Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 32

    "పురుషులతో సమానంగా వాదిస్తున్నావట. స్త్రీలకిది ధర్మమా?"
    "స్త్రీలు మనుషులు కారా?"
    "మనుషులేకాని, స్త్రీలు వేరు పురుషులు వేరు"
    "పురుషశబ్దానికి మనిషి అనీ, ఇంకా సరిగా చెప్పాలంటే జీవి అనీ అర్థం. 'పురేశేతి ఇతి పురుషః' అని కదా ఆ శబ్దానికి అర్థం. అప్పుడు పురుషుడంటే మనిషి అని సామాన్య అర్థం. తేడా చెప్పాలంటే ఆడపురుషులు మగపురుషులు అని అనాల్సి ఉంటుంది శాస్త్ర ప్రకారం"


    "అంటే ఆడా, మగా అంతా పురుషులే నంటావా?" స్వామివారు ప్రశ్నించారు.
    "నిజానికి ఎవరూ పురుషులు కారు. పురుషోత్తముడు ఒక్కడే పురుషుడు. జీవులన్నీ స్త్రీ స్వరూపమైన ప్రకృతిలో అంతర్భాగం. అటువంటప్పుడు పురుషులెవరో చెప్పండి? అందరూ స్త్రీలేగా!"
    "నువ్వు మహాభక్తురాలు మీరాబాయిలాగా తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా?"
    "సత్యం పలకటానికి తెలివి అక్కరలేదు. మీరాబాయి చెప్పినా, గోదాదేవి చెప్పినా, అక్క మహదేవి చెప్పినా, క్షేత్రయ్య చెప్పినా, పదకవితా పితామహుడు పలికినా - అందరూ పలికింది వాస్తవమైన జీవేశ్వర సంబంధం గురించి మాత్రమే. పండితులెవరూ కాదనలేరు కదా!"
    "అదంతా ఆత్మపరమైన సంబంధం. ఆధ్యాత్మికసాధనకి సంబంధించింది. మనం లౌకిక ప్రపంచంలో ఉంటున్నాం. కనక దానికి సంబంధించిన కట్టుబాట్లు కూడా పాటించాలి కదా!"
    "అది లౌకిక జీవితం, అందులో ఎదుగుదల కాంక్షించేవారికి మాత్రమే. దానికి అతీతంగా ఉండేవారికి ఎప్పుడూ అపవాదాలు ఉంటాయి."
    "నీవు ఉదాహరించిన మీరాబాయి, గోదాదేవి, అక్కమహాదేవులకు కూడా వివాహాలయ్యాయి. వారు లోకమర్యాదని కూడా పాటించారు."
    "మీ ప్రమాణాల ననుసరించి నేనూ పాటించాను. లౌకికంగా వివాహమనే నాటకం నడిచింది."
    "మరి, భర్త చనిపోయినప్పుడు వైధవ్య నియమాలని పాటించాలి కదా!"
    "నా ఆత్మేశ్వరుడుండగా నేను సనాధనేకాని, అనాధను కాను. లౌకిక నాటకంలో భర్తగా నటించిన వేంకటాచలపతి మరణించిన ఆధారాలు లేవు, గాలి వార్తలు తప్ప. అయినా పెద్దలమాటవిని అతడు కట్టిన మంగళసూత్రం, పెట్టిన మట్టెలు తీసేశాను. బొట్టుగాజులు చిన్నప్పటినుంచి ఉన్నవి. ఏ ఆడపిల్లఅయినా భర్తపోతే అవెందుకు తీయాలి?
    "అది అనాదిగా వస్తున్న సంప్రదాయం. మనం కాదనకూడదు."
    "ఎన్నో సంప్రదాయాలు కాలానుగుణంగా మారుతున్నాయి. ఒకప్పుడు స్త్రీలు యుక్తవయసు వచ్చాక స్వయంవరంలో భర్తల నెన్నుకునేవారు. తరవాత జాతిలో చేవతగ్గాక చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేయటం మొదలుపెట్టారు. ఇది సంప్రదాయానికి విరుద్ధంకాదా?"
    "చూడమ్మా! అట్లా వితండవాదం చెయ్యకూడదు. పెద్దలు చెప్పిన మాట వినాలి. ఎవరైనా ఆదిశంకరులవంటి ఆచార్యులు కొత్త సంప్రదాయాలకు ఒరవడి దిద్దేవరకు ఉన్నవి పాటించటం మంచిది."
    "అంటే ఇప్పుడున్నవి మారాల్సిన అవసరం ఉందని మీరు అంగీకరిస్తున్నారన్నమాట."
   "కాని, అంతవరకు ఇప్పుడున్న ఆచారాలని పాటించాలి కదా! సనాతన ధర్మాన్ని, ఆర్ష సంప్రదాయాలని ఈనాటిదాకా నిలబెటుతున్నది స్త్రీలే. ఎందుకంటే ఎటువంటి ఆటుపోట్లు సంభవించినా, ఎన్ని వత్తిడులు మీదపడినా అనాదిగా వస్తున్న సంప్రదాయాలను సజీవంగా నిలుపుతున్నది మహిళలే. దారితప్పిన పురుషులు కూడా వారివల్ల సన్మార్గంలోకి వస్తారు. తాము పాటించి కుటుంబంలోనూ సంఘంలోనూ అందరికీ ఆదర్శంగా ఉండాలి. నిన్ను చూచి పది మంది చెడుదారిలో వెడితే ఆ పాపం నీదే అవుతుంది. నువ్వు పెద్దలని గౌరవిస్తేనే నిన్ను నీ తరువాత తరం వాళ్ళు గౌరవిస్తారు. మీ గ్రామ పెద్దలు చెప్పిన మాట విని కేశఖండనాన్ని వైధవ్య ధర్మాలని అనుసరించు".
    "మీరు చెప్పిన ధర్మాలలో స్త్రీకి పాతివ్రత్యం పరమధర్మం. అవునా? పతివ్రత పరమపురుషుని ముట్టరాదు. అవునా? మరి, మంగలి పురుషుడు. అతడు ముట్టుకుని క్షురకర్మ చేస్తే స్త్రీల పాతివ్రత్యం ఏమైనట్టు? జుట్టు తీయించటం పాతివ్రత్య ధర్మమని ఏ శాస్త్రంలో ఉందో సెలవీయండి స్వామీ! కేశాలకి పరిమితమైన పాతివ్రత్య ధర్మం ఎంత తాత్కాలికం? రాలిపోతూ తిరిగి మొలకెత్తుతూ,..... పాతివ్రత్యం మనోధర్మం. అంతఃకరణకి, తదనుగుణమైన నడవడికకి సంబంధించింది. మనసు నిర్మలంగా, పవిత్రంగా లేనప్పుడు బాహ్యమైన కట్టడులు ఎన్ని చేసినా, ఎన్ని వ్రతాలు నియమాలు యాంత్రికంగా పాటించినా, ఉపయోగం ఏముంది? బలహీన మనస్కులకి మరింతగా వాటిపై మక్కువ కలిగి మనసు చెదిరిపోతూ ఉంటుంది. మానసిక వ్యభిచారం అవుతుంది. 'తలలు బోడులైన తలపులు బోడులు కావు కదా!' అందుకని మనసుని పవిత్రంగా ఉంచే పద్ధతులని పాటించాలి".
    సరైన సమాధానం తన దగ్గిర లేకపోవటంతో స్వామివారికి కోపం వచ్చింది. అందుకని "అంటే నీ ఉద్దేశం ఏమిటి"? అని గద్దించి అడిగారు.
    వెంకమాంబ తొణకక నిశ్చలంగా చెప్పింది.
    "నా గురించి మీకు చెప్పినవారీ విషయం కూడా చెప్పి ఉండాలి. ఒకసారి నాకు శిరోముండనం చేశారు. ఏం లాభం? శ్రీనివాసుడు మరుక్షణం కేశాలు ప్రసాదించాడు. ఆవిధంగా జరగదని మీకు నమ్మకముంటే నేను సిద్ధమే. అంతేకాదు, ఎటువంటి వారికైనా ఖండించిన కేశాలు మళ్ళీ మొలకెత్తటం సహజం. మళ్ళీ తీస్తూ ఉండాలి. జీవితాంతం అట్లా చేసేకన్నా మొలవకుండా ఉంటే బాగుంటుంది. మళ్ళీ జుట్టు మొలవదంటే మీ మాట తప్పక పాటిస్తాను స్వామీ! ఆదేశించండి".
    "నువ్వేదో కవిత్వం రాస్తున్నావట. అందుకు అహంకరిస్తున్నావట."

    "వినరయ్య కవులారా! విద్వాంసులారా!
    వినరయ్య మీరెల్ల విమలాత్ములార!
    ఘనయతి ప్రాస సంగతులు నేనెఱుగ
    వరుస నాక్షేపింప వలదు సత్కృపను"

    స్వామివారికి కోపాన్ని మించిన భావం ఏదో కలుగుతోంది. మాట్లాడటానికేమీలేదు. ఆలోచనలో పడ్డారు. ఈ చర్చనంతా వింటున్న బ్రాహ్మణ సంఘానికి ఆశ్చర్యం, అవమానం, కోపం ముప్పిరిగొన్నాయి. రక్తం ఉడికిపోతోంది. ఏదో ఒక అఘాయిత్యంచేసి, వెంకమాంబని దెబ్బకొట్టి స్వామివారిని రక్షించాలనే తహతహ క్షణక్షణానికి పెరిగిపోతోంది. స్వామివారు ఆలోచనలో పడిన స్వల్పకాలం వారికి అవకాశం కలిగించింది. వెంటనే సోమయాజి,
    "మూర్ఖులారా! స్వామివారికి నమస్కరించకుండానే మాట్లాడుతున్నావు. నీ అహంకారానికి, ఆగడాలకి అంతులేకుండా పోతోంది. సాష్టాంగ ప్రణామంచెయ్యి!" గట్టిగా ఆజ్ఞాపించాడు.
    మౌనంగా ఉన్న వెంకమాంబని "మూఢురాలా! చెప్పినట్టు చెయ్యి!" అని కోప్పడ్డాడు.
    బ్రాహ్మణులందరూ ముక్త కంఠంతో వెంకమాంబ స్వామికి నమస్కరించి తీరాలని ఘోషించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS