Previous Page Next Page 
ప్రార్థన పేజి 32


    "అదీ, అలా చెప్పండి! మసూచిని నయంచేసే విధానంలోనే కేన్సర్ ని నయం చేయగలం అన్న 'ఇమ్యూనోథెరపీ' మీది! మీ విధానంలో ఇలాంటి ముదిరిపోయిన అక్యూట్ కేసులు నయంకావు. అందుకని, పొరపాటున మా పద్ధతిలో ఈ కేన్సరు నయం అవుతే, ఇక మిమ్మల్నీ, మీ రిసెర్చినీ ఎవరూ గుర్తించరు... మీ ఉద్యోగాలు పోతాయి.... అదీ మీ స్వార్థం.... మీరెంత స్వార్థపరులంటే మా విధానంలో ఎక్కడ నయం అయిపోతుందో అని- చివరికి స్వంత కూతురి ప్రాణాలు బలిపెట్టటానికి కూడా సిద్ధపడ్డారు. దానికి మీరు అందంగా తొడుగుతున్న ముసుగు- "మీరు నయం చెయ్యలేరు" అని. మమ్మల్ని మాటిమాటికీ దెప్పి పొడవటం... మీ స్వార్థాన్ని చూస్తూంటే నాకు అసహ్యం వేస్తూంది. మీ వాదనని నిరూపించుకోవటం కోసం ఒక నిండు ప్రాణాన్ని - ఒక పాప జీవితాన్ని బలిపెడుతున్నారు. ఒక తండ్రి చెయ్యవలసిన పని కాదిది. డాక్టర్ గా కాదు, సాటి మనిషిగా సలహా ఇస్తున్నాను".

 

    వసుమతి స్థాణువైంది. ఆమె డాక్టర్ని చూడటం లేదు. భర్తనే చూస్తూంది. ఆ క్షణం అతడు డాక్టర్ ని హత్య చేస్తాడన్నంత భయపడింది. అతడు తుఫానులో చెట్టుకొమ్మలా వూగిపోతున్నాడు. కేన్సర్ గురించిన రెండు థియరీలు, ఇద్దరు మనుష్యుల రూపంలో ఢీకొని అగ్ని పర్వతాలు సృష్టిస్తున్నాయి... ప్రార్థన అంటే అతనికి ఎంత ఇష్టమో, డాక్టర్ మహేంద్ర అతడిని ఎంత దారుణంగా 'హర్ట్' చేసేడో ఆమె గ్రహించగలదు. చప్పున భర్త దగ్గిరగా వెళ్ళి 'ఏమండీ' అంటూ చెయ్యిపట్టుకుంది.

 

    భార్గవ ఒక్కసారిగా ఆమెని విదిలించుకుని వెనుదిరిగాడు.

 

    "ఏవండీ, ఎక్కడికండీ? ఒక్క క్షణం ఆగండీ-" అంటూ ఆమె చేస్తున్న అభ్యర్థనను మన్నించకుండా విసవిసా కారు దగ్గరికి నడిచి, పిల్లల్తో సహా వెళ్ళిపోయాడు.

 

    ఆమె చిత్తరువులా నిలబడిపోయింది. డాక్టర్ కూడా వెళ్ళటానికి ఆయత్తమవుతూ, "నా ఆఫీసుకు రండి. డిశ్చార్జి సర్టిఫికెట్టు ఇస్తాను" అన్నాడు నిర్లిప్తంగా...

 

    ఆమె గాలిలా అతడి దగ్గిరకు వెళ్ళి అతని చేతుల్ని పట్టుకుని, "ఇంతమంది మనుష్యుల మధ్య నేను మీకు చేతులెత్తి నమస్కరించలేను. ఈ నడి వరండాలో మీ కాళ్ళ మీద పడి ప్రార్థించలేను. కానీ మీ మీ పంతాలూ పట్టింపులతో ఈ స్థితి ఇలాగే కొనసాగిందంటే మాత్రం నేనింకొక్కక్షణం కూడా భరించలేను డాక్టర్ గారూ! నాకు పిచ్చెక్కిపోతుంది... నన్ను రక్షించండి. ప్లీజ్... నన్ను రక్షించండి".

 

    అప్పటివరకూ ఎంతో నిగ్రహం చూపించిన ఆమె అలా ఒక్కసారిగా బావురుమనేసరికి మహేంద్ర కరిగిపోయాడు. "రండమ్మా నాతో రండి!" అంటూ తన గదివైపు కదిలాడు.

 

    అతడి గదిలో ఆమె తేరుకోవటానికి అయిదు నిమిషాలు పట్టింది. అతనన్నాడు- "ఒక చిన్న పాపని బాధపెట్టటం మాకు మాత్రం ఇష్టమా? ఇంత చిన్న విషయం మీ భర్త అర్థం చేసుకోడేం?"

 

    ఆమె మాట్లాడలేదు.

 

    "మామూలు పేషెంట్లు అందరికన్నా ఈ కేస్ ని చాలా జాగ్రత్తగా చూస్తూ మీ అమ్మాయిని నేనే స్వయంగా నా పర్యవేక్షణలో వుంచి ట్రీట్ చేస్తున్నాను. మీరే చూసేరు కదా! నా కసలు టైమ్ వుండదు. అయినా ప్రతి అరగంటకీ ఎక్కడున్నా నాకు రిపోర్టు అందచెయ్యమని చెప్పాను. ఇంత ఇంటరెస్టు తీసుకోవలసిన అవసరం నాకు లేదు. నాకు బయట ప్రైవేటు ప్రాక్టీసు కూడా లేదు... పోనీ ఆ ఇంటరెస్టుతో ఏమైనా చేస్తున్నానా అంటే- అది మీకు తెలుసు కదా".

 

    ఆ విషయం నిజమే. ఇరవై నాలుగ్గంటలూ ఆస్పత్రి సేవకి అంకితమయిన కొద్ది డాక్టర్లలో మహేంద్ర ఒకరు. ఆ విషయం ఎవరూ కాదనలేరు. ఆమె తలెత్తి అతడికి క్షమాపణలు చెప్పుకోవాలనుకుంది. అతడు కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. తనలో తాను ఆలోచించుకొంటున్నట్టూ అన్నాడు... "నాకే గానీ ప్రార్థనలాంటి కూతురుండి, ఇదే పరిస్థితి ఎదురవుతే ఏం చేస్తాను?" అని వెనక్కి తిరిగాడు. "ఏ రిస్కూ తీసుకోను. కొస ప్రాణం వున్నా దాని కోసం చివరివరకూ పోరాడతాను. ఈ పోరాటంలో నా కూతురి చేతులూ, కాళ్ళూ, అందం అన్నీ కోల్పోవలసి వచ్చినా సరే, నేనా బొందిలో ప్రాణం నిలపటానికే శతవిధాలా ప్రయత్నిస్తాను. ఎందుకంటే 'ప్రాణం' అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి..."

 

    మంద్ర స్వరంతో అతడు తనని ఒక తండ్రిగా వూహించుకుంటూ మాట్లాడే ఆ మాటలు వింటుంటే ఆమె కనుల నీరు నిలచింది. ఆర్ద్రమైన మనసుతో అలానే చూస్తూ వుండిపోయింది.

 

    "నేను మీకు మొదటిరోజే చెప్పాను- కేన్సర్ భయంకరమైనదనీ, ట్రీట్ మెంట్ పేషెంట్ ని చాలా బాధ పెడుతుందని.. మీరు గుండె దిటవుతో వుండాలని కూడా అన్నాను. మేమిదంతా మీకు చెప్పకుండా చేస్తే మాదే తప్పు. కానీ మేమేమీ రహస్యంగా, మా లాభం కోసం చెయ్యటం లేదే ఇది..."

 

    ఆమె తలూపింది.

 

    "ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే, మీ భర్త ఏ క్షణమైనా మీ పాపని ఇక్కణ్నుంచి తీసుకుపోయేటట్టు వున్నాడు. మీరు నన్ను అపార్థం చేసుకోకండి. ఏ క్షణం పేషెంటు వుంటుందో... ఏ క్షణం వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితులలో ట్రీట్ మెంట్ కష్టం. నాకేకాదు- ఏ డాక్టర్ కైనా..."

 

    ఆమె అర్థం చేసుకున్నట్టూ "డాక్టర్ గారూ... మీరటువంటి అనుమానం పెట్టుకోకండి" అంది. "మా పాప గురించి మీరందరూ ఇంత ఇంటరెస్టు తీసుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. పాప ఇక్కడే వుంటుంది. ఉంటుందని హామీ ఇస్తున్నాను" ఆవేశంగా అన్నది.

 

    "మీరిస్తారు బాగానే వుంది. కానీ రేపేదైనా జరిగి, మీ భర్త ఈ ఆస్పత్రి మీద దావావేస్తే, అది వ్యక్తిగతంగా నా మీదకొస్తుంది. పేషెంట్ ని తీసుకువెళ్ళిపోతానంటే ఆపుచేసిన డాక్టరెవరూ అంటే, అది మహేంద్ర అని ప్రతివాడూ సాక్ష్యం ఇస్తాడు. నా ఉద్యోగం పోతుంది. నేనెందుకు అంత రిస్కు తీసుకోవాలో నాకు అర్థంకావటం లేదు"

 

    "అలా అనకండి ప్లీజ్..."

 

    "దయచేసి నా స్థానంలో వుండి మీరు ఆలోచించండి".

 

    ఆమెకి అతడు చెపుతున్న దాంట్లో నిజం స్పష్టంగా కనిపిస్తూంది. "ఏం చెయ్యాలో చెప్పండి, మీరేది చెయ్యమంటే అది చేస్తాను. మాక్కావలసిందల్లా పాపపట్ల ఇప్పుడు మీరెంత ఇంటరెస్టు చూపిస్తున్నారో అదే శ్రద్ధతో ట్రీట్ మెంట్ కొనసాగటం".

 

    "అలా అయితే పాపకి మీరే గార్డియన్ గా లిఖిత పూర్వకమైన ఉత్తరం ఇవ్వాలి".

 

    "నేనా..."

 

    "అవును. కనీసం అది నా ఫైల్లో వుంటే- నాకు సేఫ్! నేను మీకు స్వార్థపరుడిలా కనపడవచ్చు. కానీ ఒక పేషెంట్ కోసం, నా ఉద్యోగాన్నీ, నా పొజిషన్నీ రిస్కు తీసుకోలేను. నన్ను క్షమించండి..."

 

    "మీకెలా కావాలో చెప్పండి వ్రాసిస్తాను" అంది ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టు.

 

    "నిజానికి ఎలా కావాలో నాకూ తెలీదు. ఇలాటి కేసులు చూడటానికి ఒక లాయరున్నాడు".

 

    "ఇంత చిన్న విషయానికి లాయరెందుకు డాక్టర్ గారూ".


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS