"అయిపోయింది...అంతా అయిపోయింది. పారిపోవడానికి కూడా వీల్లేకుండా..." ప్రభు భయంతో వణికిపోతున్నాడు.
విలియమ్స్ మనసులో ప్రభువుని తలుచుకున్నాడు.
సూర్యనారాయణ, సూరజ్ లకు ఏం చేయాలో తోచడం లేదు.
నచికేత ఆలోచిస్తున్నాడు. ప్రమాదం నుంచి బయటపడే మార్గం లేనప్పుడు ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయడమే ఉత్తమం. కానీ, ఆ నరమాంస భక్షకుణ్ణి ఎదుర్కొనే శక్తి తమకుందా?
అప్పుడు...
గుర్తుకొచ్చాడు రాబర్ట్...
ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతను ఏర్ బేగ్ లో ఉన్న సెల్ ఫోన్ తీశాడు. గబగబ నెంబర్లు నొక్కసాగాడు. నరమాంస భక్షకుడు వాళ్లవైపు చూస్తూ వంగి లోపలికి అడుగులేస్తున్నాడు.
* * *
నడుస్తోన్న రాబర్ట్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎడమ జేబులో ఉన్న అతని సెల్ ఫోన్ రింగవుతోంది.
ఓకే బటన్ నొక్కాడు.
అటువైపు నుంచి నచికేత గొంతు...ఆ గొంతులో కంగారు., ఆదుర్దా తెలుస్తూనే వుంది. క్లుప్తంగా తమ ముందున్న ప్రమాదం చెప్పాడు నచికేత.
రాబర్ట్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
ఏం చేయాలో నచికేతకు చెప్పాడు.
* * *
నచికేత సెల్ ఫోన్ మాట్లాడ్డం ఎవరూ గమనించలేదు. అందరూ కంగారుగా ఉన్నారు.
పైగా నరమాంస భక్షకుడు తలవంచి ఒక్కో అడుగు వేస్తూ వీళ్లని సమీపిస్తున్నాడు.
నచికేత మాట్లాడ్డం అయిపోయేక ఏర్ బేగ్ లోకి సెల్ ఫోన్ తోసి కళ్ళు మూసుకున్నాడు. రాబర్ట్ చెప్పినట్టు మంత్రోచ్ఛారణ ప్రారంభించేడు. మెడలు వంచి ఆ గుహలో నిలబడి ఉండాల్సి రావడం వల్ల మెడలు పట్టుకున్నట్టుయ్యాయి.
నచికేత ఏకాగ్రత ఏ మాత్రం సడలించకుండా పెదవులు కదిలిస్తున్నాడు.
నరమాంసభక్షకుడు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తున్నాడు.
నలుగురూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నారు.
నచికేత మాత్రం అక్కడే నిలబడివున్నాడు.
నరమాంస భక్షకుడు నచికేత తలమీద చేయివేశాడు.
ఆ మరుక్షణమే జరిగిందా సంఘటన...
కొన్ని వేల ఓల్టుల విద్యుత్ నచికేత ద్వారా తన శరీరంలోకి ప్రవేశించినట్టు పెద్ద పెట్టున అరుస్తూ వెనక్కి విరుచుకు పడ్డాడు నరమాంస భక్షకుడు.
నచికేత కళ్ళు తెరిచి చూశాడు. నరమాంస భక్షకుడు నేల మీద కూలబడి పోయాడు.
వెంటనే ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటకు పరుగెత్తారు ఐదుగురూ.
వీళ్ళు గుహలోంచి బయటకు వచ్చిన మరుక్షణం ఆ గుహ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ రాళ్ల మధ్య చిక్కుకున్న నరమాంస భక్షకుడి చివరి శ్వాస ఆగిపోయింది. చిత్రావతి అడవిలో మిగిలివున్న ఒకే ఒక నరమాంస భక్షకుడు దిశైవ ప్రభావంవల్ల చచ్చిపోయేడు.
* * *
రామయ్య కోపంతో కళ్ళు తెరిచాడు.
ఎవరో ఆ ఐదుగురిని రక్షించారు. సందేహం లేదు. సదా వాళ్లని కాపాడుతున్నారు. అందుకే తన ప్రయత్నాలు ఫలించడంలేదు. నరమాంస భక్షకుడు చచ్చిపోయేడు. అతని శరీరంలోకి తను ప్రవేశపెట్టిన క్షుద్ర ఆత్మ భయంతో పారిపోయి వెనక్కి వచ్చేసింది.
తన మంత్ర శక్తిని అడ్డుకున్న వాళ్ల మీద రామయ్య కోపం రెట్టింపయ్యింది.
గెస్ట్ హౌస్ ను ఆ ఐదుగురూ చేరుకునేలోగా ఏదో విపత్తు సృష్టించాలి. వాళ్లలో వాళ్ళే కొట్టుకు చచ్చేలా చేయాలి.
ఆ ఐదుగురిలో నలుగురు చనిపోయి, ఒకే ఒక్క సాహసవంతుడు మిగలాలి.
రామయ్య ఒక్క క్షణం ఆలోచించి మళ్ళీ క్షుద్రతంతులో మునిగిపోయాడు.
* * *
"ఏమిటి ఏం జరిగింది? సీరియస్ గా ఉన్నారేంటి" రాబర్ట్ మొహంలోని ఫీలింగ్స్ చూసి అడిగింది తరళ..
"నచికేతకూ, అతని స్నేహితులకు ప్రమాదం తలపెడుతున్నాడు రామయ్య" చెప్పాడు రాబర్ట్.
"దానివల్ల అతనికేమిటి లాభం?"
"బిత్రోచి తెలివైన, సాహసి అయిన వాడిని తన తొలి సమర్పణగా...బలిగా స్వీకరిస్తుంది...అలాంటి సమయంలో ,మిగతా వాళ్ళ అవసరం ఏముంటుంది? అదీగాక ఆ ఐదుగురిలో స్వార్ధం, ద్వేషం, ప్రతీకారం కలిగించి ఒకరి కొకరు చంపుకునేలా చేయాలని రామయ్య ప్రయత్నం.
బిత్రోచిని ఆరాధించే వాళ్ళు, క్షుద్రం, నీచం, స్వార్ధం లాంటి గుణాలను కలిగి వుండాలి. ఎదుటి మనిషిలోని అసూయని రెచ్చగొట్టాలి. మరొకరి వినాశనాన్ని కళ్లారా చూడాలి."
"వీళ్లకు ప్రమాదం తప్పదా?" అడిగింది తరళ.
"నచికేత తెలివైనవాడే...తనని తాను రక్షించుకోవడమే కాక తన స్నేహితులను కూడా రక్షించగలడు" చెప్పాడు రాబర్ట్.
పరమహంస వాళ్ల మాటలు వింటూ ఆలోచిస్తూ నడుస్తున్నాడు.
"అదిగో టెంట్..." దూరంగా కనిపిస్తున్న గుడారం వైపు చూపిస్తూ అరచి చెప్పింది తరళ.
అక్కడ సన్నటి వెలుతురు వుంది. ఆ వెలుతురులో అడవి భయంకరంగా కనిపిస్తోంది.
* * *
"పెద్ద గండం నుంచి బయటపడ్డాం" ప్రభు ఆయాసం తీర్చుకున్నాక అన్నాడు. అతను ఆ నరమాంస భక్షకుడి ఆకారాన్ని మరిచిపోలేకుండా ఉన్నాడు.
క్షణంలో ఓ మిరాకిల్ జరిగింది. లేకపోతే ఈ పాటికి తమ ఐదుగురి శరీరాలు ఆ నరమాంస భక్షకుడికి ఆహారం అయిపోయేవి అనుకున్నాడు విలియమ్స్...
"గాడ్ ఈజ్ గ్రేట్" మెడలో వేలాడుతున్న క్రాస్ ని, ఆంజనేయుడి తాయెత్తుని కళ్ళకు అద్దుకుంటూ అన్నాడు ప్రభు.
సూరజ్, సూర్యనారాయణ లు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు.
నచికేత ఏర్ బేగ్ లో నుంచి మ్యాప్ తీసి పరిశీలిస్తున్నాడు.
"మనం ఏమైనా దారి తప్పామా?" అడిగాడు నచికేత ఆందోళన గమనించిన విలియమ్స్...
"ఊహు...మనం ఏ విధంగా దారి తప్పినా బిత్రోచి గెస్ట్ హౌస్ ని చేరుకుంటాం...ఎందుకంటే ఆ అడవి మధ్యలో ఆ గెస్ట్ హౌస్ వుంటుంది. కాబట్టి..." చెప్పాడు నచికేత.
"మరింకేమిటి ఆందోళన?" అడిగాడు విలియమ్స్...
"మనం హిస్నోక్ జాతి విషసర్పం ఉండే దారిలో వున్నామని అనుమానం. ఎందుకైనా మంచిది మనం చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఎప్పుడూ చేతిలో ఓ నైఫ్ ఉండేలా చూసుకోవాలి..." చెప్పాడు నచికేత.
విలియమ్స్ తోపాటు మిగతా వాళ్ళు అలానే అన్నట్టు తలూపారు.
అప్పటికే అర్దరాత్రి దాటడంవల్ల నిద్ర ముంచుకొస్తోంది.
ఓ చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ రాత్రికి అక్కడ విశ్రమించాలని అనుకున్నారు.
ఏర్ బేగ్ లోనుంచి పలుచటి బెడ్ షీట్ తీసి చెట్టుకింద పరిచి చెట్టును ఆనుకొని రిలాక్సయ్యారు.
రాత్రంతా అలిసిపోయి ఉండడంవల్ల వెంటనే నిద్రపట్టేసింది ఐదుగురికి.
కాసింత దూరంలోనే 'హిస్నోక్'...భయంకరమైన విషసర్పం వుందని తెలియదు వాళ్లకి.
* * *
పీటర్సన్ బ్లాక్ కలర్ గౌను వేసుకున్నాడు. దానిమీద ఎరుపు రంగు పట్టీలు వున్నాయి.
రామయ్య టెంట్ కు కాసింత దూరంలో పీటర్సన్ నిర్మించుకున్న టెంట్ వుంది.
"మనమిప్పుడు ఏం చేయబోతున్నాం?" అడిగేడు డేనియల్ పీటర్సన్ ని.
"నచికేత సమర్పణకోసం ఎదురు చూడాలి మనం. నచికేత చేతులు గెస్ట్ హౌస్ తలుపులను తాకిన మరుక్షణం అసంతృప్తితో ఉండిపోయిన బిత్రోచి నిద్రలేస్తాడు..
గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకోవడంతోనే గాలితోపాటు వేగంగా కదిలి, బయటకు వచ్చి నచికేతను చుట్టిముట్టి తన నైవేద్యంగా నచికేతను స్వీకరిస్తాడు.
నచికేత రక్తమూ, శరీరమూ, మెదడు బిత్రోచి ఆహారమవుతాయి. సంతృప్తి పడిన బిత్రోచి నచికేతను సమర్పించిన మనల్ని సంతృప్తిపరుస్తాడు.
బిత్రోచి మన వశమైన మరుక్షణం ఈ ప్రపంచమే మన పాదాక్రాంతమవుతుంది..."
"మరి రామయ్య?"
"అతను అకోరా తంతును కొనసాగిస్తున్నాడు. బిత్రోచికి నచికేతను దగ్గరకు చేసే పనిని రామయ్య నిర్వర్తిస్తాడు."
"అంటే బిత్రోచి రామయ్యను కూడా..." పెద్ద పెట్టున నవ్వి చెప్పాడు పీటర్సన్...
"బిత్రోచి సంతృప్తుడయ్యే సమయానికి రామయ్య బ్రతికి ఉండడు..."
"వా...ట్..."
"యస్...ఇటీజ్ ట్రూ...రామయ్యను వెతుక్కుంటూ ఆ రాబర్ట్ ఎలానూ వస్తాడు. లేదా అకోరా తంతు పూర్తయిన క్షణం మనమే రామయ్యని చంపుతాం"
