Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 33

 

    ఆ లెక్కన ఇందాక కనబడిన ఆకారం ఆ నరవానరమే అంటావా ?"
    "అయి వుండవచ్చును -- కాకపోవచ్చును కూడా !"
    "కాసేపు ఆగి, అన్నాడు రాజు.
    ఈ ఆకారాన్ని చూసే జనాలు రాక్షసుడని భయపడి ఉండవచ్చును"
    ఒక క్షణం అలోచించి , తల అడ్డంగా వూపింది సృష్టి.
    "మామూలు జనం భయపడ్డారంటే అర్ధం ఉంది రాజూ! కానీ మా ప్రొడ్యూసరు బాబూ సేట్ కూడా అంతగా దడుచుకుని ఉంటాడా? రాక్షసుడని భ్రమపడి ఉంటాడా?
    "మరి ?"
    సాలోచనగా అంది సృష్టి.
    ప్రతి సమష్యకీ ఎన్నెన్నో కోణాలు వుంటాయి. అన్ని యాంగిల్సు లో నుంచి ఆలోచిస్తేనే గానీ అసలు విషయం అంతు బట్టవచ్చును -- ఎనీహౌ! రాక్షసుడి స్కేర్ కీ, ఈ నరవానరానికీ సంబంధం ఉందొ లేదో తెలియదు గానీ -- ఇది గనక నిజంగా నరవానరం అయి ఉండి, దాన్ని మనం పట్టుకోగలిగితే -- అంత్రోపాలజీ శ్రాస్త్రానికి మనం అంతులేని సేవ చేసినట్లు అవుతుంది."
    ఆమె మాట పూర్తి కాకముందే కొండ మీద నుంచి ఒక అరుపు వినబడింది.
    పులీ, సింహమూ , ఏనుగు , గొరిల్లా , అన్నిటి మిక్చర్ లాగా వుంది ఆ అరుపు!
    కొండ అంచున ఆ ఆకారం మళ్ళీ ప్రత్యక్షమయింది.
    తక్షణం -
    చిన్న సైజు కొండల్లా ఉన్న రాళ్ళు పైనుంచి దొర్లడం మొదలెట్టాయి.
    "కమాన్! క్విక్!" అన్నాడు రాజు. కొండ చరియలో వున్న ఒక గుహ వైపు పరిగెడుతూ.
    గుహలోకి ప్రవెశించారు ఇద్దరూ.
    తక్షణం -
    చాలా పెద్ద బండ ఒకటి గుహ ముఖద్వారానికి అడ్డంగా పడి, దృశ్యాన్ని పూర్తిగా మూసేసింది.
    "అయ్యో ! మనం దీన్లో ట్రాప్ అయిపోయాం" అంది సృష్టి భయంగా.
    "ఏం భయం లేదు -- గుహకి ఆ కొన నుండి కాంతి వస్తోంది.
    అక్కడ ఇంకొక ఎంట్రన్సు ఉండి ఉండాలి -- చూద్దాం పద!" అని దారి తీశాడు రాజు. నిజంగానే గుహకి అటు వైపు ఇంకొక ఓపెనింగ్ ఉంది. దాన్లో నుంచి బయటికి వచ్చారు. బయటికి వచ్చాక అతని వైపు ఆరాధనగా చూసింది సృష్టి.
    "రాజూ ! యూ ఆర్ గ్రేట్!" అంది.
    "ఏం?
    "కొండ మీద నుంచి బండలు దొర్లిపడుతూ వుంటే , సెకండు లో సగ భాగంలో ఇక్కడొక గుహ వుందని కనిపెట్టి లోపలికి లాక్కు వచ్చింది నువ్వు. బండ అడ్డం పెట్టి గుహ మూసుకుపోగానే , గుహకి అటు వైపు నుంచి కాంతి వస్తోందని కనిపెట్టేసి , బయటికి తీసుకొచ్చింది నువ్వు . టార్జాన్ లాంటి వాడివి? నిజంగానే ! యూ టార్జాన్ -- మీ డోన్!" అంది నవ్వుతూ. అంటూనే , అమ్మా! అంటూ కాలు పట్టుకుని కూర్చుండి పోయింది సృష్టి.
    "ముల్లు గుచ్చుకున్నట్లయింది " అని పరీక్షగా చూసి "ఓహ్! ముళ్ళు కాదు. ఏదో ఎముక తాలుకూ ముక్క -- సన్నగా సూదిలా వుండి పాదంలో దిగబడింది " అంది.
    చుట్టూ చూసి, తర్వాత నెమ్మదిగా అన్నాడు రాజు.
    "ఒక ఎముక కాదు సృష్టి! బోలెడన్ని ఎముకలు గుట్టలు గుట్టలుగా పడి వున్నాయి -- చూడు "
    తను కూడా చూసి ,' అవును" అంటూ ఎముకల గుట్ట దగ్గరికి వెళ్ళింది సృష్టి పరీక్షగా చూసింది.
    "ఏమయింది ?" అన్నాడు రాజు.
    ఆమె మొహంలోని భావాలని చదవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా .
    సృష్టి మొహంలో రంగులు మారాయి.
    "మనుషుల ఎముకలు, వీటిని ఎవరో కొరికి నమలడానికి ప్రయత్నించినట్లుగా గుర్తులు కనబడడం లేదూ - చూడు?"
    నిజమే ! ఆ ఎముకలని ఎవరో కొరికి నమలడానికి ప్రయత్నించినట్లుగా కనబడుతోంది.
    "ఏమయి వుంటుంది?" అన్నాడు రాజు.
    "నరమాంస భక్షణ అనేది చాలా జాతుల్లో ఉండేది " అంది సృష్టి.
    పక్కనే ఉన్న ఒక చెట్టు ఆకుని తుంచి , దానితో గుట్టలోని ఒక ఎముకని ఎత్తి పట్టుకుని, జాగ్రత్తగా పరిశీలించింది సృష్టి.
    "హ్యూమన్ ఫెమూర్" అంది సాలోచనగా.
    "అంటే?"
    "ఎవరో మనిషి తాలుకూ తొడల ఎముక చూశావా -- మధ్యకు చీల్చబడి వుంది ."
    "దాని అర్ధం ఏమిటి ?"
    "ఎముక మధ్య ఉండే మూలగను తినడం కోసం ఎవరో దీనిని చీల్చారన్నమాట."
    మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాడు రాజు. మెల్లగా అంది సృష్టి.
    "ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తు వస్తోంది. ఇంగ్లాండులో కూడా ఒక చోట ఇట్లాగే ఒక ఎముకల కుప్ప కనబడింది. ఆ ఎముకలలో కూడా కొన్ని ఇట్లాగే మధ్యకు చీల్చబడి ఉన్నాయి. అంటే అక్కడి ప్రజల్లో అప్పట్లో కొంతమంది నరమాంస భక్షకులు ఉండే వాళ్ళన్నమాట- ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితపు ఎముకలు అవి."
    "మనుషులని మనుషులే తినడం దారుణం కదూ!"
    "స్వజాతి జంతువులనే భక్షించడం అనేది సృష్టిలో బహు అరుదు. అలాగని అట్లాంటి అలవాట్లు అసలు లేనేలేవని కాదు. అని ఆగి ,
    'అరె! అరెరె! రాజూ! లుక్ అవుట్! అంది.
    చటుక్కున వెనక్కి తిరిగాడు రాజు.
    ఒక తాచు పడగవిప్పి ఉంది. రాజు వెనక్కి తిరగాగానే అది బుసలు కొట్టి కాటు వేయడానికీ రెడీ అయింది.
    అదే క్షణంలో -
    ఒక బ్రహండమైన కింగ్ కోబ్రా సర్రున వచ్చి మెరుపు వేగంతో తాచును కాటువేసింది.
    దాదాపు పదిహేను అడుగుల పొడుగు ఉంది. అమహాసర్పం!
    కింగ్ కోబ్రా కాటుకి గురి అయిన తాచు కూడా తిరిగి కింగ్ కొబ్రాని కాటు వేసింది.
    కానీ --
    కింగ్ కోబ్రా విషం పవర్ ముందు తాచు పాము విషం బలాదూర్.
    కాటు వేశాక తాచుని నోటితో గట్టిగా పట్టేసుకునే ఉంది కింగ్ కోబ్రా.
    విదిలించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది త్రాచు. క్రమక్రమంగా దాని కదలికలు బలహీనమైపోయాయి.       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS