకపోతున్నాం. ఈ విషయంలో విద్యావంతులైన వారంతా ముందు వచ్చి సమాజంలో చైతన్య కాంతులు ప్రజ్వరింప జేయాలి. కాలం చెల్లిన పాత సాంప్రదాయాలకు, ఆచారాలకు సాంఘిక బంధాలకు స్వస్తి చెప్పాలి. ఆనాడే అంబేద్కర్ వంటి మహనీయులకు మనం నిజమైన భక్త్యంజలి అర్పించగలుగుతాం. అదే వారికీ నిజమైన నివాళి అని మనవి చేస్తున్నాను.
    తరతరాలుగా కాలం చెల్లిన కర్మ సిద్దాంతం పేరుతో సాంఘికంగా ఘోరమైన అన్యాయాలకు, అవమానాలకు గురవుతూ, ఆర్దికంగా దుర్భర దారిద్ర్యం అనుభవిస్తూ కాలం గడుపుతున్న కోట్లాది షెడ్యూల్డు కులాల సోదరీ సోదరులకు నూతన జీవితం ప్రసాదించడానికి, వారి రాజ్యాంగం ప్రసాదిస్తున్న సమాన హక్కులు వాస్తవంగా వారికి లభింపజేయడానికి మనమందరం నడుంకట్టుకోవాలి. డా|| అంబేద్కర్ కృషి కారణం గానే మన రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన అధ్యాయం 'ఫండమెంటల్ రైట్స్' సంబంధించింది చేర్చబడిందన్న సంగతి మనం మరువరాదు. ఆ మహనీయుని నిరంతరం కృషి వల్లనే సర్వ పౌరజన సమానత్వం ప్రాతిపదికగా సంక్షేమ రాజ్యస్థాపనకు పునాది వేయబడిందని మనం విస్మరించరాదు. అ మహా సంస్కర్తపూనిక వల్లనే హిందూ ధర్మశాస్త్ర క్రోడీకరణ సంస్కరణ సాధ్యమయ్యాయి. ఆయన కలలుకన్న సంక్షేమ రాజ్యాన్ని స్థాపించుకొన్న నాడే అంబేద్కర్ వంటి మహనీయుని కలలు నిజంచేయగలుగుతాం. ఆ దిశగా మనమందరం నిరంతరం ప్రయాణం సాగించాలని మనవి చేస్తున్నాను.
    బాబా సాహెబ్ వంటి మహనీయులు ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క ప్రాంతానికో, ఆ మాటకు వస్తే ఏ ఒక్క దేశానికో చెందినట్లు భావించి అది సంకుచితత్వం అవుతుందని మనవి చేస్తున్నాను. డా|| అంబేద్కర్ వంటివారు సర్వ మానవాళికి విశ్వజనీనులైన ఆదర్శమూర్తులు.ఆశయం సర్వమానవ శిరోధార్యం. ఈ శుభ సందర్భంలో ఆ మహనీయుని ఆశయాల సాధనకు మన మందరం పునరంకితం అవుదాం. అందుకు దీక్షతో కృషి కొనసాగిద్దాం.
    
           బాబాసాహెబ్ డా|| భీమారావు అంబేద్కర్ 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో 1984 ఏప్రిల్ 14న

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS