Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 31

 

    'అయ్యా , అమ్మ బాగా దెబ్బలాడుకున్నారు. 'నా బతుకు ఎట్లాగో సట్టుబండలయ్యింది అదేనా బాగుపడనీ , నీ కొడుకు ఎలాగో పోరంబోకులా నీలాగే తయారవుతున్నాడు , దాన్నేనా బాగుపడనీ , యింకో యిల్లు రెక్కల కష్టం సేసుకుంటూ దాన్ని సదూకుని బాగుపడనీ' అదండీ అంటూ పెద్ద కళ్ళు తిప్పుతూ తల్లి తండ్రి దేబ్బలాటంతా చెప్పుకొచ్చింది. 'అడముండలు , బరి తెగించారు  అంతా మీ పెత్తనాలేనా' అంటూ జుత్తు పట్టుకు కొట్టాడండి అమ్మ శివంగిలా లేచి ఆడ్ని తోసేసి, 'అది యీ పాడుకొంపలో వుండదు . అది సదూకొని ఉద్యోగం చేస్తది. నీవు దాని జోలికేడితే , నన్నేదన్నా అంటే పోలీసుల కాడ కెళ్ళి కంప్లయింట్ యిస్తాను. లేదంటే నే సచ్చి నీవే చంపానని పోలీసులకి ఉత్తరం రాసి పెడ్తా' అని బాగా బెదిరించింది. 'నీవు మళ్ళీ గొడవేట్టావంటే నా పిల్లలని తీసికెళ్ళి యీ ఊరొదిలి పోతా' నందండి. అప్పుడు అయ్య బూతులు తిడుతూ ఎల్లిపోయాడండి.
    'మా యింటికి వచ్చి గొడవ పెట్టడు గదా. అయ్యగారి కిష్టం వుండదు" అనుమానంగా అంది. అమ్మ సూసుకుంటానంది ఆడి సంగతి. మీ యింటికి వచ్చినా మీరు పోలీసులని బెదిరించమంది అమ్మ' అంది. ఆవిధంగా సుశీల చదువుకి పునాది పడింది.
    ఆ పునాది మీద పెద్ద భవంతే నిలబడ్తుందని అరుణ కూడా ఆనాడు ఊహించలేకపోయింది. అరుణ ఉద్దేశం , ఆశయం సుశీలని ఏ మెట్రిక్ వరకో చదివించి ఏదన్నా వృత్తి విద్యలలో ట్రైనింగు యిప్పించి ఏదో ఉద్యోగంలో ప్రవేశపెట్టి ఆమెకు స్వంత సంపాదన వుండేట్టు చూడాలన్నదే తాపత్రయం . కాని సుశీల మెట్రిక్ చదువుతుండగా అదృష్టం అరుణ తమ్ముడి రూపంలో వచ్చి తలుపు తట్టింది.

                                                  ***

    అరుణ తమ్ముడు శరత్ అమెరికాలో హాస్టన్ లో ఓ కంపెనీలో కంప్యూటర్ ఇంజనీరు, రెండేళ్ళకో మూడేళ్ళ కో ఓసారి ఇండియా శలవులకి వస్తాడు. సుశీల తొమ్మిదో క్లాసు చదువుతుండగా శరత్ వచ్చి సుశీలని చూశాడు. 'ఎవరే ఈ అమ్మాయి, చాకులా వుంది బలే దాన్ని పట్టావు. ఎంత బాగా చేస్తుంది పని పాటు, అదృష్టం , నీకిలాంటి అమ్మాయి దొరికింది . పనికి, ప్లీజ్ సుశీలని నాతొ అమెరికా పంపవే, వసంత , నేను చంటి పిల్లాడితో చాలా అవస్థ పడుతున్నాం. నెలకి రెండొందల డాలర్లు యిస్తాను. అంటే పదివేలు నెలకి. అ అమ్మాయి బతుకు బాగుపడ్తుంది. మాకూ సాయం ఉంటుంది. వాళ్ళమ్మతో చెప్పవే అక్కా. బతిమిలాడాడు. అరుణ కాస్త కోపంగా చూసింది.
    'శరత్ , ఆ అమ్మాయిని కేవలం పని చేయించుకోడానికి పనిమనిషిగా పెట్టుకోలేదు నేను. ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని చదివించి ఏదో ఓ ఉద్యోగం చూపించాలని నా ఉద్దేశం. కేవలం పనిపిల్ల మాదిరి అనుకోడం లేదు తెలుసా, ఆ అమ్మాయిని కనీసం మెట్రిక్ వరకు చదివించి ఏదో వృత్తి విద్యా కోర్సులో పెట్టాలని నా ప్లాను. ఆ పిల్ల చదువు ఆపి నీతో పంపేస్తే, జీతం ఎక్కువ రావచ్చు, కాని పనిపిల్లగానే మిగిలిపోతుంది. అది నాకిష్టం లేదు. అరుణ గంభీరంగా అంది. శరత్ ఒక్క క్షణం ఆలోచించాడు. 'నీవు అన్నది బాగుంది అక్క ఈ విధంగా ఆలోచించినందుకు నిన్ను అభినందిస్తున్నాను. పోనీ ఒక మంచి పని చేస్తున్న తృప్తి నీకు దక్కడం న్యాయమే. అక్క పోనీ ఈ అమ్మాయి మెట్రిక్ అయ్యాక నాతొ అమెరికా తీసుకెడతా, ఇంట్లో పెట్టుకుని నీవన్నట్లే ఏదన్నా కోర్సు చేయిస్తా. ఆ అమ్మాయి తన కాళ్ళ మీద నిలబడేట్టు చేస్తాం. ఇక్కడ ఏం చేసినా ఏ రెండువేలో కన్నా ఈ చదువుకి జీతాలు రావు. అమెరికా అయితే డాలర్లలో సంపాదించి తల్లికి పంపి ఆదుకునే వీలుంటుంది. ఈ మంచి పనిలో నన్ను పాలుపంచుకొని, ఇంట్లో సాయం ఉంటుందన్న స్వార్ధంతో పాటు, ఒక అమ్మాయిని ఉద్దరించానన్న ఆత్మ తృప్తి నన్ను పొందనీయి. నీవు బాగా ఆలోచించు. వాళ్ళమ్మతో మాట్లాడి ఒప్పించు. ఈసారి వచ్చినప్పుడు వీసా అప్లై చేసి తీసుకెళ్ళే ఏర్పాటు చేస్తాం' అన్నాడు శరత్. అరుణ ఆలోచనలో పడింది.

                                                   ***

    మెట్రిక్ అయ్యాక ఆ ఎండాకాలం శలవుల్లో శరత్ వెంట అమెరికా వెళ్ళిన సుశీల ఆరేడేళ్ళ తరువాత ఇండియా వచ్చింది. నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరే ముందు "అమ్మగారూ, ఉద్యోగంలో చేరేముందు మీకు కనబడి ఆశీర్వచనం తీసుకెళ్లాలనే వచ్చాను" అంటూ కాళ్ళకి నమస్కరించింది. కళ్ళ నిండా నీరు నిండగా, అరుణ కళ్ళూ చెమర్చాయి. సంతోషంతో. సుశీల మొఖం తేటపడింది. కళ్ళు విజ్ఞానం, ఆత్మవిశ్వాసం ప్రతిఫలిస్తున్నాయి. ఇరవై మూడేళ్ళ పరువం తీసుకొచ్చిన సోయగం, అమెరికాలో పెరిగిన వాతావరణంలో రంగు వచ్చి నాజూగ్గా , స్మార్ట్ గా చలాకీగా మంచి ఇంగ్లీషు మాట్లాడుతూ మాటల్లో సంస్కారం వుట్టిపడుతూన్న ప్రవర్తన తను నాటిన మొక్క పెరిగి పెద్దయి చిక్కని ఆకులు తొడిగి మొగ్గై , పువ్వైన వేళ కలిగే సంతోషంతో అరుణ కళ్ళు తుడుచుకుని సుశీల బుజాలు పట్టుకు లేవదీసి "అమ్మగారేంటి యింకా , యిప్పుడు నీవు ఉద్యోగాస్తురాలివి . నాకంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నదానివి. అరుణ సుశీల భుజం తడ్తూ అంది. 'ఇదంతా మీ చలవ, మీరు పెట్టిన బిక్షే. నేనెన్ని లక్షలు సంపాదించినా మీరేప్పటికీ నా అమ్మగారే' అంది సుశీల కృతజ్ఞతతో గొంతు నిండుకోగా ' అమ్మా మీకు శరత్ గారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోను. మీరు అమెరికా వెళ్ళమని సలహా ఇవ్వడం, మీ తమ్ముడు గారు నన్నాదరించి తీసికెళ్ళి దగ్గరుంచుకుని చదివించి, నర్సింగు కోర్సులో జాయిన్ చేసి నా బతుకికి ఓ మంచి తోవ చూపడం , యీనాడు నన్ను నేనే కాక కుటుంబం మొత్తానికి అదుకోగల్గిన స్థాయికి ఎదిగానంటే కారణం మీరే అంది సుశీల కృతజ్ఞత నిండిన గొంతుతో.
    'నే చేసిన సాయం చిన్నది సుశీలా. ఓ లేత మొక్క ఆలంబన లేక నేలమీద పాకుతుంటే చిన్న కర్ర ముక్క ఆలంబనగా నిలబెట్టి చెట్టు పైకి పాకింది. తరువాత ఓ పందిరి వేసి అల్లుకునేట్టు చేశాను. నా సాయం అంతేగా.' అది ఎంత పెద్ద సాయం అమ్మా, లేకపోతే నేలమీద పాకిన ఆ మొక్క ఎవరి కాళ్ళ కిందో నలిగి, లేక ఏ పశువుల కాహారం అయ్యేది గదమ్మా. మీరానాడు చేయూత నివ్వకపోతే ఈనాటికి ఇద్దరు ముగ్గురూ పిల్లలని కని మొగుడితో తన్నులు  తినే బతుకే నాదీ అయ్యేది! మామూలు బతుకు నించి దారి మళ్ళించి సరి అయిన దారిలో పెట్టారు. ఇంతకంటే ఇంకేం చేయాలమ్మా!' సుశీల కళ్ళు తుడుచుకుంది.
    మెట్రిక్ అవగాహనే శరత్ తో అమెరికా వెళ్ళడానికి ఏర్పాటు చేసింది. సుశీలకి, యాదమ్మకి అమెరికా వెడితే లభించే లాభాలు చెప్పింది. ఇక్కడెంత సంపాదించినా ఏదో తిండి గడిచిపోతుంది తప్ప మీ బతుకులు బాగు పదవన్నది అర్ధం అయ్యేట్టు చెప్పింది శరత్ ఇంట్లో  వాళ్ళకి సాయంగా వుంటూ చదువుకుని, వాళ్ళ ఏదో కోర్సులో చేర్పించే తోవ చూపిస్తారని, తరువాత బోలెడు సంపాదించవచ్చని చెప్పింది. వీసా ఏర్పాటు శరత్ చేసి వెళ్ళాడు.
    అక్కడ శరత్ ఇచ్చే జీతం రెండొందల డాలర్లలో ఏభై డాలర్లు తన ఖర్చు కుంచుకుని నూట యాభై అరుణ పేర పంపేది. నూరు డాలర్లు రూపాయాల్లో తల్లి కిచ్చి ఏభై డాలర్లు బ్యాంకులో వేయించేది. కూతురు డబ్బు పంపడం అరంభించాక యాదమ్మ పని మానింది. తమ్ముడు చదవక అల్లరి చిల్లరిగా తిరుగుతుంటే తల్లి తమ్ముడు కలిసి కిరాణా కొట్టు పెట్టుకునేట్టు డబ్బిచ్చింది. నర్సింగ్ కోర్సుకి అమెరికాలో మంచి డిమాండుంది. సుశీల లాంటి నెమ్మదైన పిల్లకి నర్సు ఉద్యోగం సరి అయిందని ఫోను చేసి అరుణతో చెప్పి చేర్పించాడు. నర్సు కోర్సు పూర్తీ అయి ట్రైనింగు అపుడు దొరికే స్తైఫండు జాగ్రత్తగా దాచి నెలనెలా అరుణ పేర పంపి , కొంత హౌసింగు లోను తీసి తల్లికి చవకలో దొరికే చోట ఓ అపార్టుమెంటు కొనిచ్చింది. యాదమ్మ నెలనెల అరుణ దగ్గర డబ్బు తీసుకోడానికి వచ్చినప్పుడల్లా అరుణ కాళ్ళు పట్టుకు ఏడ్చేసేది. "అమ్మా, ఆడపిల్లని దాని పీడ త్వరగా వదుల్చుకోవాలని ఎవడికో కట్టబెట్టి దాని బతుకూ నా బతుకు లాగే చేసేదాన్ని. ఆడపిల్లే ఈనాడు చూడండమ్మా నాకో ఇల్లు దుకాణం, నెలకి ఐదు వేల డబ్బు ఇన్నీ చేస్తుంది. మీ ఋణం ఎలా తీర్చుకోనమ్మా" అంటూ దండాలు పెట్టి ఏడ్చేది.
    ఈసారి సుశీల తల్లిని తనతో తీసికెడతానంది. ముందుగానే పాస్ పోర్టు వీసా అది తీసింది. తమ్ముడికి తానుండగానే మేనమామ కూతురితో పెళ్లి చేసేసి వాడి సంసారం వాడికి ఏర్పాటు చేసింది. తను పనిచేసే ఆస్పత్రిలో ఓ లాబ్ అసిస్టెంట్ ని ప్రేమించి పెళ్ళాడాలని మేం యిద్దరం అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు అరుణ ఆనందానికి హద్దు లేదు.
    అమెరుకా వెడ్తున్న యాదమ్మ సంబరం చెప్పడానికి మాటలు లేవు. వాడ వాడంతా యాదమ్మ అదృష్టానికి నిజంగానే సంతోషించారు. యాదమ్మ సుశీల వెళ్ళేముందు అరుణకి దండం పెట్టడానికి వచ్చినప్పుడు యాదమ్మ కళ్ళల్లో ఆనందం, గర్వం, సుశీల కళ్ళల్లో ఆత్మ విశ్వాసం చూసి తన ఆశయం నెరవేరింది. ఈ తృప్తి ఎంతటి ఆనందాన్నిచ్చిందో అరుణకి అనుభవంలోకి వచ్చింది. సుశీల కధకి అంత చక్కటి ముగింపు దొరికిందన్న అనందం అరుణది.

                                                    *ఆంధ్రప్రభ వారపత్రిక ఫిబ్రవరి , 2002


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS