సింహాచలం దేకుతూ తాళం వేస్తుంటే...
"భోజనం తెప్పించు" అన్నాడు పరుశురాం.
"అలాగే సార్" అన్నాడు వినయంగా సింహాచలం.
13
అనూష పరుశురాంని బెయిల్ మీద విడిపించింది.
పరుశురాం బయటకి వస్తుంటే కనీసం అతనికేసి కూడా చూడలేదామె. ఆమె విషణ్ణ వదనంతో వుంది. పాలిపోయిన మొహం . రెండు రోజులుగా నిద్రాహారాలు లేనట్టుగా వుంది. కళ్ళలో దైన్యం, కనురెప్పలకింద నల్లని చారలు ఏర్పడినాయి. ఆమె బాధ తనకోసమే అని పరుశు రామ్ కి తెలుసు.
మౌనంగా ఆమెని అనుసరించాడతను.
తను పోలీసులతో దెబ్బలు తిన్నందునో. లేక ఆపనిందకి గురయినందునో ఆమె చాలా చారిస్తుందనుకున్నాడు.
నిజమే!
తనంటే అనూషకి ఎంత ప్రేమో పరుశురాంకి తెలీకపోతే గదా!
అతనలా అనుకొంటున్నాడు.
కానీ సిగ్గుమాలిన పనికి ఒడిగట్టి పోలీసులతో చావుదెబ్బలు తిన్నా డని, రేపోమాపో అతన్ని కోర్టుకు ఈడ్చి శిక్షవేస్తారని ఆమె భావిస్తున్నదని అతనికి తెలీదు.
ఆమె అలా అనుకోడానికీ , నమ్మడానికీ కూడా బలమైన కారణాలున్నాయి.
స్టేషన్ బయటికి వచ్చాక.....
"అనూ!" అని పిలిచాడు పరుశురాం.
నడుస్తున్న అనూష ఆగింది.
కానీ వెనక్కి తిగిరి అతని కేసి చూడలేదు.కనీసం "ఏమిటి?" అని ప్రశ్నించలేదు.
ఆమె తన గుండెలపైన వాలిపోయి "నిన్ను పోలీసులు ఎంత హింసించారో రామ్!" అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుందని అతను ఆశించాడు.
అతని ఆశ నిరాశే అయింది.
పిచ్చివాడు నవ్వుకున్నట్టు తనలోతనే నవ్వుకున్నాడు పరుశురాం.
ఆమె అలా ప్రవర్తించడం అతనికి చాలా బాధగా వుంది.ఇబ్బందిగా వుంది. ఆమె తన అనూషేనా అన్న అనుమానం అతనికి కలిగింది.
"పోలీసులు నన్ను చిత్రవధచేశారు అనూ! నువ్వు బెయిల్ ఇవ్వకపోతే ఈ వేళకూడా ఆ నరకాన్ని అవుభవించాల్సి. వచ్చేది థాంక్స్ అనూ!" అన్నాడతను.
ఆమె అతని మాటల్ని విన్నది. కానీ తిరిగి ఏమీ మాట్లాడలేదు. అది రోడ్డు అనికూడా మర్చిపోయి...
.
"ఒక్క సారిలా చూడు ఎలా కొట్టారో!" అని షర్ట్ పైకి లేపి వీపుని చూపించబోయాడు. జీపు బేనట్ పైన చేతులు వేసి నించుంది. కనీసం అతనికేసి చూడలేదు. దాంతో అతనికి పిచ్చిపట్టినట్టయింది.
"అనూ!" అని ఆమె భుజంపైన చేయివేశాడు.
మెల్లగా అతని చేతిని తోసేసింది.
"నాతో మాట్లాడవా? నా మొహం చూడాలనిపించడంలేదా?" అతని గొంతు జీరపోయింది.
కళ్ళనుంచి జారుతున్న కన్నీటిని చూపుడువేలితో తుడుచుకుంది అనూష.
"ఏడుస్తున్నావా?"అడిగాడు.
ఆమె సమాధానం చెప్పలేదు.
"అనూ! ప్లీజ్, నాతో మాట్లాడవా?" అభ్యర్థనతో అడిగాడు.
"మాట్లాడ్డానికింకా ఏం మిగిలింది పరుశురాం!"
ఆమె లోలపలే కుమిలిపోతూ ఏడుస్తున్నట్టుగా ఆమె గొంతు వణుకుతోంది.
"నువ్వు కూడా అందరితోపాటు నేరస్తుడినని నమ్ముతున్నావా అనూ?"
దీనంగా అడిగాడు.
ఆమె మెడమీద నుంచి తల తిప్పి కళ్ళ చివరి నుంచి అతనికేసి చూసింది.
ఆ కళ్ళల్లో నువ్వింత మోసగాడివనుకోలేదు రామ్ అన్న భావం స్పురిస్తోంది.
అతను ఆమె ముందుకొచ్చి నించున్నాడు.
"నేను దేన్నయినా భరిస్తాను. కానీ వంచనని సహిచంలేను భరించలేనురామ్!"
"నేనెవర్నీ వంచన చేయలేదు అనూ!" అన్నాడతను.
అతని మాటలకి తీవ్రంగా చూసింది అనూష.
ఎందుకింకా అబద్దం చెబుతావు అన్నట్లుంది ఆ చూపు.
"అది నీ ఆత్మసాక్షికి తెలియాలి రామ్" అంది ఉద్వేగంతో అనూష.
"నీ మాటలకంటే పోలిసుల దెబ్బలే నయం అనిపిస్తున్నాయి అనూ! నన్నెందుకు అవమానిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు."
ఆమె పిచ్చి నవ్వు నవ్వింది.
"ఒక నేరం చేసిన వ్యక్తి తప్పించుకోడానికి అతి తెలివితేటలతో తనకి తెలీకుండానే మరింత రొంపిలోకి దిగిపోతాడు రామ్. నువ్వు ఆ కోవలోకి వస్తున్నావు."
"అంటే!?"
"గుర్తు చేసుకో రామ్! మొన్న నిన్ను సీషోర్ కి వెళ్ళాలని ఇంటికి రమ్మని పిలిచాను."
"అవును"
"మామయ్యఏదో పనిచెప్పాడని, రాలేనని చెప్పావు గుర్తుందా?"
"అవును."
