Previous Page Next Page 
యువత నవత పేజి 31

       

     "జంతువులా?"

    "మాటలూ, మొహంలో భావాలూ అలా కనిపిస్తేనూ!"

    "ఎవరబ్బా?"

    "ఎవరో పల్లెటూరి గబ్బిలాలు. వాళ్ల పెళ్లాలకు మిషనో, గేదె లకి, పందులకి లోనో అడగడానికి వచ్చివుంటారు."

    వరండాలోకి వస్తున్న సుధ పడగెత్తిన పాముని చూసినట్టుగా గడపదగ్గరే టక్కున ఆగిపోయింది. "ఎందుకొచ్చారు?" అడిగింది కర్కశంగా.

     "కేస్ విత్ డ్రా చేసుకొమ్మని చెప్పడానికి వచ్చాం!"

    "మీరు చెప్పారని కేసు విత్ డ్రా చేసుకొనే వాళ్లెవరూ లేరిక్కడ!"

    "ఇట్ల నీలిగినవంటే దానికి  పట్టినగతే నీకూ పడుతుంది."

    "ముందు ఇంట్లోంచి బయటికి నడిచి మాట్లాడండి!" సుధ నిప్పులు కక్కినట్టుగా అంది. అందులో రెండోవాడు మొదటివాడిని మందలించాడు. "నువ్వూరుకో! నేను మాట్లాడతాను!"

    "నీ ఇష్టం!"

    "మనం సామరస్యంతో మాట్లాడుకొందాం! కేసు పెట్టడంవల్ల మీకు పెద్దగా ఒరిగేదేమీ వుండదు. సాక్ష్యాలూ, రుజువులూ, కోర్టువరకు వెళ్లడం ఎంత కష్టమో మీకు తెలియదు. వెళ్లినా ఓ ఆరునెలలు జైలులో వున్నంత మాత్రాన మాకు పెద్దగా శిక్ష పడినట్టుకాదు.  మీరు చాలా ప్రయాస పడిపోతున్నారు దీనికోసం! మీరు ఊరికే కేసు తీసుకోవద్దు. చెరి పదివేలు ఇస్తాం. ఇహ చప్పుడు కాకుండా ఊరుకోండి."

    "మిస్టర్! ముందు బయటికి నడుస్తారా లేదా?"

    అతడు వేసుకున్న రంగు చెదిరిపోయింది చప్పున. "మాటలకి, డబ్బుకీ లొంగకపోతే మరోవిధంగా లొంగదీయాల్సి వస్తుంది.  ఏ జొన్న చేల్లోనో నీ జీవితం  సమాప్తమైపోతది!" అన్నాడు క్రూరంగా. "దాన్ని  ఆ రోజు మానంతోపాటు ప్రాణమూ తీసేవాళ్లం. బ్రతికినా ఎవరికి ఏ ముఖం పెట్టుకొని చెబుతుంది అని వదిలేసినం! నువ్వు దానివెనుక తగుల్కోకపోతే అది కిక్కురుమనేదికాదు."

    "తలుచుకుంటే చాలు ఏ ఆడదాన్నైనా నల్లిలా, దోమలా నలిపి వేయగలమన్న ఆ పొగరుందే ఆ పొగరుని అణచివేసే రోజు దగ్గరలోనే  వుంది. మీలాంటి దుర్మార్గులకు ఎలా బుద్దిచెప్పాలో నాకు తెలుసు! అందరాడవాళ్లూ చీమలూ దోమలూ కాదు. ఖాళీలుకూడా వున్నారు. ఆ సంగతి మీకు త్వరలోనే తెలుస్తుంది. ఇక బయటికి నడవండి!" ప్రళయ జ్వాలలా భగభగ మండుతున్నట్లుగా అంది సుధ.

    "అది మనిషయినా మిగిలింది! నువ్వు అదీ మిగలవు! వస్తాం" విసురుగా వెళ్లిపోయారువాళ్లు.

    వాళ్లు ఇలా వెళ్లీ వెళ్లకముందే సుధని లోపలికిలాగి  తలుపులు వేసేసింది శాలిని. "అబ్బ, గుండెలదిరిపోయాయి! వాళ్లెక్కడ లోపలికి జొరబడి అఘాయిత్యానికి తలపడతారోనని హడలి చస్తున్నాను."

"    "అలా భయపడితే ఇంకా భయపెడతారు వాళ్లు!"

    "కాని, నిజంగా అలా జరిగిందే అనుకో! ఏం చేయగలం? పశుబలాన్ని మనం ఎలా ఎదుర్కోగలం?"

    "శరీరం బలహీనమైంది కావచ్చుగాని, మనసు బలహీనమైంది కాదు కదా? శక్తివంతమైన మనసుముందు ఎవరూ నిలబడి గెలవలేరు! నిజంగా అలాంటిది యేదయినా ఎదురయితే చివరి ఊపిరివరకూ పోరడగలను! ప్రాణాలతో వాళ్లకు లొంగడమంటూ జరగదు!"

    "మానం పోకుండా ప్రాణాలు పోగొట్టుకొంటానంటావు! ప్రాణం పోయాక యిక సాధించేదతి యేముంటుందని? వాళ్లుచూస్తే  నిజంగా నరరూప రాక్షసుల్లా వున్నారు సుధా! వాళ్లతో పెట్టుకోకు. నిజానికి సుజాతకు జరిగిన అన్యాయం వీళ్లను శిక్షించడం వల్ల సరిదిద్దబడేదికాదు. ఆ పిల్ల జీవితం ఇహ శాశ్వతంగా అంధకారమే ఆ మాత్రందానికి  నీ జీవితానికి ఎందుకు ముప్పుతెచ్చుకొంటావు? పల్లెల్లో తిరిగే ఉద్యోగం నీది ఇలా పగబట్టిన కిరాతకులుంటే నీ ఉద్యోగవిధిని ఎలా నిర్వహిస్తావు?"

    "పిరికి మందుపోసే నువ్వేం స్నేహితురాలివి? భయపడకు! ముందుకి అడుగెయ్యి నేను నీకు తోడుంటాను. ఇంతటి ఘోరం  సహించని వాళ్ళంతా నీవెంట వుంటారు అనడానికి బదులు తోకముడవమని  సలహా ఇస్తావా?" చర్రుమంది సుధ.

     "అగ్ని గుండాలు కనిపిస్తూంటే ముందుకే అడుగేయమని అందులో పడి భస్మం కమ్మని ఏ స్నేహితురాలు చెబుతుంది? సాహసం మంచిదే కాని ముందు వెనుకలు చూడని సాహసం అనర్దకహేతువు అవుతుంది."

    "సుజాత వెనుక నిలబడ్డప్పుడే నాకు తెలుసు. నా బ్రతుకు ప్రమాదంలో  పడిందని! నిరర్దకంగా రాలిపోయేకంటే ఒక మంచి పనికోసం బలి అయితే అది గర్వించతగిందేకదా? వాళ్లు నేరంచేశారు! శిక్షించకుండా వదిలితే రేపు మరో సుధ బలి అవుతుంది. ఎల్లుండి మరో సుకన్య బలి అవుతుంది.  నేరానికి  శిక్ష వుంటుందని తెలిసినప్పుడు మనుషులు నేరస్తులు కావడానికి తప్పకుండా భయపడతారు."

    "పిచ్చి దొంగలకు జైలుశిక్షలు, జరిమానాలు, పడుతున్నాయి. దొంగతనాలు ఆగాయా?" హంతకులకు  ఉరిశిక్షలు  పడుతున్నాయి హత్యలు  ఆగాయా?  అలాగే మానభంగం కేసులూ! కరామాంధులు శిక్షింపబడుతూనే వున్నారు. మానభంగాలు జరగడం ఆగాయా?  అసలు మనుషుల్లో పరివర్తనం రావాలిగాని, శిక్షలు మనిషిని అదుపులో పెట్టలేవు!"

    "శిక్ష అతడి నేరాన్ని కొలిచి చూపుతుంది. అతడి కళ్లముందు అతడి నేరాన్ని బట్టబయలుగా చూపుతుంది! పరివర్తనానికి మనసులోబీజం పడేట్టు చేస్తుంది శిక్ష!"

    "కాని, కొంతమంది జైలుశిక్ష తరువాత ప్రతీకారవాంఛతో బుసలు కొడుతూ వస్తారు! బలం పెరిగిన రాక్షసుల్లా తమ శిక్షకు  కారకులైన వాళ్ల మీద పడతారు! అప్పుడేది దారి?"   
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS