Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 32


    "బాగా లేదండి.... వచ్చేప్రాణం పోయే ప్రాణంలా వుంది. దేవుడి మీదనే భారం వేశాం!" అన్నాడు ఆయన.


    "మొన్నమొన్నటివరకు బాగానే  వున్నారే.  ఇంతలో ఏమైంది?" అన్నాడు చౌదరి.

 
    "నాలుగు రోజుల క్రితం తిప్పొచ్చి పడిపోయారండీ! ఆచార్లుగారు మందిస్తే  తగ్గిందండీ. అయితే... నిన్నటినుంచి  తిరగబెట్టి, చూస్తూండగానే విషమించిందండీ!"  అన్నాడు ఆయన.


    "పర్వాలేదు లెండి- ఆచార్లు గారున్నారుగా.... తగ్గిపోతుంది!" అన్నాడు పీర్  సాయిబు తానూ ఏదో  మాట్లాడాలన్నట్లు.


    "అన్నింటికీ ఆ ప్రభువే వుండేను. సర్వులను ఆయనే రక్షించును" అన్నాడు ఏసుపాదం.

 
    ఇంకానయం - పాపులను రక్షించును.. అన్నాడు కాదు!" అని మనసులోనే అనుకున్నాడు రెడ్డినాయుడు.

 
     "నాదేముందండి.... నేను మందియ్యగలనే కాని, ప్రాణం పోయగలనా? అంతా దైవేచ్చ...!" అన్నాడు ఆచార్లు వినయం ఒలకబోస్తూ.


    "అన్నయ్యా.. ఊరిపెద్దలంతా నిన్ను చూడాలని వచ్చారు అని రెండు మూడుసార్లు కరణంగారి చెవి దగ్గర గట్టిగా అన్నాడు" కరణం గారి తమ్ముడు.

 
    బరువుగా కళ్లు తెరిచాడు కరణం.

 
    ఊరిపెద్దలు కంటపడేసరికి ఆయన ముఖంలో కాంతి వచ్చింది.


    ఏదో మాట్లాడాలని పెదవులు కదిల్చాడు. నెమ్మది నెమ్మదిగా ఓపిక వచ్చింది. లేచికూచోడానికన్నట్లు వెనక్కి  జరగడానికి  ప్రయత్నం చేశాడు.

 
    "చూశారా.... ఊరిపెద్దల్ని చూసేసరికి అన్నయ్యకి ప్రాణం లేచివచ్చింది ప్రొద్దునంతా ఊరివారిని చూడాలని ఒకటే కలవరింత! అలా పలవరించి పలవరించి మగతలోకి  జారుకున్నాడు" అన్నాడు తమ్ముడు.

 
    "జీవుడు అంతేనండీ! కోరిక బలంగావుంటే దేహాన్ని వదిలిపెట్టి  పోలేదు" అన్నాడు  ఆచార్లుగారు. ఆ వెంటనే కరణంగారివంక చూస్తూ. "గోడకి దించువేసి ఆయన్ని కూచోబెట్టండి. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు" అన్నాడు.


    దిండుని గోడకి వేసి ఆయన్ని నెమ్మదిగా లేపి, దాని ఆసరాగా కూచోబెట్టారు.

 
    కరణంగారికి మాట్లాడే ఓపిక వచ్చింది. రెండు చేతులూ ఎత్తి హీనస్వరంతో "నమస్కారం!" అన్నాడు.

 
    ఊరిపెద్దలు ప్రతినమస్కారం చేస్తూ - "మీరు శ్రమపడకండి. విశ్రాంతిగా వుండండి!" అన్నారు.

 
    కరణంగారు  ఆగి ఆగి నెమ్మదిగా మాట్లాడసాగారు.

 
    "నా  మనసులోని మాట మీకు చెప్పాలి, అందుకే నా ప్రాణం ఇంకా పోకుండా వుంది.  చేసిన పాపం చెప్తే  పోతుందంటారు. నేను ఎన్నో పాపాలు చేశాను బ్రతికుండగా మిమ్మల్ని ఎన్నో  బాధలు పెట్టాను. మీలో మీకు కొట్లాటలు పెట్టి చూసి ఆనందించాను.  ఆ పాపాలన్నీ నా కళ్ళముందు  మెదులుతూ నన్ను బాధిస్తున్నాయి.  మిమ్మల్ని హింసలు పెట్టి నేను  బావుకున్నదేముంది? మీరందరూ  మనస్పూర్తిగా నన్ను క్షమిస్తేనే నా ప్రాణం  సులువుగా పోతుంది" అంటూ కళ్లు మూసుకున్నాడు కరణం ఆయన కళ్ళంబట రెండు చుక్కలు రాలాయి.


     కరణం కంటనీరు చూసేసరికి ఊరిపెద్దలు ఐస్ లాగా కరిగిపోయారు.  ఆయన  మీద బోలెడు జాలి కలిగింది. ఆ సానుభూతి వరదలో ఆయన మీదున్న అసహ్యం అంతా కొట్టుకుపోయింది.

 
    "మీరు గతాన్ని మనసులో పెట్టుకోకండి. జరిగిందేదో జరిగిపోయింది. తెలిసో, తెలియకో అందరం తప్పులు చేస్తాం!" అంటూ  ఓదార్చాడు నాయుడు.

 
    "ఎవరెన్ని చేసినా చివరికి మిగిలేదేముందిలెండి?చేసిన తప్పులు తెలుసుకుని ఒప్పుకుంటే చాలు!" అన్నాడు చౌదరిబాబు.

 
     'ప్రభూ.. నేను పరమపాపిని. నా పాపములను క్షమియింపుము - అని ప్రార్దించినచో ఎంతటి ఘోరపాపులనైనను  ఆ ప్రభువు క్షమియించును' అన్నాడు ఏసుపాదం.


    కరణంగారు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు - "మీ మాటలతో నా మనసు తేలికపడింది. కాని, మీరందరూ క్షమించాము అంటేనే నాకు తృప్తి కలుగుతుంది"అన్నాడు.


    ఇంక విధిలేక అందరూ "క్షమించాం....!" అన్నారు కోరస్ గా.

 
    కరణంగారి కళ్లల్లో తృప్తి కనిపించింది. "చాలా సంతోషం! మీరందరూ నన్ను క్షమించినందుకు నాకెంతో ఆనందంగా వుంది. ఇంకొక్క కోరిక వుంది. అదికూడా తీరిదంటే నా ఆత్మకు శాంతి కలుగుతుంది."అన్నాడు నెమ్మదిగా.

 
    అదేమిటో చెప్పండన్నట్లు ఆయనవంక చూసారు అందరూ.


    కరణంగారు చెప్పడం మొదలుపెట్టాడు -


    "మన గ్రామంలో హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు - అందరూ వున్నారు. నేను బ్రతికినంత కాలమూ మీలో మీకు కొట్లాటలు పెట్టాను. మీరు కొట్టుకుచస్తుంటే చూసి ఆనందించాను. నేను చేసిన పాపం, దానిఫలితం నాతోపాటే పోవాలి. అందువల్ల మీరందరూ ఐకమత్యంగా వుండేందుకు, నిత్యమూ నన్ను మరిచిపోకుండా వుండేందుకు వీలుకల్పించే విధంగా నా చివరికోరికను కాగితం మీద రాసి కవర్లో పెట్టి సీలు చేశాను. ఆ కవరు నా తల క్రిందనే వుంది. నేను చనిపోయాక మీరు ఆ కవరుని తెరిచి, అందులో రాసిన విధంగా తూ. చ. తప్పకుండా అమలుచేస్తామని మాటివ్వాలి!"అంటూ కుడిచేతిని ముందుకుసాచారు కరణంగారు.


    "పాపం.... ఎన్ని తప్పులు చేసినా చివరకు కరణం మన ఐకమత్యంకోసం మహా ఇదైపోతున్నాడు" అని అందరికీ కొండంత జాలి కలిగి ఆయన చేతిలో చేయివేసి అందరూ "అలాగే చేస్తాం!" అంటూ ప్రమాణం చేశారు.

 
    "చాలా సంతోషం! ఇంక నాకు సెలవైంది. మీరందరూ నా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్దిస్తుండండి... నేను నిశ్చింతగా కన్నుముస్తాను" అంటూ మగతలోకి జారుకున్నాడు కరణం.


    వెంటనే ఎవరికి తోచినవిధంగా వారు ప్రార్దనలు మొదలుపెట్టారు.

 
    కరణంగారి ముఖం కాంతిహీనం కాజొచ్చింది.


    "అయిపోతోంది... కరణంగారికి అంతిమ ఘడియలు వచ్చేశాయి. తులసినీళ్ళు పట్రండి!" అని అరిచాడు ధన్వంతరి ఆచార్లు.


    తలుపుకి ఆవలనున్నవారిలో ఒకామె పెరటివైపు పరుగుతీసింది.


    కరణంగారి భార్యా, ఇతర ఆడవారూ "నాయనోయ్ - దేవుడోయ్....!" అంటూ బయటకు వచ్చి రోదనలు మొదలుపెట్టారు.


    పెరటివైపున వెళ్ళిన ఆమెనీళ్ళగ్లాసులో తులసి ఆకులువేసి చెంచాతో తీసుకువచ్చింది.


    "అమ్మా...మీ చేత్తో తులసితీర్దం వారి నోట్లో పోయండి!" అంటూ ఆచార్యులుగారు ఆ గ్లాసుని తాను అందుకుని కరణంగారి భార్యకు అందించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS