Previous Page Next Page 
గెస్ట్ హౌస్ పేజి 32

ఒక్కక్షణం డేనియల్ ఒంట్లో నుంచి సన్నటి వణుకు మొదలవుతుంది.
అయినా అపనమ్మకంతో అడిగాడు "ఎందుకు? అతను మనవాడేగా?"
మరోసారి నవ్వి "బిత్రోచికి ఇష్టమైన విషయాలు ఏమిటో తెలుసా...స్వార్ధం, దుర్మార్గం,..క్షుద్ర...ఇంకా ఇలాంటి చాలా నెగిటివ్ విషయాలను ఇష్టపడుతుంది. బిత్రోచి సంతృప్తుడయ్యే సమయానికి రామయ్య బ్రతికి ఉండకూడదు.
అతను మన మనిషి అనే ఆలోచన రావడమే తప్పు...ఇక్కడంతా 'నా' అనే స్వార్ధమే వుండాలి. నమ్మించి మోసంచేయాలి. ప్రీతిగా హత్యలు చేయాలి...
అందుకే...అందుకే అకోరా తంతు పూర్తయిన క్షణం...రామయ్య తలను చీలిపోయేలా కొడతాం.
రామయ్య తలనుంచి చిమ్మిన రక్తంతో యజ్ఞగుండం తడిసిపోవాలి. దానితో రామయ్య సర్వశక్తులు నశించడమే కాదు, అతడు చనిపోవడమే జరుగుతుంది" చెప్పాడు పీటర్సన్...
డేనియల్ మొహమంతా చెమటపట్టింది...
ఒక్క చిన్న అనుమానం క్రమక్రమంగా పెద్దదవ్వసాగింది. అంటే...రేపు నన్నుకూడా...
ఆలోచనే భయంగా వుంది.
ఆలోచన పర్యవసానం ఏంటో డేనియల్ కు తెలిస్తే కథ మరోలా జరిగి వుండేది.

                                        * * *
"రామయ్యను మనం జాగ్రత్తగా వాచ్ చేయాలి. అతను అకోరా అనే భయంకరమైన తంతును నిర్వహిస్తున్నాడు.
తంతు పూర్తవ్వకముందే అతడ్ని మనం చంపేయాలి..." చెప్పాడు రాబర్ట్.
తరళ గుండె చిక్కబట్టుకుని వింది. పరమహంస కళ్లజోడు సవరించుకుంటూ...
"ఆ పని నన్ను చేయమంటారా?" అంటూ అడిగాడు.
"వద్దు ఆ పని తరళ చేస్తుంది?" చెప్పాడు రాబర్ట్.
"ఎలా చంపను? ఓ బండరాయి అతని తలమీద వేస్తే సరి..." అంది తరళ.
"కాదు...యిలా..." అంటూ ఏర్ బేగ్ లోని ఫోల్డెడ్ స్టిక్ బయటకు తీసాడు.
ఫోల్డ్ లన్నీ విప్పదీస్తూ పోతుంటే పెద్ద స్టిక్ తయారైంది.
ఆ స్టిక్ పడి భాగంలో క్రాస్ డిజైన్ చేయబడి వుంది.
స్టిక్ ప్రారంభంలో పరమశివుడి త్రిశూలం చెక్కబడి వుంది.
"నేను మంత్రోచ్ఛారణలో వుంటాను. నేను తంతు ప్రారంభించిన పదిహేను నిమిషాల తర్వాత రామయ్య వెనగ్గా వెళ్లి ఈ కర్రతో అతని తల రెండు భాగాలు అయ్యేంత బలంగా కొట్టాలి. తల నుండి రక్తం చివ్వున చిమ్మి యజ్ఞగుండంలో పడాలి. అతడ్ని ఈ స్టిక్ తో కొట్టే సమయంలో వెలువడి ఎలాంటి శబ్దాలకు నువ్వు భయపడ కూడదు...
రామయ్య తలనుండి చిమ్మిన రక్తం యజ్ఞగుండంలో పడగానే రామయ్య శరీరం పేలిపోయే ప్రమాదం వుంది.
అతని దగ్గర బందీగా ఉన్న క్షుద్రశక్తులు ఒకేసారి అతనిమీద పడి పీక్కు తింటాయి..." రాబర్ట్ చెప్పాడు.
తరళ అతడు చెప్పే మాటలు వింటూ వుంది.
రాబర్ట్ చెప్పడం ఆపి తన దగ్గర ఉన్న స్టిక్ ని తరలళకు ఇచ్చాడు.

                                        * * *
రామయ్య మంత్రోచ్ఛారణ ఆపడంలేదు.
క్షణక్షణానికి అతని మొహం మారిపోతూ వుంది. గాలికూడా స్తంభించి పోయిన ఫీలింగ్.
అతను హిస్నోక్ ని ఆదేశిస్తున్నాడు.
తన దగ్గరున్న క్షుద్ర ఆత్మను హిస్నోక్ లో ప్రవేశపెట్టే పని చేస్తున్నాడు.

                                                                              * * *
ఇరవై నాలుగు అడుగుల పొడవు ఉన్న హిస్నోక్ చెట్టును చుట్టుకుపోయివుంది. దాని శరీరం అదో రంగులో మెరుస్తూ ఒళ్ళు గగుర్పొడిచేలా వుంది.
ఒక్కసారిగా విషసర్పం కదిలింది.
చెట్టును చుట్టుకున్న హిస్నోక్ తల భాగాన్ని కదిలించింది. తర్వాత మొత్తం శరీరం కదిలింది. ఒక్కసారిగా తలని గాల్లోకి లేపింది. పరిసరాల్లో ఉన్న పక్షులన్నీ భయంతో ఎగిరిపోయాయి. సరిగ్గా కూతవేటు దూరంలో నచికేత, అతని మిత్రులు హాయిగా నిద్రపోతున్నారు.
                                         22

ఉలిక్కిపడి లేచాడు నచికేత...
అతని చెవులను లీలగా ఏదో శబ్దం వినిపించింది.
ఏదో జరగబోతోందని అతని మనసు చెబుతోంది. సిక్త్స్ సెన్స్ అతనికి వార్నింగ్ ఇష్యూ చేసింది.
అప్రయత్నంగా ఏర్ బేగ్ లో నుంచి రివాల్వర్ తీసి బిగించి పట్టుకున్నాడు.
అతని వ్రేళ్ళు ట్రిగ్గర్ మీద బిగుసుకున్నాయి.
ఏదో శబ్దం...
ఏదో వేడి శ్వాస...
అతని చురుకైన కళ్ళు ఆ పరిసరాల్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి.

                                                * * *
రామయ్య కళ్ళు తెరిచాడు.
అతని కళ్ళు అగ్ని గోళాలయ్యాయి.
అతని కళ్లలో నుంచి ఏదో శక్తి గాలిలో కలిసి ప్రయాణించి హిస్నోక్ ని చేరింది.
ఒక్కసారిగా చిన్న జలదరింపు హిస్నోక్ లో. తన భారీ శరీరాన్ని కదిలించింది. ఇరవై నాలుగు అడుగుల పొడవున్న ఓ భయంకర విషసర్పం.
                                       * * *
ఒక్క క్షణం నిటారుగా అయ్యాడు నచికేత...  
ఎదురుగా...తన ఎదురుగా...హిస్నోక్...
రాబర్ట్ చెప్పిన హిస్నోక్...
అతని శరీరాన్ని చెమట్లు చుట్టుముట్టాయి. అరవడానికి, ప్రమాదాన్ని తన మిత్రులకు చెప్పడానికి నోరుకూడా పెగలడంలేదు.
అతని కాలు కదిలింది. తన పాదంతో ప్రభు తలని తట్టాడు.
ప్రభు ఉలిక్కి పడిలేచాడు.
నచికేత వైపు చూసి ఏదో అనబోయాడు.
అప్పటికే అతని కళ్ళ ముందు హిస్నోక్ కనిపించింది.
క్షణాల్లో అందరూ లేచారు. ఒకరి నొకరు తట్టి లేపుకున్నారు. అందరి ముఖాల్లో టెన్షన్...
వీళ్లవైపు చూస్తూ ఉంది హిస్నోక్.
"పారిపోదామా?" లోగొంతుతో అడిగాడు భయంతో ప్రభు.
"ఏం చేద్దాం?" విలియమ్స్ క్వశ్చన్.
"మనం చావడం గ్యారంటీ" సూరజ్ గొంతు తడారిపోయింది. నచికేత తన వేలిని ట్రిగ్గర్ మీద బిగించాడు. సరిగ్గా హిస్నోక్ తలవైపు ఎయిమ్ చేయబడి వుంది రివాల్వర్.
ఒకటి...రెండు...మూడు.
మూడు...రెండు...ఒకటి.
రివాల్వర్ లోని గుండు సూటిగా దూసుకువెళ్లి పడగ భాగాన్ని కొద్దిగా రాసుకుంటూ వెళ్లింది.
ఆ మాత్రానికే హిస్నోక్ కదిలింది వేగంగా. తన తోక భాగాన్ని గాల్లోకి లేపింది. పెద్ద భవనం కూలిపడ్డ ఫీలింగ్. కొన్ని వందల కిలోల ఇనుప దూలాలతో బాదిన సెన్సేషన్.
ఐదుగురూ హిస్నోక్ తోక భాగం ధాటికి చెల్లాచెదురయ్యారు.
అందరూ తేరుకుని లేచేలోగా మరోసారి తోకతో ఎటాక్ ప్రారంబించింది హిస్నోక్...
"అయిపోయింది...అంతా అయిపోయింది...థ్రిల్ కోసం, సాహసం కోసం...మూర్కంగా ఈ ఎస్సయిన్ మెంట్ ఒప్పుకుని తమ లైఫ్ ని ఫినిష్ చేసుకోబోతున్నాం" ప్రభు ఫీలవుతూ ఉండగా మరోసారి హిస్నోక్ దాడి చేసింది.
ఈసారి తన దాడికి టార్గెట్ గా నచికేతను పెట్టుకుంది.
రాబర్ట్ మాటలు గుర్తుకొచ్చాయి నచికేతకు.
"హిస్నోక్ డైరెక్టుగా మనిషిని చంపదు. తోక భాగంతో దాడిచేసి తీవ్రంగా గాయపరచి ఆపై తన కోరలతో విషాన్ని ఇంజెక్ట్ చేసి ఆహారంగా స్వీకరిస్తుంది"
నచికేత హిస్నోక్ దాడికి దూరంగా పడ్డాడు. ఓ చెట్టుకు శరీరం తాకడంతో పార్టులన్నీ కదిలిపోయిన ఫీలింగ్
.హిస్నోక్ దాడి తీవ్రతారమైంది.
 "మీరంతా పారిపోండి" నచికేత అరిచాడు.
తను చనిపోయినా ఫర్లేదు...తన స్నేహితులైన సేఫ్ గా ఉంటే చాలు...ఇది నచికేత ఫీలింగ్.
కానీ మిగతా నలుగురికి మనసు ఒప్పడంలేదు. తమ మిత్రుడ్ని వదిలివెళ్లడమా? ఇన్నాళ్లు కలిసి వుండి ఇప్పుడు ఒంటరిని చేసి...
"కమాన్ ఫ్రెండ్స్...పారి...పోండి...హిస్నోక్ తోక భాగం వైపుగా పారిపోండి..." రాబర్ట్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అరిచాడు నచికేత...
ఒక్కక్షణం అందరూ షాక్ గా చూస్తుండగానే హిస్నోక్ మరోసారి తన భారీ శరీరాన్ని కదిల్చి తోకను గాల్లోకి విసిరింది.
ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు నచికేత...ఏకాగ్రత నిలిపి దేవుడ్ని ప్రార్ధించడం ప్రారంభించాడు. అప్పటికే గాల్లోకి లేచిన హిస్నోక్ తోకభాగం నచికేతకు తాకడంతో మరో ఐదు అడుగుల దూరంలో పడ్డాడు. శరీరం నుజ్జు నుజ్జయిన ఫీలింగ్...
పైకిలేచే ఓపిక కూడా లేదు...
హిస్నోక్ ట్రాన్స్ లో ఉన్నట్లు నచికేత వైపు చూస్తోంది...అది తన నోటిని విశాలంగా చేసింది.
నచికేత బలవంతంగా తన కళ్లను తెరిచాడు...
ఎదురుగా హిస్నోక్
ఒకే ఒక క్షణంలో తనని మింగేయడానికి సిద్దంగా వుంది...అతని చేతి వ్రేళ్ళు చిట్లి రక్తం స్రవిస్తోంది. చేతిని కదిల్చే ప్రయత్నం చేస్తుండగా తగిలింది...అతని చేతికి చెయిన్...
ప్రభు మెడలో వేలాడే చెయిన్...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS