Previous Page Next Page 
సంపూర్ణ గోలాయణం పేజి 32


    గతుక్కుమని సర్దుకుంది దీపిక.

    "యిప్పుడు సమస్య ఏమిటంటే ఆ అబ్బాయికి ఆ పెళ్ళి చేసుకోడం ఇష్టంలేదుట. అతను వేరే అమ్మాయిని లవ్ చేశాడు."

    చివాల్న లేచి కూర్చున్నాడు సత్యంగారు. ఏమిటీ? నిజంగానే?" అన్నారు సంభ్రమంగా.

    "అవును నాన్నా!"

    "భేష్ ఆ కుర్రాడు వజ్రంలాంటివాడు. లేకపోతే చూస్తూ చూస్తూ ఆ సన్నాసి వెధవకి అల్లుడు అవడానికి ఎవరు అంగీకరిస్తారమ్మా!" అన్నాడు ఆనందంగా.

    "నిజమే నాన్నా! ఇప్పటినించే చెప్పితే మామయ్య ఎలాగూ ఒప్పుకోడని భయపడి రహస్యంగా గుళ్లో పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాడుట అతను. ఆ అమ్మాయి నా స్నేహితురాలే. నాతో చెప్పింది"

    ఇదంతా వింటుంటే సత్యంగారి ఆనందం అవధులు దాటింది. ఒళ్ళు పొగరు వెధవ. ఆ నడమంత్రపు సిరి చూసుకుని ఒకటే మిడిసిపాటు. ఆ కాబోయే అల్లుడిని వెంటేసుకుని కనిపించిన ప్రతివాడికీ చెప్పుకుంటూ తిరిగాడు. ఇప్పుడా అల్లుడుకాస్తా వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే వాడినడుము విరిగినట్లు అవుతుంది. నలుగురిలోనూ నవ్వులపాలు అవుతాడు అనుకున్నారు.

    "మంచిపని చేస్తున్నాడు. మరి అలాటివాళ్ళకి అలాగే చెయ్యాలి" అన్నారు ఆనందంగా.

    "అయితే ఓ సమస్య వచ్చింది నాన్నా! రహస్యంగా పెళ్ళికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. కానీ సమయానికి మామయ్యా వెళ్ళి ఎక్కడ అభాసుచేస్తాడా అని భయపడుతున్నారు. ఈ  విషయంలో కాస్త మీ సాయంకావాలి వాళ్ళకి"

    "ఏమిటది?" హుషారుగా అడిగాడు.

    "పెళ్ళి ఎల్లుండి పొద్దున పదింటికి. ఆ కాస్తా అయిపోయి వాళ్ళు ఇంటికి వచ్చేదాకా  మామయ్య ఇల్లు కదలకుండా జాగ్రత్త పడాలి"

    "ఓస్  అదెంత భాగ్యం. వాకిట్లోనే కుర్చీ వేసుకొని కూర్చుంటా. ఇల్లు కదిలినట్లు కనిపించిందా మెడకాయ పుచ్చుకొని గోడవతలికి విసిరేస్తా వెధవని. వాడి సంగతి నాకోదిలేసి మిగతా ఏర్పాట్లు చూసుకోమను" అన్నాడు మహా ఉత్సాహంతో.

    ఆ మర్నాడు మోహన్ ఆఫీస్ కి సెలవుపెట్టి అన్ని ఏర్పాట్లూ చూసుకున్నాడు. శ్యామ్  ఆఫీస్ కి వెళ్ళి చిట్టిబాబుగార్ని కలిసి "రేప్రోద్దున మోహన్ పెళ్ళిచేసుకో బోతున్నాడు. మీకిచ్చిన గడువుకు  ఇంకా రెండురోజులు ముందే పెళ్ళయిపోతుంది!" అన్నాడు.

    నోటమాట రావంత ఆశ్చర్యపోయాడు చిట్టిబాబు "నిజం?" అన్నాడు.

    "అక్షరాలా నిజం!" చెప్పడం మర్చేపోయాను. రేపుమేము ఇద్దరం సెలవు పెడతాం. ఇకపోతే అతనెలాగూ పందెం గెలుస్తున్నాడు కాబట్టి మీరుకూడా మీ ఏర్పాట్లు చేసుకోండి. పెళ్ళి వెంకటేశ్వరాలయంలో జరుగుతుంది. మీరు తప్పకుండా రండి!" ఈ పూట నాకు పనుంది. నేను వెళ్తాను" అనేసి వెళ్ళిపోయాడు.

    గాలిదుమారంలా వార్తలందించి వెళ్ళిపోయిన శ్యామ్ వంక ఒక్కక్షణం చూసి ఫోన్ అందుకున్నాడు చిట్టిబాబు. నెంబర్ డయల్ చేసాడు.

    "ఆ! నేనే చిట్టిబాబుని. నీకు బజాజ్ స్కూటర్ ఎలాట్ అయిందిట కదూ! అమ్ముదాం అనుకుంటున్నావట కదూ! ఎవరికీ మాటివ్వకు నాకే కావాలి" అని చెప్పాడు. మిగిలిన ఏర్పాట్లు చెయ్యడం మొదలుపెట్టాడు.

    చిట్టిబాబు దగ్గర్నుంచి బయలుదేరిన శ్యామ్ తిన్నగా డాక్టర్ చలపతిరావుదగ్గరకు వెళ్ళాడు.

    ఆ చలపతి రావుగారు చాదస్తం మనిషి. ఆయన దగ్గరికి వచ్చే పేషెంట్లుకూడా అంతంతమాత్రమే. ఆ వున్న కాసింతమందిలో ఇద్దరు నారాయణమూర్తులూ వున్నారు.

    వాళ్ళిద్దరికీ ఫేమిలీ డాక్టరాయన. తన దగ్గరికి వచ్చిన శ్యామ్ ని చూసి ఆనందపడిపోయి అతను నోరిప్పేలోపలే నోట్లో ధర్మామీటర్ పెట్టేసి నాడి చూసేశాడు "నాడి నార్మలే టెంపరేచరూ నార్మలే. నీకొచ్చిన ట్రబుల్ ఏమిటి?" అని అడిగాడు.

    "నాకే ట్రబులూ లేదు. మీతో పనుండి వచ్చాను" అన్నాడు శ్యామ్.

    "ఏమిటిది? విజిట్ కి రావాలా? పద" అంటూ కుర్చీ మీదున్న కోటు వేసేసుకుని మెడిసిన్ చెస్ట్ పుచ్చుకుని రెడీ అయిపోయాడు.

    "మీ  హడావిడి మండిపోనూ. చెప్పేది వినిపించుకోరే మండీ. అలా కూర్చోండి" అంటూ బలవంతాన కూలేశాడు శ్యామ్.

    ఏమనుకున్నాడో ఏమో కూర్చున్నాడాయన. "ఏమిటీ?" అన్నాడు.

    "మీకు సత్యనారాయణమూర్తి గారు, సూర్యనారాయణ మూర్తిగారూ తెలుసా?" అడిగాడు.

    "ఏడిసినట్లుంది. వాళ్ళు తెలీకపోవడం ఏమిటి? వంధోమ్మిదేళ్ళుగా ఆ రెండు కుటుంబాలకీ నేనే  ఫేమిలీ డాక్టర్ని. సత్యంగారికి  హైబి.పి సూర్యంగారికి లోబి.పి. ఇద్దర్ని నేనే ట్రీట్ చేస్తున్నాను."

    "అందుకేమరి మీ దగ్గరికొచ్చాను. మీరు రేపుప్రొద్దున ఎంత పనివున్నా సరే అవన్నీ మానేసి పదకొండు కొట్టేసరికి సత్యంగారింటికి రావాలి. వచ్చేటప్పుడు ఆయనకి బిపి పెరిగితే మీరేం మందులిస్తారో అన్నీ తెచ్చుకోండి సూర్యంగారికి బి.పి పడిపోతే ఇచ్చే మందులుకూడా తెచ్చుకోండి" అన్నాడు.

    అయోమయంగా చూశాడాయన. ";ఏమిటీ వాళ్ళిద్దరికీ ఒంట్లో బాగాలేదా? బాగాలేకపోతే రేప్రోద్దుటిదాకా ఆగటం ఎందుకు? ఇప్పుడేపోతే సరిపోలా" అడిగాడు.

    "ఇప్పుడు ఇద్దరూ గుండ్రాళ్ళలాగా బాగానే ఉన్నారు. కానీ రేప్రోద్దున పదకొండూ పన్నెండు గంటల మధ్య సత్యంగారి బి.పి రెండొందలు పైగా రైజయిపోతుంది. సూర్యంగారిబి.పి అరవైకి పడిపోతుంది" అన్నాడు శ్యామ్.

    విసుగ్గా చూసాడాయన. "ఏమిటయ్యా ఇదంతా? వెదర్ బులెటిన్ చెప్పినట్లు టైములతో సహా చెప్పుతున్నావు. ఏమిటిదంతా అసలు ఎవరు నువ్వు" అని అడిగాడు సీరియస్ గా.

    "అదంతా మీకు అనవసరం నేను చెప్పిందిమాత్రం అక్షరాలా నిజం. నా మాట విని బుద్దిగా వెళ్ళారా సరే. లేదూ చూసుకోండి. వాళ్ళు వేరే డాక్టర్లని పిల్చుకుంటారు ఇకనే వెళ్తున్నా. రేపు అక్కడికి వెళ్ళాక నేనిలా వచ్చానని గానీ చెప్పారా నేనసలే మంచివాడినికాను. జాగ్రత్తమరి. బుద్దిగా వెళ్ళి మాట్లాడకుండా కూర్చోండి. మీ అవసరం రాగానే మీ పని మీరు చెయ్యండి" అని  చెప్పేసి వెళ్ళి పోయాడు.

    నోరావలించి వుండిపోయారు చలపతిరావుగారు. అంతా గందరగోళంలా వుంది ఆయనకీ. అంతా సిల్లీగా వుంది. కానీ అలాగని మానేద్దామా అంటే ఆ కేసులు వదలడం ఎంతమాత్రం ఇష్టంలేదు.
   
    సూర్యంగారు లక్షాధికారి. ఎప్పటి  ఫీజు అప్పుడే ఇస్తాడు. బంగారు పిచ్చుకలాటి పేషెంట్.

    సత్యంగారు ఇప్పటికే రేపిస్తా ఎల్లుండిస్తా అంటూ బకాయిలుపెట్టి తొమ్మిదివందల అరవైమూడు రూపాయల ఇరవైమూడు పైసల ట్రీట్ మెంటు చేయించుకున్నాడు. ఫీజుమాట అటుంచి మందుల డబ్బుకూడా సరిగ్గా ఇవ్వడు. ఆయనకి ఏమిటో డబ్బు రావాలిట. రాగానే ఒకేసారి ఇస్తా అంటాడు. గట్టిగా అడుగుదాం అంటే బి.పి పేషెంటు. మళ్ళీ బిపి పెరిగితే చచ్చినట్లు తనే వైద్యం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రాణం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది తనకి.

    కాసేపు తర్జన భర్జనపడి, వెళ్ళడానికే నిశ్చయించుకొని మెడిసిన్ చెస్ట్ లో మందులన్నీ సర్దేసుకున్నాడు.

    తెల్లవారింది దీపిక మోహన్ ల గుండెలు నిముషానికి రెండొందలసార్లు కొట్టుకుంటున్నా యి.సత్యంగారికి సూర్యంగారికి భరించలేనంత టెన్షన్ గా వుంది. శ్యామ్ కాలుకాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ప్రొఫెసర్ గారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కూర్చున్నారు.

    ఆసనాలు ముగించి లేచారు సూర్యం, మోహన్.

    కాలం నత్తనడక నడుస్తోంది. అతికష్టంమీద చిన్నముల్లు ఎనిమిది మీదకి పెద్దముల్లు పన్నెండు మీదకి చేరింది. నీట్ గా తయారై గదిలోంచి బయటికి వచ్చాడు మోహన్.

    భారతి నవ్వుతూ ఎదురయింది శుభశకునం "ఏమిటి బావా విశేషం? పెళ్ళికొడుకులా తయారై వెళుతున్నావు?" అంది అతన్ని ఎగాదిగాచూస్తూ. అదిరిపడ్డాడు మోహన్. భారతిని చూస్తుంటే అతని మనసు కలుక్కుమంది.

    ఛీ వీళ్ళని ఎలా మోసం చేస్తున్నానో అనిపించింది. కానీ అంతలోనే మనసులేని  పెళ్ళి చేసుకుని జీవితాంతం బాధపడేకంటే ఇదేమేలు అనిపించింది. చిన్నగా నవ్వేసి మేడదిగి వచ్చేశాడు.

    హాల్లోనించి మెట్లెక్కుతున్నారు సూర్యంగారు. తెల్లటి బట్టలు వేసుకుని పెళ్ళికెడుతున్నట్లుతయారయ్యారు ఆయన దగ్గరికి వెళ్ళాడు మోహన్.

    "మామ్మయ్యా మరినేను వెళ్ళొస్తా జాగ్రత్త" అన్నాడు.

    "నీకేం ఫర్వాలేదు వెళ్ళిరా!" భుజం తట్టారు ఆయన.

    మెల్లిగా ఇంట్లోంచి బయటపడ్డాడు మోహన్.

    వెళుతూ వెళుతూ దీప ఇంటిదగ్గర ఒక్కక్షణం ఆగి తొంగిచూసాడు వాకిట్లోనే కుర్చీవేసుకుని కూర్చున్నారు సత్యంగారు. ఆయన్ని చూడగానే తడబడిపోయాడు మోహన్ కానీ ఆయన మాత్రం కళ్ళజోడులోంచి చూసి దైర్యం చెప్పుతున్నట్లు నవ్వారు తలోంచుకొని వెళ్ళిపోయాడు మోహన్.

    తిన్నగా పృధ్విగారింటికి వెళ్ళాడు. అప్పటికి అయిదు నిముషాల క్రిందటే వచ్చేసింది దీపిక. దీపని చూడగానే అమ్మయ్య అనుకున్నాడు మోహన్.

    ఇద్దరూ చకచక తయారైపోయారు. కావలసినవి అన్నీ తీసేసుకున్నాడు మోహన్ "పద వెళ్దాం!" అన్నాడు.

    "మీరూ రండి సార్!" అంది దీప.

    "నేనొద్దులేమ్మా! మీవాళ్ళెవరూ లేకుండా నేనొస్తే బాగుండదు. అదీగాక నాకు బోలెడంత రాసుకునే పనుంది మీరిద్దరూ వెళ్ళిరండి" అన్నారాయన.

    ఇద్దరూ జంటగా ఆయనకి నమస్కరించారు "క్యూరీదంపతుల్లా గొప్పవాళ్లు అవండి" అని దీవించారు ఆయన.

    అంతా మనమంచికే జరుగుతోంది సంతోషంగా ఉండు" అని తన శిష్యురాలికి దైర్యం చెప్పారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS