Previous Page Next Page 
నా కథవింటావా పేజి 31


    "మమ్మీ! అన్నం  పెట్టు, ఆకలేస్తోంది !" అంది దివ్య.
    "సరే!" అంటూ  లేచింది కావ్య!
    "బేబీ, నీ పేరేంటి ?" అడిగాడు వినోద్.
    దివ్య మాట్లాడలేదు .అతనికేసి  కోపంగా  చూసింది!
    ఇందాక  అతను తల్లిని  వాటేసుకున్న  దృశ్యం, ఆమె మనసులో  నిలిచిపోయింది! అందుకే మాట్లాడలేకపోయింది.
    "చెప్పమ్మా! అంకుల్ కి నీ పేరు  చెప్పు!" లాలనగా  అంది కావ్య!
    "దివ్య!" ముక్తసరిగా  చెప్పింది, నేలచూపులు చూస్తూ.
    "ఓ....దివ్య! మంచి.... పేరు!"
    "థాంక్స్!" అంది  అతనికేసి  చూడకుండానే!
    "కావ్యా! నేను వెళ్ళిరానా ?"
    "భోంచేసి  వెళ్ళు!" అంది కావ్య!
    దివ్య తల్లివంక  కోపంగా  చూసింది. గబ గబా అన్నం  తినేసి, వెళ్ళి నైటీ వేసుకుని, హోంవర్కు చేసుకుంటూ  కూర్చుంది.
    ఏవేవో కబుర్లు  చెప్పుకుంటూ, దగ్గరయ్యీ దూరంగా  వుండవలసిన పరిస్థితిని తిట్టుకుంటూ భోజనాలు ముగించారు కావ్యా, వినోద్ లు!      
    "గుడ్ నైట్ దివ్యా!" అని రెండుసార్లంటేగానీ గుడ్ నైట్ చెప్పలేదు వినోద్ కి, దివ్య!
                                                                                   20
    పాండిచేరిలోనే  ఒక వర్క్ షాప్  పెట్టుకున్నాడు  వినోద్! అక్కడే ఒక చిన్న ఇల్లు  కొనుక్కున్నాడు. ప్రతి రోజు సాయంత్రాలు కావ్య యింట్లోనే గడిపేవాడు. ఇద్దరూ  కూర్చుని కబుర్లు  చెప్పుకునేవారు, కలిసి ఆశ్రమానికి వెళ్ళేవారు ధ్యానానికి! రాత్రిళ్ళు  భోజనం  కావ్య ఇంట్లోనే చేసేవాడు. కావ్య కాల్లో  ముల్లు విరిగితే  వినోద్ కి ప్రాణం కొట్టుకుపోతుంది. వినోద్ కి కాస్త వొళ్ళు  వెచ్చబడితే  విలవిల్లాడిపోతుంది కావ్య!
    ఇద్దరివీ  సమాంతర రేఖల్లా  కలవని రైలు  పట్టాలవంటి  కలసిన మనసుల, కలవని బతుకుల కథలు! కావ్యాలు! దివ్యకి అతనంటే  వొళ్ళు మంట! అతనలా  ఇంటికి రావడం, తల్లితో గంటల  తరబడి  మాట్లాడడం ఇష్టంలేదు ఆమెకి ! తను మాట్లాడదు  అతనితో! అతనితో  కలిసి భోంచెయ్యదు ! తల్లి అతనితో  కలిసి  భోంచెయ్యడం  వల్ల, తనూ తల్లీ రాత్రిళ్ళు కలిసి భో చెయ్యలేక  పోతున్నామనే బాధ. అతనివల్ల  తల్లి మారిపోయిందని  కోపం !
    "అమ్మా! అతనలా  మనింటికి  రావడంవల్ల  నలుగురూ  నానా రకాలుగా  నీ గురించి అనుకుంటున్నారు. అది  నాకిష్టంలేదు" అంది ఒకరోజు తల్లితో !
    కావ్య నవ్వింది !
    "లోకులు  కాకులమ్మా! వాళ్ళ  మాటలు  మనం  పట్టించుకోకూడదు" అంది.  
    "ఎంత కాకులయినా  పొడుస్తూ వుంటే, వాటికి  ఆ అవకాశం  మనం ఎందుకివ్వాలి ?"
    "ఒక్కొక్కసారి  తప్పదమ్మా!" బాధగా అంది కావ్య!
    "ఎందుకు తప్పదమ్మా ? అతనికీ ,మనకీ ఏమిటి సంబంధం ?"
    "అది నీకు అర్ధంకాదులే !"
    "ఓ....!" అంటూ  అదోలా  చూసి వెళ్ళిపోయింది దివ్య.
    ఆ చూపులు  మేకుల్లా  గుచ్చుకున్నాయి  కావ్యకి! మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది.
    వినోద్ గుండెని  ఎవరో కోసేసినంత  బాధపడ్డాడు. తనకోసం కాదు! కావ్యని ఓదార్చలేక! దివ్యకి సమాధానం చెప్పలేక !
    "వినోద్ ! ఈ నిందల్ని  మొయ్యడం, చెయ్యని తప్పుల్ని  నెత్తిన వేసుకోవడం నాకు మొదటి నుంచీ  అలవాటే! కానీ, నావల్ల  ఇప్పుడు నీకూ అదే ప్రాప్తించింది. ఐ....యామ్....సారీ....ఫర్.... యూ...." అంది.
    "కావ్యా ! నీతోనే జీవితాన్ని  పంచుకోవాలనుకున్నప్పుడు, నీ బాధల్నీ, బరువుల్నీ, నీ కష్టాలనీ, సుఖాలనీ   కూడా పంచుకోవాలి కదా ?  నీ సాన్నిధ్యంలో, నీ సహవాసంలో, కష్టాలను  నవ్వుతూ  భరించే  తత్వాన్ని  అలవాటు చేసుకున్నాను. నువ్వు తప్ప నా కింకవ్వరున్నారు"   
    కావ్య వెక్కి వెక్కి ఏడ్చింది. అమృతభాండం  ఎదురుకుండా  వుంటే, అందుకోలేని  అథమ  పరిస్థితి! తనని తనే  నిందించుకుంది.
    రెండు మూడుసార్లు  క్రాంతి ,కావ్య దగ్గరికి  ఒచ్చి చూసి వెళ్ళాడు. శోభనలో ఏ మార్పూ లేదు. కావ్యని  చూసినట్టుగా  కూడా  చెప్పేవాడు కాదు శోభనతో క్రాంతి !
    ఒకరోజు  క్రాంతిని  చూసి   అంది దివ్య, "మామయ్యా! ఐ....డోంట్ లైక్....దట్....వినోద్ అంకుల్ !" అని.
    "ఎందుకమ్మా ? వాడు నా క్లాస్ మేట్! చాలా మంచివాడు" అన్నాడు.
    "క్రాంతి మామయ్యా! అతను మీ క్లాస్ మేట్  కావొచ్చు కానీ, మంచివాడు మాత్రం కాదు." ఆ మాటలు అంటూ వుంటే  ఆమె కళ్ళు కోపంతో  ఎర్రబడేవి. అది చూసి  మాట మార్చేసేవాడు క్రాంతి !
    ఎవరు ఏ రకంగా  చెప్పినా  వినోద్  గురించి, ఒప్పుకునేది కాదు దివ్య! ఆమె చిన్ని మనసులో  పడ్డ ముద్ర, వయస్సు కానీ, వాతావరణం కానీ, మార్చలేక పోయింది !
    దివ్య పెరుగుతూన్న  కొద్దీ, ఆమెలో  వినోద్ పైన ద్వేషం ,కోపం కూడా పెరుగుతూనే వొచ్చింది.
    శత విధాల కావ్య ప్రయత్నించినా, దివ్యకి వినోద్ పైన  అభిమానాన్ని గానీ, గౌరవాన్ని కాని, కలిగించలేక పోయింది.
    నానాటికీ  కావ్యలో దిగులు పెరుగుతూ  ఒచ్చింది !
    వినోద్ లో కూడా  ఈ బాధ క్రమేణా చోటుచేసుకుంది.
    కావ్య పనిచేసే  స్కూల్లో గుసగుసలు  ఎన్నడూ  కావ్య లెక్కచెయ్యలేదు. ఇరుగూ పొరుగూ చెవులు కొరుక్కున్నా  అంత  బాధపడలేదు, కానీ తన బిడ్డే తనని, అనుమానిస్తూ వుంటే తన పెంపుడు కుక్కే తనని కరిచినంత బాధనిపించింది. ఎన్ని రాత్రులు  మూగగా, ఒంటరిగా విలపించిందో  కావ్య. ఆ దేముడికే తెలుసు! ఇటువంటి  విషమ పరిస్థితి ఎవ్వరికీ ఎప్పుడూ  రాకూడదని  వెయ్యి  దేముళ్ళకి మొక్కింది.
    "కావ్యా! స్కూల్లో వాళ్ళేదో నీ గురించి  చెడ్డగా మాట్లాడుకుంటున్నారని  బాధపడే బదులు, ఉద్యోగం మానెయ్యకూడదూ ? డబ్బు కేమీ లోటులేదు దివ్యకూడా ఎమ్.ఏ.లో  కొచ్చేసింది. ఈ ఒక్క ఏడాదీ చదువయిపోతే, అప్పుడయినా ఆ అమ్మాయికి నిజం చెప్పి మనం కలిసుండొచ్చు ? ఏమంటావ్ ?" అన్నాడు వినోద్.
    కావ్య పకపకా నవ్వింది!
    "ఎందుకు నవ్వుతున్నావ్ ?" అడిగాడు.
    "పిచ్చి వినోద్! స్కూలు కెళ్ళడం  మానేసినంత మాత్రాన నిందలు మాసిపోతాయా ? అవి మచ్చలు! పుండు మానినా మచ్చలు మిగిలినట్టు, అవి అలాగే వుండిపోతాయి! దివ్య ఎమ్.ఏ. చేసినా, పి.హెచ్.డీ. చేసినా మారుతుందనే నమ్మకం నాకు లేదు. దాదాపు  పదేళ్ళనుంచీ, చూస్తోంది నిన్ను. ఒక్క రోజైనా నోరు  విప్పి నిన్ను  'అంకుల్' అని పిలిచిందా ? నీతో మాట్లాడిందా ? అది మారి నీతో మంచిగా  ప్రవర్తిస్తుందన్న  నమ్మకం నాకు లేదు" కళ్ళనీళ్ళు పెట్టుకుంది కావ్య!
    "హోప్....షుడ్....నాట్....డై....! మనిషి ఆశా జీవి! ఆశలతోటే బతుకుతాడు. ఆశలు  అంతరించి  పోతే, మనిషి  జీవచ్చవమై  పోతాడు." ఓదారుస్తూ తన కుర్చీఫుతో  కావ్య  కళ్ళు తుడిచాడు .సరిగ్గా అదే సమయానికి దివ్య యూనివర్శిటీ నుంచి  ఒచ్చింది. ఆ దృశ్యాన్ని చూసి  అసహ్యించుకుంటూన్నట్టు  మొహం పెట్టి, గబగబా లోపలికి  వెళ్ళిపోయింది !
    కావ్యకి ఛెళ్ళున  కొట్టినట్టయింది. వినోద్  కూడా కొంచెం  వెనకాడాడు, కంగారు పడ్డట్టుగా !
    "దివ్యా ! టిఫిను పెట్టనా ?" అడిగింది కావ్య!
    "నీ కెందుకులే  శ్రమ  మమ్మీ! నేను పెట్టుకుని  తింటానులే" అంది.
    ఆ మాటల్లోని  దెప్పి  పొదుపుకి  కావ్యకి  దుఃఖం  ముంచుకొచ్చింది. గిర్రున వెనక్కి తిరిగి, బాత్ రూంలో కెళ్ళి  గుండె  బరువు తగ్గేదాకా  వెక్కివెక్కి ఏడ్చింది.
    దివ్యకి తెలుసు తల్లి ఏడ్చిందని! తను అన్న మాటలకే  బాధపడి ఏడ్చిందని  కూడా తెలుసు. కానీ, నలుగురూ  ఆమె గురించీ ,వినోద్ గురించీ  అలా చెడ్డగా మాట్లాడుతూంటే  వినలేకపోతోంది .అంతేకాదు. తను తన తండ్రి గురించి ఏమడిగినా  సరైన  సమాధానం చెప్పకుండా దాటేస్తుంది .తండ్రి ఫోటోని చూపించమంటే  'నా దగ్గరేమీ లేవు, ఫోటోలన్నీ క్రాంతి మామయ్య దగ్గరే వుండిపోయా'యంటుంది. మామయ్య నడిగితే, అతనొచ్చేదే ఎప్పుడో ఒకసారి! అప్పుడు తీసుకురావడం మర్చిపోయానంటాడు వీళ్ళిద్దరికీ  నాన్నంటే  ఇష్టంలేదా ? అసలు  నాన్న ఏ వుద్యోగం చేసేవాళ్ళో ? నాన్న కుటుంబంలో ఎవరెవరు  వుండేవారో ?వాళ్ళందరూ  ఎందుకు  ఒక్కసారైనా మమ్మీనీ, తననీ చూడడానికి రాలేదో ? మమ్మీ పూర్తిగా వాళ్ళతో ఎందుకు తెగతెంపులు  చేసుకుందో ? ఈ ప్రశ్నల్లో వేటికీ సమాధానాలు దొరకక, తను ఎన్ని రాత్రులు ఏడ్చిందో తలుచుకున్న కొద్దీ దివ్యకి తల్లిమీద కోపం  పెరిగిపోతోంది! ఆమె చరిత్ర హీనంగా కనబడతోంది !


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS