Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 34

 


                ఆకాంక్ష


    
    శాతవాహనుల నాడే అలల తలదన్ని వెలిగింది తెలుగు తేజం. కాకతీయుల కరవాలాల ఖణఖణలలో దిగ్దిగంతాల నినదించింది తెలుగుశౌర్యం. విజయనగర రాజవీధులలో రతనాలు రాసులు పోసి వ్యాపారం సాగించింది తెలుగు వైభవం.
    గాసట బీసటే చదివి గాథలు త్రవ్వు తెనుంగు వారికి తొలి కావ్యాన్ని అందించడానికి ఆంధ్రమహాభారత సంహిత రచన బంధురుడయినాడు ఆనాడు ఆదికవి నన్నయ్య. ఆ మహనీయుని ప్రయత్నాన్ని సాఫల్యం చేస్తూ మహాభారతాన్ని రాజనీతి శాస్త్రంగా, నవరస మధు మందాకినిగా మలచాడు కవి బ్రహ్మన్న తిక్కన. కావ్య సరస్వతిని కాసుకోసం కక్కుర్తి పడి అమ్ముకోనని బాస చేసి భగవదర్పితంగా భాగవతాన్ని తెనింగించాడు భక్త పోతన. 'దేశభాషలందు తెలుగు లెస్స'ని చాటి అపూర్వ రసబంధుర కావ్యం ఆముక్తమాల్యదను అందించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఆటవెలదులలో తేట తెలుగులో అనేక జీవిత సత్యాలను ప్రకటించాడు అలనాడే మన వేమన.
    త్యాగయ్య సుమధుర సంగీత వేదికా నాదాలు, క్షేత్రయ్య సులలిత మొవ్వ గోపాల శృంగార భక్తి పదాలు, అన్నమయ్య అనన్య సామాన్య భక్తి భావనా గీతికలు, అభినవ నటరాజు సిద్దేంద్రుని అభినయ భంగిమలకు తాళం వేసిన కూచిపూడి భాగవాతుల మంజుల మంజీర విన్యాసాలు, అమరావతి, లేపాక్షి, రామప్ప అది దేవాలయాల అద్బుత శిల్ప విన్యాసాలు, అజంతా గుహలలో అపురూప చిత్రాల నావిష్కరించిన తెలుగు చిత్రకారుల తూలికా విలాసాలు పుణికి పుచ్చుకున్న పునీతమైన జీవగడ్డ - తెలుగునాడు.
    ఆ మహత్తర సంస్కృతీ సంపదకు మనం వారసులం. తేట పదాలతో, తేనియలొలుకుతూ తియ్యదనాలు చిందే తెలుగు వెలుగులతో దశదిశలను ప్రకాశమానం చేయడానికి తెలుగుమహాసభలు దోహదం చేయగలవన్న ఆశాభావం నాకుంది. మన పూర్వ వైభవాన్ని కన్నులకు కట్టేలా ప్రదర్శించి, తెలుగు వారందరికి స్ఫూర్తి అందించిన వారందరినీ ఆత్మీయతలో, ఆప్యాయతతో, ప్రేమానుబంధంతో సమైక్యపరచి, ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా రూపొందే బృహత్ ప్రయత్నంలో తెలుగు మహాసభలు విశిష్టమైన పాత్ర వహిస్తాయన్న విశ్వాసం నాకుంది.
    ఈసారి తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న చెన్నపట్టణంలో తెలుగు వారికి గల చిరస్మరణీయ మధురానుబంధం సర్వజన విదితమే. ఆంధ్రకేసరి ప్రకాశం బ్రిటీషు తుపాకి గుండ్లకు రొమ్ము ఒడ్డి నిలచింది మద్రాసు నడి బొడ్డులోనే. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగం చేసింది చెన్నపట్టణంలోనే. తెలుగు సారస్వత సముద్రంలో నిగూఢంగా దాగి వున్న అనేక అనర్ఘ రత్నాలను వెలికి తీసి, పదిమందికి తెలిసేలా ప్రచురించిన వావిళ్ళవారి కార్యస్థానం ఈ పురమే. తెలుగు వారి స్వాతంత్ర్య సమరచరిత్రకు అద్దం పడుతూ, ఆంధ్రోద్యమ వీచికలకు ఆలంబనగా వెలిగిన ఆంధ్ర పత్రిక, స్వరాజ్య వంటి అనేక పత్రికలకు పుట్టినిల్లుగా ఈ గడ్డ తెలుగు భాషా సంస్కృతీ చైతన్య స్రవంతులకు జీవగడ్డగా వెలుగొందింది. ఇట్టి పరంపరాగతమైన, ఉదాత్తమైన, ప్రేమానుబంధమైన బంధాన్ని మరింత విస్త్రుతపరచి, పటిష్ఠపరచి జాతి సమైక్యతకు బీజం వ్యాపింపజేసేలా ఈ సభలను యిట్టి చారిత్రాత్మకమైన క్షేత్రంలో నిర్వహించడం ఎంతో ప్రశంసనీయం.
    ఈ మహాసభలకు తమిళనాడు ముఖ్యమంత్రి, నాప్రియసోదరుడు శ్రీ ఎం.జి. రామచంద్రన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో ముదావహం. వారికి నా హృదయపూర్వక అభివందనాలు. తెలుగువారికి, తమిళ సోదరీ సోదరులకు ఉభయులకు ఆనందదాయకమైన ఉమ్మడి పండుగలా ఈ సభలు జరుగుతుండడం అభినంధనీయం. జాతీయ సమైక్యతకు భూమికగా, ఒక కుటుంబానికి చెందిన తెలుగు-తమిళ భాషా ప్రాంతాల మధ్య తరతరాలుగా, శాతాభ్దాలుగా నెలకొన్న మధుర సాంస్కృతిక అనుబంధ బాంధవ్యాలకు చక్కని వేదికగా ఈ సభలు నిర్వహించ బడుతూ వుండడం ప్రత్యేకించి అభిలషణీయం.
    కృష్ణమ్మకు కావేరికి వున్న సంబంధం ఈనాటిదా? రెండు దక్షిణ గంగలే- ఆ దరినుండి ఈ దరికి మరో గంగ- తెలుగుగంగ త్వరలోనే అవతరించి తెలుగు-తమిళ సోదరుల పవిత్ర స్నేహనుబంధాన్ని మరింత దృఢతరం చేసే రోజు సమీప భావిలోనే వున్నదని మనవి చేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను.
    తెలుగు-తమిళ సంస్కృత సారస్వతానుబంధానికి నాటికి నేటికి ఏనాటికీ చెరగని మధుర స్మృతి చిహ్నాలు మధురలోని తిరుమల నాయకమహల్ లోని వాస్తు సౌందర్యాలు, తంజావూరు సరస్వతి మహల్ లోని తాళపత్ర గ్రంథాలు.
    తమిళ సోదరీ సోదరుల గళాలలో నిత్యం వినిపించే మధుర కృతులు మన త్యాగరాజస్వామివి కావడం మనకు ఎంతో గర్వకారణం. త్యాగయ్య తెలుగు బిడ్డ అయినా తమిళనాడు ఆయన గాన వీచికారోచిస్సులతో వెలిగిన గడ్డ.
    తెలుగునాట సాంకేతిక విప్లవంతోపాటు సాంస్కృతిక పునరుజ్జీవనం తేవాలన్నది మా ఆశయం. ఒక్క తెలుగునాడులోనే కాదు, తెలుగు వారుండే ప్రతి ప్రాంతంలోనూ తెలుగు సంస్కృతిని సముజ్జ్వలంగా ప్రకాశింప చేయాలన్నది మా సంకల్పం. రాష్ట్రేతర ప్రాంతాలలో తెలుగు పీఠాలను నెలకొల్పే పథకంలో భాగంగా ఇటీవలే కర్ణాటక విశ్వవిధ్యాలయంలో వేమన పీఠం నెలకొల్పడానికి ఆర్ధిక సహాయం మంజూరు చేశామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. తెలుగు మహనీయుల పేరిట తెలుగు జాతి కలకాలం భక్తితో గౌరవించాల్సిన మహానుభావుల పేరిట, స్మరించుకోదగిన తెలుగు కళాకారుల పేరిట యిట్టి పీఠాలను మరికొన్ని విశ్వవిద్యాలయాలలో కూడా నెలకొల్పాలనే ఆలోచన వున్నది. తెలుగువారు ఎక్కడున్నా అక్కడ తెలుగు పలుకును నిల్పుకోడానికి, తెలుగుదనం పెంపొందించుకోడానికి చేసే ప్రతి ప్రయత్నానికి మా తోడ్పాటు వుంటుంది ఎప్పుడూ.
    ఏ దేశమేగినా, ఎందు కాలిడినా తెలుగు తల్లిని మరవని మనుషులు మీరని నాకు తెలుసు. తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి కొనసాగించే కృషి భారత జాతీయ స్రవంతిని మరింత చేసేందుకు వుద్దేశించబడిందని మనవి చేస్తున్నాను. శరీరంలో అవయవాలు పుష్టిగా, బలంగా వుంటేనే శరీరం బలంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు బలంగా, సౌభాగ్యంగా వున్నప్పుడే జాతి పరిపుష్టంగా వుంటుంది.
    ఆవులు ఎన్నో రంగులలో వున్నా వాటి వాలు మాత్రం తెల్లగానే వున్నట్లు, మనం ఏ భాష మాట్లాడినా, ఏ దేవుని కొలచినా, ఏ రాష్ట్రంలో వున్నా అందరం భారతీయులమే. భాషలు భిన్నమయినా భారత జాతి ఒక్కటే.
    అమరకవి గురజాడ ఆశ్వాసించినట్లు -
    "దేశమనియెడి దొడ్డ వృక్షం
    ప్రేమలను పూలెత్తవలెనోయ్
    నరుల చెమటను తడిసి మూలం
    ధనం పంటలు పండవలెనోయ్
    ఆకులందున అణగిమణగి కవిత కోకిల పలుకవలెనోయ్
    పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయ్."
    
    మద్రాసులో 1984 మే లో జరిగిన అఖిలభారత ద్వితీయ తెలుగు మహాసభలకు పంపిన సందేశం

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS