క్రాస్...ఆంజనేయుడి విగ్రహం కలిసి వున్న చెయిన్.
హిస్నోక్...తన కోరలను నచికేత శరీరం లోకి దించడానికి సిద్దమవుతుండగా...
ఆ చెయిన్ బిగించి పట్టుకుని పిడికిలి బిగించాడు. ఒకసారిగా అతని శరీరంలోకి వేయి ఏనుగుల బలం వచ్చి చేరిన ఫీలింగ్...
తనను సమీపించబోతున్న హిస్నోక్ పడగ మీద పిడికిలితో దాడి చేసాడు.
ఒక్క క్షణం విభ్రమం...
హిస్నోక్ ఎవరో బలంగా తనని విసిరేసినట్లుగా వెనక్కి విరుచుకుపడిపోయింది.
ఒక్కక్షణం చాలు...
నచికేత ఆ చెయిన్ ని తన మెడలో వేసుకుని పక్కనే ఏర్ బేగ్ లో ఉన్న పొడవాటి కత్తిని తీసి హిస్నోక్ తోక భాగాన్ని చేరి కసిదీరా ఆ కత్తితో దాడిచేయసాగాడు.
అప్పటివరకూ ఓ చెట్టు చాటున ఉన్న అతని ఫ్రెండ్స్ పరుగున వచ్చి ఏర్ బాగ్స్ లో నుంచి ఆయుధాలు తీసి హిస్నోక్ మీద దాడి మొదలుపెట్టారు.
చిత్రంగా హిస్నోక్ బలం క్షీణించసాగింది.
(మలేషియాలోని బెస్టు నగర శివార్లలో ఉన్న ఓ రబ్బరు తోటలో ఇస్మాయిల్ అనే అరవై నాలుగేళ్ల వ్యక్తిని తొమ్మిది మీటర్ల పొడవున్న ఓ కొండ చిలువవచ్చి చుట్టేసి అతని చేతిని తన నోట్లోకి ఇరికించుకుని ఒంటిని చుట్టేస్తుంటే అతని భార్య యాభై నాలుగేళ్ల ఫాతిమా ఓ కత్తితో కొండ చిలువపై దాడిచేసి తన భర్తను రక్షించుకుంది. ముప్పయి కిలోగ్రాముల బరువ్వున్న ఆ కొండ చిలువ యాభై నాలుగేళ్ల ఫాతిమా చేతిలో హతమయింది. ఇస్మాయిల్ ని ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన నిజం గానే జరిగింది.)
ఒకటి...
రెండు...
మూడు...
హిస్నోక్ నిస్త్రాణంగా పడిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి పరుగు మొదలు పెట్టారు.
ఓ పావుగంటసేపు అలా పరుగెత్తి తమని హిస్నోక్ వెంటాడ్డం లేదని కన్ ఫర్మ్ చేసుకుని ఊపిరి పీల్చుకున్నారు నచికేత, అతని ఫ్రెండ్సూ...
* * *
"ఈ రోజు నన్ను రక్షించింది వీళ్ళే" తన మెడలో ఉన్న గొలుసు తీసి క్రాస్ ను, ఆంజనేయుడి లాకెట్ ని కళ్లకు అద్దుకుంటూ అన్నాడు నచికేత.
అప్పటివరకూ వాళ్లను ఆవరించుకున్న టెన్షన్ కొద్దిగా తగ్గింది.
"మైగాడ్ మన చాప్టర్ ఇలా అడవిలోనే క్లోజ్ అన్న నిర్ణయానికి వచ్చేసాను..." సూరజ్ అన్నాడు.
"మనం వెంటనే వెనక్కి వెళ్దామా?" అడిగాడు భయంగా ప్రభు.
"ఇంతవరకూ వచ్చాక వెనక్కి వెళ్లడం ఎందుకు? ముందుకు వెళ్లడమే బెటర్. మనం మ్యాప్ ప్రకారం గెస్ట్ హౌస్ కు సమీపంలో ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే మనం అనుకున్న దానికన్నా ముందే గెస్ట్ హౌస్ చేరుకునేలా వున్నాం" చెప్పాడు నచికేత...
"ఇప్పటికే మూడు గండాలు దాటాం...ఇంకా ఎన్ని గండాలు ఎదుర్కోవాలో?" అన్నాడు భయంగా సూర్యనారాయణ.
"రాబర్ట్ చెప్పినదాని ప్రకారం మనం ఇప్పుడు గెస్ట్ హౌస్ చేరువలో వున్నాం" నచికేత ఉత్సాహంగా చెప్పాడు.
"నిజమా?" ప్రభులో సంతోషంతో కూడిన విస్మయం.
"అవును. మనం అనుకోకుండానే షార్ట్ కట్ లో వచ్చేసాం ఇదిగో" యారో మార్కు చూపించి "ఇక్కడి నుంచి మనం మరో ఆరు గంటలు ప్రయాణిస్తే బి..త్రో..చి..గె..స్ట్..హౌ..స్..చేరుకుంటాం" ఉద్వేగంగా చెప్పాడు నచికేత...
కొద్దిగా ఉత్సాహం వచ్చింది వాళ్లలో...జరగబోయే పరిణామం తెలిసి వుంటే ఆ ఉత్సాహం కాస్త భయంగా మారిపోయేది.
* * *
తల విదిల్చాడు రామయ్య.
అతని కళ్లముందు హిస్నోక్ గిలగిల కొట్టుకోవడం కనిపిస్తుంది.
ఓసారి కళ్ళు మూసుకుని వెంటనే కళ్ళు తెరిచి తీక్షణంగా యజ్ఞగుండం వైపు చూశాడు.
యజ్ఞగుండం దర్పణంగా మారిందో క్షణం. నచికేత మెడలో వేలాడుతున్న క్రాస్...ఆంజనేయుడి లాకెట్ కనిపిస్తున్నాయి.
రామయ్య మొహం క్షణక్షణానికి వికృతంగా మారుతోంది.
* * *
రాబర్ట్ పద్మాసనం వేసుకుని కూచుని వున్నాడు.
తరళ చేయి రాబర్ట్ ఇచ్చిన మంత్రదండాన్ని బిగించి పట్టుకుంది.
పరమహంస జరగబోయే తంతును ఉద్వేగంగా గమనిస్తున్నాడు.
మరికాసేపట్లో రామయ్యను తను చంపబోతోంది. క్షుద్రమైన ఆలోచనలతో, క్షుద్ర శక్తులను తన వశం చేసుకుని ప్రపంచ వినాశనానికి, తన స్వార్ధ పైశాచికత్వానికి కంకణం కట్టుకున్న ఓ క్షుద్ర మంత్రగాడిని మంత్రదండంతో చంపబోతోంది.
రాబర్ట్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
"తరళ...నేను మంత్రదండం నీ చేతికి ఇచ్చి ఎందుకు చంపమన్నానో తెలుసా? క్షుద్ర మాంత్రికుల మంత్రశక్తులను ఎదుర్కొనే శక్తి స్త్రీలకుంది...స్త్రీ శక్తి స్వరూపిణి అంటారు...బిత్రోచిని నమ్మే క్షుద్ర మాంత్రికులకు, స్త్రీలకు చుక్కెదురు. సాధారణంగా బిత్రోచిని ఆరాధించే క్షుద్ర, మాంత్రికులు స్త్రీలతో జాగ్రత్తగా ఉంటారు.
స్త్రీ చేతిలో వాళ్ల బలం తగ్గుతుంది. మాంత్రికుడు తన రక్తాన్ని చూడకూడదు. అలానే స్త్రీ చే హత్యాప్రయత్నానికి గురికాకూడదు"
మాటలు మరోసారి మననం చేసుకుంటూ మంత్ర దండాన్ని బిగించి పట్టుకుంది తరళ.
* * *
అర్దరాత్రి పదకొండు గంటల ముప్పయి నిమిషాలు
"బిత్రోచి గెస్ట్ హౌస్ కు వచ్చేసాం" ఒక్కసారిగా ఉద్వేగంగా అరిచాడు నచికేత.
టార్చిలైటు వెలుతురులో గెస్ట్ హౌస్ ప్రాంగణం భయంకరంగా కనిపిస్తోంది.
క్షుద్ర ప్రేతాత్మ శరీరంలా ఉంది గెస్ట్ హౌస్. చాలా పాతకాలం నాటిదని తెలుస్తోంది...
గెస్ట్ హౌస్ చుట్టూ ఫెన్సింగ్ లాంటిది వుంది.
చిన్న ఇనుప తీగలతో అల్లిన గేటు తుప్పు పట్టి వుంది. తాళం లేదు. ఇనుప వైర్లతో గేటు బిగించారు.
నిషిద్ధ ప్రాంతం...
"బి..త్రో..చి..వుం..ది..జా..గ్ర..త్త.."
అనే అక్షరాలు అడ్డదిడ్డంగా రాసి వున్నాయి.
ఆ అక్షరాలను చూస్తుంటేనే ఒళ్ళు జలదరించింది...
ఒక్కసారిగా శరీరం చల్లబడినట్లు గాలిలో ఏదో మార్పు జరిగినట్టు...
గెస్ట్ హౌస్ నుంచి ప్రేతాలు తమవైపు చూస్తున్నట్టు...
23
పీటర్సన్ పదునైన కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. ఎడమ చేతిలో ఉన్న కత్తితో కుడిచేతి చూపుడు వేలిమీద గాటుచేసుకున్నాడు.
ఒక్కసారిగా రక్తం చివ్వున చిమ్మింది.
డేనియల్ కళ్ళు మూసుకున్నాడు ఆ దృశ్యం చూడలేక.
పీటర్సన్ చూపుడు వేలిని గట్టిగా నొక్కాడు . బాధని పళ్ళ బిగువున భరిస్తూ.
రక్తం ధారలుగా పడుతోంది. ఆ చూపుడు వేలిని గట్టిగా నొక్కుతూ వలయంలా చుట్టూ తిరిగాడు.
తన చేతి మణికట్టుకు ఉన్న రంగు రంగుల దారాలు ఒక్కో దాన్ని తెంపుతూ వలయం చుట్టూ పేర్చాడు.
రక్తంలో ఆ దారాలు తడిచిపోయాయి.
ఆ వలయంమధ్య పీటర్సన్ పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు.
వలయానికి అటువైపు డేనియల్. పీటర్సన్ డేనియల్ వైపు తిరిగి...
"బిత్రోచి నిద్రలేవడానికి ఐదుగురి బలితో...నచికేత సమర్పణతో సంతృప్తుడై నన్ను ఆవహించే సమయం ఆసన్నమవుతుంది. నేను చివరి తంతు నిర్వహిస్తాను. ఎటువంటి పరిస్థితిలోనూ నన్ను డిస్ట్రబ్డ్ చేయొద్దు...
ఈ వలయం వైపు ఎవరూ రాకుండా చూసే బాధ్యత నీదే...నా చివరి బాధ్యత నీదే...నా చివరి తంతు
పూర్తవ్వడం, అక్కడ నచికేత...బిత్రోచికి సమర్పించబడ్డమూ ఒకేసారి జరగాలి.
చండ్ర ప్రచండ వేగంతో బిత్రోచి నన్ను చేరుకుంటాడు" చెప్పాడు వికృతానందంతో పీటర్సన్.
డేనియల్ అలానే చూస్తుండిపోయాడు. అతను ఒక విధమైన ట్రాన్స్ లో ఉండిపోయాడు. ఇది కలా? నిజమా?
బిత్రోచి పీటర్సన్ ని ఆవహించనుందా? ఈ ప్రపంచం తమ పాదాక్రాంతం కానుందా? అతనా ఆలోచనలో వుండగానే పీటర్సన్ చివరి తంతు మొదలుపెట్టాడు ఆ రక్తవలయంలో కూచొని...
* * *
పెద్ద శబ్దంతో ఇనుప తీగలతో అల్లబడిన ఆ గేటు అతి కష్టమ్మీద తెరుచుకుంది.
ఒక్కసారిగా ప్రకృతి భీతిల్లిన ఫీలింగు.
గుడ్లగూబలు భయంతో అరుస్తున్నాయి.
ఎక్కడో నక్కల ఊళలు...
జన సంచారమే కాదు...జంతు సంచారం కూడా లేని ఆ ప్రాంతంలో కుక్కలు సన్నగా రోదిస్తున్నట్టు... చల్లగాలి వాళ్లని స్పశించింది.
నచికేత...అతని ఫ్రెండ్సూ వణికిపోయారు. టార్చిలైటు ఫోకస్ లో గెస్ట్ హౌస్ భయానక రూపం భీతి గొలుపుతుంది.
కాళ్లకింద పిచ్చిమొక్కలు నలిగిపోతున్నాయి.
ఎండుటాకులు శబ్దం వికృతంగా వినిపిస్తోంది.
నూటయాభై సంవత్సరాల తర్వాత బిత్రోచి నిద్రలేస్తుందా?
విశాలమైన గెస్ట్ హౌస్ లో నేల మాళిగలో...నూటయాబైయ్యేళ్లుగా అసంతృప్తితో ఉండిపోయిన బిత్రోచి ఏం చేస్తుంది?
అర్దరాత్రి పదకొండు యాభైఐదు...
* * *
