Previous Page Next Page 
Sri N T Rama Rao Prasangalu పేజి 32

 

    శాంతి పథంలో


    
    ఎంతో సుదినం ఈ రోజు. భగవాన్ మహావీరుడు అవతరించిన శుభదినం ఈనాడు. మానవాళికి తరించే మార్గాన్ని చూపించేందుకు అవతరించిన తీర్ధంకరులలో భగవాన్ మహావీరుడు సుప్రసిద్ధుడు. ఆయన జయంతి సందర్భంగా జైన సోదరీ సోదరులందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
    భగవాన్ మహావీరుడు మోక్షమార్గ అన్వేషణలో రాజ్యాన్ని, సిరిసంపద లను, భార్యా పిల్లలను వదలి తపోమార్గానికి వెళ్ళిన పుణ్యమూర్తి. ఆయన ప్రబోధించిన విశ్వమానవ ప్రేమ, అహింస, సత్యం, శాంతిమార్గం మానవాళికి అవశ్యం అనుసరణీయం. ఆ మహనీయుని ఆదర్శం-తను ప్రబోధించిన దానిని ఆచరించి చూపడం. ఆయన ఆదర్శాన్ని మనమందరం పాటించవలసిన అవసరం ఎంతైనా వున్నది.
    ఈ రోజు సమాజం ఏ పరిస్థితిలో వుందో మీ అందరికీ తెలుసు. ద్వేషాసూయలతో రేగిపోతూ, స్వార్ధ చింతనతో క్రుళ్ళిపోతూ, పరస్పర అనుమాన భయాలతో కొట్టుమిట్టాడుతున్న వర్తమాన సంఘానికి వర్దమాన మహావీరుడు ప్రబోధించిన ప్రేమ, అహింసల కన్నా వేరే తరుణోపాయం ఏమి వుంటుంది?
    మతం పేరిట మానవుని దానవునిగా మారుస్తూ ఒకరిగొంతు ఒకరు నరుక్కుంటూ మానవత్వం కోల్పోయి వికృత రూపాలను ప్రదర్శిస్తున్న వర్తమాన సమాజానికి మతం అంటే మానవత్వాన్ని, దైవత్వ స్థాయికి తీసుకొనిపోవడమేనని ప్రబోధించిన అవతార పురుషుడు శ్రీ మహావీరుడు.
    ఒకనాడు జైనమతం ఆంధ్రప్రదేశ్ లో ఎంతో వ్యాప్తిలో వుండేదని చరిత్ర మనకు చాటుతున్నది. ఈ రోజు కూడా నాటి వైభవానికి కొండగుర్తులుగా మిగిలిన అవశేషాలు మనకు కన్పిస్తాయి. అయితే ఈనాడు మన కర్తవ్యం భగవాన్ మహావీరుని బోధనలను అనుసరిస్తూ మానవ సేవే మాధవ సేవ అన్న పరమార్ధాన్ని ఆచరణలో చూపడం. ఇందుకు జైన సోదరీ సోదరులందరూ పూనుకొంటారని ఆశిస్తున్నాను. భగవంతుడు మనకిచ్చిన ధనంలోనే కొంత సమాజ శ్రేయస్సుకై కేటాయించుకొని, ఆ విధంగా సేకరించుకొన్న ధనంతో పేద ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రులు,మంచి నీటి వనరులు, విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలు మొదలైనవి నెలకొల్పుకునేందుకు కృషి చేయగలరని ఆశిస్తున్నాను. ఇందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు తప్పక లభిస్తాయని హామీ యిస్తున్నాను.
    ఈ శుభ సందర్భాన భగవాన్ మహావీరునికి నా హృదయ పూర్వక అర్చనాంజలి ఘటిస్తూ, నమస్సుమాలు అందజేస్తున్నాను.
    
        మహావీర జయంతి సందర్భంగా 1984 ఏప్రిల్ 13న హైదరాబాదులో -

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS